గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఆగస్టు 2011, శనివారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ6)

సాహితీ బంధువులారా!
అవధాని బ్రహ్మశ్రీ కట్టమూరి చంద్రశేఖరం గారికి ఒక అవధానంలో యిచ్చిన 
ఆ  సమస్యను ఈనాడు చూద్దాం.
తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్.
ఈ సమస్యను మీరు పూరించి వ్యాఖ్యద్వారా పాఠకులకు అందించ గలరని ఆశిస్తున్నాను.
అవధాని పూరణను, నా పూరణను వ్యాఖ్యలో చూడఁగలరు.
నమస్తే.
జైశ్రీరాం.
జైహింద్. 


Print this post

14 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణము.

తెలతెలవారుచు నుండగ
కుళాయి వచ్చెడు ననుచును గుర్తుగ తానా
జలమునకు నీళ్ళబిందవ
తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యను అవధానిగారు ఈ విధంగా పూరించారు

లలనా మణి సొంపులతో
ఉలుకుచు కులుకుచు సొగసుల నొప్పుగ అద్దం
బుల ముందు నిలిచి దువ్వెన
తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్.

చాలా చక్కగా పూరించారు కదండీ!

కంది శంకరయ్య చెప్పారు...

కిలకిల నవ్వుచు సుందరి
చెలియలతోఁ గొలనులోనఁ జేసెను స్నాన
మ్మలకలు గనఁబడ నీటన్
దలఁ గ్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

నెల నెల సాధన జేసెను
కల పండగ నెంచి తాను కష్టము తోడన్
ఇల గిన్నిస్ బుక్కెక్కగ
తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నెలరాజును గని నంతనె
వలపుల మన్మధుని తలచి పులకాంకితయై !
కలలందు తేలి యాడుచు
తల క్రిందుగ నిలిపి నెలత తలదువ్వు కొనెన్ !

" ఇక్కడ తల క్రిందుగా అనగా = తన తలను క్రిందకు వంచి [ నిలిపి ] అని ]
పొరబాట్లు ఉన్నయెడల మన్నించ మనవి ]

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

అలినీలాలకలారగ
అలివేణియె తలను వంచి, ఆభంగిమనే
అలకలు కుదురుగ కుదరగ
తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

కలికియుఁ దనపతి తోడను
చలిఁగొండలపయి, విహార, సయ్యాటలలో
చెలుఁ గేలఁ ముకురమందునఁ
తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్.

ఈ సందర్భాన్ని వివరంగా చెపుతాను. భర్త తో విహారయాత్రలకు వెళ్ళిన ఏకాంతంలో అద్దం భర్త చేతిలో ఉన్నపుడు అతను ముఖం చూసుకుంటుండగా, తన ముఖాన్ని (అద్దంలో) అతని ముఖం క్రిందుగా కనిపించేలా పెట్టి తల దువ్వుకున్నదట.

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

ఉలుకును లేకనె బలుకులు
నొలుకుచు రాకెట్టు లోన నూగుచు నేర్పున్
బలు భంగిమ లాడి పడుచుఁ
దలక్రిందుల నిలిపి నెలత తల దువ్వుకొనెన్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్యగారు ప్రకృతి సౌందర్యాన్ని మనసారా ఆవిష్కరించారు. అద్భుతం అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అబ్బా! హనుమచ్ఛాస్త్రి గారూ! రికార్డ్ సృష్టించారండి. చాలా చక్కని ఆలోచన. అద్భుతం.అభినందనలు.

చిన్న విషయం మనం గమనించాలండి.
రెండవ పాదంలో నకార్ పొల్లు ఉండి తరువాత పాదంలోఅచ్చు వచ్చినప్పుడు రెండూ కలిపోతాయి.కష్టము తోడ నిల ఐపోతుంది.
ఐతే ఇక్కడ చిన్న సవరణ కూడా ఉంది.
నకారం ద్విరుక్తంగా కూడా ఒప్పుతుంది.
అప్పుడు కష్టము తోడన్నిల అని కూడా ప్రయోగం చేయ వచ్చును.
గమనించ గలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజేశ్వరక్కయ్యా! ఎంత చక్కటి రచనా నిపుణత? చిన్న ముఖ్యమైన విషయం మనం గమలించాలమ్మా.
రెండవ పాదంలో ప్రాస యతి వేసారు.
కంద పద్యానికిప్రాస నియమమే ఉంది. యతి మామూలుగానే వేయాలి కాని, ప్రాస యతి వేయరాదు.

పులకాంకితయై అనడానికి బదులు పరవశ యగుచున్ అని వ్రాస్తే సరిపోతుందమ్మా.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీపతి శాస్త్రి గారూ!మీ పూరణ సహజత్వానికి అద్దం పడుతోంది. అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

డాక్టర్ నరసింహ మూర్తిగారు పూరణతో పాఠకులను కాస్త సేపు భావనాకాశంలోకి తీసుకు పోయారు. అద్భుతం. అభినందనలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! ధన్యవాదములు. ఓపికగా సవరణ, వివరముగా తెలిపినందులకు కృతజ్ఞతలు. మీ సూచన గ్రహించి పాటిస్తాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.