గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఆగస్టు 2011, గురువారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 15 / 21 వ భాగము


ఉ:- శ్రీ వరలక్ష్మియున్ తమను చేరి రహించెను తత్వ వేత్త ప్రీ
      తా వహమై. సుధా మతుల ధైర్య రహస్యము మాన్య! నీవెరా!
      ధీ వరు నాత్మలో కలుగ తేజరిలున్ గద గారమొప్ప; స
      ద్భావ హరీ! సదా వినయ భావము నిచ్చెడి వేణు గోపకా! 71.
        భావము:-
        ఎల్లప్పుడూ వినయ భావనను మాలో కలిగించెడి ఓ వేణు గోపకుఁడా!
        తత్వ వేది యైన శ్రీ వరలక్ష్మీదేవియు ప్రీతికి స్థానమైనదై తమరినే చేరి
        ఒప్పియున్నది. ఓ మాన్యుఁడా! అమృతముతో సరి పోలు మనస్సులందు గల
        ధైర్య రహస్యము నీవే కదా! సద్భావుఁడ వైన ఓ శ్రీ హరీ! నీ వంటి ధీ వరుని
        తమ మనస్సులో కలిగి యున్నట్లైతే గౌరవ మొప్పగా ఎవరైనాసరే తేజరిల్లును కదా!
        (అర్థాంతరన్యాసము).

క:-  వరలక్ష్మియున్ తమను చే  -  రి రహించెను తత్వ వేత్త ప్రీతా వహమై.
       వరు నాత్మలో కలుగ తే  -  జరిలున్ గద గారమొప్ప సద్భావ హరీ! 71.
        భావము:-
        సద్భావుఁడ వైన ఓ శ్రీ హరీ! నీ తత్వమును పూర్తిగ నెఱిగిన వరలక్ష్మీ దేవిప్రీతితో
        నిండినదై నిన్ను చేరి;ఒప్పెను. తన వరుడైన వాని ఆత్మలో ఉన్నట్లైతే గౌరవము
        పొందుచూ; ప్రకాశించును కదా! (అర్థాంతరన్యాసము)

గీ:- తమను చేరి రహించెను తత్వ వేత్త! -  మతుల  ధైర్య రహస్యము మాన్య! నీవె
      కలుగ తేజరిలున్ గద గారమొప్ప .-  వినయ భావము నిచ్చెడి వేణు గోప! 71.
        భావము:-
        వినయ భావనను మాలో కలిగించెడి ఓ వేణు గోపకుఁడా! మిమ్ములను గ్రహించిన
        తత్వ వేత్త మిమ్ములనే చేరి ఒప్పెను.  ఓ మాన్యుఁడా! ధైర్య రహస్యమైన నీవే
        మనసులందుఁ గలుగ గౌరవ మొప్పగా ప్రకాశించును కదా!

చ:- భవ! సు విధానమున్ విమల భక్తి విధేయత వెల్లి గొల్పితే?
      దివిజ నుతా! మతిన్ సుజన దీప్తి  విశిష్టత చూడఁ గొల్పితే?
      భవ రవి తేజమై అభయ భావ సుశక్తుల నందఁ గొల్పితే.
      యవని హరీ! మహా వినుత యద్భుత మైతివి! వేణు గోపకా! 72.
        భావము:-
        దేవతల చేత పొగడఁ బడు వాఁడా!  ఓ వేణు గోపకుఁడా! మాకు ప్రాప్తించిన
        ఓ శ్రీ హరీ! మంచి పద్ధతిలో నిర్మలమైన భక్తి; విధేయత; పరంపరగా మాలో
        కలిగించితివి కదా! సుజనులలోనుండు దీప్తి వైశిష్యమును మనసులో చూచునట్లు
        మమ్మొనరొంచితివి కదా! శుభ ప్రదమైన సూర్య కాంతివై నిర్భయమైన
        మంచి భావమును శక్తిని మాకందఁ జేసితివి కదా! భూమిపై గొప్పగా పొగడ దగిన
        అద్భుతమే అయి యుంటివి కదా!

క:- సు విధానమున్ విమల భ  -  క్తి విధేయత వెల్లి గొల్పితే? దివిజ నుతా!
      రవి తేజమై అభయ భా  - వ సుశక్తుల  నందఁ గొల్పితే యవని హరీ! 72.
        భావము:-
        దేవతల చేత పొగడఁబడు వాఁడా! ఓ శ్రీ హరీ! మంచి పద్ధతిలో  నిర్మలమైన భక్తి;
        విధేయత; పరంపరగా మాలో కలిగించితివి కదా! సూర్య కాంతివై నిర్భయమైన
        శక్తి వైశిష్యమును మాకందఁ జేసితివి కదా!

గీ:- విమల భక్తి విధేయత వెల్లి గొల్పి?  -  సుజన దీప్తి    విశిష్టత చూడఁ గొల్పి?
      అభయ భావ  సుశక్తులనందఁ గొల్పి.  -  వినుత యద్భుత మైతివి! వేణు గోప! 72.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! నిర్మలమైన భక్తి; విధేయత; పరంపరగా మాలో కలిగించి;
        సుజనులలోనుండు దీప్తి  వైశిష్యమును మనసులో చూచునట్లు మమ్మొనరించి;
        నిర్భయమైన మంచి భావమును శక్తిని  మాకందఁ జేసి; నీవు మాకు పొగడఁ దగిన
        అద్భుతమైతివి కదా!

చ:- తిరుపతి కొండపై అలసితేసతి సేవల నంది నీవు? స
      ద్వరుఁడవొకో? అటన్ కలియు భామల నేలనొ కాంక్ష తీర్చి? శ్రీ
      తిరు సతి నేలనో? కనగ ధీరత చాలకొ? గౌరవించి! రా
      వరద హరీ! కనన్. విన స్వభావ విరిద్ధమొ? వేణు గోపకా! 73.
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! తిరుపతి కొండ మీద నీవు అలసితెవే సతి సేవలనంది!
        అలసితి వేసతి సేవలనంది? నీవు సద్వరుఁడవే కదా? అక్కడ కలిసెడి భామల
        కాంక్ష తీర్చి ఏలుట కొఱకా? (అలసితివి) మంగళప్రద యగు లక్ష్మీ సతిని
        యేలుకొనుట చేతనా? (అలసితివి). గౌరవ పురస్సరముగ  చూచుటకు నీకు
        ధైర్యము చాలకనా? (అలసితివి) ఓ వరదుడా! ఓ శ్రీ హరీ! ఇటు రమ్ము.
        ఇది యంతయు ఎఱిగే విధంగా వినుట నీ స్వభావ విరుద్ధమా?

క:- పతి! కొండపై అలసితే  -  సతి సేవల నంది నీవు? సద్వరుఁడవొకో?
      సతి నేలనో? కనగ ధీ  -  రత చాలకొ? గౌరవించి! రా వరద హరీ! 73.
        భావము:-
        ఓ ప్రభూ! వరదుఁడవైన ఓ శ్రీహరీ! నీ సతి సేవలనందిన కారణముగా
        కొండలపైనున్న నీవు అలసితివా? నీ సతిని గౌరవిస్తూ తేరిపార జూచుటకు ధైర్యము
        నీకు చాలదేలనో ? నీవు మంచి వరుఁడవవేనా? నావద్దకు  వేంచేయుము.

గీ:- అలసి తేసతి సేవల నంది నీవు? -  కలియు భామల నేలనొ కాంక్ష తీర్చి?
      కనగ ధీరత చాలకొ? గౌరవించి! -  విన స్వభావ విరిద్ధమొ? వేణు గోప! 73.
        భావము:-
        ఓ వేణు గోపుఁడా! నిన్ను ప్రేమతో కలియు భామలను ఏలుటకనో; లేక నీ సతి చేయు
        సేవలను అందుచున్నందుననో ? వారిని గౌరవిస్తూ చూచుటకు ధైర్యము చాలకనో;
        అలసిపోతివే? ఇది నీ స్వభావమునకు విరుద్ధమా; యేమి?

చ:- నవ భవనాలలో అలసినాడవు; పూజల నందుచుండుటన్.
      నవ జవనా లతో వెలసినాడవు; గుండెల వెల్గు లీన మా
      నవ సవనాలలో సొలసినాడవు; భక్తుల శోభఁ గూర్చుటన్.
      ధవుఁడ! హరీ కృపన్ వినక తప్పదు నా మొర వేణు గోపకా! 74.
        భావము:-
        మా ధవుఁడా! ఓ శ్రీ హరీ! ఓ వేణు గోపకుఁడా! నూతనమైన భవనములలో
        నీకు వారు పూజలు చేయు చుండుట చేత అలసిపోతివి.  మా గుండెలలో
        కాంతులు వెలయఁ జేయుట కొఱకు నూతనమైన వేగముతో వెలసితివి.
        నూతనముగ చేయుచున్న యజ్ఞములలో భక్తులకు శోభఁ గూర్చుట చేత సొలసి పోతివి.
        ఐననూ నా మొర వినక తప్పదు సుమా!

క:- భవనాలలో అలసినా  -  డవు;  పూజల నందుచుండు టన్ నవ జవనా!
      సవనాలలో సొలసినా  -  డవు భక్తుల శోభఁ గూర్చుటన్  ధవుఁడ! హరీ! 74.
        భావము:-
        నూతనమైన వేగము కలవాఁడా! ఓ శ్రీ హరీ! భవనములలో పూజల నందుచున్న
        కారణముగా అలసిపోతివి.మా ధవుఁడా! యజ్ఞములందు భక్తులకు శోభఁ గూర్చుట చేత
        సొలసిపోతివి కదా!

గీ:- అలసినాడవు; పూజల నందుచుండు.  -  వెలసినాడవు; గుండెల వెల్గు లీన.
      సొలసినాడవు; భక్తుల శోభ గూర్చు. -  వినక తప్పదు నామొర వేణు గోపకా! 74.
        భావము:-
        ఓ వేణు గోపుఁడా! గుండెలలో వెలుగులు ప్రసరింపఁ జేయుటకు వెలసినవాఁడవు.
        అలసిపోతివి కదా! పూజల నందుకొనుచుండుము. సొలసొనవాడివు. భక్తుల శోభను
        గూర్చుము. నామొర వినక తప్పదు సుమా!

చ:- తొలి విశదంబుగా అల చతుర్దశ లోక విహారి వీవురా!
      యలఘు హరీ!భువిన్ గన మహర్దశ నీకృప గా తలంతు. జ్ఞా
      తుల భృశ భావనల్ క్షణిక దుర్దశ;  బాపను చాలు దీవురా!
      ఫలద హరీ! కృపన్ వినుచు భవ్యుఁడ కావర! వేణు గోపకా! 75.              
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! మాకు ఫలితములను ప్రసాదించే ఓ శ్రీ హరీ! పూర్వము నుండియే
        స్పష్టమయే విధముగా ప్రసిద్ధమైన పదునాల్గు భువనములలో విహరించు వాఁడవు
        నీవే కదా! చాలా గొప్పవాఁడవైన ఓ శ్రీహరీ! భూమిపై మహర్దశ మేము పొందితిమి అనినచో
        అది నీ కృపగా నేను భావింతును. జ్ఞాతుల యొక్కపెను భావనలు నాకు కలిగించే
        క్షణికమైన దుర్దశను పోకార్పుటకు నీవే సరిపోదువుసుమా! ఓ గొప్పవాఁడవైన
        నా పరమాత్మా! కృపతో నా మొర విని కాపాడుము.

క:- విశదంబుగా అల చతు  -  ర్దశ లోక విహారి వీవురా! యలఘు హరీ!
      భృశ భావనల్ క్షణిక దు  -  ర్దశ; బాపను చాలు దీవురా! ఫలద హరీ! 75.
        భావము:-
        గొప్పవాడివైన ఓ శ్రీ హరీ! స్పష్టమయే విధముగా ప్రసిద్ధమైన పదునాల్గు భువనములలో
        విహరించు వాడవు నీవే కదా! మాకు ఫలితములను ప్రసాదించే ఓ శ్రీ హరీ!
        అపరిమితమైన దుర్భావనలను; క్షణికమైన దుర్దశను పోగొట్టుటకు నీవే సరిపోదువుకదా!

గీ:- అల చతుర్దశ లోక విహారి వీవు!  -  గన మహర్దశ నీకృప గా తలంతు.
      క్షణిక దుర్దశ  బాపను చాలు దీవు!  -  వినుచు భవ్యుఁడ కావర! వేణూ గోప! 75.    
        భావము:-
        ఓ వేణు గోపకుఁడా! ప్రసిద్ధమైన పదునాల్గు భువనములలో విహరించు వాడవు నీవే కదా!
        భూమిపై మహర్దశ మేము పొందితిమి అంటే అది నీ కృపగా నేను భావింతును. క్షణికమైన
        దుర్దశను పోకార్పుటకు నీవే సరిపోదువుసుమా! కృపతో నా మొర విని కాపాడుము.
         ( స శేషం )
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.