గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, నవంబర్ 2025, మంగళవారం

ఈశావాస్యోపనిషత్. (శుక్లయజుర్వేదము 40వ అధ్యాయములోని భాగము) ... పద్యానువాదము ... చింతా రామకృష్ణారావు. తే. 04 - 11 - 2025.

జైశ్రీరామ్.
ఈశావాస్యోపనిషత్.
పద్యానువాదము ... చింతా రామకృష్ణారావు. 
వేదసారములయిన  ఉపనిషత్తులు 108 ఏవి కలవో వాటిలో ప్రథమమైనది ప్రథానమైనదిగా చెప్పఁబడునది ఈశావాస్యోపనిషత్. ఈ ఈశావాస్యము అనుదానికి ఈశ్వరుని నివాసము అని అర్థము.
తత్ సంబంధమయినది ఈశావాస్యోపనిషత్.
ఈశావాస్యోపనిషత్.
ఓం పూర్ణమదః పూర్ణిమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః.

తే.గీ.  పూర్ణమాదైవ మీ సృష్టి పూర్ణము కన,
పూర్ణమౌదానినుండి యీ పూర్ణ సృష్టి
పుట్టినది, తీసివేసినన్ పూర్ణసృష్టి
పూర్ణముననుండి మిగులును పూర్ణమేను.

భావము.
దేవుడు పరిపూర్ణుడు. ఇది (ఈ ప్రపంచము) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండి పరిపూర్ణమైన ప్రపంచము పుట్టినది. పరిపూర్ణము నుండి పరిపూర్ణమును తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణమే మిగిలి ఉన్నది.

1. ఓం ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనం
తే.గీ.  ఈ జగమ్మున నన్నియు నీశుచేత 
నింపఁబడినవే, యేదియు నీది కాదు,
అట్టిబుద్ధిని నీవిది యనుభవించు,
పరధనమ్మును కోరకు, పాపమగును.
భావము.
జగత్తులో ఏవేవైతే ఉన్నవో అవన్నియు భగవంతునిచే నింపబడవలెను. అటువంటి త్యాగబుద్ధితో ఈ లోకమును అనుభవించు. ఎవరి ధనమును ఆశించకు.

2. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్‌ం సమాః
ఏవం త్వయి నాన్యథేతో స్తిన కర్మ లిప్యతే నరే
తే.గీ.  నీదు కర్తవ్యములు నీవు నిర్వహించు,
బ్రతుకు నూరేండులటులనే బద్ధుఁడవయి,
దారి లేదింతకన్ననుఁ దలప నీకు,
అంటవు నిను కర్తవ్యముల్ వెంట రావు. 
భావము.
ఈ లోకములో కర్తవ్యాలను నిర్వహిస్తూ మాత్రమే నూరేళ్ళు జీవించవలెనని ఆశించు. నీవంటి వారికి ఇది తప్ప వేరే దారి లేదు. కర్తవ్యములు నిన్ను అంటవు.

3.అసుర్యా నామతే లోకా అంధేన తమసావృతాః
తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్చన్తియేకే చాత్మహనో జనాః
తే.గీ.  రాక్షసులయొక్క లోకాలు క్రాలుచుండు
గాఢమైనట్టి చీకటిన్, మూఢమతిని
ఆత్మహత్యకు పాల్పడు హంతుకు లిల
నట్టి లోకలనుందురు గిట్టి వారు. 
భావము.
రాక్షసుల యొక్క లోకములు గాఢమైన అంధకారముతో అనగా చీకటితో ఉండును. ఆత్మహంతకులు మరణానంతరం ఆ లోకములను పొందుదురు.

4.అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్
తద్ధావతో న్యానత్యేతి తిష్ఠత్ తస్మిన్నపో మాతరిశ్వా దధాతి
తే.గీ. ఆత్మ కదలలేనిది చూడ నదియు నొకటె,
మనసుకన్నను వేగమై మసలునద్ది,
పొందవింద్రియమ్ములు దాని, ముందుపోవు
చు నది తిరముగానుండును,చురుకుగాను
కదలునన్నిటికన్నను,కనుక నడపు
నన్నిటిని తాను సతతమున్ మిన్నగాను.
భావము.
ఆత్మ కదలలేనిది. ఒక్కటే అయినది. మనస్సు కంటే వేగవంతమైనది. ఇంద్రియములు దానిని పొందలేవు. అన్నిటికన్నా ముందు వెళ్ళుచునే అది స్థిరముగా ఉంటుంది. కదిలెడి వస్తువులు అన్నిటికన్నా ఆత్మ వేగవంతమైనది. ఆత్మ స్థిరముగా ఉండుట వలన ప్రాణము అన్నిటితో పనిచేయించును.

5.తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః
తే.గీ.  కదలునాత్మ సతతమును గాంచ నదియె
కదలకుండయునుండును గణన చేయ,
కనగ దూరంబుగాను దగ్గరగనుండు
నన్నిటికిలోన బయటను నమరియుండు.
భావము.
అది చలించునది, చలించనిదియు. దూరముగా ఉండునది, చాలా దగ్గరగా ఉండునది. అది అన్నిటి లోపలా, బయట కూడా ఉండునది.

6.యస్తు సర్వాణి భూతాన్యాత్మ న్యేవాను పశ్యతి
సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే
తే.గీ. అరయునెవ్వరు జీవుల నాత్మలోన,
నాత్మనన్నిజీవులలోననట్టివారు
పరులనెప్పుడున్ ద్వేషింపరరసి చూడ,
నుత్తమోత్తములవ్వారలుర్విపైన.
భావము.
ఎవఁడు అన్ని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూచునో అతఁడు ఎవరినీ ద్వేషించడు.

7.యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః
తత్రకో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః
తే.గీ.  ఉన్నదాత్మయే పరికింప నన్ని జీవ
రాశులననుచు గ్రహియించు రమ్యులకిక
యెట్టులుండును మోహంబు పట్టి చూడ
నుండునెట్టుల శోకమీ యుర్విపైన.
భావము.
ఆత్మయే అన్ని జీవరాసులుగా ఉన్నదని గ్రహించిన వ్యక్తికి మోహము, శోకము ఎలా ఉంటాయి? ఉండవు.

8. స పర్యాగాచ్చుక్ర మకాయవ్రణమస్నావిరగ్‌ం శుద్ధమపాపవిద్ధం
కవిర్మనీషీ పరిభూః స్వయం భూ ర్యాథాతథ్యతోర్థాన్ వ్వదధాచ్చాశ్వతీభ్యః సమాభ్యః
తే.గీ.  పొందు తా నెవ్వఁడాత్మానుభూతి, కనఁగ 
నతఁడు గ్రహియించు నన్నిట నంతరార్థ
మునిల వశ చిత్తుఁడున్, జ్ఞాని, కనగ చెంద
డెవరికిన్,  నిజమన్నిటనెఱుఁగువాఁడు,
నతఁడు పూర్ణుండుస్వచ్ఛమౌ నతులదైవ
మున్నతండుచేరుకొనును, పూజ్యముగను.
భావము.
అతఁడు (అంటే ఆత్మానుభూతి పొందినవాడు) అన్నిటి అంతరార్థమును గ్రహించును.మనసును వశము చేసుకొనినవాఁడు. మొత్తము జ్ఞానమును తనలో ఉంచుకొనినవాఁడు. ఎవరికీ చెందనివాఁడు. అన్నివేళలా అన్ని వస్తువుల నిజమైన నైజాన్ని తెలుసుకొనినవాఁడు. ఉజ్వలమైన శరీరము లేని, కండలు లేని, పాపము లేని పరిపూర్ణమైన, స్వచ్ఛమైన దేవుడిని అతఁడు చేరుకొనును. 

9. అంధం తమః ప్రవిశన్తి యేవిద్యాముపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగ్ంరతాః
తే.గీ.  జ్ఞానమునుమాత్రమేకల్గి కర్మములను
చేయనట్టివారికి కల్గు చీకటులిల,
కర్మములనాచరించుచు జ్ఞానమొంద
నట్టివారరుగుమరింత యంధమునకు.
భావము.
విద్యా అంటే జ్ఞానము. కేవలము జ్ఞానమును మాత్రమే ఆశ్రయించి, కర్మలను చేయనివారు కటిక చీకట్లలోనికి వెళ్ళుదురు.  అసంభూతి అంటే కర్మలు. కేవలం కర్మలను ఆచరించి, జ్ఞానమును పొందనివారు మరింత చీకటిలోనికి వెళ్ళుదురు.

10.అన్యదేవాహు ర్విద్యయా అన్యదాహురవిద్యయా
ఇతి శుశ్రుమ ధీరాణాం యేన స్తద్విచచక్షిరే
తే.గీ.  ఆత్మవిద్యచే నమరెడునంచితఫల
మొకటి, కర్మచేసినను వే రొక ఫలంబు
కలుగు ననుచు మహాత్ములుతెలిపిరదియె
తెలుసుకొనవలె సుమతులతులితముగను.
భావము.
ఆత్మ విద్య ద్వారా ఒక ఫలితము, కర్మల (పనుల) ద్వారా మరొకరకమైన ఫలితము లభించును. మాకు దానిని వివరించిన మహాత్ములు ఈ విధముగా చెప్పిరి.

11.విద్యాం చావిద్యాం చ య స్తద్వేదో భయగ్‌ం సహ
అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతశ్నుతే
తే.గీ.  జ్ఞానకర్మలన్ రెంటిని కలిపి తెలుసు
కొనినవాఁడు కర్మలొనర్చి ఘనతరముగ
మరణమును దాటు, జ్ఞాన సన్మార్గమునను
పొందునమరత్వమున్ తాను పూర్తిగాను.
భావము.
జ్ఞానము (అంటే భగవంతుని తెలుసుకొనెడి విద్య), కర్మలు (పనులు) రెండింటినీ కలిపి తెలుసుకొనిన వాఁడు కర్మల ద్వారా మరణమును దాటి, జ్ఞానము ద్వారా అమరత్వమును పొందును. 

12.  అంధం తమః ప్రవిశన్తి యే సంభూతిముపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాగ్‌ం రతాః
తే.గీ.  అంధ తమసమ్మునంబడు నరయ నెవరు
ధర నిరాకారమున్ గొల్చి వరలువార
లంతకన్నను తమసాన నలమటింతు
రెవరుసాకారమునుగొల్తు రెలమి వారు.
భావము.
నిరాకార (సంభూతి) రూపమును మాత్రమే ఆరాధించు వారు కటిక చీకటిలోనికి వెళ్ళుదురు. సాకార (ఉ సంభూతి) రూపమును మాత్రమే ఆరాధించువారు అంతకంటే ఘోరమైన చీకటిలోనికి వెళ్ళుదురు. రెండింటినీ (సాకారం మరియు నిరాకారం) పూజించుట ద్వారా మాత్రమే సంపూర్ణ జ్ఞానము లభించును. 

13. అన్యదేవాహుః సంభవాదన్యదాహురసమ్భవాత్
ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే
తే.గీ.  మాకు తెలిపిన వార లమందగతిని
వినిన దేమన్నచో  నుపాసనను  చేయ
నొసగు సాకారమొకఫల మసదృశముగ,
క్షితి నిరాకార మొకఫలమతులితముగ.
భావము.
కొందరు "సంభవం" (ఉత్పత్తి లేదా సృష్టి) గురించి మాట్లాడుదురు, మరికొందరు "అసంభవం" (అభావం లేదా నిరాకారం) గురించి మాట్లాడుదురు. ఈ విధముగా మేము ఞానులనుండి వింటిమి.
ఈ విధముగా వారు దానిని తెలుసుకొనిరి.

14. సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయగ్‌ం సహ
వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యాఽమృతమశ్నుతే
తే.గీ.  పుట్టుకను మృత్యువు నెవండు పుడమి నెఱుగు
మృత్యువున్ జయించు వినాశ సత్యమెఱుగ,
నాతఁడమృతత్త్వమొందు నిరాకృతిఁగన
సాధనమునను నియ్యవి సంభవమగు. 
భావము.
పుట్టుకను (సంభూతిని) మరియు నాశనమును (వినాశానమును) రెండింటినీ ఎవఁడు తెలుసుకొనునో వాఁడు సాకార ఉపాసన ద్వారా మృత్యువును జయించి, నిరాకార ఉపాసన ద్వారా అమృతత్వమును పొందును.

15. హిరణ్మయేన పాత్రేణసత్యస్యాపిహితం ముఖం
తత్ త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే
తే.గీ.  కప్పఁబడె సత్య ముఖము బంగారుపాత్ర
ననుపమా, సూర్యదేవ! నేననుపమముగ
సత్యధర్మమున్ గాంచంగ,  సన్నుతముగ
తొలఁగఁ జేయుమా పాత్రను, కొలుతు నిన్ను.
భావము.
సత్యము యొక్క ముఖము బంగారు పాత్రతో కప్పబడి ఉన్నది. ఓ సూర్యదేవా! సత్యధర్మాన్ని మేము చూచుట కొఱకు ఆ బంగారు పాత్రను తొలగింపుము. 

16. పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ
తేజో యత్ తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి యో సావసౌ పురుషః సోఽహమస్మి
తే.గీ.  స్తుత ప్రజాపతి పుత్రుఁడా! సూర్యదేవ!
ఒక్కఁడవె జీవజాలంబునొనరకాసి
పోషణముచేయుచొంటిగఁ బోవు దేవ!
కాంతి తగ్గించుకొనుము నే కనుదు నిన్ను,
నీదు బ్రహ్మరూపమదియు నేనె కనఁగ.
భావము.
ప్రజాపతి కుమారుడా! అన్నిటినీ పాలించే ఓ సూర్యదేవా! సకల జీవరాసులను పోషించి కాపాడువాఁడవు, ఒంటరిగా పయనించెడివాఁడవు. నీ కిరణములను ఉపసంహరించుకొనుము. నీ తేజస్సును కుదించుకొనుము. కళ్యాణకరమైన నీ స్వరూపమును నీ అనుగ్రహముతో నేను చూచుచుంటిని. ఆ పరబ్రహ్మ స్వరూపుడైన పురుషుఁడు ఎవరో, ఆయన నేనే.

17. వాయురనిలమమృతమథేదం భస్మాన్తగ్‌ం శరీరం
ఓం (3) క్రతో స్మర కృతగ్‌ం స్మర క్రతో స్మర కృతగ్‌ం స్మర
తే.గీ.  పుడమి వాలిన దేహంబు బూది కాగ,
ప్రాణవాయువమృత వాయు లీనమగును,
చింత చేయుము గడచిన చేసినపను
లో మనస! నీవు, నీమది నొప్పుగాను.
భావము.
ఈ శరీరం కాలి బూడిద అగును. ఈ శరీర ప్రాణము మరణము లేని ప్రాణముతో కలిసిపోవును. ఓ మనసా! చేసినవాటిని విచారణ చేయుము, విచారణ చేయుము. 

18. అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ
తే.గీ.  అగ్నిదేవా! సమస్తంబునరసినట్టి
వాఁడ! మము నడుపుము సత్య పథమునందు,
చేసిన యపరాధములన్ని వాసిపోవఁ
జేసి నను నీవు నడుపుము, చేసెద నతి.
భావము.
ఓ అగ్నిదేవా! సమస్త జ్ఞానమును కలిగినవాఁడవు. మమ్ములను సరియగు మార్గములో నడిపించుము. మేము చేసిన అపరాధములనుండి మమ్మలను విముక్తులను చేయుము. మేము నీకు పదేపదే నమస్కరించుచున్నాము.

ఓం పూర్ణమదః పూర్ణిమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే
తే.గీ.  పూర్ణమాదైవ మీ సృష్టి పూర్ణముకన,
పూర్ణమౌదానినుండి యీ పూర్ణ సృష్టి
పుట్టినది, తీసివేసినన్ పూర్ణసృష్టి
పూర్ణముననుండి మిగులును పూర్ణమేను.
భావము.
దేవుడు పరిపూర్ణుడు. ఇది (ఈ ప్రపంచము) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండి పరిపూర్ణమైన ప్రపంచము పుట్టినది. పరిపూర్ణము నుండి పరిపూర్ణమును తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణమే మిగిలి ఉన్నది.
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఏతత్ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.
చింతా రామకృష్ణారావు.
తే. 04 - 11 - 2025.
 
కృతికర్త.  


చిత్రకవితాసమ్రాట్....కవికల్పభూజ....పద్యకవితాభిరామ....చిత్రకవితా సహస్రఫణీ....పుంభావ భారతి.
చింతా రామ కృష్ణా రావు. భాషాప్రవీణ .,P.O.L.,  M.A., విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.
ఫ్లాట్ నెం. ఆ 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.
తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165

రచనలు.
 1) అనంత ఛందము౨౨౦౦ కొఱకు శతకము.
 2) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమునా 
      మూడు ప్రాసయతులతో ఒక్క రోజులో వ్రాసినది.)
 3) ఆంధ్రసౌందర్యలహరి.
 4) ఆంధ్రామృతమ్,  పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగులలో అనేక 
      స్వీయ రచనలు.
 5) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.
 6) క్షీరాబ్ధిపుత్రీరమా! శతకము.
 7) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
 8) నేరెళ్ళమాంబ సుప్రభాతమ్.(సంస్కృతంలో)
 9) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.
10) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.
11) బాలభావన శతకము.
12) మూకపంచశతి పద్యానువాదము.
13) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు 
       తెలుఁగు పద్యానువాదము.
14) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
15) రాఘవా! శతకము.
16) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
17) రుద్రమునకు తెలుగు భావము.
18) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
19) వసంతతిలక సూర్య శతకము.
20) విజయభావన శతకము.
21) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
22) వేదస్తుతి, షోడశ చిత్రకవితలు. 
23) శ్రీ అవధానశతపత్రశతకము.
24) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.
25) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.
26) శ్రీచక్రబంధ మంగళాష్టకము.
27) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.
28) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.
29) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత 
       నృసింహనామాంచిత118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)
30) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)
31) శ్రీమన్నారాయణీయ పద్యానువాదము.
32) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
33) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ పద్మము.
34) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.
35) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము. (బంధచిత్రకృతి 
       ఒకే శతకమున మూడు మకుటములతో మూడు శతకములు.) 
36) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)
37) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి (శివశతకము.) (ఒక్క రోజులో 
       వ్రాసినది.)
38) శ్రీ శివాష్టోత్తరశతనామాన్వితాష్టోత్తరశత విభిన్నవృత్త శివశతకము.
39) సుందర కాండ.(రామాన్వయముగా కందపద్యములు, 
       సీతాన్వయముగా తేటగీతి పద్యములు, హనుమదన్వయముగా 
       ఉత్పలమాలలుతో సుందరోత్పల నక్షత్రమాల.)
40) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)
41) సువర్ణమాలా స్తుతి. శంకరుల శ్లోకములకు పద్యానువాదము
42) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా రకార ప్రాసతో 
       అష్టోత్తర శత పాద ఉత్పలమాలిక. 
43) శ్రీరామ పట్టాభిషేకం  
44) శాంభవీ శతకము 
45) శ్రీ అరుణాచలేశ్వరాష్టోత్తరశతనామాంచిత పద్యపుష్పార్చన.(తే.08 - 8 - 2025.)
46) గణపతి అష్టోత్తరశతనామాన్విత పద్యావళి. శాంకరీ శతకము. (ఒక్కరోజులో వ్రాసినది) తే. 31 - 8 - 2025.
47) సంక్షిప్త రామాయణము. పద్యానువాదము. 
48) ఈశావాస్యోపనిషత్ ... పద్యానువాదము. తే. 04 - 11 - 2025.
స్వస్తి.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.