చ:- మొర వినవేమిరా! సరసముల్ గనఁ జాలను. శంకఁ గల్గెఁగా!
Print this post
ముర హరుఁడా! దయా వరుఁడ! మోక్షముఁ గోరుదు. ప్రాణ మీవె! శ్రీ
కర! కన నీకు నే పరుఁడఁ గానె? నయంబుగ పట్టి వీఁడ నీ
కరము; హరీ! సదా విజయ కారణ పాదుఁడ! వేణు గోపకా! 56.
భావము:-
మా విజయములకు మూల కారణమైన పాదములు గల వాడా! ఓ వేణు
గోపకుఁడా! నాయొక్క మొరవినకుంటివేమి? నీవు సాగించే సరసములను
నేను చూడఁ జాలను. నా ఉనుకి పైననే నాకు అనుమానము కలిగినది కదా!
ఓ ముర హరుఁడా! దయా గుణము చేత శ్రే ష్ఠుఁడా! నిన్ను నేను మోక్షమును
ప్రసాదింపుమని కోరుచున్నాను. నా ప్రాణము నీవే కదా! ఓ శుభ కరుఁడా!
చూడగా నీకు నేను పైవాడను కాను కదా! ఓ శ్రీ హరీ! నయ మార్గములో పట్టిన
నీ చేయిని ఇక నేను వీడను సుమా!
క:- వినవేమిరా! సరసముల్ - గనఁ జాలను. శంకఁ గల్గెఁగా! ముర హరుడా!
కన నీకు నే పరుఁడ కా - నె నయంబుగ పట్టి వీడ నీకరము. హరీ! 56.
భావము:-
ఓ శ్రీ హరీ! నాయొక్క మొర వినకుంటివేమి? నీవు సాగించే సరసములను
నేను చూడఁ జాలను. నా ఉనుకి పైననే నాకు అనుమానము కలిగినది కదా!
ఓ ముర హరుఁడా! చూడగా నీకు నేను పైవాడను కాను కదా! నయ మార్గములో
పట్టిన నీ చేయిని ఇక నేను వీడను సుమా!
గీ:- సరసముల్ గనఁ జాలను. శంకఁ గల్గె. - వరుఁడ! మోక్షముఁ గోరుదు. ప్రాణ మీవె!
పరుఁడ కానె? నయంబుగ పట్టి వీఁడ. - విజయ కారణ పాదుఁడ! వేణు గోప! 56.
భావము:-
మా విజయములకు మూల కారణమైన పాదములు గల వాడా! ఓ వేణు గోపకుఁడా!
నీవు సాగించే సరసములను నేను చూడఁ జాలను. నా ఉనుకి పైననే నాకు అనుమానము
కలిగినది. ఓ శ్రేష్టుడా! నిన్ను నేను మోక్షమును ప్రసాదింపుమని కోరుచున్నాను.
నా ప్రాణము నీవే కదా! నీకు నేను అన్యుడను కాను కదా! నయ మార్గములో పట్టిన
నీ చేయిని ఇక నేను వీడను సుమా!
చ:- వర చరణాబ్జముల్ సకల భక్తి రహస్యము చాటి చెప్పు. ధీ
వరులకిలన్. సదా! వసుధ వర్ధిల చేయును భక్తిఁ గల్గగా.
వర కరుణాన్వితా! గొలుపవా! చరణంబులు కోరి పట్ట; స
ద్గురుఁడ! హరీ! మహా వినుత ! కూర్మిని గాంచుమ వేణు గోపకా! 57.
భావము:-
ఓ వేణు గోపకుఁడా! భూమిపై గల ధీవరులకు శ్రేష్టమైన నీ పాద పద్మములు
సమస్తమైన భక్తి యొక్క రహస్య మార్గములను చాటి చెప్పును. భక్తినే
కలిగి యున్నట్లైతే భూమిపై అభివృద్ధి పొందే విధముగ చేయును. శ్రేష్టమైన
కరుణతో కూడుకొన్నవాఁడా! పొగడఁ బడేవాఁడా! సద్గురుడవైన ఓ శ్రీహరీ!
మేము నిన్ను కోరి పట్టుటకై నీ పాదములను సంప్రాప్తింపఁ జేయవా! నీ కృపతో
ఇష్టముతో నన్ను గాంచుమా!
క:- చరణాబ్జముల్ సకల భ - క్తి రహస్యము చాటి చెప్పు. ధీవరులకిలన్.
కరుణాన్వితా! గొలుపవా! - చరణంబులు కోరి పట్ట; సద్గురుఁడ! హరీ! 57.
భావము:-
కరుణతో కూడుకొన్నవాఁడా! సద్గురుఁడవైన ఓ శ్రీహరీ! భూమిపై గల ధీ వరులకు
శ్రేష్టమైన నీ పాద పద్మములు సమస్తమైన భక్తి యొక్క రహస్య మార్గములను
చాటి చెప్పును. మేము నిన్ను కోరి పట్టుటకై నీ పాదములను సంప్రాప్తింపఁ జేయవా!
గీ:- సకల భక్తి రహస్యము చాటి చెప్పు. - వసుధ వర్ధిల చేసెడు భక్తిఁ గల్గ.
గొలుపవా! చరణంబులు కోరి పట్ట; - వినుత! కూర్మిని గాంచుమ వేణు గోప! 57.
భావము:-
పొగడఁ బడేవాడా! ఓ వేణు గోపకుఁడా! భక్తినే కలిగి యున్నట్లైతే అట్టి వారికి సమస్తమైన
భక్తి యొక్క రహస్య మార్గములను చాటి చెప్పునటువంటివిన్నీ; భూమిపై అభివృద్ధి
పొందే విధముగ చేయునటువంటివిన్నీ; అగు నీ పాదములను మేము కోరి పట్టుటకై
మాకు సంప్రాప్తింపఁ జేయవా! నన్ను ఇష్టముతో గాంచుము!
ఉ:- ఆ వన జాతమై మురళి; అద్రి నయావృత; ముందె తాను బృం
దావనమున్ నినున్. అసమ ధైర్యద! నీ యధ రామృతంబు నే
తా వన ధారగా తెలిసి త్రాగను చేరెను తృప్తినొందగా!
మోవి హరీ! భువిన్ వెలసె ముచ్చట తీరగ వేణు గోపకా! 58.
భావము:-
సాటి లేని ధైర్యమును ప్రసాదించువాఁడా! ఓ వేణు గోపకుఁడా! ఓ శ్రీ హరీ! పర్వతముపై
న్యాయమైన పద్ధతిలోవ్యాపించి యున్న ఆ అరణ్యమున పుట్టినదై మురళి తృప్తిని
పొందుటకై తాను బృందావనమున నీ అధరామృతమునే తెలుసుకొని దానిని తాను
జల ధారగా త్రాగుటకు గాను ముందుగానే నీ మోవిని చేరెను.అది తన ముచ్చట
తీరునట్లుగా భూమిపై ప్రకాశించెను.
క:- వన జాతమై మురళి; అద్రి నయావృత; ముందె తాను బృందావనమున్
వనధారగా తెలిసి త్రా - గను చేరెను తృప్తినొందగా! మోవి హరీ! 58.
భావము:-
ఓ శ్రీ హరీ! పర్వతముపై పద్ధతిగా వ్యాపించి యున్న అడవి నుండి పుట్టి మురళి
తాను తృప్తి నొందు విధముగా నీ అధరామృతమును జల ధారను వలె త్రాగుట కొఱకు
ముందుగానే బృందావనమున నిన్ను చేరెను.
గీ:- మురళి; అద్రి నయావృత; ముందె తాను - అసమ ధైర్యద! నీయధరామృతంబు
తెలిసి త్రాగను చేరెను తృప్తినొంద - వెలసె ముచ్చట తీరగ; వేణు గోప! 58.
భావము:-
సాటి లేని ధైర్యమును ప్రసాదించువాడా! కొండపై చక్కని పద్ధతితో వ్యాపించి యున్నవాడా!
ఓ వేణు గోపుఁడా! నీ అధరామృతమును గూర్చి తెలుసుకొని మురళి తాను తృప్తి నొందు
విధముగ త్రాగుట కొఱకు నీ అధరమును చేరెను. తన ముచ్చట తీరునట్లుగా తేజరిల్లెను.
చ:- చను వడిఁ గల్గుచున్; వని వసంతుఁ డదెట్టుల వచ్చి పోవునో?
ఘృణి నిలయా! దయా నిలయమీవని నీవని నిశ్చయించెనో?
కని కలగా వనిన్ కలుగు కాము డయాచిత కల్పనంబు పూ
నెనుగ?హరీ! యటుల్ విరియ నెమ్మి యొనర్చెను వేణు గోపకా! 59.
భావము:-
ఓ వేణు గోపకుఁడా! వెళ్ళిపోవుట కొఱకు వేగము గల్గి యుండియు వసంతుఁడు
ఈ వనమునకు ఎందులకు వస్తూ పోతూ ఉంటాడో కదా! ఓ కాంతి నిధానమా! ఓ శ్రీ హరీ!
ఈ వనము దయా నిలయమనియు; అది నీవే ననియు అతఁడు నిశ్చయించుకొనెనేమో!
ఈ వనమునందు సంచరించు కాముఁడు ఇది కలగా కని; ఎవరూ కోరకుండకయే
తన కల్పనము చేత పూల వనము అను విధముగాను; ఆ విధముగ పుష్పములు
విరివిగ వికసించు నట్లుగను చేసెనేమో!
క:- వడిఁ గల్గుచున్; వని వసం - తుఁ డదెట్టుల వచ్చి పోవునో? ఘృణి నిలయా!
కలగా వనిన్ కలుగు కా - ము డయాచిత కల్పనంబు పూనెనుగ?హరీ! 59.
భావము:-
వేగముగా వసంతుఁడు ఈ వనమునకు ఏ విధముగ వస్తూ పోతూ ఉంటాడో కదా!
ఓ కాంతి నిధానమా! ఓ శ్రీ హరీ! కలలాగా వనమునందు కలిగి యున్న కాముని యొక్క
అయాచిత కల్పనయే కదా ఈ పూవని!
గీ:- వని వసంతుఁ డదెట్టుల వచ్చి పోవు? - నిలయ మీవని నీవని నిశ్చయించె?
కలుగు కాము డయాచిత కల్పనంబు - విరియ నెమ్మి యొనర్చెను వేణు గోప! 59.
భావము:-
ఓ వేణు గోపుఁడా! వసంతుఁడు ఏ విధముగ వనమునకు వస్తూ పోతూ ఉంటాఁడు?
ఈ వనమే తనకు నిలయ్మనియు; అదియూ నీవే ననియు నిశ్చయించెను కాబోలు.
వసంతుఁడుండు చోట నుండు కాముఁడు అయాచితమైన తన కల్పనచేత
ఉద్యాన వనమంతయు పూలు విరియునట్లుగా చేసె నేమో!
చ:- మొలకల కైవడిన్ పుడమి మూర్ఖు లదెట్టులఁ బుట్టు నయ్యరో?
యిడుమలిడన్. భువిన్ వెలయనీయక యడ్డుమ! విశ్వ రక్షకా!
యిల పలుమార్లు నిన్ వినయ మేర్పడ మ్రొక్కెద వింగడించి; పా
ప లయ! హరీ! సదా విపుల వాఙ్మయ గోచర! వేణు గోపకా! 60.
భావము:-
ఓ అయ్యా! వేణు గోపకుఁడా! భూమిపై కష్టములు కలిగించుటకు మూర్ఖులు
కలుపు మొక్కల వలె ఏ విధముగ పుట్టుకు వత్తురో కదా! ఓ విశ్వ రక్షకుఁడా!
పాపములను హరింపఁజేయువాఁడా! ఎల్లప్పుడూ అంతు లేని వాజ్మయమున
గోచరించు వాడా! ఓ శ్రీ హరీ! ఈ భూమిపై నిన్ను నేను అనేక పర్యాయములు
వినయముతోవింగడించి మ్రొక్కెదను. ఈ భూమిపై అట్టివారు పుట్టకుండా అడ్డుకొనుమ
క:- కల కైవడిన్ పుడమి మూ - ర్ఖులదెట్టులఁ బుట్టు నయ్యరో? యిడుమలిడన్.
పలుమార్లు నిన్ వినయ మే - ర్పడ మ్రొక్కెద వింగడించి పాప లయ! హరీ! 60.
భావము:-
ఓ అయ్యా! పాపములను హరింపఁజేయువాఁడా! ఓ శ్రీ హరీ! భూమిపై కష్టములు
కలిగించుటకు మూర్ఖులు కల వలె ఏవిధముగ పుట్టుకు వత్తురో కదా! అనేక పర్యాయములు
విభజించి నిన్ను వినయ మేర్పడే విధముగా మ్రొక్కెదను స్వామీ!
గీ:- పుడమి మూర్ఖు లదెట్టులఁ బుట్టు నయ్య! - వెలయనీయక యడ్డుమ! విశ్వ రక్ష!
వినయ మేర్పడ మ్రొక్కెద వింగడించి; - విపుల వాఙ్మయ గోచర! వేణు గోప! 60.
భావము:-
విపులమైన వాఙ్మయ గోచరుఁడ వగు ఓ వేణు గోపుఁడా! భూమిపై మూర్ఖులు
అది ఏ విధముగా పుట్టు చుండిరి? ఓ విశ్వ రక్షకుఁడా! వినయ మేర్పడునట్లుగా
వింగడింతును. అట్టి మూర్ఖులు పుట్టకుండునట్లు చేసి, అడ్డుకొనుము.
( స శేషం )
జైశ్రీరాం.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.