గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2019, మంగళవారం

నా జన్మ...

జైశ్రీరామ్. 

1.శా.  శ్రీమన్మంగళ దేవ దేవ! నృహరీ! చింతాన్వయంబందు నన్

భూమిన్ బుట్టఁగఁ జేసి, పెంచితివిటుల్ పూజ్యంబుగా నిల్పి, నా

క్షేమంబీవె నిరంతరంబు గనుచున్ గేల్పట్టి నన్ బ్రేమతో

శ్రీమార్గంబున సాగఁ జేసితివి, నేరీతిన్ నినున్ గొల్చెదన్?

2.శా.  జన్మంబందున నొక్కమారయిన నిన్ సద్భక్తి నెన్నన్, బున

ర్జన్మంబే కలిగింప నేర్వక హరీ! సాయుజ్యమున్ గొల్పుదే,

సన్మార్గంబున పాపదూర శుభ సత్ సంస్కారిగా నిల్పి, న

న్నున్మాదాదులకున్ సుదూరునిగ నీ వొప్పారగా నిల్పితే.

3.మ.  తలిదండ్రుల్ మహనీయు లెన్నఁగ, లసద్ధాత్రీశులే బంధువుల్,

కలనైనన్ మరువంగరాని గురువుల్, కారుణ్య పూర్ణుల్ హితుల్,

కలనైనన్ నను  వీడనట్టి సతి, నీ కారుణ్యమున్ జేసి నా

కిలఁ బ్రాప్తించె, నృసింహదేవ సరిరా రీకెవ్వరున్ సృష్టిలోన్.

4.మ.  ఋణముల్ తీర్పను బుట్టఁ జేసితివిగా పృథ్విన్? ఋణంబంతయున్

ప్రణవాకారుఁడ! తీరునెట్లు?  కన నా భారంబునే మోయు నీ

ఋణ మే జన్మకు తీర్చఁ గల్గుదును? మాతౄణంబు, పిత్రాదులన్

ఋణభారంబులవెట్లుతీర్తు? నృహరీ! కృష్ణా! విముక్తిప్రదా!

5.ఉ.  శ్రీపతి! నీ పదద్వయము చేకొన నీయని పాప జన్మ, యీ

పాపపు కూపమందుఁ బడ, పాప విమోచన సాధ్య మెట్లగున్?

భూ పరిధిన్ గలారలకు పుణ్యఫలంబులు, వాని తోడనే

పాపఫలంబులున్ గలుగు, పాయు టసాధ్యము వీటి నో హరీ!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.