గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఆగస్టు 2011, ఆదివారం

మూడు వసంతాలను అధిగమించిన ఆంధ్రామృతం.

ఈనాడు దిన పత్రికలో ప్రశంసింపబడిన ఆంధ్రామృతం.(ఫొటోపై క్లిక్ చెయ్యండి) 
శ్రీమన్మంగళ భావనా ప్రతిభులైన ఆంధ్రామృత  పాఠకుల ఆదరాభిమానాలతో
ఆంధ్రామృతం మూడు వసంతాలను అధిగమించి నేడు నాల్గవ యేట అడుగు పెట్టింది. 
ఈ సందర్భంగా  అమృత హృదయులై ఆంధ్రామృత పాన లోలురైన, ఆంధ్రామృతాభిమానులైన ప్రతీ ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియ జేసుకొనుచున్నాను.
శ్రీమాన్ కల్వపూడి వేంకట వీర రాఘవాచార్య గురు దేవుల కృప  చేత ఆంధ్ర భాషాధ్యనం చేసి, ఆంధ్రోపన్యాసకునిగా ఉద్యోగ జీవితం గడిపి,  ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్న నేను భాషాపరంగా ఏ కొంచెమైనా కృషి, సేవాయత్నం, చేయ గలిగే సద్భాగ్యం ఈ నాడు నాకు కలిగింది. ఇందుకు కారణం  ఈ బ్లాగ్ నిర్మాణ సాంకేతికాలను కనుగొని, వెలుగులోకి తెచ్చిన, అజ్ఞాత శాస్త్రవేత్తల యొక్క, గూగుల్ నిర్మాత యొక్క, ఆంధ్రాభిమానులైన మనీషుల యొక్క అనంతమై కృషియే అనడం అత్యుక్తి కానేరదు.
ఆ విధంగా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, ఈ అభ్యున్నతికి కారణమైన ప్రతీ ఒక్కరికీ నేను కృతజ్ఞతా పూర్వకంగా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
చిరంజీవులనేకమంది నాకు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, సహాయ సహకారాలనందిస్తుండడం నా మనసుకెంతో ఆనందంకలిగిస్తోంది.
అట్టి చిరంజీవులందరికీ భగవంతుడు మరింత సేవా తత్పరులై ఉల్లాసంగా పనిచేసే అవకాశం కలిగించడం కోసం వారి నిజ జీవితాలలో సుఖ సంతోషాలను పరిపూర్ణంగా నింపుతూ ఆనందప్రదుడు కావలసినదిగా మనసారా ప్రార్థిస్తున్నాను.
నేను నాకు కలిగిన పరిజ్ఞానంతో నిరంతరం నిష్కళంకమైన సన్మార్గప్రదమైన, సామాజిక ప్రయోజన కరమైన, భాషాభివృద్ధికరమైన మార్గంలోనే ఈ బ్లాగును మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నానని, చేస్తూ ఉండ గలననీ, హృ దయ పూర్వకంగా తెలియజేస్తున్నాను.
ఏమైనా పోరపాటులు దొర్లే అవకాశం లేకపోలేదు. అట్టివి ఉన్నట్లైతే అవి నా పరాకు కారణంగానే, అజ్ఞానం కారణంగానే జరిగి ఉంటాయే తప్ప ప్రయత్న పూర్వకంగా చేసినవి కాదని మనవి చేసుకొనుచున్నాను. అట్టి పొరపాటులు జరిగి ఉంటే మన్నించమని వేడుకొంటున్నాను.
మీ అందరి సూచనలే ఆంధ్రామృతానికి అనంత జీవం.
ఇంతవరకూ నడిపించి నాల్గవయేట అడుగు పెట్టేలా చేసిన ప్రతీ ఒక్కరికీ నాహృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
నమస్తే.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

17 comments:

మిస్సన్న చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అరుదగు సత్కవీంద్రు లసహాయ పరాక్రము లాంధ్ర భాషకున్
స్థిరముగ నుండి సత్కవిత తేనెల వాగులుగా స్రవింపగా
వరమది కాదె యాంధ్రమున పారగ జేయ సుధానిధానమున్?
మరువగజాల నే మిము.సమంచిత సత్కవి! మిస్సనార్యుఁడా!

మీకు నా ధన్యవాదములు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

స్వంతమయినట్టి భాషను
సుంతను మరువంగలేరు, సొగసుగ రచనల్
వింతగఁ జేయుట నేర్పిరి
పంతులు గారికి విశేష ప్రణతులుఁ జేతున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకినీ ప్రియోక్తుల
మందానందంబుఁ గొలిపె మహనీయ గుణా
నందాంకిత రచన మరిగి
సుందరముగ చెప్పు మీకు శుభములు కలుగున్.

మందాకిని గారూ! మీకు నా ధన్యవాదములు.

Pandita Nemani చెప్పారు...

ayyaa!
andhra bhashaku meeru cestunna sevalu adbhutamainavi. meeru sahitee durandharulu. mee krishi inkaa baagaa saagaali. assessulu
Nemani Ramajogi Sanyasi Rao

Pandita Nemani చెప్పారు...

ayyaa! subhaaseessulu.
mee krishi abhinandaneeyamu. meeru sahitee sevaa durandharulu.
inkaa enno metlu meeru ekka galaru.
Sanyasirao Nemani

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! పండిత నేమాని గురువరేణ్యా!
నమశ్శతములు.

సుమధుర భావనా గరిమచొప్పిలఁ జేసిరి మీర లందుచే
నమర కవిత్వతత్వముల నాంధ్రసుభాషకునద్దుటద్ది నా
కమరె మహాత్మ! మీ కృప మహాద్భుత శక్తిని కల్గఁ జేసె. మీ
సుమధుర వాక్ప్రబంధములు శోభిలఁ జేయును.ధన్యవాదముల్.

జ్యోతి చెప్పారు...

ఆంధ్రామృతానికి అభినందనలు!

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

మూడువసంతాలను అధిగమించిన "ఆంధ్రామృతం" కు అభినందనాది వందనములతో.......

అభినందింతును రామకృష్ణ గురువర్యా!! మీదు యౌన్నత్యమున్,
శుభయోగంబగు, నాంధ్రజాతి పులకించున్, భారతీ సేవనా
విభవుండైతివి, పద్యవిద్య కొఱకై విఖ్యాత "మాంధ్రామృతం"
బభిసర్గంబును జేసితీవు, ముదమున్ హస్తార్పణన్ జేసితిన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సంపత్ కుమార్ శాస్త్రి గారూ!
మీ అభిమానానికి ధన్యవాదాలు.

సరసొన్మీల వచో విలాస విదుషా! సంపత్కుమార్ శాస్త్రి! సుం
దరభావాద్భుత పద్య భావ మది నన్ ధన్యాత్ముగా చేసె, మీ
కరుణన్ వెల్గుటఁ జేసి.నాదు కృషి సంస్కారంబుతో వెల్గుగా
పరమాత్ముండటనుండుటన్నిదియె నాభాగ్యంబు.సన్మిత్రమా!

ఊకదంపుడు చెప్పారు...

గురువుగారూ, అభినందనలండీ.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! నమస్కారములు. మీ బోటి పండితులు తెలుగు భాషకు, తెలుగు సాహిత్యాభిమానులకు మీ బ్లాగుల ద్వారా అందిస్తున్న సేవ, విషయ విజ్ఞానము మాలాటి సాహిత్యాభిమానులకు ఎంతో ఉపయుక్తము. ఇలాగే నేటి జనులందరూ నెటిజనులై
మీ ఆంధ్రామృతాన్ని త్రాగే అదృష్టం కలగాలని అభిలషిస్తూ ...అభినందనలతో ...

పద్య విపంచినే హృద్యమ్ముగా మీటి
తెలుగు వారి మదిని తెరచినారు
యువతరంగమ్ము తో నుత్సాహమే నింపి
నవతరంగాలపై నడిపి నారు
ఆంధ్రామృతమ్ముచే అఖిలాంధ్ర జనులకు
దప్పి దీర్చగ నోరు తడిపి నారు
క్రొత్త సమస్యల కోరి పూరణ జేయ
చిన్ని కవులకు మేల్జేసి నారు

ఆంధ్ర భారతి వెలుగుల నన్ని దిశల
వ్యాప్తి జేయగ వెలిగించి బ్లాగు జ్యోతి
నిలచి నావయ్య కవిరాజ 'నెటిజనులకు'
వాసికెక్కగ గోరుదు వాణి దయను.

మిస్సన్న చెప్పారు...

ఆంధ్రామృతానికి అభినందనలు!

ఆంధ్రత్వ మాంధ్ర భాషయు
నాంధ్రులకు తప:ఫలమ్ము లనుట నిజమ్మౌ!
నాంధ్రామృతరస ఝరుల-
న్నాంధ్రావనిఁ పాఱఁ జేసి రార్యా ! ప్రణతుల్.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

మూడు వర్షాల మురిపించు ముగ్ధ బాల
అవని అందాల బెంచెడు ఆంధ్ర బాల
రామకృష్ణునిపుత్రికా రత్నమనగ
అమృతమును పంచు నందర కాదరమున

గురువుగారికి వందనములు. ఆంధ్రామృతము అమృతమై వెలుగొందాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! హనుమచ్ఛాస్త్రి గారూ! మీ ఆదరాభిమానాలకి ధన్యవాదములు.

హృదయాంతర్గత భావనామృతమదే శ్రీమన్మహత్సీసమై
బుధవంద్యా! ప్రవహించి యుండు కనగా. పూజ్యుండ! మీ వంటి సా
రధులే నన్ నడిపించువారు. మహితా రాధ్యోత్తమా! యాంధ్రభా
షధరిత్రిన్ వికశించు గోలి హనుమచ్ఛాస్త్రీ! భవత్ ప్రేరణన్.

ఆర్యా! హనుమచ్ఛాస్త్రి గారూ! మీ ఆదరాభిమానాలకి ధన్యవాదములు.

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

శ్రీ ఛింతా రామకృష్ణా రావు గారికి మనః పూర్వక అభివందనములు.

సుమధుర భాషణంబులను శోభిత వాణిని గొల్వ సిధ్ధుడౌ
యమరిన పంకజాక్షుడుయె యాంధ్రము జిందుచు నమృతంబునున్
విమలుని,సఛ్ఛరిత్రుని,కవీశ్వరు, బండిత రామకృష్ణునిన్
సుమముల, పద్యసూనముల ,సూనృత వాక్కుల ప్రస్తుతించెదన్ !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

" మూడు వసంతాలను అధిగ మించిన ఈ " ఆంద్రామృత ఝరి " నూరు శతాబ్ధాల దిగంతాలకు వెల్లి విరియాలని "
శుభా శీస్సులు + అభినందన మందారాలు
ప్రేమతో అక్క .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.