ఆర్యులారా!
అవధాని కట్టమూరి జీవనములో అవధాన పర్వంలో ఎదుర్కొనిన ఒక సమస్యను ఈ రోజు చూద్దాము.
మాటలు తప్పువారె బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్.
ఈ సమస్యకు అవధాని చేసిన పూరణను, నాయొక్క పూరణను వ్యాఖ్యానంలో చూద్దాము.
మీరు తమ భావనా సౌరభం గుబాళింప జేస్తూ,రచనా పాటవాన్ని ప్రదర్శిస్తూ, పూరణలను చేసి పంపి సాహితీ ప్రియానందకరులగుదురని విశ్వసిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
11 comments:
మాటల జెప్పియెన్నికల మాయలు జేయుచు గద్దె నెక్క ; మో
మాటము లెండుకయ్య, మది మానవ ! మానవ ! వారి మెచ్చుటన్ !
కోటలు గట్టు వారె ! మరి కూర్చుని మూటలు గట్టు వారె! హా!
మాటలు తప్పువారె బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్!
ఈ సమస్యకు నాపూరణము.
నేటి దురంత దుష్టులు మనీషుల వంచన చేతురన్నచో,
మాటనొసంగియున్, సుజన మాన్యుల కెత్తఱి దుష్టపాళిచే
జేటు కలుంగు నేని, పరిశీలన చేసి సమాజ దృష్టితో
మాటలు తప్పువారె బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్ .
మన అవధానిగారు ఈ విధంగా పూరించారు. చూడండి.
కోటను దాటు మాటలను కుప్పలు తెప్పలుగా వచింతురే!
కోటి వచించి యున్న మరి గొప్పకు, యొక్కటి యైన జేయరే!
నేటివినీతి లోకము,యనేకపు చెట్టల పుట్టలయ్యె. హా!
మాటలు తప్పువారె బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్.
బాగుందికదండీ!
హనుమచ్ఛాస్త్రి హృదంతరాళమును మాయాదౌష్ట్య దుర్మార్గులౌ
మనుజుల్ చేసెడి మోసముల్, గనెడి సమ్మాన్యంబులున్, కల్చె. బా
ధనువ్యక్తంబును చేసె నద్భుతముగా ధన్యాత్ముడీతండు.స
జ్జన సంస్కారము పూరణంబు తెలిపెన్. సన్మాన్యుడీతండిలన్.
శ్రీగురుభ్యోనమ:
కాటికి కాళ్ళుదాచినను కష్టములెన్నియు కల్గుచుండినన్
మాటలు తప్పువారె?? బహుమాన్యులు పూజ్యులు మాననీయులున్
ధీటుగ నిల్చినారు తమదేశపు పేదల సేవజేయుచున్
నేటికి కొందరుండిరన, నేస్తమ నమ్ముము నాదు మాటలున్
{మాటలు తప్పువారె = కష్టాలెన్ని ఉన్నా మాట తప్పరు కదా!
శ్రీపతి శాస్త్రి సత్కవులు చెప్పిన మాట యదార్థమయ్య.ఆ
శ్రీపతి వచ్చి చెప్పినను చెప్పినమాటను తప్పరయ్య. సం
దీపిత ధర్మ బద్ధులయి తేజరిలున్. వర భారతీయ ని
క్షేపిత సంప్రదాయమిది.శ్రీగుణ వర్యులు పూజనీయులౌన్.
సీతాదేవి:
ఆటలు తప్పవేరెరుగ నర్భకు లౌదురె, రాజనీతినే
పూటనవెల్లెవేసితిరొ?భూవరు నింతటి మాటలాడ?నే
నాటికి నాపుడయ్య!రఘు నాధుని నిందనఁ బిడ్డలార! మీ
మాటలు తప్పు. వారె బహుమాన్యులు పూజ్యులు వందనీయులున్.
గురువుగారూ ధన్యవాదములు
ఎంతటి భావనా గరిమ! ఎంతటిసత్కవితా ప్రభావమున్!
ఎంతటి పూరణా పటిమ! ఎంతటి చాతురి! ఎంత నేర్పరీ
సంతుకు సీత మాటలుగ చక్కగ చెప్పినదూకదంపూడే?
పంతము పట్టిన పట్టినన్ కవిత పారగ చేయును రామకృష్ణుఁడే.
అద్భుతం రామకృష్ణా. అభినందనలు.
ఆర్యా ! ధన్యవాదములు.
మీ పూరణ నేటి సమాజపు మేడి పండును చూపింది.
శ్రీపరి గారి విరుపు ఒక మెరుపు.
ఊక దంపుడు గారు అద్భుతమైన విరుపుతో ' ధన్' చేశారు.
సూటిగ సంజయుం డనెను చూపుకు నోచని వృద్ధ రాజుతో
నేటికి పాండుపుత్రులకు నెగ్గులు సేయుట, నీ కుమారులున్
మాటికి దూరు చుండు టలు ? మానుట మంచిది, వక్ర బుద్ధితో
మాటలు తప్పు; వారె బహుమాన్యులు, పూజ్యులు, వందనీయులున్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.