జైశ్రీరామ్.
10వ పద్యపక్షము
వైద్యరంగం - మారుతున్న సమీకరణాలు.
రచన. చింతా రామ కృష్ణా రావు.
౧. ఆటవెలది త్రయ గర్భ సీసము. శ్రీకర, మహనీయ, శ్రీహరి నామమున్ జేకొను మనుజుండు చెలఁగునెపుడు
ననుపమమయినట్టి యారోగ్య సంపదన్ వైద్యమతనికేల వినుత కృష్ణ!
వైద్య వృత్తి నలరు వైద్యుఁడే నారాయణుండటంచు గనరె నిండు మదిని,
అట్టివైద్యుడెలమినసహాయుడై వృత్తి నమ్ముకొంచు బ్రతుకు నవని కృష్ణ!
ఆ.వె. వైద్యవృత్తిచేత వర్ధిల్లిరానాడు. విశ్వ జనులు పొగడ వేల్పులయిరి.
ధనమె ఘనమటంచు దయమాలి పీడించు రాక్షసులయినేడు క్రాలు కృష్ణ!
౨. ఆటవెలది త్రయ గర్భ సీసము.
మారుచుండె జగతి. మర్యాదలును మారె మానవత్వమిలను మట్టి కలిసె.
వైద్య విద్య కొఱకు వరలు భూములనమ్మి రిక్త హస్తులగుచు వ్రేగు కృష్ణ!
అట్టివారు పృథివి ననుపమ ధనవాంఛ నరయ నేర్వరహిత దురితగతులు.
ధనము కురియు రోగి తమకు దక్కినవేళ పిండుచుండిరవని. వేద్య కృష్ణ!
ఆ.వె. వైద్యవిద్యనరయ వలయునుచితముగ, పాలకులు గ్రహించి, వారి కొఱకు
ధనము కూర్చి చదువు తప్పక చదివించ లోకులఁ గని వారు సాఁకు కృష్ణ!
౩. ఆటవెలది త్రయ గర్భ సీసము.
ఉచిత వైద్యమమరనొప్పగున్ జనులకు. బ్రతుకజాలుదురిల ప్రజలు భువిని,
ధనము కొఱకు వైద్యమును నేర్చుకొనుటిమి? శోచనీయముకద! శుభద కృష్ణ!
ప్రకృతివైద్యమిలను ప్రాణరక్షణఁ గొల్పి వరలఁ జేసెనపుడు ధరను జనుల.
ప్రకృతి వికృతమయ్యె బ్రతుకు భారంబయె. జనుల స్వాస్త్యమమరఁ గనుము కృష్ణ!
ఆ.వె. రోగముల్ ప్రబలెను. రోగార్తులను కాచు వైద్యముల్ ప్రబలెను. వైద్యశాల
లెల్ల ధనము కొఱకునెల్లలు మరచిరే! రోగికేమి దిక్కు? ప్రోవు కృష్ణ!.
ఉ. మేలగు వైద్యమందున సమీకరణంబులు మారుచుండె, ని
ర్భీలత రోగులందు కనిపించుట లేదు దురంత దుస్థితిన్.
కాలము మారిపోయె. కలికాల ప్రభావము పెచ్చురేగె నీ
వేల గణింపకుంటివొ? రమేశ్వర! రక్షణ గొల్ప రావయా.
క. నారాయణులుగ వైద్యుల
నారాధన చేతురు ప్రజ. నాయనలారా!
మీరావైద్యామృతమును
కోరి యొసగి కాచి జనులకున్ హరియగుడీ!
స్వస్తి.
జైహింద్.
1 comments:
నమస్కారములు
నేటి వైద్య వృత్తిని గురించి చక్కగా వివరించారు . ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.