జైశ్రీరామ్.
శ్రీరస్తు.
పద్య పక్ష కృష్ణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు
1. కార్మిక సంక్షేమమ్ ఆ.వె. శ్రీ గణపతి దేవ చేకొమ్ము నతులంచు - కార్మికుల్ మొదలిడు కార్యములను.
చేయునటులఁ జేసి చేయూత నీయుమా - నమ్మి కొలుతు నిన్ననంత కృష్ణ. 1.
ఆ.వె. తగిన వసతి, భుక్తి, ప్రగణిత వైద్యము, - చదువు నేర్ప బడులు సముచితముగ
వారి వారికొఱకు వర్ధిల్ల కల్పించు - భక్తిగ నినుఁ గొల్తు భవ్య కృష్ణ. 2.
ఆ.వె. కష్ట జీవులకును కర్మ వీరులకును - కామితములు తీర్చి కరుణఁ జూపు.
పద్య సద్రచనను పటువర్ధనము చేయు - పద్య పక్ష మధుర భావ కృష్ణ. 3.
ఆ.వె. నీరజాక్ష! యతని భారము కనవేల - నిత్య సంతసమును నిలుప వేల?
యతని జీవితమున వెతలు బాపినఁ జాలు. - పద్య పక్షమటుల వరలుఁ గృష్ణ! 4.
ఆ.వె. జీవితాన సుఖము, భావిపై నాశయు, - కలుగునటులఁ జేసి కనఁగ లేవ?
భావి లేని యతని జీవితమ్మది యెట్లు - వరలునయ్య? కనుమ వరలఁ గృష్ణ. 5.
ఆ.వె. బంధు హితుల తోడఁ బకపక నవ్వుచు - పండుగలను వెలుఁగ నిండు మదిని
చేయువాఁడవనుచు చేయంగ కోరుదు - నిష్టఁ గొలిచి నిన్ బ్రకృష్ట కృష్ణ! ! 6.
ఆ.వె. పద్య పక్షమునను ప్రబలెడి శ్రీకృష్ణ! - కార్మికులకు నీవు కావె రక్ష?
వారి జీవితమును వర్ధిల్లఁ జేయుమా! - భక్త సులభ దివ్య భాగ్య కృష్ణ! 7.
ఆ.వె. యంత్రరాక్షసులను మంత్ర ముగ్ధులఁ జేసి - నేర్పు మీర ప్రగతి నిత్యమొసఁగు
సాధనమున దేశ సంపద పెంతురా - కార్మికులను నీవె కలవు కృష్ణ! 8.
ఆ.వె. కార్మికులను కాచు ఘనులు కర్మాగార - ప్రభువులందు నిలిచి వరలు కృష్ణ!
కార్మికులను బ్రేమఁ గనఁ జేయుమా! వారి - గౌరవమును నిల్పి కాచు కృష్ణ! 9.
2. జీవనాధార జలవనరుల సద్వినియోగం.
ఆ.వె. శ్రీకరమగు ధాత్రి జీవకోటికి నిత్య - జీవ జలమునిచ్చు, క్షేమమిచ్చు.
యుగ యుగాలుగనిది జగతిని నిత్యమున్ - సాగుననుట కీవె సాక్షి కృష్ణ 10.
ఆ.వె. కలుషమైన జలము కలుషంబు లెటు పాపు? - కావ వలయు నీటి జీవన గతి
నీరు లేక జగతి నిలుచుటెట్టులు? కాన - నీటి నిలువ పెంచు మేటి కృష్ణ! 11.
ఆ.వె. ప్రాణులకిల నీరు ప్రాణవాయువటులే. - నీటి నిలువ భువిని నిలుప వలయు.
సలిల రక్షణమును జరుపకుండిన జల - మంతరించు కద యనంత కృష్ణ! 12.
ఆ.వె. మానవుల్ జలమును మన్నించి రక్షించు - పూనికఁ గొని చేయఁ బుణ్యమొదవు.
నీరు వ్యర్థ పరచు నీచులు పాపులై - యంతరింత్రుకద యనంత కృష్ణ! 13.
ఆ.వె. ధనము ఖర్చయినను దానినార్జింపగా - వచ్చు. భువిని నీరు మచ్చుకయిన
మిగులనీక మితికి మించి వెచ్చించిన - మృగ్యమౌన్. గొలుపు పరిణతి కృష్ణ! 14.
ఆ.వె. జ్ఞాన మొసగుమయ్య సద్భావనము నిమ్ము - మానవాళినిలను మనఁగనిమ్ము.
నీటి నిలువఁ బెంచు నేర్పరులుగఁ జేయ - నేలతల్లి మెచ్చు నిన్ను కృష్ణ! 15.
ఆ.వె. బ్రతుకనెంచు జనులు పరమాత్మ సృష్టి యీ - నీరమనుచు దాని పారఁబోయ
వలవ రిలను జలము వర్ధిల్లఁ జేయఁగాఁ - వలచి యింకఁ జేయఁ దలచు కృష్ణ! 16.
ఆ.వె. పూర్వ కాలమునను భూమి పీల్చుటఁ జేసి - నీటి మయము భూమి నిత్యమపుడు.
రాళ్ళ కట్టడములు వేళ్ళూనుటను చేసి - భూమి పీల్చునెటుల పూజ్య కృష్ణ! 17.
ఆ.వె. ఇలకు నింక జలము నింకుడు గోతులన్ - గొలుపుటుత్తమమయ జలలు పెరుగు
సహజ వనరులందు సలిలంబు మృగ్యమౌన్ - కావకున్న దానిఁ గనుము కృష్ణ.! 18.
౩. వృద్ధాప్యం కష్ట సుఖాలు.
ఆ.వె. శ్రీ రమా రమణుఁడ! శేషశాయిగనుండి - చింత చేయ వసలు జీవితాన
మానవునిఁగ బుట్టి మనుజుఁడెంతటి బాధ - లనుభవించుననుచు, కనవు కృష్ణ. 19.
ఆ.వె. బాల్య యౌవనములు పరుగిడి పోవగా - వృద్ధ దశకుఁ జేర విస్తు గొల్పు
చింతలెల్ల మదిని చీకాకు పరచెడు. - శాంతి మార్గమగుము చాలు కృష్ణ! 20.
ఆ.వె. కన్నులుండియు నిను మిన్నకుందురు కనన్, - కంటి చూపు తొలఁగ కలత చెంది,
కన్నతండ్రివగుచు కనులలో నిలువుమా - యనుచు నేడ్తు రపుడు వినుము కృష్ణ! 21.
ఆ.వె. పిన్న వయసులోన కన్ను గానక, నాడు - చేయరాని పనులు చేసి యుండి,
తనువు మాయు సమయమున నిన్నుఁ దలచినన్ - బాప ఫలితమెటులఁ బాయు కృష్ణ! 22.
ఆ.వె. వృద్ధ వయసు తానె పిలవకనే వచ్చి - పైనఁ బడుచునుండ బాధపడుచు
బిడ్డలతని బాధ పెడచెవిన్ బెట్టుటన్ - నడ్డి విరిగినట్లు నడచు కృష్ణ! 23.
ఆ.వె. దేహమతని మాట తిన్నగా వినకుండ - మూలఁబడుచు నుండ కూలిపోవు.
వృద్ధుఁడపుడు జ్ఞాన వృద్ధుఁడై చింతించి - నీవె దిక్కనునయ. నిజము కృష్ణ! 24.
ఆ.వె. దాన గుణము వీడి, దాయాదులను వీడి - ధనము నిలువఁ జేసి తనయులకిడ,
వారలతని వీడి పైదేశములనుండ - చూడరంచు వగచుచుండు కృష్ణ! 25.
ఆ.వె. పుణ్యమొసగు కార్యములు జేయనైతినే, - సన్యసించనయితి ధన్యుఁడనవ
జన్య జనక మర్మజంబగు మూర్ఖతన్ - తప్పు చేసితినని తలఁచు కృష్ణ! 26.
ఆ.వె. ప్రగతిఁ గొలుప పద్య పక్షాన నిలనైతి - రచన చేసి కృతిని ప్రబలనైతి
ఇప్పుడేమి చేతు నీశ్వరా యని, వృద్ధు - డేడ్చుచుండి కరము మోడ్చి కృష్ణ!, 27.
4. తొలకరి చినుకులు రైతుల తలపులు.
ఆ.వె. ఋతువులారు కలిపి వృత్తంబుగా చేసి - కాల గతిని కూర్చి కదిపినావు.
ధర్మబద్ధమయిన తరియన్నదే లేని - కాల గమనమందు కలుగు కృష్ణ! 28.
ఆ.వె. ఋతువులందు సహజ ఋతు ధర్మముం గూర్చ - గ్రీష్మఋతువు లోని కీల చేత
భూమిమాడు చుండి బగబగల్ పుట్టించ - రైతు మనసులోన రగులు కృష్ణ. 29.
ఆ.వె. అట్టి సమయమందు నాశలు పుట్టించ - తొలకరింపువగుచు పలుకుదీవు
ప్రకృతి రక్షకుఁడగు పరమాత్మగా నెంచి, - దానిఁ గనిన రైతి తనియు కృష్ణ! 30.
ఆ.వె. గ్రీష్మ ఋతువు తాను భీష్మ కీలల మాడ్చ - వేగుచున్న ధరణి బీడువారు.
పైరుపచ్చలవని పై నెండిపోవగా - పసరములవియెట్లు బ్రతుకు కృష్ణ? 31.
ఆ.వె. పసుల జీవికకయి పలుపలు విధముల - యత్నములను చేసి యలసిపోవు
నంతలో తొలకరి నంతసమ్మునుఁ గూర్చ - వచ్చు రైతు జనులు మెచ్చ కృష్ణ! 32.
అ.వె. తొలకరి పొడఁ గాంచి తుది లేని యానంద మొదవరైతు మదిని వ్యధను వీడి
భూమిదున్నుటకయి పూజలు చేయుచు పొంగిపోవునతఁడు. పూజ్య కృష్ణ! 33.
ఆ.వె. చిఱు చిఱు వడగళ్ళు చెలరేగు పెనుగాలి, కారుమబ్బుల గతి కనిన రైతు
వర్షధార తడువ పరువెత్తు హర్షంబు మిన్నుముట్ట భవిత నెన్ని కృష్ణ! 34.
ఆ.వె. చిటపట చిఱు జల్లు కటిక నేలను పడి నంతనావిరయి, నయ పరిమళము
జగతిని వెదజల్లు, సొగసైన కలవాపి నటన చేయ వలచునచట కృష్ణ! 35.
ఆ.వె. తొలకరింపవనిని పలకరింపఁగ కవి కలము పట్టు రయితు హలము పట్టు
కలము హలములందు కలవునీవని నమ్మ, కలిగి శుభములీయఁ గలవు కృష్ణ! 36.
5. సర్కారు బళ్ళు చదువుల గుళ్ళు.
ఆ.వె. శ్రీకరంబు చదువు, చిత్జ్ఞాన సుఫలద. జీవితేశునఱయఁ జేయునిదియె.
జీవ శక్తినొసఁగు జీవికకిదిప్రాపు, భావి భాగ్యమిదియె, దేవ! కృష్ణ! 37.
ఆ.వె. చదువు సంద్యలరయ, సన్మార్గమరయంగ, గురుకులంబులమరఁ గొలుప నాడు
నేడు బ్రతుకు బాట నేర్పాటు సర్కారు బడులు చేయు నవియె గుడులు కృష్ణ! 38.
ఆ.వె. గుడులలోన శిలను కూర్మిని గను దైవ - మనుచు నేర్పు బడులు మనకు గుడులు.
సత్యమెన్నిచూడ సర్కారు బడి మేలు - కొలుపు, మదిని మేలుకొలుపు కృష్ణ! 39.
ఆ.వె. ఓనమాలనరయ నోర్పుతో సర్కారు బడులు నేర్పి కొలుపు భక్తి మనకు
ఆంగ్లవర్ణములనె యరయమంచును నేర్పు నట్టివేల విను మహాత్మ కృష్ణ! 40.
ఆ.వె. పెక్క సొమ్ములొసఁగి పేరున్న బడులంచు నాంగ్ల భాషనరయనంప శిశువు
చిక్కులందుపడుచు చీకాకు పొందునే? క్షేమమేల కలుగు శ్రీశ! కృష్ణ! 41.
అ.వె. భాగ్యమంతపోవు, భవిత శూన్యంబగు, - తెలుఁగు భాష మరచు, నలిగిపోవు
నెట్టి కష్ట మనున దిలఁ గన సర్కారు - బడుల నుండదు కద! ప్రనుత కృష్ణ! 42.
ఆ.వె. ఆటపాటలకును, మేటి విద్యలకును సాటిలేని ప్రగతి బాట నడుపు
సద్విభాసితమగు సర్కారు బడి సాటి లేదు చూడ భువిని లేదు కృష్ణ! 43.
ఆ.వె. నిరుపమానులయిన నిష్ణాత బోధకుల్ నేర్పు విద్యలిచట నేర్పు మీర.
అటకు నిటకుపోయి ఆయాస పడనేల భావి జీవితమున వరల కృష్ణ! 44.
ఆ.వె. అమ్మపాల సాటి యవనిని లేదుగా! - కమ్మ తెలుగు సాటి కనఁగ లేదు.
సదయ బోధనమున సర్కారు బడి సాటి - లేదు లేదు లేదు లేదు కృష్ణ! 45.
6. విచ్ఛిన్నమౌతున్న వివాహ వ్యవస్థ - సంతానంపై దాని ప్రభావం.
ఆ.వె. శ్రీకరంబనుచును జీవన సరళికి = పెండ్లితంతు కొలిపిరిండ్లు వెలుఁగ
దాని వలన వారు తమదైన సంతతి - సుఖముపొందిరపుడు, శుభద కృష్ణ! 46.
ఆ.వె. దంపతులగువారు తమరిద్దరొక్కటై - కలిసి మెలిసి బాధ్యతలు వహించు.
నొకరికొకరుతోడు సకల శుభములిచ్చు - ననుచునేర్పరచిరి వినుము కృష్ణ! 47.
ఆ.వె. ఇట్టిచక్కనిదగు నీ సంప్రదాయము - మట్టిఁగలియుచుండె మహిని నేడు.
స్వేచ్ఛ పెఱిగి వారలిచ్ఛానుసారము - గొడవలు పడుచుండ విడరె కృష్ణ! 48.
ఆ.వె. ఆలుమగల మధ్యనన్యోన్యతయె సంతు - హేతువన్నదెఱిఁగి నీతి తోడ
మెలఁగుచున్నఁ గలుగు మేలైన సంతతి - మెలగకున్న జనత కలఁగు కృష్ణ! 49.
ఆ.వె. ధర్మమార్గము విడి దంపతులున్నచో - కలుగు సంతు దురిత గతుల నడచు
దురితులయిన సంతు దుర్గతిపాలౌను. - చేయరాని పనులు చేసి కృష్ణ! 50.
ఆ.వె. తల్లిదండ్రులొసఁగు ధనము ప్రేమయె కనఁ - బ్రేమ లేని బ్రతుకు బీడువారు.
లోకకంటకులగు లోకాన బిడ్డలు - తల్లిదండ్రుల విడు ధరను కృష్ణ! 51.
ఆ.వె. భర్తమాట వినని భార్యలుండగరాదు - భార్య మాట వినని భర్తలటులె.
వారసత్వ గతిని వర్ధిలఁ జేసిన - బాగు పడును పృథ్వి బాల కృష్ణ! 52.
ఆ.వె. వారి సంతు వెలుఁగు భక్తిప్రపత్తులన్ - వరలఁ గలరు వారు వసుధ కృష్ణ!
కానినాడు జగతి గాఢాంధకారాన - కుములు నిజము కాంచ, గోప కృష్ణ! 53.
ఆ.వె. ధర్మబద్ధమయిన దాంపత్య బంధమున్ - గౌరవింపవలెను కాపురమున,
గౌరవింతుమేని ఘనులైన పెద్దలన్ - దైవశక్తి మనకుఁ దక్కు కృష్ణ! 54.
7. మాదక ద్రవ్యాల మత్తులో యువత - నాశనమవుతున్న భవిత.
ఆ.వె. శ్రీనివాసుఁడవని చిక్కుంచుకొన నిన్ను - చేయి పట్టి తరికి చేఁదుకొనవొ?
మానవాళి మరిగె మాదక ద్రవ్యముల్ - భవిత భ్రష్టమవదె? పాహి కృష్ణ! 55.
ఆ.వె. అతిప్రమాదకరము లగును మాదకద్రవ్య - ములవి మరిగి ప్రాణములకు ముప్పు
తెచ్చుకొనుచునున్న వచ్చునెవ్వఁడు కావ, - మాన్పి కావుమఖిల మాన్య కృష్ణ! 56.
ఆ.వె. పెద్దవారు పలుకు సుద్దులు వినఁజాల - రిట్టి మాదకములనెఱిఁగిరేని.
పిన్నవారి భవిత పీకుకుపోవును - జాగు వలదు.కావ జాలు కృష్ణ! 57.
ఆ.వె. నీతి నెఱుఁగ నేర్పి భాతిని పెంచినన్ బాలురెపుడు నేర్వజాలరిట్టి
మత్తు కలుగఁ జేయు మాదక ద్రవ్యముల్ గొనుట. నేర్పునటుల కనుము కృష్ణ! 58.
ఆ.వె. మంచి చెడులనెన్న మరతురు మత్తులో భవిత శూన్యమగుట భువిని కనరు.
మత్తుమందు మరిగి చిత్తగుచున్నట్టి వారి మదులు మార్చవేర? కృష్ణ! 59.
ఆ.వె. తల్లిదండ్రులపయి దయన్నదే వీడు, తనను తాను కనడు గుణము చెడును.
మరిగిరేని జనులు మాదక ద్రవ్యముల్ మరుగకుండ సుగతి మనుపు కృష్ణ! 60.
ఆ.వె. చదువు సంధ్యలు విడు సద్భావనలు వీడు సుగతి వీడు తనదు ప్రగతి వీడు
వీడ జాలక తను వాడు మాదకద్రవ్య ములను. కావుమతని పూజ్య కృష్ణ! 61.
ఆ.వె. చేయ రాని పనులు చేయఁబూను యువత, ప్రాయముడుగునాడు పనికి రారు.
జ్ఞేయములను నేర్చి శ్రేయంబు గనుమార్గ గాములవగఁ జేసి కాచు కృష్ణ! 62.
ఆ.వె. తల్లిదండ్రులెపుడు తమ పిల్లలను కని పొంగఁ జూతురుకద? ముదిమి కదిసి
మూల్గుచున్న తరిని పోషింపఁదగు సంతు మత్తు వీడి కనఁగ మలచు కృష్ణ! 63.
8. సమాజ శ్రేయస్సు - నా కర్తవ్యము.
ఆ.వె. అజుని సృష్టిని భువినపురూప సౌందర్య - సత్ప్రభా ప్రణవ ప్రశస్తి నిండె.
జ్ఞాన హీనులమయి గ్రహియింపఁగాలేము. - జ్ఞానమొదవునట్లు కనుమ కృష్ణ! 64.
ఆ.వె. జ్ఞాన దీప్తి కలుగ కానంగనగును సత్. - సత్స్వభావమిలను జయపథంబు.
నాదు కృషిని దాని శోధించి వ్యాప్తిలం - జేయఁదగును. కలుగ జయము కృష్ణ! 65.
ఆ.వె. సత్వమీవె ప్రణవ సౌందర్యమును నీవె, నిన్నె జూపు జనులనెన్ని వారి
వలన ప్రబల సత్స్వభావంబు కృషి చేయ వలయునయ్యనేను వసుధ కృష్ణ! 66.
ఆ.వె. చిత్స్వరూపమున ప్రసిద్ధంబుగా నీవు మనములందు దాగి మసలుదువయ
నిన్నుఁ గాంచి ప్రజల కెన్ని చూపుట నాదు విది. చరింపఁ గనుమ ప్రీతిఁ గృష్ణ! 67.
ఆ.వె. దోష గతులఁ బాపి, భాషణంబునమంచి భావనమున మంచి ప్రబలఁజేయు
ధర్మమమరె నాకు. తప్పక చేయించు, నాకు నీడవగుచు నడచు కృష్ణ! 68.
ఆ.వె. నీవె దోష రహిత నిర్మలాత్ముఁడవయ్య! దోష రహితమైన భాషవీవె.
భావనములవెల్గు బ్రహ్మంబు నీవె నిన్ వరలజూపుదునయ వరద! కృష్ణ! 69.
ఆ.వె. ఆత్మశుద్ధి కొఱకు హరి పాదపద్మముల్ మనములందు నిలుపి మనునటులను
చేయవలయు నేను చిన్మార్గ గామినై భక్తపాళికిలను భవ్య కృష్ణ! 70.
ఆ.వె. నీదు తోడు కలిగి ఖేదంబులను బాపి నిత్య సంతసమును నిలుపవలయు
భారతీయులమది. పరమార్థమిదె కదా! ధర్మ పథము నిమ్ము దయను కృష్ణ! 71.
ఆ.వె. ఇహములోన కుములు నీస్వరు నెఱుఁగమిన్, మోహతప్తులగుచు మూర్ఖ జనులు.
వారి మదులకెక్క నీరూపమును జేయ వలయు నేను. మదుల నిలుచు కృష్ణ! 72.
9. తెలుఁగు భాషా పరిరక్షణలో ప్రభుత్వం యొక్క పాత్ర, మన కర్తవ్యము..
ఆ.వె. శ్రీకరంబు తెలుఁగు. శ్రీవాణి మంజీర - నాద మంజులమగు నా తెలుంగు.
తెలుఁగు దివ్వె భువిని కొడికట్టుకొనుచుండ, - ప్రభుత కాంచకుండె భవిత కృష్ణ. 73.
ఆ.వె. జీవభాష తెలుఁగు, చిన్మూర్తిఁ గనఁ జేయు, - ధైవభాష పోలి ధాత్రి వెలిఁగె.
భావ సుందరమగు పదసంపదల భాష. - బ్రతుకఁ జేయుమయ్య క్షితిని కృష్ణ! 74.
ఆ.వె. ప్రభుత దృష్టి పెట్టి పాఠశాలలనుండి - తెలుఁగు వరలఁజేసి నిలుప వలయు.
జనులు మాతృభాష ఘనతను మరువక - తెలుఁగు నేర్వ భువిని వెలుఁగు కృష్ణ! 75.
ఆ.వె. తెలుఁగు తెనుఁగు నాంద్ర దేదీప్య నామాల - వెలుఁగె నాడు తెలుఁగు జిలుఁగులీని
తెలుఁగు వెలుగుకింక తెల్లవారుచునుండె - నాంగ్లమరయుచుంట నమల కృష్ణ! 76.
ఆ.వె. చిత్ర కవిత, బంధ చిత్ర, గర్భకవిత, - శ్లేష కవిత తెలుఁగు హృదయమపుడు
నేడు వర్ణచయము నేర్వకుండుటఁ జేసి, - వీడిపోయె తళుకు వినుము కృష్ణ! 77.
ఆ.వె. సద్వధాన సుగతి, సరస వాఙ్మయముతో - నలరు భాష తెలుఁగుకథమ గతియె
కలుగుచుండె. ప్రభుత కని కావఁగావలెన్, - మరచిరేని తెలుఁగు మనదు కృష్ణ! 78.
ఆ.వె. మనము తెలుఁగు భాష మాటలాడవలయు - సరస కావ్య తతిని చదువ వలయు.
ఘనత చాటు తెలుఁగు ఘన చిత్ర బంధముల్ - కలవటంచు తెలుపవలయు కృష్ణ! 79.
ఆ.వె. నవ రసామృత మిది, శ్రవనసుందరమిది - నవ్య గతుల వెల్గు భవ్య భాష
అట్టి తెలుఁగు వీడుటన్యాయమేకద! - అరసి కావుమయ! యనంతకృష్ణ! 80.
ఆ.వె. బ్రతుకు కొఱకు మనము పాశ్చాత్య దేశాల - కేగి యుండవచ్చు నెచ్చటున్న
మాతృభాష తెలుఁగు మన్ననందునటుల మేము - చేయవలయు పృథ్వి కృష్ణ! 81.
10. వైద్యరంగం - మారుతున్న మీకరణాలు.
ఆ.వె. శ్రీకర, మహనీయ, శ్రీహరి నామమున్ జేకొను మనుజుండు చెలఁగునెపుడు
ననుపమమయినట్టి యారోగ్య సంపదన్ వైద్యమతనికేల వినుత కృష్ణ! 82.
ఆ.వె. వైద్య వృత్తి నలరు వైద్యుఁడే నారాయణుండటంచు గనరె నిండు మదిని,
అట్టివైద్యుడెలమినసహాయుడై వృత్తి నమ్ముకొంచు బ్రతుకు నవని కృష్ణ! 83.
ఆ.వె. వైద్యవృత్తిచేత వర్ధిల్లిరానాడు. విశ్వ జనులు పొగడ వేల్పులయిరి.
ధనమె ఘనమటంచు దయమాలి పీడించు రాక్షసులయినేడు క్రాలు కృష్ణ! 84.
ఆ.వె. మారుచుండె జగతి. మర్యాదలును మారె మానవత్వమిలను మట్టి కలిసె.
వైద్య విద్య కొఱకు వరలు భూములనమ్మి రిక్త హస్తులగుచు వ్రేగు కృష్ణ! 85.
ఆ.వె. అట్టివారు పృథివి ననుపమ ధనవాంఛ నరయ నేర్వరహిత దురితగతులు.
ధనము కురియు రోగి తమకు దక్కినవేళ పిండుచుండిరవని. వేద్య కృష్ణ! 86.
ఆ.వె. వైద్యవిద్యనరయ వలయునుచితముగ, పాలకులు గ్రహించి, వారి కొఱకు
ధనము కూర్చి చదువు తప్పక చదివించ లోకులఁ గని వారు సాఁకు కృష్ణ! 87.
ఆ.వె. ఉచిత వైద్యమమరనొప్పగున్ జనులకు. బ్రతుకజాలుదురిల ప్రజలు భువిని,
ధనము కొఱకు వైద్యమును నేర్చుకొనుటిమి? శోచనీయముకద! శుభద కృష్ణ! 88.
ఆ.వె. ప్రకృతివైద్యమిలను ప్రాణరక్షణఁ గొల్పి వరలఁ జేసెనపుడు ధరను జనుల.
ప్రకృతి వికృతమయ్యె బ్రతుకు భారంబయె. జనుల స్వాస్త్యమమరఁ గనుము కృష్ణ! 89.
ఆ.వె. రోగముల్ ప్రబలెను. రోగార్తులను కాచు వైద్యముల్ ప్రబలెను. వైద్యశాల
లెల్ల ధనము కొఱకునెల్లలు మరచిరే! రోగికేమి దిక్కు? ప్రోవు కృష్ణ!. 90.
11. టీవీ సీరియళ్ళు - సమాజంపై ప్రభావం. ( నామ గోపన చిత్రము )
ఆ.వె. శ్రీపతి కనిపించు చేతనత్వముఁగొల్పు - రమ్మని పిలిచేమొ రారు జనులు.
దూరదర్శనమున దూరిపోదురు వారు - కాంచు కాంక్ష వలన, కనుము కృష్ణ! 91.
ఆ.వె. బుల్లితెరను వచ్చు పుంఖానుపుంఖాల - నాటక క్రమదృష్టి నాట మదిని
చేటు కలుఁగఁ జేయు చిత్ర దర్శనమబ్బె. - మానవాళిఁ గనుమ మనిచి, కృష్ణ! 92.
ఆ.వె. చూచువారి మదికి సూదంటురాయియే - దూరదర్శన మనివారణమయె.
ధనముచేసుకొనెడి మనమె కానఁగవచ్చు. - ప్రబలె దీని మహిమ. పాపు కృష్ణ! 93.
ఆ.వె. సమయ పాలనమున సాక్షులై కనిపించు - బుధులు చూడ మరిగి విధులు మరచి
దూరదర్శనమున సారించి మనమును - దూరుదురయ దానిఁ గోరి కృష్ణ! 94.
ఆ.వె. దూరదర్శన క్రమ భూరి దుర్గతి నాడు - వారు కూడ విడువఁ గోరు మగల
నాడువారి మనసులాకట్టుకొనునవి. - చెడ్డమార్పు లొసగుఁ జేటు కృష్ణ! 95.
ఆ.వె. మంచియు చెడు నుండు మన దూరదర్శినిన్ - సమయపాలనమది జరుగనీదు.
కాలగతిని మరచి కాంచుటన్ వికటించి - జీవితములు సమసిపోవు కృష్ణ! 96.
ఆ.వె. దూర దర్శనమున దురితంబులే చేయు - టీ వ్యవస్థ మరగు పృథ్వి పైన.
విలువలన్ విడుతురు విగత నైతికముల - వీక్షణమునఁ జేసి వినుత కృష్ణ! 97.
ఆ.వె. విలువలెంచని మది నలముకొనదె యుదా - సీనత? మనకింక చెడుటె మిగులు.
ఇహ పరములపైన నేరీతిగా కల్గు - రిక్త జీవుల కనురక్తి? కృష్ణ! 98.
ఆ.వె. ధర్మదూరులగుచు తరియింప లేక జ్ఞే - యము నిలం దెలియక యలమటింత్రు.
అంతులేని కథల ననురక్తిఁ గనుచు, క్రు - ళ్ళుచు, కృశింతురు కలఁగుచును కృష్ణ! 99.
12. భారత రాజ్యాంగము అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ.
ఆ.వె. శ్రీనివాసమదియె స్వేచ్ఛకు నిలయము పలుకవచ్చు ధనము బలము చేసి.
భారతావనినిట ప్రకటింప భావముల్ - స్వేచ్ఛ లేదు నిజము వినుమ కృష్ణ! 100.
ఆ.వె. స్వేచ్ఛ కలదటంచు వెలువరించితిమేని, తుచ్ఛులైన నరులు తునుమ వచ్చు.
భావప్రకటనంబు ప్రాణంబులకు తెచ్చు - ముప్పు నిజము చూడ పూజ్య కృష్ణ! 101.
ఆ.వె. మనసులోకలదని మాటలాడ తగదు. - మనుజులున్న లోక మార్గమెఱిఁగి.
బ్రతుకవచ్చు మనము ప్రఖ్యాతమెఱుఁగుచు, - బ్రతుకు బాట కనుచు రమ్య కృష్ణ! 102.
ఆ.వె. స్వేచ్ఛ కలదటంచు నిచ్ఛానుసారము - మంచి చెడ్డలు విడి మాన్య జనుల
పరువు మంటఁ గలుపు ప్రకటనలనుచేయు - మూర్ఖ లధికమైరి పుడమిఁ గృష్ణ! 103.
ఆ.వె. స్వేచ్ఛ కలుగనౌను. తుచ్ఛత సరికాదు. - భంగ పరుప రాదు పరుల శ్వేఛ్చ.
అట్టి భావప్రకటనంబునే రాజ్యాంగ - మొసగెనయ్య కనఁగ వసుధ కృష్ణ! 104.
ఆ.వె. మాటలాడనగును మనభావమునుదెల్ప. నోటి మాట, వినిన తోటివారి
యాత్మగౌరవమును హాని పరుపరాదు. భావ భాగ్యమపుడె ప్రబలు కృష్ణ! 105.
ఆ.వె. సమసమాజమునను సభ్యతా సంస్కార - ములను వీడఁ దగదు మూలమదియె.
భావప్రకటనంచు వాచాలురైనచో - శిక్షతప్పదపుడు శ్రీశ కృష్ణ! 106.
ఆ.వె. వ్రాతలందయినను భాషణంబందైన - భావ ప్రకటనాన వరలుసుగతి
నీవు కనుచు మంచి నేర్పుమా ప్రజలకు - నేర్పు మీర జనులు నేర్వ కృష్ణ! 107.
ఆ.వె. భావ ప్రకటనాన బ్రహ్మస్వరూపంబు - జూపు వారు ఘనులు. శోభిలుదురు.
మంచిఁ గొలిపి మాకు మర్యాద దక్కించు. - మంగళములు నీకు మహిత కృష్ణ! 108.
స్వస్తి.
జైహింద్.
1 comments:
నమస్కారములు
శతక పద్యములు అద్భుతముగా నున్నవి అభినందన మందారములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.