అవధాని గారి తల్లిదండ్రులు.
సుజన బాంధవులారా!
శ్రీ చంద్రశేఖరావధాని గారు పూరించిన మరొక సమస్యను ఈ రోజు చూద్దాం.
"పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్".
(పవి = వజ్రాయుధము)
ఈ సమస్యకు అవధాని గారి పూరణను, నా పూరణను వ్యాఖ్యాలో చూడ వచ్చును.
మీరు మీ పూరణలద్వారా పాఠకులనలరింపఁ జేయగలరని ఆశింతును.
జైశ్రీరాం.
జైహింద్.
12 comments:
రవణక్కలియాస్ రోజా
సవరించుక మార్గము తన సౌఖ్యము కొరకున్
రవణను పెండ్లాడెనుగా
"పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్"
శివదేవుండతడు కిరా
తు వలెను పోరెను, కిరీటి తోడన్. తుదకా
శివుడే వరాల నిచ్చెన్
పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్
ఈ సమస్యకు నా పూరణము.
భువి కర్కశ దుశ్చేష్టుఁడు
ప్రవిమల సద్బోధలువిని పరవశమొందెన్
నవనీత హృదయుఁడాయెను.
పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్.
ఈ సమస్యకు అవధాని గారి పూరణము.
రవి కాంచని స్థలములనే
కవి కాంచునటన్న సూక్తి ఖ్యాతంబయ్యెన్.
కవి రమణీయపు బల్కుల
పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్.
చాలా చక్కగా పూరించిన అవధానిగారికి అభినందనలు.
దివి కేఁగె సుధను గొని క
ద్రువ కిడ, నడ్డుకొనె బలభిదుఁడు, జననీ దా
స్య విమోచకుఁడు గరుడునకు
పవి పూవుగ మారిపోయి పరవశ మయ్యెన్.
(తల్లి దాస్యవిముక్తికోసం అమృతం తెచ్చి ఇవ్వాలని కద్రువ కోరగా గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి అమృతభాండాన్ని అపహరించి తెస్తుండగా ఇంద్రుడు అడ్డుకొని వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది గరుడుని ఏమీ చేయలేక అతనికి వశమయిందన్న ఐతిహ్యం సందర్భం)
హనుమచ్ఛాస్త్రిగారూ! రణక్క పెండ్లిచేసి పవిని పూవుగా మార్చేసారు. అద్భుతం. అభినందనలు.
మందాకినిగారూ! వజ్రాయుధంలాంటి శివుణ్ణే భక్తికి వశమై పూవుగా మారేలా చేసారు. కథ పాతదే ఐనా. పూరణ అద్భుతంగా ఉందండి. అభినందనలు.
శంకరయ్యగారూ! అమృతాపహరణ ఘట్టాన్ని తీసుకొని, అర్థాంతర న్యాసంలో అద్భుతంగా పూరణ చేసిన మీకు నా అభినందనలు.
శ్రీగురుభ్యోనమ:
పవనకుమారుడు తెలియక
రవిబింబము పండనుకొని రయమున బోవన్
దివినాథుడు తా విసరగ
పవి, పూవుగ మారిపోయి పరవశమయ్యెన్
రవి చంద్రాగ్ని విలోచను
డవురా! మరుడేయ శరము నద్రిజ గాంచెన్
భవుని మనస్సు చలించెను
"పవి పూవుగ మారిపోయి పరవశమయ్యెన్"
వజ్రాయుధపు దెబ్బ తిన్న ఆంజనేయస్వామివారికి అనేక వరములు లభించుట వలన వజ్రాయుధము ఆస్వామి పాలిట పుష్పమైనదనే భావంతో వ్రాశాను
శ్రీపతి శాస్త్రి గారూ! మీ పూరణ బాగుంది.
ఐతే రయమున పోవన్ కు బదులు రయమున పట్తన్ అని ఉంటే ఇంకా అందగిస్తుందని భావిస్తున్నాను.
మీకు నా అభినందనలు.
మిస్సన్న గారూ!
చాలా బాగుందండి మీ పూరణము. అభినందనలు.
ఇచ్చిన సమస్యను, అవధాని చక్కటి నేర్పుతో పూరించెను. అవధాని యొక్క పూరణతో వజ్రాయుధము లాంటి సమస్య పూవుగ మారిపోయినది అనే ఊహతో......
సవివరణంబుల మయమై,
కవితాతత్వమ్ము శుద్ధ గణముల తోడన్,
అవధాని చిక్కు విప్పెను,
పవి పూవుగ మారిపోయి పరవశమందెన్.
చిక్కు = సమస్య,
రవి గాంచిన తరులతలు
ఆవిర ళముగపెరుగు చుండు నవ్యక్తముగాన్ !
కవి హృదయము గనినంతనె
పవి పూవుగ మారిపోయి పరవశ మయ్యెన్ !
తప్పో రైటో తెలియదు వ్రాయాలని పించింది . తప్పులుంటే ప్రచురించ వద్దని మనవి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.