గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జనవరి 2019, మంగళవారం

మకర సంక్రాంతి పండుగ సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
మకర సంక్రాంతి సందర్భంగా మీరు సకుటుంబ బంధు మిత్ర పరివారముగా సుఖ సంతోషాలతో ఆనందసాగరంలో తేలియాడాలని మనసారా కోరుకొంటూ శుభాకాంక్షలు తెలిఅయఁ జేస్తున్నాను.
చ:-మకరమునందు సూర్యుఁడు విమానప్రదేశమునందు కూడగా
సకల జగమ్ము పుణ్య పరిసంభవ కాలముగా గణించుచున్
ముకుళిత హస్తులై తలచి పూర్వుల నెల్లర బ్రాహ్మణాళిలో.
సకల పదార్థముల్ గొనగ చక్కగ నిత్రు భుజింప భక్తితో. 

ఉ:-పంట పొలాలలో విరగ పండిన పంటల లక్ష్మి బండ్లపై
నింటికి చేరి శోభిలగ, హేమ ప్రభా రమణీయ తేజసం
బంటిన రైతు బిడ్డ పరమాన్నము పంచును గాదె! పూజ్యులై
యింటికి వచ్చు వారలకు, నెంతటి పుణ్య పునీత మూర్తియో!

ఉ:-బంగరు కాంతులీను పురి పాకలు, మామిడి తోరణావళుల్
ముంగిట రంగవల్లుల నమోఘముగా విరచించు కన్యకల్
చొంగలు కార్చుచున్ కనెడి సోకుల రాయుల వేష భాషణల్
రంగుగ నద్దినట్టి చదరంగపు మ్రుగ్గుల మధ్య గొబ్బిళుల్,
జంగమ దేవరల్ కొలుపు చక్కని నాదములిచ్చు శంఖముల్
టింగరి వోలె చెట్లపయి డేకుచు నాడెడు కొమ్మ దాసరుల్
సాంగముగా హరిన్ కొలుచు సన్నుత శ్రీ హరి దాసరావళుల్
పింగళ వర్ణులౌ పగటి వేషపు గాండ్రును, పల్లె వాసులున్,
రంగుల వస్త్ర ధారణను రాజిలు ముంగిటి గంగిరెద్దులున్
హంగులకాశ చేసి వరహాలను జల్లెడి పెత్నదారులున్
నింగికినంటు యాశల మునింగియు నల్గెడి క్రొత్త యల్లుళున్
రంగులు పూసి బావలకు రాతిరి యక్కల దాచు చెల్లెళున్
బంగరు బావ గారనుచు వందలు గుంజెడి బావ మర్దులున్,
బెంగగ నుండు నప్పులిల పేరుకు పోవుచునున్న మామలున్.
భంగమునొంది జూదమున పళ్ళికలించెడి తోటి యల్లుళున్.
ఖంగని మ్రోగునట్టి గుడి గంటలు. మండెడి భోగి మంటలున్,
నింగికి నంటు సంతసము నివ్వటిలే సరి క్రొత్త జంటలున్,
బంగరు పళ్ళెరంబులను పంటికి నోటికి నచ్చు వంటలున్,
రంగుల నీను పల్లెలును రమ్యత నొప్పెడి పట్టణంబులున్,
యింగిత మున్నసత్కవుల కెల్ల మనోజ్ఞ ము సంకురాత్రులౌన్.
జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.