గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఆగస్టు 2011, సోమవారం

శ్రీ వేణు గోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. పద్యము 19 / 21 వ భాగము

ఉ:- శ్రీ సుగుణాకరా! కరుణఁ జేరగ నీయవ? కాంచ వేమిరా?
      నీ సుతుఁడన్ గదా! కృపను నీ దరిఁ జేర్చుమ! క్షేమ మీయగా!
      మా సుగతిన్ నినున్ గొలువ మానగ నీయక కొల్పుమయ్య నా
      యాస హరీ! దయన్! విపుల హర్ష ప్రకల్పక! వేణు గోపకా!  91.
       భావము:-
       మంచి గుణములకు స్థానమైన వాఁడా! విపులమైన సంతోషమును బాగుగ
       మాకు కల్పించువాఁడా! ఓ వేణుగోపకుఁడా! నీ సుతుఁడనే కదా! చూడవేమి?
       కరుణతో నీ దగ్గరకు చేరనీయవా యేమి? నాకు క్షేమ మిచ్చుట కొఱకు కృపతో
       నీ సమీపమునకు నన్ను చేర్చుము. ఓ శ్రీ హరీ!  మా చేసిన పుణ్య ఫలమున
       నిన్ను కొలుచుట మాననీయక నా ఆశను నెరవేర్చుము.

క:- సుగుణాకరా! కరుణఁ జే  -  రగ నీయవ? కాంచ వేమిరా?నీ సుతుఁడన్ !
      సుగతిన్ నినున్ గొలువ మా  -  నగ నీయక కొల్పుమయ్య నాయాస హరీ!  91.
       భావము:-
       మంచి గుణములకు స్థానమైన వాఁడా! ఓ శ్రీహరీ! నీ సుతుఁడనే కదా! చూడవేమి?
       కరుణతో నీ దగ్గరకు చేరనీయవా యేమి? మా సుగతి చేత నిన్ను కొలుచుట మాననీయక;
       నా ఆశను నెరవేర్చుము.

గీ:- కరుణఁ జేరగ నీయవ? కాంచ వేమి?  -  కృపను నీ దరిఁ జేర్చుమ! క్షేమ మీయ!
      గొలువ మానగ నీయక కొల్పుమయ్య  -  విపుల హర్ష ప్రకల్పక! వేణు గోప!  91.
       భావము:-
       విపులమైన సంతోషమును బాగుగ మాకు కల్పించువాఁడా! ఓ వేణుగోపకుఁడా! కరుణతో
       నీ దగ్గరకు చేరనీయవా యేమి? నన్ను చూడవేమి?  నాకు క్షేమమిచ్చుట కొఱకు కృపతో
       నీ సమీపమునకు నన్ను చేర్చుము. నిన్ను కొలుచుట మాననీయక నిన్ను కొలిచేలాగ
       చేయుము.

చ:- నిను మనసార నే తలతు నిన్ గనఁ గోరుచు, తాల్మి తోడ గా
       తును మహితాత్ముఁడా! మదికి తోచెద వీవు సమైక్య వర్తిగా.
       నను మనమందునన్. ప్రణవ నాద నయస్థితి ప్రాప్తిఁ; గొల్పు; ధ
       న్యునిగ హరీ! దయన్!  విపుల యోగ ప్రదీపక! వేణు గోపకా!  92.
        భావము:-
        సమస్తమైన యోగములను తేజరిల్ల జేసేవాఁడా! ఓ వేణుగోపకుఁడా! నిన్ను చూడ వలెనని
        కోరుకొంటూ మనసారా  నేను తలంతును. గొప్ప మనస్సు గల ఓ మహానుభావా!
        తాలిమితో  వేచి యుందును.అంతటను సమానముగా ఉండి వర్తించు వాడిగా
        నామనస్సునకు నీవు తోచెదవు. ఓ శ్రీ హరీ! నన్ను ధన్యుడగునట్టి విధముగ
        నా మనస్సులో ప్రణవ నాదము యొక్క నయస్థితి యొక్క ప్రాప్తిని కొలుపుము.

  క:- మనసార నే తలతు నిన్ -  గనఁ గోరుచు, తాల్మి తోడ గాతును మహితా .
        మనమందునన్. ప్రణవ నా  -  ద నయస్థితి ప్రాప్తిఁ; గొల్పు ధన్యునిగ హరీ!  92.
         భావము:-
         ఓ శ్రీహరీ! నిన్ను చూడ వలెనని కోరుకొంటూ మనసారా  నేను తలంతును. ఓ మహానుభావా!
         తాలిమితో  వేచి యుందును. నన్నుధన్యుడగునట్టి విధముగ నా మనస్సులో
         ప్రణవ నాదము యొక్క నయస్థితి యొక్క ప్రాప్తిని కొలుపుము.

గీ:- తలతు నిన్ గనఁ గోరుచు, తాల్మి తోడ -  మదికి తోచెద వీవు సమైక్య వర్తి.
      ప్రణవ నాద నయస్థితి ప్రాప్తిఁ గొల్పు; -  విపుల యోగ ప్రదీపక! వేణు గోప!  92.
       భావము:-
       సమస్తమైన యోగములను తేజరిల్లఁ జేసేవాఁడా!  ఓ వేణుగోపుఁడా!  తాలిమితో
       నిన్ను చూడ వలెనని కోరుకొంటూ మనసారా నేను తలంతును.  అంతటను
       సమానముగా ఉండి వర్తించు వాడిగా నామనస్సునకు నీవు తోచెదవు.
       ప్రణవ నాదము యొక్క నయస్థితి యొక్క ప్రాప్తిని నాలో కొలుపుము.

ఉ:- శ్రీ శివ మూర్తివో? పరగు శ్రీధవు డీవొకొ? బ్రహ్మ వీవొ? దై
      వేశుడవో? ననున్ కరుణఁ నెన్నుచు గాచెడి కన్న తండ్రివై
      తే! శివభావనన్ సకల తేజ విరాజిత సర్వ మీవొ? స
      ర్వేశ హరీ!  కృపన్ వెలయు మిప్పుడె నామది వేణు గోపకా!  93.
       భావము:-
       ఓ వేణుగోపకుఁడా! నీవు మంగళ ప్రదుఁడగు శివమూర్తివా! ఒప్పెడి లక్ష్మీ పతివా నీవు?
       బ్రహ్మవా? నీవు దేవాది దేవుడవా? సమస్త తేజస్సుతో ప్రకాశించెడి యీ సమస్తము
       నీవే అయి యుందువా? నన్ను నీ కరుణతో కాపాడే కన్న తండ్రివైనట్లైనచో
       శివ భావనను నాలో తెమ్ము. సర్వేశుడవైన ఓ శ్రీ హరీ! కృపతో నా మదిలో ఇప్పుడే
       వెలయుమయ్యా!

క:- శివ మూర్తివో? పరగు శ్రీ -  ధవు డీవొకొ? బ్రహ్మ వీవొ? దైవేశుడవో?
      శివభావనన్ సకల తే  -  జ విరాజిత సర్వ మీవ! సర్వేశ హరీ!  93.
       భావము:-
       సర్వేశుడవైన ఓ శ్రీ హరీ! నీవు మంగళ ప్రదుఁడగు శివమూర్తివా! ఒప్పెడి లక్ష్మీ పతివా నీవు?
       బ్రహ్మవా? నీవు దేవాది దేవుడవా? శివ భావనతో సమస్త తేజస్సుతో ప్రకాశించెడి
       యీ సమస్తము నీవే అయి యుందువా?

గీ:- పరగు శ్రీధవు డీవొకొ? బ్రహ్మ వీవొ?  -  కరుణఁ నెన్నుచు గాచెడి కన్న తండ్రి!
      సకల తేజ విరాజిత సర్వ మీవొ? -  వెలయు మిప్పుడె నామది వేణు గోప!  93.
       భావము:-
       ఓ వేణుగోపకుఁడా! నీవు ఒప్పెడి లక్ష్మీ పతివా ? బ్రహ్మవా? నన్ను నీ కరుణతో కాపాడే
       కన్న తండ్రీ! సమస్త తేజస్సుతో ప్రకాశించెడి యీ సమస్తము నీవే అయి యుందువా?
       నా మదిలో ఇప్పుడే వెలయుమయ్యా!

చ:- శ్రిత భువనైకమై  చెలగి శ్రీ భువి జీవుల జీవమీవె.  బ్రో
      వ తగుదువే సదా! అరయ పావులు చేయుచు ఆడు దీవె. పొం
      దితి భవదీయమౌ సుగుణ తేజ వరిష్ఠముఁ జూడనిమ్ము. స
      మ్మతిని హరీ! కృపన్ విజయ మార్గముఁ జూపుచు వేణు గోపకా! 94.
       భావము:-
       ఓ వేణుగోపకుఁడా! ఆశ్రితమై యున్న భువనము లన్నిట ఏక రూపమై చెలగి
       మంగళ ప్రదమైన భూమిపై గల జీవుల యందలి జీవము నీవే కదా! ఎల్లప్పుఁడూ
       మమ్ములను కాపాడుటకు తగుదువు కదా! విచారించి చూడగా
       మమ్ములను పావులుగా చేసి నీవే ఆడు చుందువు కదా! ఓ శ్రీ హరీ!
       నీదైనటువంటి శ్రేష్ఠమైన సుగుణ తేజమును నేను పొందితిని.  సమ్మతితో
       నన్ను చూడనిమ్ము. కృపతో విజయ మార్గమును చూపుము.

క:- భువనైకమై  చెలగి శ్రీ  -  భువి జీవుల జీవమీవె. బ్రోవ తగుదువే!
      భవదీయమౌ సుగుణతే  -  జ వరిష్ఠముఁ జూడనిమ్ము. సమ్మతిని హరీ! 94.
       భావము:-
       ఓ శ్రీహరీ! భువనము లన్నిట ఏక రూపమై చెలగి మంగళ ప్రదమైన భూమిపై గల
       జీవుల యందలి జీవము నీవే కదా! ఎల్లప్పుఁడూ మమ్ములను కాపాడుటకు
       తగుదువు కదా! నీదైనటువంటి  శ్రేష్ఠమైన సుగుణ తేజమును సమ్మతితో
       నన్ను చూడనిమ్ము.

గీ:- చెలగి  శ్రీభువి జీవుల జీవమీవె. -  అరయ పావులు చేయుచు ఆడు దీవె.
      సుగుణతేజ వరిష్ఠముఁ జూడనిమ్ము. -  విజయ మార్గముఁ జూపుచు వేణు గోప!  94.
       భావము:-
       ఓ వేణుగోపుఁడా! మంగళ ప్రదమైన భూమిపై గల జీవుల యందు  చెలగు జీవము నీవే కదా!
       విచారించి చూడగా మమ్ములను పావులుగా చేసి నీవే ఆడు చుందువు కదా! నీదైనటువంటి
       శ్రేష్ఠమైన సుగుణ తేజమును నన్ను చూడనిమ్ము. విజయ మార్గమును చూపుము.

చ:- మనుప; రమాత్ముడా! కృపను మాధురి యొప్పగ గీత చెప్పి; త్రో
      వను తెలుపన్; ప్రభూ!  నుదుటి వ్రాతను మార్చితి నొప్పి బాపి. ద
      ర్శన వరమిచ్చి మా  అఘము సత్వర మొప్పుగ నార్పినావు ధా
      త్రి; నుత హరీ! కృపన్  విమల తేజము  నిల్పితి; వేణు గోపకా!  95.
       భావము:-
       లక్ష్మీ దేవికి ఆత్మగా అయిన వాడా! ఓ వేణుగోపకుఁడా! కృపతో మమ్ములను
       మనఁ జేయుటకు; సన్మార్గము చూపుటకూ; మధురాతి మధురముగా
       భగవద్గీతను స్వయముగా చెప్పి; మా బాధ పోఁగొట్టి; మా నుదుటి వ్రాతనే
       మార్చితివి. భూమిపై పొగడఁ బడెడి ఓ శ్రీ హరీ! నీ దర్శనమునే మాకు వరముగానిచ్చి;
       మా పాపమును మిక్కిలి వేగముగా ఆర్పివేసితివి. కృపతో నిర్మలమైన తేజమును
       మాలో నిలిపితివి కదా!

క:- పరమాత్ముడా! కృపను మా  -  ధురి యొప్పగ గీత చెప్పి; త్రోవను తెలుపన్;
      వరమిచ్చి మా  అఘము స  -  త్వర మొప్పుగ నార్పినావు ధాత్రి; నుత హరీ!  95.
       భావము:-
       ఓ పరమాత్ముఁడా! భూమిపై పొగడఁ బడెడి ఓ శ్రీ హరీ! కృపతో మాకు మంచి మార్గమును
       తెలుపుట కొఱకు మధురముగా ఉండే విధముగా భగవద్గీతను స్వయముగా చెప్పి;
       మాకు వరముగా ప్రసాదించి; మా పాపమును సత్వరముగ పోగొట్టినావు.

గీ:- కృపను మాధురి యొప్పగ గీత చెప్పి; -  నుదుటి వ్రాతను మార్చితి నొప్పి బాపి.
      అఘము సత్వర మొప్పుగ నార్పినావు. -  విమల తేజము  నిల్పితి; వేణు గోప!  95.
       భావము:-
       ఓ వేణుగోపుఁడా! కృపతో మధురముగా ఉండే విధముగ భగవద్గీత చెప్పితివి.
       మా బాధ పోగొట్టి మా నుదుటి వ్రాతనే మార్చివేసితివి. మా పాపములను సత్వరమే
       పోఁగొట్టినావు. మాలో నిర్మలమైన తేజస్సును నిలిపితివి.
       ( సశేషం )
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.