గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, నవంబర్ 2025, శనివారం

యాజ్ఞవల్క్య చరిత్రము. ... ప్రచురణ. ,... శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ... ఉయ్యూరు.

జైశ్రీరామ్.

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -1

     బృహత్కల్పం లో కురు పాంచాల దేశం లో గంగానది తీరం లో చమత్కార పురం లో యజ్ఞ వల్క్యుడు బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు. సకల సద్గుణాలతో విరాజిల్లుతూ చిన్ననాటే వేదాధ్యయన పరాయణుడై యాజ్ఞ వల్క్య, వాజసని, బ్రహ్మరాత, దేవ రాత పేర్లతో ప్రసిద్ధి చెందాడు. యజ్ఞం అంటే వేదం. వేదాలను చక్కగా చెప్పగలవాడు కనుక యజ్ఞవల్క్యుడని, అన్నికాలాలలో  అన్నదానం చేయటం చేత వాజసని అనీ, బ్రహ్మము అంటే వేదం కనుక వేదాన్ని నిరంతరం బోధించేవాడుకనుక బ్రహ్మరాతుడని, దేవునిచే పాత్రదానం ఇవ్వబడ్డాడు కనుక దేవరాతుడని సార్ధక బిరుదనామాలు పొందాడు. వల్కలం అంటే వస్త్రం, యజ్ఞం లేక యాగం ఆయనకు వస్త్రాలవంటివి అంటే విడువరాని బంధం కలవి కనుక యజ్ఞవల్క్య నామం సార్థకము.

    ఆ కాలం లో వర్ధమాన పురంలో శకలుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనభార్య దితి. ఈ దంపతులకు సునంద అనే కుమార్తె, శాకల్యుడు అనే కుమారుడు జన్మించారు. సునందను యజ్ఞవల్క్యునికిచ్చి వివాహం చేశాడు. వీరికి చాలాకాలం సంతానం లేదు. పుత్ర సంతానం కోసం యజ్ఞవల్క్యుడు కేదారం వెళ్లి 12 ఏళ్ళుశివునికై  తీవ్ర తపస్సుచేశాడు. ప్రత్యక్షమైన పరమేశ్వరుడు వరం కోరుకోమనగా సత్పుత్రుని ప్రసాదించమని అర్ధించాడు. అప్పుడు శివుడు ‘’లోకం అంతా బ్రహ్మ విద్యా విహీనంగా ఉంది. కనుక నేనే నీకు కుమారుడిగా జన్మించి బ్రహ్మ విద్యా వ్యాప్తి చేస్తాను ‘’అని వరమిచ్చాడు. ఆనందం తో యజ్ఞవల్క్యుడు చమత్కారపురం చేరి శుభవార్త చెప్పాడు. కొంతకాలానికి సునంద గర్భవతియై పండంటి పుత్రుని కార్తీక శుద్ధ ద్వాదశి ఆదివారం కన్నది. వేదోద్ధరణకు జన్మించిన పరమేశ్వరుడనే ఆ బిడ్డను అందరూ భావించారు. అతనికి యాజ్ఞవల్క్యుడు అనే పేరు పెట్టారు. తండ్రికున్న నాలుగు పేర్లూ ఈయనకూ సంక్రమించాయి. అయిదవ ఏట అక్షరాభ్యాసం, గర్భాస్టమం లో(ఎనిమిదవ యేట) ఉపనయనం చేశారు. కొంతకాలానికి యజ్ఞ సునందలకు కంసారి అనే పుత్రిక కూడా కలిగింది. ఈమెకు యుక్త వయసు రాగానే వివాహ ప్రయత్నాలు చేశారు. కొడుకు  దేవ దేవుని వరప్రసాదం అని వారి మధ్య సంభాషణ జరిగింది. దేవదేవుడు ఎవరు  అని కొడుకు వాళ్ళను ప్రశ్నించాడు. అతని తెలివి తేటలకు సంతోషించారు. బాష్కలుడు అనే  గురువును చేరి వేద విద్యా రహస్యాలను నేర్వమని పంపించి దంపతులు శేష జీవితాన్ని కేదార క్షేత్రంలో గడపటానికి వెళ్లి పోయారు.

   యాజ్ఞవల్క్యుడు బాష్కలుని వద్దకు చేరి ఋగ్వేదం అభ్యసించాడు. జైమిని వద్ద సామ వేదాన్ని నేర్చాడు. పైలుని వద్ద అధర్వ వేదం చదువు కొన్నాడు.  వర్ధమాన పురం వెళ్లి తన మేనమామ విదగ్ధ శాకల్యుడు వద్ద యజ్ఞ యాగాలకు ఉపయోగ పడే యజుర్వేదాన్నినేర్చుకొన్నాడు. వేదపాఠం చెప్పటం లో బహు ప్రజ్ఞావంతుడు కనుక విదగ్ధ శాకల్యుడని పించుకొన్నాడు. ఇతడు వర్ధమాన పుర రాజు సుప్రియుడికి పురోహితుడుకూడా. ఈయన దగ్గర మూడువందల అరవై మంది విద్యార్ధులు యజుర్వేదం అభ్యసిస్తున్నారు. యాజ్ఞవల్క్యుని అవతార పరమార్ధం వారెవరికీ తెలియక పోవటం చేత అవమానిస్తుండేవారు.

  రాజు సుప్రియుడు దుర్వ్యసనాల పాలిట బడి రోగ గ్రస్తుడయ్యాడు. పురోహితుడికి మొరపెట్టుకొని తన జబ్బు తగ్గే ఉపాయం చెప్పమన్నాడు. మందులకు లొంగని జబ్బు ‘’శాంతిక ‘’కు  లొంగుతుందని చెప్పి ఊరడించి, రాజమందిరానికి రోజుకొక శిష్యుని పంపి అతనిచే శాంతికం జరిపిస్తూ రాజుకు మంత్రోదకం తీర్ధంగా ఇచ్చే ఏర్పాటు చేశాడు. ఏ రోజు ఎవరు వెళ్ళాలో కూడా శిష్యులకు తెలియ జేశాడు. ఒక రోజు యాజ్ఞవల్క్యుని వంతు వచ్చింది. మేనమామ వెళ్లి శాంతిక జరిపి మంత్రోదకం రాజుకు ఇచ్చి రమ్మన్నాడు. రాజు గుణ శీలాలు తెలిసి  వెళ్ళనన్నాడు. నచ్చ చెప్పి పంపాడు మేనమామ మేనల్లుడిని. రాజు అమర్యాదగా ప్రవర్తించినా సహించాడు. మంత్ర జలం పై నమ్మకం లేదన్నాడు.  తెచ్చిన మంత్ర జలాన్ని కోపంతో అక్కడున్న ఎండిపోయిన కర్రపై చల్లి’’ మళ్ళీ రాజమందిరానికి రాను’’ అని చెప్పి గురు కులానికి వెళ్లి పోయాడు. ఇంతలో ఆ ఎండుకర్ర ఆకులు, కాయలు, పండ్లు తో ఒక చెట్టు గా మారి శోభాయమానంగా కనువిందు చేసింది. అది చూసిన రాజు ఆశ్చర్యపోయి తాను చేసిన తప్పు తెలుసుకొన్నాడు. గురుకులానికి సేవకులను పంపి యాజ్ఞవల్క్యుని మళ్ళీ పంపమని గురువును వేడుకున్నాడు. ఆయన శిష్యుడికి చెప్పాడు .’’మా నాన్న చెప్పిన నీతి మార్గాన్నే నేను ఆచరించాను. మళ్ళీ వెళ్ళను ‘’అని తెగేసి గురువగు మేనమామకు చెప్పాడు. ఆయనకు కోపంవచ్చి ‘’నీమహిమ తో నీకు గర్వం హెచ్చింది ‘’అన్నా వినలేదు. శిష్యులతో బుద్ధి చెప్పిస్తానన్నా బెదరలేదు. 

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర –2

   మేనమామ శాకల్యుడు మేనల్లుడు యాజ్ఞవల్క్యుని ఏమీ చేయలేక  శిష్యులనందర్నీపిలిపించి విషయం  చెప్పాడు. అదెంత పని అని ప్రచూడుడు, పైన్గ్యుడు తమకు తపోమహిమ తక్కువేమీ లేదని ప్రకటించి, రాజుకు మంత్రోదకం ఇవ్వటానికి వెళ్ళారు. రాజు వారిని నమ్మటానికి అక్కడ ఒక మొద్దు పడేసి దాన్ని మంత్రోదకంతో చిగురించేట్లుచేయమన్నాడు. ఎన్ని సార్లు మంత్రజలం చల్లినా వాళ్ల పాచిక పారలేదు. తెల్లమొహాలు వేసుకొని గురువును చేరి జరిగింది చెప్పారు. రాజు సుప్రియుడు గురువును పిలిపించి తాను అవమానించిన యాజ్ఞవల్క్యుడు మహా తపస్సంపన్నుడు అని తర్వాత తెలుసుకున్నానని అతడే వచ్చి మంత్రోదకం ఇస్తేనే తన వ్యాధి నయమౌతుండదనే నమ్మకంతో ఉన్నానని  అతడు రాకపోతే తానె అక్కడికి వస్తానని ప్రాధేయపడి, గురువు వెంట ఆశ్రమ౦ చేరాడు. మేనల్లుని పిలిచి రాజు వచ్చాడని, మంత్రోదకం ఇవ్వమని చెప్పాడు. పట్టు వదలని అతడు ససేమిరా అన్నాడు. కోపంతో ఊగిపోతూ  రాజుల మన్నననలు పొందుతూ అభిమానం మొదలైనవి వదులుకోవాలని హితవు చెప్పాడు. దానికి బదులిస్తూ ‘’రాజు దయా ధర్మ భిక్ష నాకక్కరలేదు. అవమానించినవారి మోచేతి నీళ్ళు త్రాగుట నేను చేయను. ఆత్మ గౌరవం లేని బతుకు బతుకు కాదు ‘’అన్నాడు. ఆ మాట విని గురువయిన మేనమామ అగ్గిమీద గుగ్గిలం అయి ‘’నేను చెప్పిన చదువంతా’’ కక్కేసి ‘’ నా ఇంట్లోంచి బయటికి వెళ్ళు ‘’ అని ఆజ్ఞాపించాడు. నిమిషం ఆలస్యం చేయకుండా యోగ బలం తో తాను నేర్చిన యజుర్వేదాన్ని మూర్తిమంతం చేసి, కక్కిపారేసి  అక్కడ నుంచి యాజ్ఞవల్క్యుడు వెళ్లి పోయాడు .ఆ కక్కిన దాన్ని వైశంపాయనుడు అనబడే శాకల్యుని శిష్యులు ‘’తిత్తిరి పక్షులు‘’గా మారి తినేశారు. అప్పటినుంచి ఆవేదం’’ తైత్తిరీయం ‘’అనే పేరుతో పిలువబడింది. మేనమామ ఇంటినుంచి వెళ్ళిపోతూ మేనల్లుడు యాజ్ఞవల్క్యుడు ‘’నీ వేదం బుద్ధి మాలిన్యం తో పూర్వ, ఉత్తరాంగ రహితమై, అవ్యవస్తితమై, కక్కినదాన్ని జనం ఎవరూ చూడక అసహ్యించు కోనేట్లుగా, నీ దగ్గర చదివిన యజుస్సులు అన్నీ స్మరణ కైనా రానీయను. ఇంతకంటే అనేక రెట్ల గొప్పదైన వేదాన్ని పొంది నీవేదాన్ని మూలపడేట్లు చేస్తా.’’అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు .

  అక్కడినుండి బయల్దేరిన యాజ్ఞవల్క్యుడు హాటకేశ్వరం వద్ద ఉన్న విశ్వామిత్రహ్రదం చేరి స్నానం చేసి, వేదమాత ను ఉపాసించటానికి ముందు సూర్యోపాసన చేయగా, ప్రభాకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ‘’ ఏ కొరతా లేని కర్మ బ్రహ్మ విద్యలు కలిగి శుద్ధ స్వరూపమైన వేదాన్ని ప్రసాదించు ‘’అని  వేడుకొన్నాడు. రవి యాజ్ఞవల్క్యుని నోరు తెరవమని చెప్పి సరస్వతీ రూపమైన తన తేజస్సును అతని నోటిలో ప్రవేశ పెడతానని, దానివలన ‘’శుద్ధ (శుక్ల )యజుర్వేదమే కాక అఖిలవిద్యలు నీకు వశమౌతాయి. సకల జగద్రహస్యాలు తెలియ జేసే అద్వితీయమైన ‘’శత పథం’’నువ్వు వ్రాస్తావు’’అని చెప్పి యాజ్ఞవల్క్యుని నోటిలో తన తేజస్సును ప్రవేశ  పెట్టాడు ఆదిత్యుడు .

  ఈ విధం గా యాజ్ఞవల్క్యుడు శుద్ధయజుర్వేదాన్ని పొందాడు. వాజీ రూపాన్ని ధరించి శుక్ల యజుర్వేదాన్ని బోధించాడు. శుక్ల యజుస్సులు వాజస నేయుడైన యాజ్ఞవల్క్యుని వలన ‘’ఆదిత్యాలు ‘’ అని పిలువ బడ్డాయి. అంటే ఆదిత్యుడు యాజ్ఞవల్క్యుని చేత చదివించిన తర్వాతే స్వయంభు ఐన బ్రహ్మనుండి బయల్వెడలిన శుక్ల యజుర్వేదాన్ని ఆదిత్యం అంటారని భావం .

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -3

యాజ్ఞవల్క్యుడు దివాకరుని అనుగ్రహం తో పొందిన వేదాన్ని శుద్ధ యాజుషం అని, ఏకాయనం అని, అయాత యామ అని పిలువబడింది. పూర్వ మీమాంస శాస్త్రం పుట్టటానికి కర్మకాండ, ఉత్తర మీమాంసకు కారణం అయిన బ్రహ్మకాండ, తర్వాత మంత్ర బ్రాహ్మణం వేర్వేరుగా ఉండటం చేత శుద్ధ లేక శుక్ల యజుర్వేదం అనే పేరు తోపాటు దీనికంటే శ్రేష్టమైనది వేరేలేనందున ఏకాయతనం అనే పేర్లు వచ్చాయి. శుక్లాయజుర్వేదానికి చరణ వ్యూహం, భారతంలో చెప్పబడినట్లు 15 శాఖలున్నప్పటికీ ఇప్పుడున్నవి కేవలం కాణ్వ, మాధ్యందిన అనే రెండు శాఖలు మాత్రమే అని ముందే చెప్పుకున్నాం. ఇతర వేదాలలో కొన్ని పాఠక భేదాలు అంటే సూత్ర భేదాలనుబట్టి శాఖలేర్పడ్డాయి. కాని శుక్ల యజుర్వేదానికి మాత్రం ఏ శాఖ బ్రాహ్మణం ఆ శాఖకే ఉన్నాయి. అంటే కాణ్వశాఖ కు సంహిత బ్రాహ్మణాలు వేరుగా, మాధ్యందిన శాఖకు బ్రాహ్మణాలు వేరుగా ఉన్నాయి. శుక్ల యజుర్వేద బ్రాహ్మణాన్ని’’శత పథం’’అంటారు. కాణ్వ శాఖాను సారంగా ఈ బ్రాహ్మణం లో 17 కాండలు, 104 అధ్యాయాలు ఉన్నాయి. మాధ్య్యందిన శాఖానుసారంగా 14 కాండలు,100 అధ్యాయాలున్నాయి. ’’పథిక్’’అంటే అధ్యాయం అనే  అర్ధం ఎక్కడా లేదు. నాలుగు అనే అర్ధం చెప్పవచ్చు. కనుక శతపథం అనేది కాణ్వ బ్రాహ్మణానికి మాత్రమే చెందుతుంది అని గ్రహించాలి. వ్యాకరణ భాష్యం లో శతపథం, షష్టి అనే రెండుపదాలున్నాయి. మాధ్య౦దినం లో  మొదటి 9 కా౦డలలోని అధ్యాయాలు 40 కనుక ఆ తొమ్మిది కా౦డలకు మాత్రమే ‘’షష్టి పథం’’అన్నారు. వార్తికం పుట్టేనాటికి మాధ్యందిన శాఖలో 100 అధ్యాయాలున్నట్లు భావించారు. ఏతావాతా తేలిందేమిటంటే’’ షష్టి పథం’’ అంటే మాధ్య౦దినం అనీ, ’’శతపథం’’ అంటే కాణ్వ మనీ గ్రహించాలి. మాధ్య౦దినం లోని 40 అధ్యాయాలు కాణ్వం నుంచి చేర్చబడ్డాయి .

   యాజ్ఞవల్క్యుడు యాజ్ఞిక ప్రవీణుడు, ఆధి దైవత త్త్వం తెలిసిన పండిత శ్రేష్టుడు. కనుక ఆయనకు బ్రహ్మవాదం అంటే మహా ప్రీతి. తురీయాశ్రమాన్ని మొట్టమొదట స్వీకరించినవాడు యాజ్ఞవల్క్యుడు అని చరిత్ర ప్రసిద్ధం. శతపధం లో అనేక పూర్వ ఋషుల, రాజుల చరిత్ర ఉంది. ఋగ్వేదం చదివినవారికి మిగిలినవేదాలు నేర్వటం యెంత సులువో, శతపధ బ్రాహ్మణం నేర్చినవారికి యాజ్ఞిక కర్మలు చేయించటం అంత తేలిక మాత్రమేకాక తైత్తిరీయాదులు గ్రహించటం కూడా చాలా తేలికౌతుంది. శతపథంలో వేదార్ధాన్ని గ్రహించటం సులువు. ఇది తెలిస్తే వైదిక విషయాలు కరతలామలకం అవుతాయి. కనుక అన్ని బ్రాహ్మణాలకంటే శ్రేష్ఠంగా పేర్కొన్నారు. ఆధ్యాత్మ రామాయణం అరణ్యకాండ 8 వ సర్గ   లో ‘’అపూర్వ మైన శతపథం నాచే చేయబడింది ‘’అని యాజ్ఞవల్క్యుడు అన్నట్లు ఉంది – ‘’రతి పతి శత కోటి సుందరాంగం’’  – శతపథం గోచర భావనావిదూరం –యతి పతి హృదయే సదా విభాంతం –రఘుపతి మార్తిహరం ప్రపద్యే ‘’   వెబర్ అనే పాశ్చాత్య పండితుడు’’ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ ‘’లో ‘’White Yajus occupies the most significant and important position of all the Brahmanas ‘’అన్నాడు .శతపథం కు మాత్రమే కాక తాండ్యభాల్లవి బ్రాహ్మణానికి కూడా ఉదాత్త అనుదాత్త స్వరాలు రెండేఉంటాయి అని కాత్యాయనుడు’ భాషిక సూత్రం’’ లో చెప్పాడు. ఈ సూత్రం ప్రాతిశాఖ్యము వేదం యొక్క స్వర సంస్కార నియమాన్ని తెలిపినట్లే, వేద వ్యాఖ్యానమైన బ్రాహ్మణ స్వర సంస్కార నియమాన్ని కూడా తెలుపుందని విజ్ఞుల ఉవాచ.

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -4

తాను పొందిన శుక్ల యజుర్వేద వ్యాప్తి కోసం యాజ్ఞవల్క్య మహర్షి గంగాతీరాన ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఒక రోజు కణ్వుడు అనే ఋషి పుత్రుడు వచ్చి పాదాలపై వ్రాలి ‘’మహాత్మా! శాకల్యుడి వంటి వాళ్ళు తప్ప మిమ్మల్ని పొగడని వారుండరు లోకం లో. మీకు తెలియని విద్య లేదు. నేను మీకు ముఖ్య శిష్యుడుగా ఉండాలనే ఆశతో వచ్చాను. నన్ను సర్వాదికారిని చేస్తే మహదానంద పడతాను, ’’అన్నాడు వినయంగా. అప్పుడాయన ‘’భాస్కరాశీర్వాదం తో పొందిన శుద్ధ యజుర్వేజం లోని ముఖ్యభాగాన్ని నీకే బోధిస్తాను. దీనివలన లోకం లోని అన్ని వేదాలకంటే నీకు నేను చెప్పినదే మొదటి స్థానంలో ఉంటుంది. అదే లోకం లో ‘’ప్రధమ శాఖ ‘’అని,  కాణ్వ శాఖ అని ప్రసిద్ధి చెందుతుంది. అనగానే అతడు ‘’మీ అనుగ్రహంతో నేను అందరికంటే ఆదధిక్యుడు అనే కీర్తి పొందుతాను ‘’అన్నాడు. వెంటనే యాజ్ఞవల్క్యుడు ‘’వత్సా! నీవొక్కడివే గొప్ప వాడివి అవటం కాదు. నీకు చెప్పేవేదం చదివి, అందులోని అర్ధాదులను గ్రహిం, నీ శిష్య పర౦పర కూడా గొప్పవారవ్వాలి. లోకంలో మంచి విషయాన్ని గ్రహించినవారంతా అధికులే’’ అని ఆశీర్వదించి అన్ని విషయాలతో పరిపూర్ణంగా ఉన్న ప్రథానభాగాన్ని అంతటినీ కణ్వుడికి బోధించి చదివించాడు. ఈ కాణ్వ సంహిత లోని పూర్వ భాగానికి సాయనాచార్యుడు ‘’వేదార్ధ ప్రకాశం ‘’అనే భాష్యాన్ని,ఉత్తర భాగానికి నాగదేవభట్టు కుమారుడు అనంతాచార్యుడు ‘’వేదభావార్ధ దీపిక ‘’ భాష్యాన్ని, జాత వేద ఉపాధ్యాయుడి కొడుకు శ్రీ మదానంద బోధ భట్టో పాద్యాయుడు ‘’కాణ్వ వేదమంత్ర భాష్య సంగ్రహాన్ని ‘’ రచించారు .

కాణ్వీయ సంహిత లోని మొదటి అధ్యాయం నుంచి 27 వ అధ్యాయం వరకు ఉన్న దానిలో దర్శ పూర్ణ మాసలు  మొదలు అశ్వమేధం చివరవరకు అన్ని క్రతువులు ఉన్నాయి. 21 నుంచి 27 వరకున్న అధ్యాయాలు మొదటి 20 అధ్యాయాలలోని విషయాలే అన్న పాశ్చాత్య పండితుల అభిప్రాయం సరై౦ది కాదంటారు. 28 నుండి 35  వరకు ఉన్న8  అధ్యాయాలు’’ ఖిలం ‘’అని అంటారు. వీటికి శ్రౌత వినియోగాన్ని కాత్యాయనుడు చెప్పలేదు. అయితే వాటిని ఎందుకు ఉంచారు అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం వాటిలో విశేషాలు ఉండటం, బ్రహ్మ యజ్ఞం మొదలైన వాటిలో వాటి అవసరం ఉన్నది కనుక. కానీ అవి ఏదో ఒక క్రతువు గూర్చి మాత్రం చెప్పలేదు. 36 నుండి 40 వరకు 5 అధ్యాయాలను ‘’శుక్రియములు ‘’ అంటారు వాటిని పగలు మాత్రమే ఉచ్చరించాలి, కాని రాత్రి వేళ కాదు. బ్రాహ్మణాలలో వీటికి ‘’ఆరణ్యకాలు’’ అనే పేరుకూడా ఉంది. కారణం ఇవి బ్రాహ్మణాలలోని, ఆరణ్యాక భాగం లో వ్యాఖ్యానం చేయబడ్డాయి. కనుక అరణ్యాలలో నే కాని, గ్రామాలలో  వాటిని పఠించ రాదు. శుక్రియ భాగం తప్ప మిగిలిన వేదభాగాలన్నిటిని గ్రామ౦ లోనైనా, అరణ్యం లోనైనా చదువ వచ్చును.

శ్రీ యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -5

28 నుంచి 31 వరకు ఉన్న 4 అధ్యాయాలలో యజుర్గణనం మొదట్లో చూపిన అధ్యావస్థ విషయాలకే సంబంధించింది. కనుక తగిన చోట్ల ఉపయోగిస్తారు. 32 నుంచి 39 వరకు 8 అధ్యాయాలలో పురుష మేధం, సర్వ మేధం, పితృ మేధం, ప్రవర్గ్యం మొదలైనవి కొత్తవి అని  కొందరి భావన. కాని దీనికి విలువ లేదు. 40 వ అధ్యాయంలో ఈశావాస్యం ఉన్నది. దీనికి ముందున్న అధ్యాయాలలో కర్మ గురించి చెప్పి, ఇప్పుడు దీనిలో బ్రహ్మాన్ని గురించి చెప్పటం చేత ఇది ఉపనిషత్తు అని పిలువబడి ‘’ఈశావాస్యోపనిషత్’’ అయింది. సంహితలో యే వేదంలోను బ్రహ్మ విద్యను  తెలిపే భాగం లేదు. ఇలా ఒక అరుదైన విషయం వాజసనేయ సంహితలోనే ఉంది. కనుక’’ వాజసనేయ సంహితోపనిషత్’’ అయింది. అందుకే ఉపనిషత్తులన్నిట్లో ప్రధమ స్థానం పొందింది. దీని ప్రత్యేకత ఏమిటి? ఇందులో కర్మ విషయాన్ని, బ్రహ్మ విషయాన్ని సాకల్యంగా చర్చించి బ్రహ్మ విషయమే శ్రేష్ఠము అని నిక్కచ్చిగా న్యాయాధికారిగా తీర్పు చెప్పింది. జగత్తు అంతా పరబ్రహ్మం చేత వ్యాప్తమై౦దని, బ్రహ్మం లేనిది జగత్తులో ఏదీ లేనే లేదని చెప్పింది. కనుక మమత్వం అంటే నాది నీది అనే భేదభావం లేకుండా సర్వం బ్రహ్మమయం అని భావించి భజించాలి అని నిష్కర్షగా తెలియ జేసింది. కనుక ఇందులోని మొదటి మంత్రమే సర్వోత్కృస్టం.

  రెండవ మంత్రం ‘’కుర్వాన్నే వేహ కర్మాణి ‘’ లో ఒక వేళ సన్యసించినా, మనో వాక్కాయ కర్మలతో విషయాల క్రియలను మానేసి ముఖ్యమైన ఆత్మ చి౦తనాన్నిచేయ లేకపోయినచో బ్రతికి ఉన్నంతకాలం ఏ రోజూ మానకుండా సంధ్యావందనం మొదలైన విహిత కర్మలు మాత్రం చేస్తూ ఉండాల్సిందే. మూడవమంత్రం కామ్య కర్మలు సంసార బద్ధుని చేస్తాయి కాని, పరబ్రహ్మార్పణం గా, జ్ఞానం కోసం  చేసే కర్మలు మనలను అంటవు అని బోధించింది. మిగిలిన 16 మంత్రాలు మొదటి మూడు మంత్రాల పరిపూర్ణమైన వివరణ మాత్రమే.

     17 వ కాండ సంహితలో చివరది అయిన 40 వ అధ్యాయం కూడా బ్రహ్మ విద్యనే బోధిస్తుంది కనుక దీనికి ‘’బృహదారణ్యకోపనిషత్ ‘’ అన్నారు. దీనిలో బ్రహ్మవిద్య కరతలామలకంగా బోధి౦పబడింది అని విద్యారణ్య స్వామి శతపథ బ్రాహ్మణ వ్యాఖ్య లో తెలియ జేశారు – ‘’కరామలక వద్యత్ర పరం తత్త్వం ప్రకాశితం – యా కా చిత్తాదృశీశాఖా త్వయా వ్యాఖ్యాయతామితి ‘’.సాధారణంగా సంస్కృతం లోని సంజ్ఞావాచకాలన్నీ ఏదో ఒక ధర్మాన్ని బోధించేవే. శంకర భగవత్పాద, విద్యారణ్యమొదలైన గురు దేవులంతా ‘’ చిత్త వృత్తి నిరోధానం కోసం అరణ్యాలలో నివసించేటప్పుడు, ముందుగా గురువులు చెప్పుకుంటూ పోతుంటే, వెనకున్న శిష్యులు దాన్ని ఉచ్చరిస్తూ ఉన్న జ్ఞాన శాస్త్రాన్ని’’ ఆరణ్యకం ‘’అన్నారు. అంటే చిన్నతనం నుంచి ముసలితనం వరకు వివిధ విషయాలపై పరిగెత్తే మనసును  ఎప్పటికప్పుడు వెనక్కి మరలిస్తూ, ఆత్మచింతనం చేయాలని అర్ధం. ఇలా అరణ్యాలలో సాధన చేయకుండా, గ్రామాలలో చేస్తే ఇంద్రియాలు, మనసు స్వాదీనంకావు. విషయవాంఛ బలీనమై మనసును ఒక చోట నిలువ నీయదని గ్రహించాలి . బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం వేదాంత గ్రంథాలను అధ్యయనం చేయాలని, అలాంటి ఆరణ్యకాలే వేదాలకు ముఖ్యమైనవి అని మహా భారతం చెప్పింది – ‘’భారతస్య వపుర్హే తత్సత్యం చామృత మేవచ –నవనీతం యదాదధ్య్నో  ద్విపదాం బ్రాహ్మణో యధా, ‘’ఆరణ్యకం చ వేదేభ్య శ్చౌషధిభ్యోమృతం యధా –హ్రదానాముదధిః శ్రేష్టో గౌర్తరిస్ఠోచతుష్పదాం ‘’ఋగ్వేదానికి  ఐతరేయ శాఖారణ్యకాలు, కృష్ణ యజుర్వేదానికి తైత్తిరీయారణ్యకాలు, శుక్ల యజుర్వేదానికి బృహదారణ్యకాలు ఉన్నాయి’. వీటిలో పరిమాణం లో, అర్ధ గౌరవం లో శుక్ల యజుర్వేద ఆరణ్యకం పెద్దది కనుక ‘’బృహదారణ్యకం ‘’అనే పేరొచ్చింది అనిదీనికి వ్యాఖ్యానం రాస్తూ  ఆది శంకరాచార్యాదులు తెలియ జేశారు.

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -6

బృహదారణ్యకం లోనే సన్యాస విషయం సమగ్రంగా చెప్పబడింది .శుక్ల యజుర్వేదానికి చెందిన ‘’జాబాలోపనిషత్ ‘’కూడా సన్యాసం గురించి చెప్పింది. శంకర భగవత్పాదుల వంటి వారలకు బ్రహ్మ చర్యం నుండే  సన్య సించవచ్చు అని దారికూడా చూపింది. యాజ్ఞవల్క్యుడే మొదట సన్యాసం స్వీకరించాడు అన్నమాట యదార్ధం. పరివ్రాజక ధర్మం గురించి విశేషంగా చెప్పింది జాబాలికోపనిషత్. యజ్ఞ రహస్యాలను ఆలంకారికంగా వర్ణించింది. బృహదారణ్యకంలో  ముఖ్యంగా ఆత్మజ్ఞాన బోధ ఉంది. ఇందులో .యాజ్ఞవల్క్యుడే  ప్రధాన భూమిక వహించాడు. యాజ్ఞవల్క్య, విదేహరాజుల మధ్య సంభాషణలో చెప్పాల్సిన విశేషాలన్నీ చోటు చేసుకొన్నాయి. దీనిలోనే బ్రహ్మవాదినులైన మైత్రేయి, గార్గి ల వర్ణన కూడా ఉంది. మైత్రేయీ బ్రాహ్మణమైన దీనిలో ‘’ఆత్మావా అరే ద్రస్టవ్యః ‘’అనే వాక్యం వేదాంత శాస్త్రం అంటే ఉత్తర మీమాంసకు విషయం  అయింది .

శుక్లయజుర్వేదం అభ్యాసకులైన కాణ్వ, మాధ్య౦ది మునులకు కాత్యాయనుడు రచించిన ‘’శ్రౌత సూత్రం ‘’ ఉన్నది. దీనిలో 26 అధ్యాయాలు. ఇది ఖచ్చితంగా ‘’శత పథం’’అనుసరించే రాయబడింది. మొదటి 18 అధ్యాయాలు బ్రాహ్మణం లోని మొదటి 11 కా౦డలననుసరించి ఉంటే ‘’సౌత్రామణి’’,19లో, అశ్వమేధం 20, పురుమేధం, సర్వమేధం, పితృమేధం 21అధ్యాయాలలొ చెప్పబడ్డాయి. తర్వాత ఉన్న  మూడిటిలో ఏకాహం, సత్రం వగైరా ఉన్నాయి. 25 లో 14 వ కాండలో చెప్పిన ప్రాయశ్చిత్తం, చివరిదైన 26 అధ్యాయం లో 16 వ కా౦డ లోని ‘’ప్రవర్గ్య ‘’విశేషాలున్నాయి . స్వర సంస్కార నియమాలకు ‘’ప్రాతిశాఖ్య ‘’,ఋషి ,దేవతాదులు తెలుసుకోవటానికి ‘’కాణ్వ సర్వానుక్రమ సూత్రం’’  గృహ్య కర్మలకు ‘’పారస్కర గృహ్య సూత్రం ‘’ఉన్నాయి. అంటే కాత్యాయనుడు శుక్ల యజుర్వేదం అంతటికీ ప్రయోగ శాస్త్రం రాశాడన్నమాట .

యాజ్ఞవల్క్య మహర్షికి మధ్య౦దినుడు, జాబాలి, బోధి, శాపేయుడు, గాలవుడు అనే అయిదుగురు ముఖ్య  శిష్యులున్నట్లు, వారు శుక్ల యజుర్వేదాన్ని అధ్యయనం చేసినట్లు విష్ణు పురాణం మొదలైన వాటిలో ఉన్నది. అయితే ఇప్పుడున్నవి కాణ్వ, మాధ్యందిన శాఖలు రెండే అని ముందే తెలుసుకొన్నాం. రెండిటిలో విషయం ఒక్కటే అయినా, అధ్యాయ  విభాగం, వ్యాకరణా౦శాలలొ భేదం ఉన్నది. ఋషి భేదాన్ని బట్టి వచ్చినవే. ఇవి విషయంలో తేడా, దేశాలలో తేడా బట్టి భాషా భేదం ఉండచ్చు. ఆంగ్లేయ పరిశోధకులు కూడా ‘’ఎన్ సైక్లోపీడియా బ్రిటాన్నికా’’లో  ‘’ఈ రెండింటిలో విషయభేదం చాలాతక్కువ. శైలిలో చాలాభేదం ఉంది ‘’అన్నారు. కాణ్వ పాఠం ఋగ్వేద సంప్రదాయంలో ఉంటుంది. మాధ్యందిన పాఠం కొన్ని చోట్ల కృష్ణ యజుర్వేదాన్ని పోలి ఉంటుంది. మాధ్య౦దినం కంటే కాణ్వం సర్వవిధాలాల శ్రేష్ఠము అని కూడా ముందే చెప్పుకున్నాం .మాధ్యందిన శాఖా సంహితలో 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975  ఖండికలు ఉన్నాయి. బ్రాహ్మణం లో 14 కాండాలు, 100 అధ్యాయాలు, 438 బ్రాహ్మణాలు, 7,624 ఖండికలు ఉన్నాయి .

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -7

మిథిలానగరానికి దగ్గరలో ఒక ఆశ్రమం లో ‘’కతుడు ‘’అనే ఆయన ఉండేవాడు. ఆయన కుమార్తె కాత్యాయని. అందంతో పాటు బుద్ధి శాలిని. యుక్తవయసురాగానే  కతుడు భార్యతో కూతురు వివాహ విషయం చర్చించాడు. శుభ లక్షణాలున్న తమ కూతురు  సాక్షాత్తు లక్షీస్వరూపమని భావించారు . గంగాతీరంలో ఒక మహాత్ముడు ఆశ్రమంలో ఉంటూ బ్రహ్మజ్ఞానం బోధిస్తున్నాడని అతడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడని లోకుల ద్వారా  తెలుసుకొని అతనికి తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని తలచార. కతుడు అతని వివరాలు స్వయంగా తెలుసుకోవటానికి బయల్దేర యజ్ఞవల్క్యాశ్రమం చేరి ఆతనితో ‘’మాకు లక్ష్మీదేవి వంటి కాత్యాయని అనే కూతురు ఉంది. విష్ణు స్వరూపంగా ఉన్న మీరామెను వివాహం చేసుకోమని విన్నవి౦చటానికి విచ్చేశాను ‘’అన్నాడు . సంతోషం తో అంగీకరించి, ఋషి బృందంతో కలిసి యాజ్ఞవల్క్యుడు వెళ్లి, ఒక శుభ ముహూర్తం నాడు కాత్యాయనిని పరిణయమాడాడు. కాత్యాయినీ కళ్యాణ వైభోగాన్ని చూసి అందరూ ఆనందించారు.

యాజ్ఞవల్క్యుడు బాదరాయణునికి దౌహిత్రుడైన బ్రహ్మ దత్తునికి తాను నేర్చిన శుక్ల యజుర్వేదాన్ని క్షుణ్ణంగా అభ్యసింప జేసి, ప్రయోగం ఎలాచేయాలో యాగాలు  కూడా చేయించాడు. ఆకాలం లో యాగాలు అన్నిటికన్నా శ్రేష్ఠమైన కర్మలని భావించేవారు. పిలిచినా, పిలవకపోయినా యాగాలు చూడటానికి ఋషి గణం ఉత్సాహంగా వచ్చేది. శాకల్యుడు అనబడే వైశంపాయనుడు, ఉద్దాలకుడు , తిత్తిరి, శ్వేతకేతుడు, కహోళుడు మున్నగు ఋషులు కూడావచ్చియాజ్ఞవల్క్యుడు చేయించే యజ్ఞ విధానాన్ని చూసి ఆశ్చర్య పోయేవారు. మేనల్లుడిని తన ఇంటి నుంచి తరిమేస్తే ఇంతటి ప్రభావ శీలి అయినందుకు మేనమామ శాకల్యుడికి ఈర్ష్య కలిగింది. తనతో వచ్చినవారితో పూర్వం నుండి వస్తున్నకల్పాలన్నిటినీ మార్చేసి, కొత్తవి  కల్పించి చేయిస్తున్న తీరు నచ్చలేదని చెప్పాడు. ఉద్దాలకుడు ‘’ఈ వేదం యాజ్ఞవల్క్యుడు కల్పించినట్లుగా ఉన్నది ‘’ అన్నాడు. మిగిలిన ఋషులు తొందర పడటం మంచిదికాదని, ఈ విధులన్నీ ఎవరి వద్ద నేర్చాడో తెలుసుకోవాలని అన్నాడు. క్రోధం ఉంటె అవతలి వారిలో ఉన్న గుణం దోషంగా కనిపిస్తుంది అని వారించారు .

వారు యాజ్ఞవల్క్యుని చేరి ‘’మహాత్మా! ఈవేదం పేరేమిటి? దానిలో విషయమేమిటి? ఎవరి దగ్గర నేర్చావు? ‘’ అని సవినయంగా ప్రశ్నించారు. దానికి ఆయనకూడా అత్యంత వినయంతో ‘’ఋషి పు౦గవులారా!  దీన్ని శుద్ధ యజుర్వేదం, ఏకాయనం, యాతయామ అంటారు. ఇది వ్యవస్థితి ప్రకరణం, సర్వకర్మ నిరూపకం, పూర్వ, ఉత్తరాంగ సహితం. స్వయంభు బ్రహ్మనుండి ఏర్పడి సర్వ తేజో రాశి అయిన సూర్యుని వద్ద అధ్యయనం చేశాను ‘’ అని విన్నవించాడు. సాకల్యుడికి అంతటి తేజో రాశి అయిన సూర్యుని ఎలా చూశావని అడిగాడు. కావాలంటే దర్శనం కలిగిస్తానని చెప్పి తేజో మయమైన తన రూపాన్ని చూపించగా  వాళ్ళు మూర్ఛ పోయారు. కాసేపటికి తేరుకొని యాజ్ఞవల్క్యుని అవతార పురుషునిగా భావించి, ఆయన సాక్షాత్తు పరాత్పరుడే అని నిశ్చయం చేసుకొని ఆయనవద్దే అన్నీ నేర్చుకొందామని నిర్ణయానికి వచ్చారు .

మిగిలిన  ఋషుల అభిప్రాయాన్ని మన్నించని శాకల్యుడు  వారికి వెర్రి ముదిరిందని, అదంతా అతని మాయాజాలమని కొట్టిపారేసి, తనపై కోపంతో గురుకులం నుంచి వచ్చి, ఇక్కడ తానేదో వెలగబెడుతున్నాడని అన్నాడు, అప్పుడు ఆ ఋషులు తమలో తాము యాజ్ఞవల్క్యుడు తమ వేదాన్ని అపహాస్యం చేయనే లేదని, తాముకాని తమ శిష్యులు కానీ అయన చేసే విమర్శలకు  సమాధానం చెప్పలేక తలది౦చుకోవాలని అనుకొని ‘’మంత్రం బ్రాహ్మణం వేర్వేరుగా ఉండాలా? స్వరం మొదలైన భేదాలు లేకుండా ఒకటిగానే ఉండాలా? ఒకటిగా ఉంటే, మంత్రం అని  బ్రాహ్మణం  అని రెండు పేర్లెందుకు? మంత్రం అంటే, బ్రాహ్మణం అంటే ఏమిటి? శాస్త్రాలలో రెండిటికీ భేదం చూపించారా లేదా? బ్రాహ్మణం మంత్రానికి వ్యాఖ్యానం అవుతు౦దా కాదా? కాదు అంటే బ్రాహ్మణం లో ‘’ఇషేత్వా ‘’మొదలైన మంత్ర ప్రతీపకాలకు ఎందుకు వ్యాఖ్యానం చేశారు? ఇదికాదు అంటే నేరం కాదా? పోనీ  బ్రాహ్మణం అయినా మనకు సమగ్రంగా ఉందా?లేదుకదా. అలాఉంది అంటే ‘’పరాయాతం ‘అనే పేరు మన బ్రహ్మణ౦లో కొంతభాగానికి ఎందుకొచ్చినట్లు? మన బ్రాహ్మణాలలో కొన్నిభాగాలను ‘’కాఠకాలు ‘’అని ఎందుకు పిలుస్తారు? ఇది కఠశాఖ నుంచి రాలేదని చెప్పగలమా? మంత్రానికి మంత్రం, బ్రాహ్మణానికి బ్రాహ్మణం వేర్వేరుగా లేకపోవటం మన వేదానికే కాని రుగ్వేదాదులకు ఉందా? లేదుకదా? వాటికి బ్రాహ్మణాలు సంహిత లతో కలిసి ఉండకుండా ప్రత్యేకంగా ఉన్నాయికదా? అన్ని వేదాలకు  మంత్ర బ్రాహ్మణం స్వరం మొదలైన భేదాలతో వేటికవి అలా ప్రత్యేకంగా ఉంటే, వేదానికి మాత్రం అలా లేకపోవటాన్ని ఏమనాలి ? అది అలాఉండనీ –

‘’క్రియలన్నీ మంత్రాలతోనే చేయాలా? మంత్ర వ్యాఖ్యానాలైన బ్రాహ్మణాలతో చేయాలా ? దీనిపై స్పష్టత లేదుకదా? అలాయితే శాస్త్ర విరుద్ధమవుతుంది. అన్ని క్రతువులు మంత్రాలలో అంటే సంహితలలో ఉన్నాయా? ఉన్నాయంటారా? సౌత్రామణి, పురుషమేధం సంహితలలో ఎక్కుడున్నాయో చెప్పగలమా? పైగా సర్వ మేధం, పితృ మేధం, ప్రవర్గ్యలు మనకు బ్రాహ్మణాలలో కనిపించవుకాని, ప్రత్యేకభాగాలుగా ఉన్న ఆరణ్య కాలలో ఉంటాయికదా.  ఆరణ్య కానికి యేమని అర్ధం చెపుతాం? అరణ్యాలలో అధ్యయనం చేసినందుకే కదా వాటికి ఆరణ్యకాలు అనే పేరొచ్చింది? దీనికి సార్ధక్యం ఉందా? మనకు’’శుక్రియ ‘’ భాగం సంహితలో ఉందా? లేదే. శుక్రియలంటే సూర్యుడు ఉండగా పఠించే మంత్రాలుకదా? ’’అని తర్జన భర్జన పడ్డారు. ఇంకా సందేహాలు తీరక ప్రశ్నించుకొన్నారు. 

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -8

అందులో చూడభాగుడు ‘’ఐతే ఆయనతో కలిసి ఉండాల్సి౦దేనా?  ఆయనకు శాపం ఉందని కల్పించితే ఏమౌతుంది? ’’అని ప్రశ్నించాడు. దానికి ఋషులు ‘’అది తుచ్చ మైన పని అవుతుంది . ఆ శాపం శ్రుతి రూపమైనదా, స్మృతి రూపమైనదా లేక పురాణ రూపమైందా? అని ఆయన శిష్యులు మనల్ని ప్రశ్నిస్తే మనదగ్గర సమాధానం లేక దిక్కులు చూడాల్సి వస్తుంది. వాళ్ళ చెవిన ఈ మాట పడితే మన నోళ్ళు మూయి౦చేవారు. అప్పుడు మేము అంగీకరించవలసి వచ్చేదికదా. అయినా అద్దం చేతిలోనే ఉంటె దిక్కులు చూడటం దేనికి? ఆయన్నే ప్రశ్నించి విషయం సాకల్యంగా తెలుసుకొందాం ‘’ అన్నారు .

ఋషులంతా యాజ్ఞవల్క్యుని చేరి ‘’అశన, అనశన వ్రతం గురించిమాట్లాడుకొందాం ‘’అనగా   ‘’ సానయసుడాషాహ్లూడుడు’’ అనశనుడై  వ్రతం చేయాలి. కారణం దేవతలు మానవ హృదయాన్ని గ్రహించగల నేర్పరులు. అనశన వ్రతం ఆచరించే వాడు తమను యజి౦పగలడని వాడి ఇంటికి వస్తారు. అప్పుడు వాడి ఇల్లు ‘’ఉపవసధం ‘’అవుతుంది .కనుక ఇంటికి అతిధులుగా వచ్చిన దేవతలకు పెట్టకుండా భోజనం చేయటం పాపమే అవుతుంది. కనుక వాడు రాత్రి భుజి౦పకూడదు .’ ’అన్నాడు. దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’అది సరికాదు. భోజనం చేయకపోతే పితృ కార్యం చేసే అర్హత కలవాడౌతాడు. తింటే ఉపవాసమున్న దేవతలకు పెట్టకుండా తిన్నవాడౌతాడు. కనుక దీవతలకు నివేది౦చాల్సిన పని లేకుండా తినదగిన పదార్ధాలు తింటే దోషం రాదు . అంటే వృక్షాల ఫలాలు తింటే ఏ దోషం అంటదు. పితరులను యజించేటప్పుడు ఫలాలూ తినరాదు .’’ అన్నాడు వార్ష్ణు డు, బర్కువు ‘’మినపరొట్టె (గారెలు )వండి తినవచ్చు ‘’అన్నారు. మహర్షి ‘’తినకూడదు మినప రొట్టెలో  కలిపే బియ్యం పిండి మూడు నాలుగు యామాలలో అధికమౌతుంది కనుక తిల మాషాదులతో (గారెలు )కలిసిన వ్రీహి (బియ్యం పిండి ) అసలు తినకూడదు. అలాతింటే వాడు ఇచ్చే హవిస్సులు దేవతలు గ్రహించరు ‘’అన్నాడు.

ఋషులు అగ్రాయణ ఇష్టి గురించి మాట్లాడుదామన్నారు. కహోళ కౌషీతకి ’’ఓషధుల రసం భూమ్యాకాశాలకు చెందినవే. కనుక ఈ రసాన్ని దేవతలకిచ్చి ఆగ్రయణత్వం చేత  భోజనం చేయచ్చు’’ అన్నాడు. దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’ఆగ్రయణం చేయటం గురించి ఒక ఆఖ్యాయిక ఉంది.  ఒకప్పుడు ఆధిక్యం కోసం దేవ రాక్షస యుద్ధం జరిగింది. రాక్షసులు మనుషులకు మృగాలకు ఆహారమైన ఓషధులను విషతుల్యం చేస్తే తిండి లేక మాడిపోతారు. అప్పుడు దేవతలకు మించిన వాళ్ళమౌతాము అనుకొని అలాగే చేశారు. పశువులు మానవులు ఆహారం లేక కుంగి కృశించారు. అప్పుడు దేవతలు యజ్ఞ౦  చేసి రాక్షసకృత్యాన్ని తొలగించారు. అప్పుడే ఋషులు కూడా యజ్ఞం చేశారు. ఆయజ్ఞ౦ ఎవరిది ఔతుందని  దేవతలు తగవులాడి పందెం వేసుకొని పరిగెత్తారు. చివరికి గెలుపు అగ్ని ఇంద్రులదే అయింది. కనుక ఆగ్రయణం ఇంద్రాగ్ని సంబంధమైనది. వారికి ద్వాదశ కపాలము పురోడాశం ఇవ్వాలి. ఆగ్రయణ ఇష్టి చేతనే దేవతలు రాక్షస కృత్యాలను మాన్పగాలిగారు. దీనికి పూర్వం దర్శ పూర్ణ  మాసలు చేయకపోయి ఉంటె, వాటిని చేశాకే ఆగ్రయణ౦ చేయాలి. కుదరకపోతే ’’జాతుస్ట్రాశ్యౌదనం ‘’(అంటే నలుగురు బ్రాహ్మణులు భుజించటానికి తగిన వంట ) వండి బ్రాహ్మణులకు పెట్టాలి. దీనికి కారణం ఉంది. దేవతలు మనుష్య దేవతలని, దేవతలని రెండు రకాలు. వేదాదులుచదివి చదివించే బ్రాహ్మణులు మనుష్య దేవులు . అగ్ని మొదలైనవారు దేవతలు .’’ అని వివరించాడు .

కొందరు ఋషులు అధ్వర్యుడే యాజ్యాన్ని చూడాలి అంటే  మరికొందరు ఋషులు యజమానే చూడాలి అన్నారు. దీనికి ‘’యజమాని అధ్వర్యుడుగా ఎందుకు ఉండరాదు? గొప్ప వరాలు పొందాలనుకొనే యజమాని మంత్రాలను ఎందుకు చదువకూడదు? అధ్వర్యుడు ఏది కోరితే అది యజమానికోసమే అవుతుంది. అందుకని అధ్వర్యుడికి శ్రద్ధ కలుగకపోవచ్చును. కనుక యజమాని అధ్వర్యుడై చూడాలి ‘’అన్నాడు యాజ్ఞ్యవల్క్యుడు .

ఋషులు ‘’అంతర్వేది లో హవిస్సు ఉంచితే దేవులను,  దేవ భార్యలను విడదీసి నట్లు ఔతుంది. వారికి యజమానిపై ప్రీతి ఉండదు. కనుక అంతర్వేదిలో హవిస్సు ఉంచరాదు’’ అన్నారు. దీనికి సమాధానంగా యాజ్ఞవల్క్యుడు ‘’యజమాని భార్య తన విధి తానూ చేయాలి. అంతర్వేదిలో హవిస్సు ఉంచినంత మాత్రాన తనభార్య అన్య పురుషునితో కలిసింది అనే మాట ఎవరూ ఆదరించరు. ఇలాంటి పిచ్చి పిచ్చి అభిప్రాయాలు వదిలిపెట్టి యజ్ఞమే వేదిగా, యజ్ఞమే యాజ్యంగా భావించి యజ్ఞాన్ని చేస్తున్నాను అంటూ అంతర్వేదిలో హవిస్సు ఉంచాలి ‘’ అన్నాడు. ప్రవీణుడైన యాజ్ఞికుడు అయిన౦దువలననే  ఋషులు చాలామంది ఉన్నా వ్యాసుడు బ్రహ్మిష్టి ఐన యాజ్ఞావల్క్యుడినే ధర్మరాజు చేసే రాజసూయయాగానికి అధ్వర్యుడిగా నియమించాడు. ఆయనే చేసిన అశ్వమేధయాగం లో అశ్వం వెంట అర్జునునితో పాటు యజ్ఞ కర్మ కుశలుడైన యాజ్ఞవల్క్య శిష్యుని శాంత్యర్ధం పంపబడ్డాడు. జనకమహారాజు తండ్రి చేసిన యాగం లో కూడా వేద దక్షిణకోసం యాజ్ఞవల్క్యుడు మేనమామ వైశంపాయనునితో తగాదా పడి దేవలుని సమక్షం లో సగం దక్షిణ పొందాడని మహాభారతంలో ఉన్నది. జనమేజయుడు దర్శపూర్ణిమాసేస్టి చేయ సంకల్పి౦చి బ్రాహ్మణులను చేయించమంటే వారంతా తిరస్కరించారు. అప్పుడు యాజ్ఞవల్క్యడు నిలబడి చేయి౦చాడని మత్స్య పురాణంలో ఉన్నది. కనుక యాజ్ఞవల్క్య మహర్షి ఉత్తమోత్తమ ఆధ్వర్యుడు అని మనకు తెలుస్తోంది.

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -9

యాజ్ఞవల్క్యుడు ఆదిత్యుని నుండి పొందిన యజుస్సులను ఇతరులకోసం సంస్థాపించి , బ్రహ్మం గురించి చింతనలో పడ్డాడు. అప్పుడు విశ్వా వసువు అనే గ౦ధర్వరాజు  ఆయన వద్దకు వచ్చి ‘’వేదాంత శాస్త్రం లో బ్రాహ్మణోక్తమైనది, సత్యమైనది ఉత్తమమైనది ఏదో తెలియజేయండి ‘’అని అడిగాడు .ఇదేకాక వేదాలను గురించి 24ప్రశ్నలు, అన్వీక్షకి గురించి మరొక ప్రశ్న ఆడిగాడు. దానికి కొంత సమయం మనసులో సరస్వతీ దేవిని ధ్యానించి యాజ్ఞవల్క్యుడు చెప్పటం ప్రారంభించాడు.

‘’ముముక్షువులకు భయం కలిగించేది, జననమరణాలు కలిగిస్తూ అవ్యక్తమైనదే విశ్వం. దానికి సత్వ రజస్ తమోగుణాలు మహత్తు మొదలైన గుణాలు కలిగిస్తుంది. అవిశ్వం అంటే నిర్గుణ పురుషుడు . అశ్వ అంటే స్త్రీ. అశ్వం పురుషుడు. అంటే ప్రకృతి పురుషులన్నమాట. ప్రకృతి అవ్యక్తం. పురుషుడు నిర్గుణుడు. మిత్రుడు పురుషుడు. వరుణుడు ప్రకృతి. జ్ఞానం ప్రకృతి. జ్ఞేయం పురుషుడు. పురుషుడు జీవుడైఅజ్ఞుడు అవుతాడు నిర్గుణుడై ’’ జ్ఞుడు ‘’అవుతాడు. క  అంటే పురుషుడు. తప అంటే ప్రకృతి. అవేద్యం ప్రకృతి. వేద్యం పురుషుడు. చలం ప్రకృతి. అది వికారం పొంది సృష్టి స్థితి లయాలకు కారణమౌతోంది. అచలం పురుషుడు. అతడు  వికారాలకు లోనుకాడు. సర్గ, ప్రళయాలకు తోడ్పడతాడు. కొందరి దృష్టిలో వేద్యం ప్రకృతి అవిద్య పురుషుడు. ప్రకృతి , పురుషులు ఇద్దరూ అజ్ఞులు, ద్రువులు, అక్షయులు, అజులు, నిత్యులు అని ఆధ్యాత్మ గతిలో  నిశ్చయం ఉన్న వారు అంటారు. సృష్టి విషయం లో అక్షయం అనేదాన్ని బట్టి అజం అయిన ప్రకృతి అవ్యయం అంటారు. పురుషుడు అక్షయుడు. కారణం క్షయం లేకపోవటమే. ప్రకృతిలోని గుణాలే క్షయమౌతాయి కాని ప్రకృతి క్షయించదు కనుక అక్షయమన్నారు విద్వాంసులు. ప్రకృతి వికారం పొంది సృష్టికి కారణమౌతోంది, మరుగు పడుతూ ఉంటు౦ది.ప్రకృతి అలాకాక పోవటం చేత అదీ అక్షయమే అనబడుతుంది ‘.

  ‘’అన్వీక్షకి వలన, గురు సుశ్రూషవలన  వేదాలను పొంది, విధులు అనుస్టిస్తూ వేదాధ్యయనం చేయాలి. వేదాలను సాంగోపాంగంగా చదివి సకల జీవరాశికి పుట్టే చోటు,,ప్రళయం లో లయించే చోటు, వేదాలన్నీ ఒక్కటై వేద్యమైన పరమాత్మను తెలుసుకోన్నవారి, వేదం ప్రతిపాది౦చ బూనినవాని ఎరుగక పొతే వారి వేద పఠనం నిరర్ధకం. అలాంటి వారు వేదాల బరువు మోసే  వాళ్ళుగానే మిగిలిపోతారు. వెన్నకావల్సినవాడు గాడిదపాలను మధిస్తే వచ్చేది కంపుమాత్రమే కానీ మీగడా వెన్న రావు. వేదాలన్నీ చదివి ప్రకృతి, పురుషుడు అంటే తెలియని వాడు మూఢమతి అనిపించుకొంటాడు. ప్రకృతి పురుషులను గూర్చి ఊరికే చింతిస్తూ ఉంటె పుట్టటం గిట్టటం మళ్ళీ పుట్టటం చావటమే జరుగుతుంది. కనుక అక్షయం అయిన యోగధర్మం అవలంబించాలి. జీవాత్మ, దానికి పరమాత్మతో సంబంధం పై ఆలోచించేవాడు నిర్గుణ పరమాత్మ దర్శనం పొందుతాడు. షడ్వింశకుడు, పంచ వి౦శకుడు వేరు అని భావించే వారు మూఢులు. జనన మరణాలకు భయపడి, జీవాత్మ పరమాత్మలకు భేదం లేదని సాంఖ్యులు, యోగులు భావిస్తారు ‘’అని సవిస్తరంగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు యాజ్ఞవల్క్యుడు.

  అప్పుడు విశ్వావసువు ‘’జీవాత్మ అక్షయం, పరమాత్మకంటే వేరుకాదు అన్నారుమీరు. దీన్ని స్పష్ట పరచండి. నేను జైగీష వ్యాధుడు, మా తండ్రి కాశ్యపులవలన ఈ విషయం విన్నాను. రుద్రాదులు చెప్పిందీ విన్నాను. వారంతా నిత్యమైన వేద్యాన్ని మాత్రమె చెబుతారు. నువ్వు మతిమంతుడవు. శాస్త్రాలలో దిట్టవు. సకల శ్రుతులకు నిధివి. నిన్ను దేవలోకం పితృలోకం శ్లాఘిస్తున్నాయి .బ్రహ్మలోక మహర్షులు, జ్యోతులకు పతి అయిన ఆదిత్యుడు నీకు ఈ జ్ఞానం బోధించారని అంటారు. నువ్వు సాంఖ్యం , యోగ శాస్త్రాల  లోనూ ప్రవీణుడవే. చరాచరాలు తెలిసిన నువ్వే ఈ జ్ఞానాన్ని విస్పష్టంగా చెప్పగలవు. కనుక చెప్పవలసింది ‘’అని అడిగాడు.

  యాజ్ఞవల్క్యుడు ‘’నీకు అన్నీ తెలుసు. కానీ తెలియనివాడివిగా ఉన్నావు. నేను విన్నది విన్నట్లు గా చెబుతాను. పంచ వి౦శకుడు అంటే జీవాత్మ అప్రబుద్ధ అయిన ప్రకృతిని తెలుసుకొంటాడు. కాని ప్రకృతి జీవుని తెలుసుకోలేదు. జీవుడు ప్రకృతిలో ప్రతిబి౦బిస్తాడు కనుక సాంఖ్యులు, యోగులు వేదం నిదర్శనంగా దీన్ని ప్రధానం అంటారు. జీవుడు  చతుర్వి౦శాన్ని అంటే ప్రకృతిని చూడ దలచి, పంచ వి౦శను అంటే ఆత్మను చూస్తున్నాడు. చూడాలనే ఉద్దేశ్యం లేకుండా షడ్వింశకుని చూస్తున్నాడు. జీవుడు తనకంటే అధికుడు లేడని పొరబాటు పడుతున్నాడు. నిజంగా వాడు చూస్తున్నా కూడా షడ్వింశకుడిని చూడడు. జ్ఞానులైన మానవులు ప్రకృతిని జీవునిగా భావించ కూడదు. నీటిలోని చేప నీటికంటే భిన్నమైనట్లే, ఆత్మ దానికంటే భిన్నుడు. పరమాత్మతో తనకున్న ఐక్యం తెలియక, ప్రకృతి సంసర్గం తో సహవాసం, స్నేహం, అభిమానాలతో సంసారం లో మునిగిపోతాడు. మమకారం వదిలేస్తే మునగకుండా పైకి తేల్తాడు. తాను  ఉండే ప్రకృతి వేరు,  తాను  వేరు అనే జ్ఞానం కలిగితే పరమాత్మ దర్శనం పొందుతాడు. ఇక పునర్జన్మ ఉండదు.

‘’  రాజా! జీవాత్మ వేరు పరమాత్మ వేరు. పరముడు జీవుడిలో అంతర్యామిగా ఉండటం వలన జీవాత్మ ,పరమాత్మ ఒకటే అని సాధువులు భావిస్తారు. అందుకే యోగులు సాంఖ్యులు చావు పుట్టుకలకు భయపడి శుచులై, పరమాత్మ పరాయణులై జీవుని చ్యుతి లేనివానిగా భావిస్తారు. జీవుడు కేవలుడై, పరమాత్మను చూసినప్పుడే సర్వ వేత్త, విద్వాంసుడు అయి పునర్జన్మ పొందడు. ద్రస్ట కు, దృశ్యానికి దృష్టికి దృశ్యానికి భేదం ఎంచనివాడే కేవలుడు, అకేవలుడు అయి పంచ వి౦శకుడు అవుతున్నాడు. ఇవన్నీ నేను విన్నవీ, కన్నవీ. నీకు అన్నీ  చెప్పాను ‘’అన్నాడు యాజ్ఞవల్క్యుడు.

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -10

      గ౦ధర్వ రాజు విశ్వావసువు యాజ్ఞవల్క్యుడు చెప్పినదానికి సంతృప్తిపడి, ఆయన మనసు ఎప్పుడూ బుద్ధి తో కూడి ఉండాలని చెప్పి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి దేవలోకానికి వెళ్ళాడు . దేవలోకం లోనూ, భూలోక, అధోలోక వాసులకూ విశ్వావసువు యాజ్ఞవల్క్య దర్శనాన్ని బోధించినట్లు మహా భారతం లో ఉంది.

  మిధిలా నగర రాజు జనకుడు  దేశాంతరం నుంచి వచ్చిన ఆరుణి కొడుకు శ్వేత కేతుడు, సత్యయజ్ఞుడికొడుకు సోమ శుష్ముడు, యాజ్ఞవల్క్యులను తన ఆస్థానానికి పిలిపించి అగ్ని హోత్ర విషయాన్ని చర్చించాడు. ముందుగా వారిని తాము అగ్ని హోత్రం ఎలాచేస్తారో చెప్పమని అడిగాడు జనకుడు. శ్వేతకేతువు తాను  అగ్న్యాదిత్యులలోనే హోమం చేస్తానని చెప్పాడు .అదెలాగా అని అడిగాడు రాజు. అతడు ‘’ఆదిత్యుడే తేజము. సాయం వేళ ఆదిత్యునికే అగ్నిలో హోమం చేస్తాను. అగ్నికూడా తేజస్సు కనుక ఆ అగ్నికోసం ఉదయం సూర్య ఘర్మం అంటే తేజస్సులో హోమం చేస్తాను. అంటే హవిస్సుచేత అగ్నిని తృప్తి చెందిస్తాను ‘’అన్నాడు. ఇలా చేస్తే ఏమిటి ఫలమని ప్రశ్నించాడు జనకుడు. శ్వేతకేతువు ‘’ఎప్పుడూ లక్ష్మి కీర్తితో కలిసిఉ౦డటమేకాక అగ్ని, ఆదిత్యుల సాయుజ్యం సమానమవుతుంది. అంటే ఐహిక ఆముష్మిక ఫలం కలవాడు అవుతాడు ‘’అని చెప్పాడు .

   సోమ శుష్ముడు ‘’తేజాన్నే తేజం లో హోమం చేస్తాను ‘’అనగా అదేట్లాని ప్రశ్నిస్తే ‘’ఆదిత్యుడే తేజం. అందుకే సాయంకాలం అగ్నిలో హవిస్సులు వేసి తృప్తికలిగిస్తా. అగ్ని తేజస్సు కనుక ప్రాతః కాలం లో అగ్ని తృప్తికిసూర్యుని యందు హోమం చేస్తాను ‘’అనగా దీనివల్లకలిగే ఫలితమేమిటి అని అడగ్గా ‘’శ్రీమంతుడు కీర్తిమంతుడు అయి వారి సాయుజ్యాన్నిఅలోకత్వాన్నీ పొందుతాడు ‘’అన్నాడు.

   యాజ్ఞవల్క్యుడు ‘’నేను ఆహవనీయాగ్నిని గార్హత్యాగ్ని నుంచి తీస్తాను. అ౦గోపాంగ సహిత అగ్నినే ఉద్దరిస్తా. అప్పుడు ఆదిత్యుడు అస్తమించటం చూసి దేవతలంతా అతని వెంట పోతారు. మళ్ళీ వారంతా నేను ఉద్ధరించిన అగ్నిని చూసి తిరిగి వస్తారు. అప్పుడు సృవాది పాత్రలు కడిగి వేదిపైఉంచుతాను‘. అగ్ని హోత్రి అయిన ధేనువు పాలు పితికి  దేవతలను చూసే నేను, నా వంక చూసే దేవతలను హవిస్సు తో తృప్తి చెందిస్తాను ‘’ ’అని చెప్పాడు. దీనికి జనకుడు సంతోషించి అతడు అగ్ని హోత్ర స్వరూపాన్ని బాగా నే అవగాహన  చేసుకొన్నాడని మెచ్చాడు. అతనికి వంద ఆవులనిస్తాను అని చెప్పి ,’’అగ్ని హోత్ర ఆహూతుల ఉత్క్రమణ కాని, ప్రతి స్టకాని, తృప్తినీ ,పునరావృత్తి, ప్రతిపక్ష లోకం కాని నీకు తెలియదు ‘’అంటూ రధం ఎక్కి వెళ్ళిపోయాడు జనకమహారాజు. రాజు తమల్ని అతిక్రమించి  అవమానపరచాడని   భావించి శ్వేతకేతువు, సోమశుష్ముడు రాజును  తమతో బ్రహ్మవాదానికి రమ్మని సవాలు చేద్దా౦ అందులో రాజు తమముందు ఓడిపోతాడు అన్నారు. దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’మనం బ్రాహ్మణుల౦. అతడు రాజు .మనమే జయిస్తే జాతి తక్కువవాడిని జయించిన వాళ్ళం అవుతాం. అతడే జయిస్తే బాపలను రాజు జయించాడని లోకమంతామనల్నే  గేలి చేస్తుంది. కనుక ఆమాట తలపెట్టవద్దు ‘’అని సలహా ఇచ్చాడు. తర్వాత యాజ్ఞవల్క్యుడు రథమెక్కి జనకుడి దగ్గరకు వెళ్ళాడు .

 ఎందుకు వచ్చావంటే అగ్ని హోత్రం గురించి తెలుసుకోవటానికే వచ్చానన్నాడు యాజ్ఞవల్క్యుడు. జనకుడు చెప్పటం ప్రారంభించాడు ‘’మహర్షీ ! ఉదయం చేసే అగ్ని హోతాహూతులు అంతరిక్షానికి పోయి ఆహవనీయం చేస్తాయి. వాయువును సమిధలుగా మరీచులను ఆహూతులుగా చేసి అంతరిక్షాన్ని తృప్తి చెందించి స్వర్గానికి పోతాయి. అక్కడే ఆహవనీయంగా ఆదిత్యుని సమిధగా చంద్రుని శుద్ధ ఆహూతిగా చేసి దివాన్ని తృప్తి చెందిస్తాయి. దివి నుండి భువికి  వచ్చి భూమినే ఆహవనీయాగ్నిగా, అగ్నిని సమిధగా ఓషధులను శుద్ధ ఆహూతులుగా చేసి భూమిని తృప్తి చెందిస్తాయి. భూమినుండి పురుషుని చేరి, అతని నోటిని ఆహవనీయంగా నాలుకను సమిధగా, అతడు తిన్న ఆహారాన్ని శుద్ధ ఆహూతిగా చేస్తాయి. ఈ విధంగా ముఖం మొదలైనవి ఆహవనీయ ఆదిత్య రూపం అని తెలిసిన పురుషునికి అగ్నిహోత్రం హుతమౌతుంది. అక్కడినుంచి స్త్రీలో ప్రవేశించి, ఆమె ఉపస్థను ఆహవనీయంగా, దారకాలను సమిధలుగా, శుక్రాన్ని ఆహతిగా చేసి స్త్రీని తృప్తి చెందిస్తాయి. కారణం ప్రజాపతి వీటి చేతనే ప్రజలను భరిస్తాడుకనుక. ఇది తెలిసిన విద్వాంసుడు మిధునాన్ని పొందుతాడు అంటే ప్రియను కలుస్తాడు. అతడి అగ్నిహోత్రం హుతం అవుతుంది. అప్పుడు స్త్రీలో పుత్రుడు పుడతాడు. ఈ పుట్టినవాడే మళ్ళీ పుట్టే లోకం. అగ్ని హోత్రం అంటే ఇదీ. ఇంతకంటే ఏమీ లేదు ‘’అని చెప్పగా యాజ్ఞవల్క్యుడు మిక్కిలి సంతోషించి జనకుని అభినందించి వరం అడగమని రాజునే కోరాడు.

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -11

సరే అని ‘’బ్రహ్మం ‘’విషయం పై చర్చిద్దామన్నాడు జనకుడు. అప్పుడు జనకుడు బ్రహ్మ అంటే  వసిస్టుడయ్యాడు. మరో సారి జనక యాజ్ఞావల్క్యులు అగ్నిహోత్రం  గురించి చర్చించారు. అగ్ని హోత్ర ద్రవ్యం గురించి తెలుసా అని రాజు అడిగాడు. తెలుసు అనగా చెప్పమంటే పాలు అన్నాడు. అవిలేకపోతే దేనితో హోమం చేస్తావని అడిగితె వ్రీహి తో అనగా, అదీ లేకపోతె అంటే ఓషదులతో  అనగా అవీ లేకపోతె అంటే నీళ్ళతో అంటే అవీ లేకపోతె ఏం చేస్తావు అని అడిగితె యాజ్ఞవల్క్యుడు ‘’సత్యాన్ని శ్రద్ధలో హోమం చేస్తాను ‘’అన్నాడు .

  ప్రకృతి మొదలైనవాటి గురించి చెప్పమని రాజు అడిగితె మహర్షి ‘’అవ్యక్తం మహస్సు, అహంకారం, పృథ్వి, నీరు, తేజము వాయువు ఆకాశం అనే ఎనిమిది ప్రకృతులు అంటారని చెవి చర్మం, జిహ్వ, ముక్కు శబ్దం స్పర్శ రూపం రసం గంధం, వాక్కు హస్తాలు పాదాలు పాయువు మేఢ్ర౦ లను వికృతుల౦టారని, వీటిలో శబ్దము మొదలైన పంచ భూతాల వలన పుట్టినవి విశేషాలు అంటారని జ్ఞానేంద్రియాలు అవిశేషాలనీ, మనసు పదహారవదిగాఆధ్యాత్మ చింతనాపరులు భావిస్తారని, ఈ మొత్తం 24లను తత్వాలు అంటారని శ్రుతులు చెప్పాయన్నాడు.

   జనకుడు నవవిధ సృస్టుల గురించి చెప్పమని అడగగా మహర్షి ‘’అవ్యక్తం అంటే మూల ప్రకృతి నుంచి మహదాత్మ పుట్టింది. ఇదే మొదటి సృష్టి .మహత్తు నుంచి అహంకారం పుట్టి బుధాత్మకమైన ద్వితీయ సృష్టి అయింది. అహంకారంనుంచి ఆకాశం మొదలైన భూతాత్మకమనస్సు  పుట్టి అహంకారిక తృతీయ సృష్టి అయింది. మనసు నుండి మహాభూతాలు అయిదు పుట్టి మానసిక నాల్గవ సృష్టి అయింది. శబ్ద స్పర్శ రస గంధ రూప మైన భౌతిక పంచమ సృష్టి ఏర్పడింది. శ్రోత్వ చక్షు త్వక్ జిహ్వ ఘ్రాణం అనే చి౦తాత్మక ఆరవ సృష్టి జరిగింది. కర్మేంద్రియాలు పుట్టి ఐంద్రియ సప్తమ సృష్టి అయింది. ఊర్ధ్వంగా పుట్టే వాయువు అంటే ప్రాణం  అడ్డంగా పుట్టే వాయువులు అంటే అపాన ఉదాన వ్యానాలు పుట్టి ఆవర్జక ఎనిమిదవ సృష్టి అయింది. తర్వాత అడ్డం గా పోయే వాయువులు అనగా సమానం దానం వ్యానం, క్రిందుగా పోయే అపానం వాయువులు పుట్టి అనార్జవం అనే తొమ్మిదవ సృష్టి అయింది ‘’ అని వివరించాడు.

  సంతృప్తి చెందిన జనకరాజు గుణాలు కాలం గురించి వివరించమని కోరాడు. యాజ్ఞవల్క్యుడు ‘’పది వేల కల్పాలు అవ్యక్త పురుషుడికి ఒక పగలు, రాత్రి కూడా అంతేపరిమాణం కలది. రాత్రి గడవగానే అతడు సకలప్రాణులకు జీవాధారమైన ఓషధులను సృష్టిస్తాడు. తర్వాత హిరణ్మయమైన అండం నుండి బ్రహ్మ౦ను సృష్టిస్తాడు. ఇతడే సర్వభూతాలకు మూర్తి. ఒక సంవత్సరకాలం ఆ అండంలోనే ఉండి, తర్వాత బయటికి వచ్చి ఆ అండంలో సగం స్వర్గంగా సగం భూమిగా చేశాడు అని వేదాలే చెప్పాయి.ఈ  రెండిటికి  మధ్య ఆకాశం ఏర్పరచాడు. ఏడు వేల ఏనూరు కల్పాలు బ్రహ్మకు ఒకపగలు అంతేకాలం రాత్రి. మహత్తు అనబడే బ్రహ్మం  అహంకారం , తర్వాత తన శరీరం నుండి నలుగురుపుత్రులు అంటే మన పితరులకు పితరులను పుట్టించాడు . జ్ఞానేంద్రియాలు అంతఃకరణ ఈ పితరులనుండే పుట్టినట్లు, చరాచర జగత్తు అంతా ఆ మహా భూతాలచేత నిండింప బడినట్లుగావింటున్నాము. అహంకారం అయిన పరమేస్టి పంచభూతాలను సృజించాడు. ఆ అహంకారం కు అయిదు వేలకల్పాలు పగలు అయిదు వేలకల్పాలు రాత్రి అవుతాయి. శబ్ద స్పర్శాదులు  పంచమహాభూతాలతోచేరుతాయి. ఈ అయిదు ప్రాణులలో చేరి స్నేహం అతిక్రమణ మాత్సర్యం కలిగిస్తాయి. ఇవి అవ్యయాలను హరిస్తాయి, గుణాల చేత పురిగొల్పబడి, ఒకదాన్ని ఒకటి చంపుతూ తిర్యక్ వ్యోమాలలో ప్రవేశించి, ఈలోకం చుట్టూ తిరుగుతాయి. వీటికి మూడువేలకల్పాలు పగలు మరో మూడు వేలకల్పాలు రాత్రి అవుతాయి. ఇంద్రియాలను పురికొల్పినప్పుడు మనస్సు అన్ని వస్తువులపైకిపోతుంది. ఇంద్రియాలు ఒకదానినొకటి కనుక్కోలేవు. మనస్సు మాత్రమే వాటిమూలంగా విషయాలు తెలుసుకొ౦టుంది. కన్ను మనసు సాయం తో రూపాన్ని చూస్తుంది. మనసు పని అయిపోతే ఇంద్రియాలపనీ ఆఖరు. కనుక ఇంద్రియాలు మనసుకు లోబడే ఉంటాయి. మనసే ఇంద్రియాలకు ఈశ్వరుడు. జగత్తులో ఉన్న 20భూతాలూ ఇవే ‘’అని చెప్పాడు.

  గంభీర విషయాలను కూడా సునాయాసంగా అరటిపండు వొలిచి చేటిలో పెట్టినట్లు చెప్పిన యాజ్ఞావల్క్యుని జ్ఞానానికి   అబ్బురపడి జనక మహారాజు భూత సృజన, సంహారం అనాదినాధుడు బ్రహ్మ ఎలా చేస్తాడని ప్రశ్నించాడు. యాజ్ఞవల్క్యుడు ‘’ రాత్రి కాగానే బ్రహ్మ నిద్రపోతాడు. భూత సంహారం కోసం ఒక రుద్ర రూపుడిని ఏర్పాటు చేస్తాడు. ఆ మహారుద్రుడు వందలకొద్దీ సూర్యులై జ్వలించే 12అగ్నులరూపం గా  మారుతాడు. తన తేజస్సుచే జరాయుజాలు అండజాలు స్వేదజాలు ఉద్భిజాలనే నాలుగు రకాల జంతువులను దహిస్తాడు ఒక రెప్పపాటుకాలంలో స్థావర జ౦గమాలన్నీ నశిస్తాయి. అప్పుడు భూమి నాలుగు ప్రక్కలకు తాబేటి చిప్పలాగా మారుతుంది . భూమిపై నాలుగు వైపులా నీటిని ప్రవహి౦ప జేస్తాడు. తర్వాత ప్రళయ కాలాగ్ని పుట్టించి భూమిని ముంచేసి, నీటిని ఇగురి౦ప జేస్తుంది. జలాలు లేకపోవటం తో ఆమహాగ్ని అంతటా ప్రజ్వరిల్లుతుంది. సప్తాగ్ని జ్వాలలను ఎనిమిది మూర్తులతో వాయువు భక్షి౦చి కిందకు మీదికి అడ్డంగా నాలుగు ప్రక్కలకు పరుగులు తీస్తుంది. అతి విస్తృతి చెందిన వాయువును ఆకాశం మింగేస్తుంది. మనసు ఉల్లాసం తో ఆకాశాన్నే మింగేస్తుంది. ప్రజాపతి మనస్సును మింగితే, అహంకారం మనస్సును మింగగా మహదాత్మ  అహంకారాన్ని మింగేస్తుంది. అప్పుడు  ప్రజాపతి, అణి మహిమాది  విభూతి సంపన్నుడైన శంభుడు మహదాత్మను మింగేస్తాడు. అతడి చేతులు ,పాదాలు నేత్రాలు శిరస్సు ముఖం చెవులుకలిగి అన్నిట్లో వ్యాపిస్తాడు. అన్ని భూతాలకు హృదయమై అంగుస్టమాత్ర పరిమితమై ఉంటాడు. అన౦తుడు మహాత్ముడు ఐన ఈశ్వరుడు ఈ విధంగా జగత్తు నంతా మింగుతున్నాడ . చివరికి అక్షయం, అవ్యయం అప్రణవం, భూత భవిష్యత్తులను సృష్టించే అనఘుడైన పరబ్రహ్మం ఒక్కటే మిగిలి ఉంటుంది ‘’అని సవిస్తరంగా సృష్టి ప్రయోగ ఉపసంహారాలను వివరించాడు.

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -12

‘’ఆధ్యాత్మ, అధిభూత అది దైవతాల గురించి చెప్పండి ‘’అడిగాడు జనకుడు. దీనికి యాజ్ఞవల్క్యుడు ‘’పాదాలు అధ్యాత్మ, గమనం అది భూతం విష్ణువు అది దైవతం. పాయువు ఆధ్యాత్మ మల విసర్జన అధిభూతం సూర్యుడు అది దైవతం. ఉపస్థ అధ్యాత్మం, దాని ఆనందం అధిభూతం, ప్రజాపతి అధి దైవం. చేతులు అధ్యాత్మ అవి చేసే పనులు అధిభూతం, ఇంద్రుడు అధిదైవం. వాక్కు ఆధ్యాత్మ. మాట్లాడటం అదిభూతం అగ్ని అధి దైవం. కన్ను అధ్యాత్మ రూపం అదిభూతం సూర్యుడు అధి దైవం. చెవి అధ్యాత్మం, శబ్దం అధిభూతం దిక్కులు అధిదిదైవాలు. జిహ్వ అధ్యాత్మ రసం అధిభూతం జాలం అది దైవతం. ఘ్రాణం అధ్యాత్మ గంధం అది భూతం, పృథ్వి అధిదైవతం . చర్మం అధ్యాత్మ స్పర్శ అదిభూతం, వాయువు అది దైవం మనస్సు అధ్యాత్మ, మంతవ్య౦ అది భూతం చంద్రుడు అదధి దైవం. ఆహ౦ కారం అధ్యాత్మ అభిమానం అదిభూతం, బుద్ధి అధిదైవం. బుద్ధి అధ్యాత్మ బోద్ధవ్యం అధిభూతం క్షేత్రజ్ఞుడు అధి దైవం. రాజా! భగవానుడిని ఆది మధ్యాన్తాలలో చూపిస్తూ విభూతులన్నిటినీ యధాక్రమ౦గా చెప్పాను .

  ‘’ప్రకృతి తనంత తాను  కోరికతో అనేకవేల గుణ వికారాలు కలిగిస్తుంది. అది దాని సహజ లక్షణం. ప్రకృతి పురుషుని యొక్క సత్వ రజస్ తమో గుణాలకు అనేక వికృతులు కలిగిస్తుంది .సత్వం ఆనందం ఉద్రేకం, ప్రీతి ఆరోగ్యం సంతోషం శ్రద్ధ క్షమా కార్పణ్యం సమత్వం, నిర్దయ , దానహీనబుద్ధి హింస వైరం, ధర్మ ద్వేషం మొదలైనవన్నీ కలిగించి మనిషిని చికాకు కలిగిస్తుంది ‘’అని చెప్పాడు.

  జనకుడు సాత్వికాది గుణాలో తేడాల విషయం స్పస్టపరచమని అడిగాడు. మహర్షి ‘’ సత్వ రజస్తమోగుణాలు ప్రకృతి గుణాలు. అవి విడిచిపెట్టకుండా లోకం లో ఉంటూనే ఉంటాయి . అవ్యక్త రూప భగవానుడు ఈ గుణాలవలననే కోటానుకోట్ల జీవ రాశులలో ఉంటున్నాడు. వీటిలో సాత్వికం ఉత్తమ౦ రాజసం మధ్యమం, తామసం అధమం. మనిషికి పుణ్యం చేత ఊర్ధ్వగతి, పాపం చేత అధోగతి కలుగుతాయి. రజస్సు సత్వంతో, తమస్సు రజస్సుతో సత్వం తమస్సుతో కలిస్తే, లేక మూడూ సమానంగా కలిస్తే కానీ అవ్యక్తమైన ప్రకృతికూడా కలుస్తుంది. అవ్యక్త పురుషుడు సత్వంతో ఉంటె దేవలోకంలోనూ, రజస్సు తమస్సు కలిగి ఉంటె మనుష్యలోకంలోనూ, రజస్సు తమస్సులతో కలిస్తే పశు పక్ష్యాదులలోను పుడతాడు. మూడిటిలోనూ కలిసి ఉంటె మనుష్యత్వం కలుగుతుంది . పుణ్య పాపాలు లేని మహాత్ములు శాశ్వత అవ్యక్త అక్షయ స్థానం పొందుతారు. జ్ఞానులు ఉత్కృష్ట జన్మ పొందుతారు. అపుడు అచ్యుత అతీంద్రియ అజ్ఞానరహిత, జన్మ మృత్యు తమోరహితం గా ఉంటారు ’’అని వివరించాడు .

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -13

  అవ్యక్తం లో ఉన్న పరమ పురుషుని స్వభావం వర్ణించి  చెప్పమని జనకుడు అడిగాడు. యాజ్ఞవల్క్యుడు ‘’పరముడు ప్రకృతిలో ఉన్నా, దాని స్వభావం పొందకుండా తన స్వభావం తోనే ఉంటాడు. సాధారణంగా అచేతనంగా ఉండే ప్రకృతి అతడు అధిస్టించినపుడు అది సృస్టించటానికి  సంహరించటానికి శక్తి కలిగిఉంటుంది ‘’అన్నాడు. జనకుడు ‘’ఆ ఇద్దరిలో ఒకరు అచేతనం గా ఎందుకు ఉంటారు. మరొకరు చేతనకల్గి క్షేత్రజ్ఞుడు అని ఎలా పిలువబడుతాడు? వివరించు ‘’అనగా మహర్షి ‘’జపాకుసుమం దగ్గరున్న స్పటికం దాని రంగులు పొందినట్లు గుణాలు పొంది గుణవంతుడు అవుతాడు. ఆ పుష్పం దగ్గర లేకపోతె శుద్ధ స్పటికంగా నిర్గుణుడై నిజ స్వభావంతో ఉంటాడు. అవ్యక్త ప్రకృతికి ఏమీ తెలియదు. స్వాభావికంగా పురుషుడికే అన్నీ తెలుసు. అజ్ఞానం చేత పురుషుడు మళ్ళీ మళ్ళీ గుణాలతో కలిసిఉంటాడు. కనుక నిజ స్వరూపం తెలియక ముక్తిపొండలేడు. ప్రకృతి యొక్క కర్తృత్వం కలవాడై ప్రకృతి ధర్మ కలవాడౌతాడు. గుణాలను ప్రసవి౦చేవాడుకనుక ప్రసవధర్ముడు అనీ, ప్రళయం కలిగించేవాడు కనుక ప్రళయధర్ముడు అనీ అంటారు. అన్నిటికీ తానె సాక్షి తనకంటే వేరేది లేనందువలన, తానె ప్రకృతి అనుకోవటం వలన ఆధ్యాత్మ విదులు అతడిని అద్వయుడు నిత్యుడు అంటారు. కారణ రూపం చేత అవ్యక్తుడు ఆస్థిరుడు కార్య రూపంలో వ్యక్తుడు. సాంఖ్యులు మోక్షానికి జ్ఞానాన్నీ, భూతదయను అవలంబిస్తారు . వారు వారు ప్రకృతికి ఏకత్వం, పురుషుడికి నానాత్వం చెపుతారు  అంటే ప్రకృతి ఒక్కటే కాని పురుషుడు అనేకం అని  వాళ్ళభావం. కాని ప్రకృతికంటే పురుషుడు వేరే. ప్రకృతి అధ్రువం అయినా ద్రువమైన దాని లాగా కనిపిస్తుంది. దీన్ని వివరంగా వివరిస్తాను.’’అన్నాడు .

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -14

యాజ్ఞవల్క్యుడు ‘’జనకరాజా ! ముండ్ల దుబ్బు, ముండ్ల గడ్డి వేరు వేరు అయినట్లే, పురుషుడు ,ప్రకృతి వేరు వేరు. వీరి పరస్పర సంయోగం వలన వేరు అనిపిస్తారు. మేడిపండుపై ఉన్న దోమ ఆపండులో భాగం కాదు. నీటిలోని చేప నీటికంటే వేరు. కుంపటి అందులోని అగ్ని వేరువేరు అని  సాంఖ్యులలభావన. ప్రకృతి, పురుషుడు భిన్నంకాదు. యోగులు ఎలా దీన్ని భావిస్తారని రాజు అడగగా మహర్షి ‘’సాంఖ్యానికి యోగానికున్న బలం లేదు. కానీ రెండూ ముక్తికి మార్గాలే. ఈ రెండు భిన్నం కాదు ఒక్కటే అని నేను భావిస్తాను. యోగులు దేన్ని దర్శిస్తారో సాంఖ్యులు కూడా దాన్నే దర్శిస్తారు. ఈ రెండిటిని ఒక్కటిగా చూసేవాడే నిజమైన తత్వవేత్త. యోగం లో ప్రాణవాయువుకేకాక ఇంద్రియాలు ప్రధాన్యముంది. ఈ రెండిటిని అణగించుకొని యోగులుఅంతటా స్వేచ్చగా సంచారం చేస్తారు. స్థూల దేహాన్ని నశి౦ప జేసు కొని అణిమాది సిద్దులతో సూక్ష్మ దేహం పొంది, ఆ దేహం లోనే అన్ని సుఖాలుపొండుతూ అన్నిటా సంచరిస్తారు. యోగం లో ఎనిమిదిగుణాలున్నాయి, ఎనిమిది అ౦గాలున్నాయి .

  ‘’ఉత్తమ యోగుల తీరు సగుణ, నిర్గుణ అని  రెండురకాలు. మనసుని పదహారింటి లో ధారణ చేయాటమే మొదటిదైన సగుణయోగం . రెండవదైన నిర్గుణం లో  ప్రాణాయామాన్నీ చిత్తాన్నీ ధ్యాత ధ్యేయం భేదం నశి౦చేట్లు ఏకాగ్రత్వం పొంది ఇంద్రియ నిగ్రహత్వంతో ఉండటం. మొదట సగుణాన్నీ తర్వాత నిర్గుణాన్నీ అభ్యాసం చేయాలి. రాత్రి మొదటి యామం లో 12 ప్రాణాయామాలు, నిద్రించాక చివరియాములో 12ప్రాణాయామాలు ఉన్నట్లు చెప్పారు . దాంతుడు, శాంతుడు ఈ 24విధాల ప్రాణాయామాలను నిరోధిస్తాడు. అప్పుడుపరమాత్మలో ఆత్మను విలీనం చేయగ లుగుతాడు. ఇంకా చాలా వివరాలున్నాయి మళ్ళీ  చెబుతా  ‘’అన్నాడు యాజ్ఞవల్క్యుడు .

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -15

చనిపోయినవాడు పొందే స్థానాల గూర్చి వివరించమని యాజ్ఞవల్క్యమహర్షినిజనకమహారాజు  అడిగాడు. ఆయన ‘’ఆత్మ-పాదాలనుంచి నిష్క్రమిస్తే విష్ణువు యొక్కయు, పిక్కలనుండి పొతే వసువుల యొక్క, మొకాలినుంచి అయితే మహా సాధ్యులయొక్క, గుదం నుండి అయితే మిత్రునియొక్క, జఘనం నుంచి అయితే భూమి యొక్క, పార్శ్వాలనుండి అయితే మరుత్తులయొక్క, నాశిక నుండి అయితే చంద్రుని యొక్క, వక్షం నుంచి అయితే రుద్రుని యొక్క, మెడనుంచి అయితే రుషి శ్రేష్టుడైన నరుని యొక్క, ముఖం నుంచి అయితే విశ్వే దేవతలయొక్క, చెవులనుంచి అయితే దిక్కులయొక్క, ముక్కునుంచి అయితే వాయువు యొక్క , కళ్ళనుంచి అయితే సూర్యుని యొక్క, కనుబొమలనుండి అయితే అశ్వినీ దేవతల యొక్క ,లలాటం నుంచి అయితే పితృ దేవతల యొక్క, మూర్ధం నుండి అయితే బ్రహ్మయొక్క స్థానాలను పొందుతారు ‘’ అన్నాడు .

‘’మనీషులు విధించిన అరిస్టాలేవి? ’’వివరించండి ‘’అని రాజు ప్రశ్నిస్తే మహర్షి ‘’కనిపించే అరుంధతి నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రాన్ని చూడలేకపోతే, దీపకాంతులు కుడిప్రక్కకు చీలినట్లు కనిపిస్తే మనిషి ఆయుర్దాయం ఒక సంవత్సరం మాత్రమె. తన ప్రతిబింబాన్ని ఇతరుల కళ్ళల్లో చూడలేకపోయినా ఏడాది లోపు బాల్చీ తన్నేస్తాడు. తనలోని కాంతిని, అతి ప్రజ్ఞను , తనస్వభావం లోపలాబయటా మారితే, అరునెలలే బతుకుతాడు. దేవతలను పూజించక బ్రాహ్మణులతో వైరం పెట్టుకొంటే, నల్లని రంగు తెల్లబడితే బతుకుఇక ఆరునెలలే. చంద్ర బి౦బ౦ లోకాని, సూర్య బింబం లోకాని సాలెపురుగు అల్లికలో లాగా రంద్రాలున్నట్లు కనిపిస్తే వారంకంటే బతకడు. దేవాలయం లో సుగంధం శవగంధంగా అనిపిస్తే వారంలో ఖాళీ. చెవులు ముక్కు వాలిపోయి, పండ్లు చూపులు వసివాడితే, సంఖ్యజ్ఞానం మర్చిపోతే, లోపలి వేడి చల్లారిపోతే వెంటనే చావు ఖాయం. అకస్మాత్తుగా ఎడమకంటి నుంచి నీరు ధారగా కారటం, తలనుండి పొగవచ్చినవాడు ఆరోజే టపాకడతాడు. కనుక పగలు రాత్రి తన ఆత్మను పరమాత్మలో అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే  మృత్యుంజయుడు అవుతాడు . ఆత్మజ్ఞానమున్నవాడు సాంఖ్యుల పధ్ధతి ప్రకారం ఆత్మను పరమాత్మతో యోచన చేసి చావును జయిస్తాడు. చివరికి అక్షయ అవ్యయ శాశ్వత స్థానం పొందుతాడు ‘’అని వివరించాడు ‘ జనకుడు అవ్యక్త పరబ్రహ్మ గురించి వివరించమని కోరగా యాజ్ఞవల్క్యుడు – ‘’నేను సూర్యుని ఆరాధించి శుక్ల యజుర్వేదాన్ని పొంది శిష్యులకు బోధించి, బ్రహ్మ ను గూర్చి చి౦తిస్తుంటే విశ్వావశువు వచ్చి ప్రశ్నించగా, ఆయనకు చెప్పినదంతా నీకు బోధిస్తాను అని చెప్పిబోధించి  ద్విజాదులవలననే మోక్షసాధన జ్ఞానం పొందవచ్చు ‘’అన్నాడు .

 ఒక రోజు జనకుడు గౌతమ రాహూ గణుడు ‘’వేదాంగాలు బాగా తెలిసి ఎవరు ఇష్టి చేసి దాని ఫలితం పొందారో తెలుసుకొని. వాళ్లకు వెయ్యి బంగారునాణాలు ఇస్తాను ‘’అని అంతటి విశిష్ట వ్యక్తీ యాజ్ఞావల్క్యుడే అని గ్రహించి తాను  అన్నధనాన్ని ఆ మహర్షికిచ్చి సంతృప్తి చెందాడు. ఆయనతో ఆయన బహుముఖ ప్రజ్ఞాపాటవాలను ఋషులవలన విని కొంత తాను ఆయనతో చర్చి౦చి కొంతా తెలుసుకొన్నానని, కర్మ బ్రహ్మలను గురించి పూర్తిగా తెలిసినవాడు ఆయనే అని, లోకోద్ధరణకు ఉద్భవించిన అవతార పురుషునిగా తాను ఆయనను భావిస్తానని వినయంగా చెప్పి తనను శిష్యునిగా స్వీకరింఛి మోక్షమార్గం ప్రసాదించమని  యాజ్ఞవల్యుని ప్రార్ధించాడు. 

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -16

మహారాజు కోరికకు  మహర్షి యాజ్ఞవల్క్యుడు ‘’సార్వభౌమా! లోకం లో ఒకరిని మించినవారొకరుంటారు. అన్ని విధాలా అధికుడైనవాడినే గురువుగా చేసుకొని బ్రహ్మ విద్య నేర్వాలి. కురు , పాంచాల దేశాలలో ఎందరో అలాంటి మహానుభావులున్నారు. వారిని పిలిపించి ఎంచుకొంటే గొప్ప గురువు లభించకపోడు ‘’అనగా ‘’లోకమంతా ఆరాధించే మీరు తప్ప అన్యగురువులెవరు‘’? అనగా ‘’ఏదైనా నిండు సభలోనే తేలాలి ‘’అన్నాడు మహర్షి. అలా అయితే అందరూ  వచ్చే మార్గం తెలియజేయమని అడుగగా ‘’సార్వ భౌముడు చేయాల్సిన బహుదక్షిణయాగం చేయి. చక్రవర్తి తలపెట్టి యాగం చేస్తుంటే అందరూ తమంతట తామే వస్తారు ‘’అన్నాడు. సరే అన్నాడు జనకుడు. 

యాగ సంభారమంతా సిద్ధం చేసుకొని మంత్రి మిత్రయుని కురు, పా౦చాల దేశాలలోని విప్రులనందర్నీ సగౌరవంగా ఆహ్వానించామని చెప్పాడు,. అలాగే ఆహ్వానించాడు మంత్రి .మైత్రేయుని కుమార్తె బుద్దిమతి అయిన మైత్రేయి ఉంది. ఆమె పెదతల్లి  గార్గి ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించి బ్రహ్మవాదిని ని చేసింది.  బ్రహ్మ వేత్తలంతా సమావేశమయ్యారు.  అందులో అశ్వలాయనుడు ‘’మా అందరిలో నువ్వే బ్రహ్మ వేత్తవా? ’’అని అడిగాడు దానికి యాజ్ఞవల్క్యుడు ‘’నేను బ్రహ్మ వేత్తనుకాను. హౌత్రార్ధం గోవులు కావాలనే వచ్చివాటిని తోలుకుపోతున్నాను. అంతేకాని బ్రహ్మిస్టఅనుకొనినికాదు అన్నట్లుగా చెప్పగా ఆశ్వలాయనునికి ధైర్యం వచ్చి వాదానికి దిగాడు.

అశ్వలాయనుడు ‘’యాజ్ఞవల్క్యా! యజ్ఞం అంతా మృత్యువుతో వ్యాప్తి చెందింది. యజమాని దాని వ్యాప్తిని ఎలా అధిగమిస్తాడు?’’ అని ప్రశ్నించాడు. మహర్షి ‘’యజమాని వాక్కే హోత, అగ్నికూడా .అగ్నినే హోతగా భావించి కర్మ సాధనాలన్నీ హోతాగ్నులకు అది దేవత అయిన అగ్ని రూపంతో చూడటమే అతి ముక్తి ‘’అన్నాడు. అశ్వలాయనుడు ‘’యజమాని అహోరాత్ర వ్యాప్తిని ఎలా అదిగమించగలడుడు?’’ అనగా  ‘’అధ్వర్యుడు అనే నేత్ర రూపుడైన సూర్యుని మృత్యువు అతిక్రమిస్తాడు కనుక ఆదిత్యుడే ముక్తి అతిముక్తీ కూడా. ఆధ్వర్య ఆదిత్యుల నిద్దర్నీ ఆదిత్యునిగా చూడటమే మృత్యువును అతిక్రమించటం. అధ్వర్యుడు అంటే యజుర్వేదం బాగా తెలిసిన ఋత్విజుడు ‘’అన్నాడు. అశ్వలాయనుడు ‘’అంతా శుక్ల కృష్ణ పక్షాలచేత స్వాధీనమై ఉన్నాయికదా , దాని వ్యాప్తిని ఎలా అతిక్రమించాలి?’’ అన్న ప్రశ్నకు మహర్షి ‘’యజమాని అయిన ఉద్గాత, ఋత్విజుడు వాయు రూప ప్రాణం చేత మృత్యువును అతిక్రమించి ప్రకాశిస్తారు. యజమాని ప్రాణమే ఉద్గాత. అదే వాయువు. అదేఉద్గాత . అదే ముక్తి అదే అతిముక్తి ‘’అన్నాడు .

‘’ఆకాశానికి ఆధారం లేదుకదా, యజమాని దేని నాధారంగా స్వర్గాన్ని అతిక్రమిస్తాడు ‘’అడిగాడు అశ్వలాయనుడు. ’’బ్రహ్మ ఋత్విజుడు, మనసు అయిన చంద్రుని చేత స్వర్గాన్ని అతిక్రమించి ముక్తుడౌతాడు. యజమాని మనస్సు బ్రహ్మ అనే ఋత్విక్కు. ఆ మనస్సు చంద్రుడు. ఆ చంద్రుడే బ్రాహ్మణే ఋత్విజుడు అతడేముక్తి అతిముక్తి ‘’అన్నాడు. ’’ఇప్పు’’డీ యజ్ఞం లో హోత ఎన్ని రుగ్మంత్రాలతో హోత్రం చేస్తాడు?’’ అనగా ‘’మూడిటితో’’అనగా అవేవో చెప్పమంటే ‘’మొదటిది పురోను వాక్యం అంటే యాగం కంటే ముందు చెప్పే రుగ్వేదమంత్రాలు. రెండోది యాజ్య అంటే యాగం లో ప్రయోగం కోసం చెప్పేఋగ్వేద మంత్రాలు, మూడవది శన్య  అంటే యాగం లో శస్త్రం కోసం చెప్పే మంత్రాలు’’ అని బదులిచ్చాడు. ఈ మూడిటితో దేన్ని  జయిస్తాడు అనిఅడుగాగా సకల ప్రాణి సముదాయాన్నీ జయిస్తాడు ‘’అనగా ‘’ఇప్పుడీ యాగం లో ఎన్ని హుతులను వ్రేలుస్తారు ‘’అని ప్రశ్నిస్తే ‘’మూడు అనగా అవేమిటి అంటే ‘’బాగాప్రకాశించే సమిధాహుతులు, బాగా శబ్దం చేసే మాంసం మొదలైనవి, భూమికి౦దికి  పోయే పయస్సు సోమాహుతులు ‘’అన్నాడు. వీటితో దేన్ని  జయిస్తాడు అనే ప్రశ్నకు ‘’మొదటి ఆహుతులతో దేవలోకాన్నీ, రెండవదానితో పితృలోకాన్నీ, మూడవదానితో మనుష్య లోకాన్నీ జయిస్తాడు ‘’అని చక్కని సమాధానాలు చెప్పాడు. ఇంతలో కురుపా౦చా ల దేశాలలోని బ్రాహ్మణ్య  గణ౦  యాగం ఆహ్వానం తో  గుంపులు గుంపులుగా యాగ శాలకు చేరుకొనగా, యాజ్ఞావల్క్యుని మేనమామ శాకల్యుడు, ఆయన  ముఠావాళ్ళు యాజ్ఞవల్క్యుని ఎలాగైనా ఓడించి పరాభవించాలని అత్యుత్సాహం తో చేరారు . 

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -17

  మేనల్లుడిపై మాటల విషం కక్కుతూ శాకల్యుడు అక్కడి రుషిగణంతో ‘’తానొక్కడే విద్వాంసుడను అనే గర్వతో యాజ్ఞవల్క్యుడు ప్రవర్తిస్తూ మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు. ఇప్పుడు జనకమహా రాజుఆహ్వాన పై కురు పాంచ దేశాలను౦ డి ఎందరెందరో వేదవిదులు వచ్చారు. వారి ముందు అతడిని ప్రశ్నించి ఎండగడదాం ‘’అన్నాడు ఒక రోజు మహారాజు వెయ్యి ఆవులను అక్కడ నిలిపి, ఒక్కో ఆవుకొమ్ముకు ‘’పదేసి పాదాల బంగారం ‘’కట్టించి నిలబెట్టించి ‘’మీలో బ్రహ్మిస్టు   డైనవాడు ఈ గోసహశ్రాన్ని హాయిగా ఇంటికి తోలుకుపోవచ్చు ‘’అని ప్రకటించాడు. ఎవరికివారు వితర్కి౦చు కొని తమ అర్హతను బేరీజు వేసుకొని తమకు అంత ‘’దృశ్యం ‘’లేదని గ్రహించి   వాటిని తోలుకుపోవటానికి సాహసించి ముందుకు రాలేదు .

  అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి తనదగ్గర సామవేదం చదువుతున్న ‘’సోమ్యుని తో ‘’ఆవులను మన ఇంటికి తోలుకు వెళ్ళు ‘’అని పురమాయించగా, అతడు తోలుకు పోతుంటే సభ్యులు గుంజాటన పడుతూ ప్రశ్నించే ధైర్యం లేక కకావికలయ్యారు. అప్పుడు యాగానికి హోత అయిన అశ్వలాయనుడు ‘’యజ్ఞం లో బ్రహ్మ అనే ఋత్విజుడు దక్షిణంలో బ్రహ్మాసనంపై కూర్చుని ఎందరు దేవతలచేత యజ్ఞాన్ని కాపాడుతున్నాడు ?’’ అని ప్రశ్నించగా యాజ్నవల్క్యుడు ‘’ ఒక్క దేవతతో ‘’అని చెప్పగా, ఆదేవత ఎవరు అని అడిగితే ‘’మనస్సు ఆ దేవత. మనస్సు అనంతమైనది దేవతలూ అన౦తమైనవారు. బ్రహ్మ , ఋత్విజుడు మనస్సు లో విశ్వే దేవ దృష్టితో ధ్యానించటం చేత అనంతమైన లోకాన్నే జయిస్తున్నారు ‘’అన్నాడు.

   అశ్వలాయనుడు ‘’ఈయజ్ఞ౦లొ ఉద్గాత ఎన్ని స్తోత్రియాలను స్తుతిస్తున్నాడు?’’ అనగా ‘’మూడు ‘’ అని చెప్పగా అవేమిటి అంటే పురోను వాక్యాదులు ‘’అనగా అవి కర్తలో ఎలా ఉన్నాయని అడిగితె ‘’ అధ్యాత్మం లో ప్రాణమే పురోను వాక్యం. అపానమే యాజ్య , వ్యానమే శన్య ‘’అనగా పురోను వాక్యాలతో కర్త దేన్ని  జయిస్తాడని ప్రశ్నించగా ‘’పురోను వాక్యాలతో భూలోకాన్నీ, ఆజ్య చేత అంతరిక్షాన్నీ, శన్య చే భూలోకాన్నీ జయిస్తాడు ‘’ అంటూ తడబాటు లేకుండా యాజ్ఞవల్క్య మహర్షి సమాధానాలు చెప్పాడు. ఇక ప్రశ్నించటానికి ఏమీ లేక అశ్వలాయనుడు మాటాడకుండా ఉండి పోయాడు.

అశ్వల బ్రాహ్మణాశయం

జనులు అజ్ఞానం తో యజ్ఞ కామ్య కర్మలమీదే ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ యజ్ఞాన్ని ఆధ్యాత్మికంగా ఎలా అన్వయించి చెపుతాడో చూద్దామనుకొని అశ్వలాయనుడు ఆ విషయమై ప్రశ్నించాడు. మహర్షి ఆధ్యాత్మ యజ్ఞమే యజ్ఞం. ద్రవ్యమయ యజ్ఞం యజ్ఞం కాదు అని నిరూపించి చెప్పాడు. యజ్ఞ సాదృశ్యం వలన ద్రవ్యాలతో చేసే యజ్ఞంలో హోత అధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మ, అనే నలుగురు ఋత్విజులే కాక యజమాని అయిదవ వాడుగా ఉంటాడు. వాక్కు చక్షువు కర్ణం మనస్సు నాలుగూ నలుగురు ఋత్విజులు. అవి పవిత్రం అయితే వాటి అధిదైవతాలైన అగ్ని ఆదిత్యుడు, వాయువు చంద్రుడు అనే పేర్లతో పిలువబడుతారు. అప్పుడు యజమాని అయిన ఆత్మకు మోక్షం కలగటానికి అభ్యంతరం ఉండదు. అప్పుడే పురుషుడు జ్ఞాని అనిపించుకొంటాడు. మృత్యువు మొదలైనవి జ్ఞానిని బంధించలేవు. దేవ, పితృ మనుష్యులు ఈ శరీరం లోని భాగాలే. శిరస్సు దేవలోకం. మధ్య శరీరం పితృ లోకం. కటికి కిందిభాగం మనుష్యలోకం. దిట్టమైన బ్రహ్మవలననే యజ్ఞం సాంగం అయినట్లుగా, మనసు వివిధ విషయాలపైకి పోనీయకుండా నిలిపితేనే ఆత్మ అనే యజమానికి మోక్షం లభిస్తుంది ‘’అని తగిన సంతృప్తికరమైన సమాధానం చెప్పాడు యాజ్ఞవల్క్యుడు .

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -18

జరత్కార గోత్రుడు, రుతభాగుని కొడుకు ఆర్తభాగుడు యాజ్ఞవల్క్యుని ‘’గ్రహాలెన్ని? అతి గ్రహాలెన్ని‘’? అని అడిగాడు. గ్రహాలూ అతిగ్రహాలు ఎనిమిదేసి అన్నాడు మహర్షి. వివరించమని కోరగా యాజ్ఞవల్క్యుడు ‘’’ఘ్రాణ ఇంద్రియమే గ్రహం. దానికి సంబంధించిన గంధమే అతి గ్రహం. లోకం నిశ్వాస వాయువు చేత తీసుకోబడి వాసన అనుభవిస్తుంది. వాగింద్రియమే గ్రహం. అది వ్యక్తం చేసేదే అతి గ్రహం. వాగింద్రియగ్రహం వ్యక్తం చేసేఅతిగ్రహంతో వ్యాప్తి చెందుతుంది. నాలుక గ్రహం దానికి చెందిన రసం అతిగ్రహం. నాలుక రసం చేత వ్యాపిస్తుంది. కన్ను గ్రహం రూపం అతి గ్రహం. చెవి గ్రహం, వినికిడి అతిగ్రహం. మనసు గ్రహం. కాలం అతిగ్రహం. హస్తద్వయం గ్రహం. కర్మ అతిగ్రహం. చర్మం గ్రహం. స్పర్శ అతిగ్రహం. ఈ ఇంద్రియాలవలననే సుఖదుఃఖాలు కలుగుతాయి ‘’అని స్పష్టంగా చెప్పాడు.

‘’మృత్యువునకు అన్నీ ఆహరం కదా ఆ మృత్యువు ఏ దేవతకు అన్నం అవుతోంది? ’’అని అడగగా మహర్షి ‘’అగ్నియే మృత్యువు. అది ఉదకాలకు అన్నం అవుతోంది. పరబ్రహ్మ వేత్త అయిన పురుషుడు మృత్యువును జయిస్తాడు ‘’అని చెప్పి మళ్ళీ దానికేది మృత్యువు అనే ప్రశ్న పరంపర రాకుండా కట్ చేసి ఉపాయంగా బ్రహ్మానికి మృత్యువు లేదు అని ఖండితంగా చెప్పి ఆరకమైన ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టించాడు. ఆర్తభాగుడు మళ్ళీ ‘’బ్రహ్మవేత్త అయిన పురుషుడు మృతి చెందితే అతడి ప్రాణాలు లేచిపోతాయా పోవా ?’’ అని అడిగాడు. యాజ్ఞవల్క్యుడు ‘’పురుషుని ప్రాణాలు ఇక్కడే పరమాత్మలో లీనమవుతాయి. అతడు నిద్రిస్తాడు. బాహ్యవాయువు చేత పూరి౦పబడి, మరణం పొంది పడుకొని ఉంటాడు. అంటే సంసార బంధ విముక్తుడు ఎక్కడికీ పోడనీ లోకమంతా వ్యాపించి ఉంటాడని భావం ‘’అన్నాడు. ‘’ బ్రహ్మ వేత్త ఐన పురుషుడు మరణిస్తే అతడిని విడువకుండా ఉండేది ఏది?’’. ఆర్తభాగుని ప్రశ్న. యాజ్ఞవల్క్యుని సమాధానం – ‘’అతడిని విడువకుండా ఉండేది పేరు. నామాలు అనంతం విశ్వేదేవులూ అనంతమే. అంటే గొప్పవారు మృతి చెందినా వారి పేరు ప్రఖ్యాతులు నిలిచే ఉంటాయని భావం. బ్రహ్మవేత్త కాని వాడు మరణిస్తే? అనే ప్రశ్నకు మహర్షి ‘’అజ్ఞాని మళ్ళీ మళ్ళీ పుట్టటానికి కొందరు స్వభావమని కొందరు యాదృచ్చికమని, కర్మ, దైవం అని అంటారు. దీన్ని జనసమూహంలో నిరూపించటం కుదరదు.’’ అన్నాడు. ఇద్దరూకలిసి ఒక  ఏకాంత  ప్రదేశం లో చర్చించారు. చివరికి అజ్ఞాని అయిన పురుషుడు దేహేన్ద్రి యాదులు పొందుతాడని నిశ్చయించారు. దేహాంతర ప్రాప్తికి కర్మమే ముఖ్యకారణమని తేల్చారు. చివరగా యాజ్ఞవల్క్యుడు పుణ్య కర్మలతో పుణ్యం పొందినవాడు బ్రహ్మణాది జన్మలను, పాపకర్మలతో పాపాత్ముడైనవాడు కుక్క పంది మొదలైన జన్మాలు పొందుతాడు ‘’అని చెప్పగానే ఆర్తభాగుడు ఇక ప్రశ్నించలేదు.

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -19

లహ్యుని పుత్రుడు భుజ్యుడు ‘’మేము అధ్యయనం కోసం వ్రతం చేస్తూ, మద్ర దేశం లో కసి గోత్రజుడు పతంజలి ఇంటికి వెళ్లాం. అతని కూతురు అమానుష గాంధర్వ గ్రహా ష్టయైఉంటుడగా అతడిని ఎవరు అని అడిగితె తాను  ఆంగీరస గోత్రజు డైన సుధన్వుడను అని చెప్పాడు. అతడి గురించి తెలుసుకోవాలని ‘’పరీక్షిత్ కొడుకులు ఏ లోకం లో ఉన్నారు? అని అడగగా అతడు వారెక్కడ ఉన్నదీ సవిస్తరంగా వివరించాడు. యాజ్ఞావల్క్యా పారీక్షితులు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పగలవా?’’అని అడిగాడు . ’’వాళ్ళు అశ్వమేధ యాగం చేసిన వారు పోయే లోకానికి పోయారని మీకు ఆగంధర్వుడు చెప్పలేదు కదా?’’ అని ఎదురు ప్రశ్నవేశాడు యాజ్ఞవల్క్యుడు. ’’అశ్వమేధం చేసేవారు ఎక్కడికి పోతారు? ’’భుజ్యుని ప్రశ్నకు మహర్షి ‘’ప్రాణుల కర్మఫలం అనుభవించే స్థానం ,విరాట్ పురుషుని శరీరం లోకాలోక పర్వతం చేత  చుట్టుకోబడి ముప్ఫైరెండు దేవ రధాహ్మ్యముల పరిమితి కలిగి ఉంటుంది. దీనికి రెండింతల పరిధితో భూమి చుట్టుకొని ఉంటుంది. వీటిని చీల్చుకొని అశ్వమేధయాగం చేసినవారు పోతారు  ‘’అని చెప్పగా ‘’ఆ రంధ్రం పరిమాణం యెంత?’’ అని ప్రశ్నించగా ‘’క్షురకుని కత్తివాయి యెంత పరిమాణం ఉంటుందో అంత సూక్ష్మ పరిమాణం ‘’అన్నాడు. ఈ మార్గం ద్వారా పరమేశ్వరుడు పరీక్షిత్ కొడుకులు భీమ సేన, ఉగ్రసేన, శ్రుత సేన లను పక్షి రూపం లో మోసుకు పోయి, లోపలా బయటా సమష్టి వ్యష్టి రూపంలో ఉన్న వాయువుకు అప్పగించాడు. వాయువు వారిని తనస్వరూపంగా మార్చుకొని అండకపాలం మధ్యలో ఉన్నఅతి సూక్ష్మమార్గం నుంచి, దాని బయట ఉండే లోకాలకు తీసుకు వెళ్ళాడు. ఇదంతా మీకు గంధర్వుడు చెప్పి వాయువును ప్రశంసించాడు కదా. ఆ వాయువు వ్యష్టి, సమష్టి రూపం అని తెలుసుకొన్నవాడు పునర్జన్మ రహితుడు అవుతాడు ‘’అనగానే భుజ్యుడు మళ్ళీ ప్రశ్నించలేదు.   ఉపనిషత్తులలో వాయువు అద్భుత గుణ శక్తి చాలక శక్తి  కలదని వర్ణించబడింది. ఇది సాధారణగాలి కాదు. భూమి, సూర్యాదులు ఏ శక్తివలన చలిస్తున్నారో అలాంటి చాలక శక్తికల వాయువు. దీనిలోనే ముక్త జీవులందరూ సంచరిస్తారు. ఈ వాయువే ఆ జీవిని నిజస్థానానికి పంపుతుంది. ఇది లేకుండా క్షణం కూడా ఉండలేము. అదే జీవనం. అదే అశ్వమేధం చేసినవారు సంచరించే స్థానం.

  జక్రుని పుత్రుడు ఉషస్తుడు. ’’కొమ్ములను బట్టి ఆవు అని చెప్పవచ్చు. శబ్దాలతో ప్రత్యగాత్మను ఎలా చెప్పగలవు?’’ అని అడుగగా ‘’దేహే౦ద్రియాలతో ఉన్న ఆత్మసర్వా౦తరమైనది ‘’అనగా ‘’సర్వానికి లోపల ఉండే ఆత్మ ఏది?’’అని ప్రశ్నించగా మహర్షి ‘’నాశికతో ప్రాణవ్యాపారం, ఉదానం తో ఉదాన వ్యాపారం, ఏది చేస్తుందో అదే లోపలుండే విజ్ఞానమయమైన ఆత్మస్వరూపం. అంటే దేహం ఇద్రియాదులకు విలక్షణమైన విజ్ఞానమే ఆత్మచేత అధి స్టింపబడి ప్రాణమున్న మనుష్యాదులచేత రధం మొదలైన వాటికి చలనం కలిగినట్లు కలిగిస్తుంది. దేహెంద్రియాది సముదాయం కంటే ఆత్మ వేరైన విజ్ఞానం కలిగి ఉంటుంది. ఈ ఆత్మనే సమీపం, ప్రత్యక్షం, బ్రహ్మము, సర్వా౦తరము, ప్రత్యగాత్మ అనే విశేషాలతో ఉంటుంది. ఇదే సర్వా౦తర మైన ఆత్మ స్వరూపం ‘’అని చెప్పాడు.

  సమాధానం స్పష్టంగా లేదని మరింత వివరించమని కోరగా ‘’ఆవు గుర్రాలను చూసినట్లు ఆత్మను చూడలేవు, వినలేవు తలపలేవు. బుద్ధితో తెలుసుకోలేవు. ఆత్మకానిది ప్రతిదీ నశి౦చేదే. ఆత్మకంటే వేరైనా కారణ శరీరాన్ని కరణాత్మక లింగం అంటారు’’ అనగానే నోరు మెదపలేదు ప్రాశ్నికుడు.

  కుషీతుని కొడుకు కహోళుడు ‘’సన్నిహితం, ప్రత్యక్ష , సర్వాంతరం అయిన ఆత్మఏదో స్పష్టంగా చెప్పండి?’’ అని అడిగాడు.’’ఆత్మస్వరూపం సర్వా౦తరమైనది ‘’అన్నాడు.’’దాని స్వరూపం ఏది?’’ అని అడిగితె యాజ్ఞవల్క్యుడు ‘’భోజనం, ప్రాణంపై ఇచ్చ, శోక మోహ ముదిమి మృత్యువులను అతిక్రమించి  ఆత్మ స్వరూపం తెలిసి పుత్ర విత్త, లోకాలపై కోరికలేక భిక్షాటనం చేస్తున్నారు. బ్రాహ్మణుడు గురువు, ఆగమాలు పాండిత్యంలతో ఆత్మజ్ఞానం పొందిబాల్యంతో అంటే ఆత్మ విజ్ఞాన బలంతో ఉండగోరి ముని అవుతాడు. మౌనం, అమౌనం లగురించి బాగా తెలుసుకొని బ్రాహ్మణుడు అవుతాడు అంటే సర్వం బ్రహ్మ స్వరూపమే అనే జ్ఞాని అవుతాడు ‘’అని ఆత్మజ్ఞాన విషయం కూలకషంగా వివరించగా కహోళుడు మారు మాట్లాడలేదు. మొత్తం మీద మనం అర్ధం చేసుకోవాల్సింది – ఆత్మకంటే వేరైనది నశిస్తుంది. కనుక సర్వం వదిలి ఆత్మ చింతన చేస్తే ముక్తి లభిస్తుంది.

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -20

వచక్నుని కుమార్తె గార్గి, తన సహోదరి కూతురు మైత్రేయిని కూడా వెంటబెట్టుకొని వచ్చి ‘’యాజ్ఞవల్క్యా! అంతా ఉదకాలలో ఓత, ప్రోతాలుఅయ్యాయని అంటారు. ఉదకాలు దేనిలో ఓతప్రోతాలయ్యాయి?’’ అని ప్రశ్నించింది. ఇక్కడ ఓత పోతాలు అవటం అంటే వస్త్రం లో ఉండే పడుగు పేక లాగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటం. యాజ్ఞవల్యుడు ‘’వాయువులో ‘’అన్నాడు వాయువు దేనిలో?’’అంతరిక్షంలో ‘’. అంతరిక్షం దేనిలో ‘’?’’ గ౦ధర్వ లోకంలో ‘’, అది దేనిలో ?’’’’ఆదిత్యలోకంలో ‘’అది దేనిలో ‘’?’’ చంద్రలోకంలో ‘’, అది దేనిలో?’’ నక్షత్ర లోకంలో..’’ అది దేనిలో ?’’’’దేవలోకంలో ‘’అది ఇంద్రలోకంలో అది ప్రజాపతి లోకంలో, అది బ్రహ్మలోకంలో ‘’అని చెప్పాక ‘’బ్రహ్మలోకం దేనిలో ఓతప్రోతమౌతుంది‘’? అని గార్గి అడిగితె‘’గార్గీ ! న్యాయం మీరి అడగకు అలా చేస్తే నీతల పగిలిపోతుంది ‘’ అనగానే గార్గి నోరు మెదపలేదు.

  ఈ సంవాదానికి శ్రీ భాగవతుల లక్ష్మీ పతిశాస్త్రిగారు అర్ధవంతమైన వివరణ ఇచ్చారు. దాన్ని పరిశీలిస్తేనే అసలు భావం తెలిసేది.- అంతరిక్షం అంటే శరీరాకాశం. గంధర్వలోకం అంటే సూర్య కిరణాలు. వేడిలేకపోతే నీరు వాయువు ఉన్నా బీజం మొలకెత్తదు. శరీరం లోని వేడినే గ౦ధర్వ శబ్దం. జఠరాగ్ని యే ఆదిత్యుడు. చంద్రలోకం మనసు. పంచేంద్రియాలు నక్షత్రలోకం. కళ్ళు చెవులు మొదలైనవాటికి అది దేవతలే దేవలోకం. జీవాత్మ ఇంద్రలోకం. ప్రజాపతిలోకం అంటే శుభాశుభకర్మలు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ.

  అరుణ పుత్రుడు ఉద్దాలకుడు ‘’మేము పత౦జలుని  ఆశ్రమంలో యజ్ఞ శాస్త్రం చదువుతూ ఉంటె అతనిభార్య గాంధర్వ గృహీతగా ఉంటె ఎవరని అడిగితే గాంధర్వ పుత్రుడను కబంధుడను అన్నాడు. అతడుపత౦జలు నేకాక  మమ్మల్నీ ప్రశ్నించాడు.  ‘’లోకం, పరలోకం సకలభూతాలు ఏ సూత్రంతో గుచ్చబడినాయి?’’ అని అడిగితె పతంజలి తనకు తెలీదన్నాడు ‘’తర్వాత ’’అంతర్యామి అయిన పరమాత్మ తెలుసా? అని అడిగాడు. తెలుసుకోలేదన్నాడు. అప్పుడు కబంధుడు ‘’ఆ సూత్రంలో ఉన్న అంతర్యామిని కనుగొన్నవాడే బ్రహ్మవేత్త. వాడే లోకవిదుడు వేదవిదుడు. తర్వాత అతడి ద్వారా ఆ విషయాలన్నీ తెలుసుకొన్నాం. యాజ్ఞవల్క్యా! నీకు ఆ సూత్రం తెలీకుండానే గోవుల్ని స్వంతం చేసుకోవాలనుకొన్నావు. తోలుకు వెడితే తలపగిలి చస్తావు ‘’అన్నాడు.

  యాజ్ఞవల్క్యుడు ‘’ఉద్దాలకా! నాకు ఆ సూత్రస్వరూపం అంతర్యామి తత్త్వం పూర్తిగా తెలుసు ‘’అనగా ‘’ తెలుసు అంటే చాలదు ఎలా తెలుసో వివరించు ‘’అన్నాడు. మహర్షి ‘’ ఆ సూత్రం అంటే వేరే ఏదీకాదు వాయువే. వాయువే అన్నిటినీ దారంతో పూలు గుచ్చినట్లు గుచ్చుతుంది. వాయువు శరీరాన్ని వదిలేస్తే మరణమే. సంతోషించి’’ అంతర్యామి తత్త్వం వివరించమనగా ‘’అది దైవత స్వరూపాలైన భూమి నీరు అగ్ని అంతరిక్షం వాయువు ద్యులోకం ఆదిత్యుడు దిక్కులు చంద్ర తారకలు ఆకాశం అంధకారం తేజస్సు – అది భూతాలైన – సకల భూతాలూ, ఆధ్యాత్మ స్వరూపాలు ప్రాణం వాక్కు, కన్ను చెవి మనసు చర్మం విజ్ఞానం రేతస్సు ఇవన్నీదేనికి శరీరమై ఉందొ, ఏది వాటికి అంతరంగా ఉండి వాటిని నియమిస్తోందో అదే నాశనం లేని అంతర్యామి స్వరూపం. అంటే భూమి ఆకాశాలకు అంతరంగా ఉంటూ వాటినన్నిటినీ నియమిస్తూ వాటి చేత తెలియబడకుండా విలక్షణంగా ఉండే నాశరహిత అంతర్యామి స్వరూపమే ఆత్మ’’అని వివరించాడు.

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -21

గార్గి రంగ ప్రవేశం చేసి తాను రెండు ప్రశ్నలు యాజ్ఞవల్కుని అడుగుతానని, ఆయన సరైన సమాధానాలు చెబితే అతడిని ఇక ఎవరూ జయించలేరని  సభలోని వారికి చెప్పగా వారంతా అంగీకరించగా ‘’దేనిలో ద్యులోకానికి పైన, భూమికి కింద, అండకపాలానికి మధ్య ఉంటూ భూమి అంతరిక్షాలను ప్రవర్తి౦ప చేసేది చేయగలిగేది, ఏకీభవించేది అనేదాన్ని యాగాలను బట్టి చెబుతారో అది అంతా దేనిలో ఓత ప్రోతమౌతుంది?’’ అని ప్రశ్నించింది. ’’ వాయువులో ‘’అని ఠక్కున చెప్పాడు. సరైన సమాధానమే అని ‘’వాయువు దేనిలో  ఓతప్రొతమౌతు౦ది ‘’అని అడుగగా ‘’ఆకాశం లో ‘’అనగా ,అది దేనిలో అనగా ‘’అక్షరాలలో – అక్షరాస్వరూపం లావు పొట్టి రంగున్నది స్నేహం నీడ చీకటి వాయువు ఆకాశం సంగమం కాదు. రసం వాసన కళ్ళు చెవులు వాక్కు మనసు తేజస్సు లేనిది. ప్రాణం లేనిది. ముఖం, పరిమితి, రంధ్రం బాహ్యం లేనిది. దేన్నీ తినదు దేని చేతా తినబడదు. ఈ అక్షర ప్రకాశం వలననే సూర్య చంద్రులు క్రమం తప్పక సంచరిస్తారు. నిమిషాలు ముహూర్తాలు రాత్రి పగలు నెలలు సంవత్సరాలు కలుగుతాయి. నదులుకొన్ని తూర్పుకు కొన్ని పడమరకు ప్రవహిస్తాయి. దేవతలు యజమానుని, పితృ దేవతలు దర్వీ హోమాలను అనుసరిస్తారు. ఈ అక్షర తత్త్వం తెలీకుండా హోమం యాగం తపస్సు చేస్తే కర్మఫలం వలన నాశనమౌతారు. అక్షర స్వభావం తెలీకుండా చనిపోతే దీనుడై జనన మరణాల సుడి గుండం లో పడిపోతాడు. అక్షర రహస్యం తెలిస్తే బ్రాహ్మ వేత్త ఔతాడు. అక్షరం చూడబడనిది అయినాచూస్తుంది. వినబడనిదైనా వింటుంది తలపబడనిదైనా తలుస్తుంది. తెలిసికోబడనిదైనా తెలుసుకొంటు౦ది. కనుక ఈ అక్షరం కంటే వేరే ఏదీ చూసేది తలచేది తెలుసుకొనేది లేనే లేదు. ఆకాశం ఈ అక్షరం లోనే ఓత ప్రోతమౌతుంది ‘’అనగానే గార్గి పరమానందం తో అక్కడి బ్రాహ్మణులతో ‘’మీలో ఎవరూ యాజ్ఞావల్క్యుని జయి౦చేవారు లేరు కనుక ఆయనకు నమస్కరించి వెళ్ళిపోవటం శ్రేయస్కరం ‘’అని తీర్పు చెప్పింది.

కాని మేనమామ విదగ్ధ శాకల్యుడికి ‘’ఎక్కడో ‘’మండి’’దేవతలుఎందరు?’’ అని అడిగితె ‘’విశ్వ దేవ శాస్త్రం నివిత్తులో చెప్పబడినట్లు, మూడు వందలముగ్గురు, మూడువేల ముగ్గురు అనీ దేవతల  సంఖ్య చెప్పే మంత్రాన్ని నివిత్తం అంటార’’ని చెప్పాడు. తర్వాత  వీరిద్దరి మధ్య ప్రశ్నోత్తర సరళి ఇలా సాగింది – దేవతలెందరు? ముప్ఫై ముగ్గురు. దేవతలలెందరు? ఆరుగురు ‘’, దేవతలెందరు? ముగ్గురు ‘’, దేవతలెందరు? ’’ఇద్దరు ‘’, దేవతలెందరు? ’ఒకటిన్నర ‘’దేవతలెందరు? ఒక్కరు ‘’మూడువేల ముగ్గురు మున్నూతముగ్గురు దేవతలేవారు? ’’ముప్పది ముగ్గురా యొక్క విభూతియె ఆ దేవతలు. అసలు దేవతలు ముప్పది ముగ్గురే.’’వాళ్ళెవరు‘’? ’’ఎనిమిదిమంది వసువులు పదకొండు మంది రుద్రులు, 12మంది ఆదిత్యులు.’’వసువు లెవరు? ’’అగ్ని భూమి, వాయువు, అంతరిక్షం చంద్రుడు నక్షత్రాలు అనేవే వసువులు. వీటిలో వసువు  అంటే ధనం రూపం లో జగత్తు ఉండటం చేత వసువులు అని పిలువబడ్డాయి. ఈ ఎనిమిది అధీనం లోనే ధనం ఉందని  భావం ,.’’రుద్రులెవరు ?’’ పురుషునిలోని ప్రాణ అపానాది దశ ప్రాణాలు, ఆత్మ కలిసి పదకొండుమంది రుద్రులు. మరణ సమయం లో ఇవి శరీరం నుంచి లేచిపోతాయి. అప్పుడు పుత్రాది బంధు వులు రోదనం చేస్తారుకనుక రుద్రులు అనబడుతాయి. ‘’ఆదిత్యులెవరు?’’ సంవత్సరం లోని పన్నెండు నెలలే ద్వాదశ ఆదిత్యులు. ప్రాణుల ఆయువు కర్మఫలాలను గ్రహించి పోవటం వలన ఆదిత్యులు అన్నారు  .’’ఇంద్రుడు అంటే ?’’గర్జించే మేఘం ‘’ప్రజాపతి అంటే? ’దర్శ పూర్ణ మాసాది యజ్ఞమే. ప ‘’.’’స్తనయత్నువు ?’’అంటే ‘’ఆశని ‘’. యజ్ఞం అంటే?’’పశువులే యజ్ఞం .’’ఆరుగురు దేవతలేవారు? ’’అగ్ని భూమి వాయువు అంతరిక్షం ఆదిత్యుడు ద్యులోకం ‘’మళ్ళీ ఆరుగురు దేవతలలెవరు? ’’ పైన చెప్పబడినవారే ‘’ముగ్గురు దేవతలలెవరు‘’?’’మూడులోకాలే ‘’వీటినుంచే దేవతలుద్భవిస్తారు .’’ఇద్దరు దేవత లెవరు? ’’అన్నం, ప్రాణం.’’ అధ్యర్ధమైన దైవతం ఎవరు? ’’వీచే గాలి ‘’ఎందుకు అయింది? ’’వాయువు వలననే సకలం వృద్ధి పొందు తుంది కనుక.’’ఇదివరకు చెప్పిన దేవత ఏది? ’’ప్రాణమే బృహత్ స్వరూపమైన పర బ్రహ్మ౦.’’ ఈ విధంగా శాకల్య యాజ్ఞవల్క్య చర్చ కొనసాగింది. 

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -22

శాకల్యుడు ‘’ఆ  పురుషుని విశేషాలు నాకు తెలుసు .నీకు తెలిసిన వివరాలు చెప్పు ‘’అని అడిగాడు .’’శరీరం అనే విశేషణం కలవాడు పురుషుడు .ఇంకేదైనా  విశేషణం ఉన్నవాడని నువ్వు భావిస్తే అడుగు ‘’అన్నాడు యాజ్ఞవల్క్యుడు .’’ఆపురుషునికి దేవత ఎవరు ?’’అమృతం ‘’అంటే తిన్న అన్నం యొక్క రసం .తల్లిలోని రక్తానికి తండ్రిలోని శుక్రానికి ఇదే కారణం .శుక్ల శోణితమైన ఆ రసమే అమృతమే పురుషునికి దేవత .కామమే స్థానం హృదయమే ఆలోచన ,మనసే జ్యోతి అయిన ఆపురుషుని ,దేహే౦ద్రియాది సముదాయాలకు పరాయణుడుగా ఎరిగినవాడే పండితుడు .’’అనగా ఇంకా విశేషాలు చెప్పమని అడిగితె ‘’కామమయుడు .’’అనగా ‘’కామమయుడికి దేవత ఎవరు ?’’స్త్రీ వలననే కామం ప్రకాశమానమౌతు౦దికనుక స్త్రీయే దేవత .రూపమే స్థానం ,నేత్రమే ఆలోకనం ,మనస్సు జ్యోతి అవుతోందో అలాంటి పురుషుని దేహే౦ద్రియాది సముదాయానికి పరాయణుడుగా తెలుసుకొన్నవాడే పండితుడు .అంటే ఆకారాలే నివాసం నేత్రాలచే చూడటం మనస్సు అనే జ్యోతిచే సంకల్ప వికల్పాది పనులు చేస్తున్న పురుషుని దేహే౦ద్రియాదులకు ఆశ్రయం గా ఎరిగినవాడే పండితుడు ‘’అన్నాడు .ఇంకా విశేషాలు చెప్పమని అడిగితె ‘’ఆదిత్యునిలో ఉండేవాడు .’’ దేవత ఎవరు ?’’సత్యం .ఆకాశమే స్థానం .నేత్రమే అలోకనం మనస్సు జ్యోతి అయిన పురుషుని దేహే౦ద్రియాది సముదాయానికి పరాయణుడిగా తెలుసుకొన్నవాడే పండితుడు ‘’అన్నాడు .మరిన్నివిశేషాలు చెప్పమంటే ‘’ఆ పురుషుడు ప్రాతి శుత్కుడు ,శ్రౌత్రుడు అనే విశేషణాలున్నవాడు .అంటే ప్రతిదీ వినేవాడు చెవిలో పుట్టేవాడు అని అర్ధం ‘’దేవత ?’’దిక్కులే .అంధకారమే స్థానం ,హృదయమే లోకం ,మనస్సే జ్యోతి అయిన ఆపురుషుని దేహే౦ద్రియ సముదాయం కు పరాయణుడుగా తెలుసుకొన్నవాడే పండితుడు ‘’’’అదినాకూ తెలుసు .ఇంకా విశేషాలు చెప్పు ‘’అన్నాడు మేనమామ.’’ఆ పురుషుడు ఛాయామయుడు ‘’’అని మేనల్లుడు చెప్పగా ‘’దేవత ‘’?అంటే ‘’మృత్యువు ‘’అన్నాడు .అంటే అజ్ఞానికి మృత్యువే దేవత .ఇవి తెలిసినవాడే వేత్త’’.

   మళ్ళీ మళ్ళీ ప్రశ్నోత్తరాలు జరిగాయి వాటి లోని వివరాలు మాత్రమె తెలియజేస్తాను .’’అద్దం లో ప్రతి బి౦బ౦గా ఉండేవాడు .దేవత ప్రాణం .నీరే స్థానం .దేవత వరుణుడు.రేతస్సు స్థానం .పుత్రమయుడే ఆపురుషుడు .ప్రజాపతి దేవత .అంటే తండ్రి ‘’అని అన్నిటికి తగిన సమాదాలు చెప్పి చివరికి యాజ్ఞవల్క్యుడు ‘’శాకల్యా !ఈ బ్రాహ్మణులు నాతో నిన్ను తగలబెట్టించారు ‘’అనగా కోపం తారాస్థాయికి వచ్చి ‘’నువ్వు బ్రహ్మవేత్తవా ?’’అనగా ‘’దేవతలతో ప్రతిష్టితాలతో ఉన్న అన్ని దిక్కులు నాకు తెలుసు ‘’అనగా ఒక్కో దిక్కుకు దేవత గురించి ప్రశ్నించగా ‘’తూర్పుకు ఆదిత్య స్వరూపుడిని ,.ఆయన నేత్రాలలో ఉంటాడు .నేత్రం రూపం లో ఉంటుంది రూపం హృదయం లో ఉంటుంది .దక్షిణ దిక్కుకు యమదేవతా స్వరూపుడను. అతడు యజ్ఞం లో ప్రతిష్టితుడు .యజ్ఞం దక్షిణలో ప్రతిష్టితం .దక్షిణ శ్రద్ధలో ప్రతిష్టితం .శ్రద్ధ హృదయం లో ఉంటుంది .పశ్చిమ దిశకు వరుణ దేవతా స్వరూపుడను .వరుణుడు ఉదకాలలో ఉంటాడు .ఉదకాలు రేతస్సులో ప్రతిష్టితాలు .రేతస్సు హృదయం లో ప్రతిష్టితం .ఉత్తర దిక్కుకు సోమదేవతాస్వరూపుడను. అది దీక్షలో ప్రతిష్టితం. దీక్ష సత్యం లో, సత్యంలో, సత్యం హృదయం లో ప్రతిష్టితం .ధ్రువ దిక్కుకు అగ్ని దేవతా స్వరూపుడను .అగ్ని వాక్కులో వాక్కు హృదయం లో ప్రతిష్టితం ‘’అన్నాడు ‘’హృదయం దేనిలో “? అని అడిగితె ‘’అహల్లికుడా !(అంటే పగటి వేళ ప్రేతత్వం తో లీనమైనవాడా )!హృదయం శరీరం లోకాక ,వేరే చోట ఉంటుందా ?హృదయం శరీరం లోనే ప్రతిష్టితం ‘’అన్నాడు .వాదన కొనసాగింది వివరాలు తర్వాత .

యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -23

శాకల్యుడు ‘’శరీరం హృదయం దేనిలో ప్రతిస్టింప బడ్డాయి?’’ యాజ్ఞవల్క్యుడు ‘’ప్రాణవాయువు లో. అది అపానవాయువులో. అది వ్యానవాయువులో. అది ఉదాన వాయువులో అది సమానవాయువులో ప్రతిష్టింప బడినాయి ‘’అనగానే ఇక మాట్లాడక ఊరుకున్న మేనమామను ‘’ఔపనిషద పురుషుని గురించి నువ్వు వివరించిచెప్పు .. చెప్పకపోతే తలపగిలి చనిపొతావు ‘’అన్నాడు. శాకల్యునికి ఆ వివరం తెలియకపోవటం తో తలపగిలి చచ్చాడు. బ్రాహ్మణ్యం అంతా మహర్షి వేతృత్వాన్ని వేనోళ్ళ  పొగడి, శాకల్యుని అజ్ఞానాన్ని అహంకారాన్ని దూషించారు. అవతారపురుషుడు యాజ్ఞవల్క్యుడని మెచ్చారు. శాకల్యుని శిష్యులు గురువుకు జరిగిన పరాభవం మరణం గురించి బాధపడి ఆయన అస్థులనుమూటకట్టి ఉత్తరక్రియలకోసం తీసుకు వెడుతుంటే దొంగలు అందులో డబ్బు ఉందనుకొని ఎత్తుకొని పారిపోయారు. బ్రహ్మ వేత్తలను ద్వేషిస్తే ఇహ పరాలు దక్కవు అని అందరికి అర్ధమైంది.

  శాకల్యుని కథ సమాప్తి చెందటం తో జనకరాజు ఆస్థానానికి వచ్చిన వారు ఇక నోరు మెదపకుండా కూర్చుంటే యాజ్ఞవల్క్యుడే ‘’మీలో ఇంకెవరైనా కానీ, కొందరుకానీ అందరూ కలిసి కానీ సందేహాలుంటే అడగండి. మీరు అడగకపోతే నేనే మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది ‘’అన్నాడు .కిమిన్నాస్తి. ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పుడు మహర్షి యాజ్ఞవల్క్యుడే వారందరితో ‘’పురుషుడిని వనస్పతి తో పోల్చవచ్చు. ఎలాగంటే శరీరానికి  వెంట్రుక   లున్నట్లు వృక్షాలకు ఆకులున్నాయి .పురుషుడికి జన్మ ఉన్నట్లు చెట్టుకూ ఉంది. పురుషునికి రక్తం కారినట్లే చెట్లకూ బంక కారుతుంది .మనకు మాంసం ఉన్నట్లే వాటికి శకలాలున్నాయి. మన నరాలలాగే వాటికీ దృఢమైన కీనాటం ,ఎముకలులాగా వాటిలో దారువులు, మనకు కొవ్వు ఉంటె వాటికి చేవ సమాన ధర్మాలుగా ఉన్నాయి .చెట్టును నరికితే, మూలం నుంచి మళ్ళీ పుడుతుంది. మృత్యువు చేత చేది౦పబడితే మనిషి ఏ మూలం నుంచి పుడతాడు ?. రేతస్సు అని చెబుతారేమో ?బ్రతికి ఉన్నవాడికే రేతస్సు ఉంటుంది .చెట్టు చచ్చిపోయినా బీజం వలన మళ్ళీ పుడుతుంది. వ్రేళ్ళతో పెకలిస్తే మళ్ళీ పుట్టదు. చనిపోయినవాడు ఏ మూలం నుంచి పుడతాడు ? పుట్టినవాడు మళ్ళీ పుట్టడు కనుక ఈ ప్రశ్న అసంబద్ధం అంటారా ? కాదు. పుట్టినవాడు చనిపోయాక జన్మమే లేకపోతే వాడు చేసిన పుణ్యపాపాలకు ఫలం నశించటం  చేయని వాటికి ఫలం రావటం జరుగుతుంది. కనుక చచ్చినవాడు మళ్ళీ పుడతాడు అనే చెప్పాలి. అప్పుడు అతడిని ఎవరు పుట్టిస్తారు?’’ అని ప్రశ్నలు సంధించగా తెల్లమోహాలేసి ఎవరూ మారు మాటాడలేదు. కనుక ఇందులో తేలిన సారాంశం – అన్నిటికీ మూల విజ్ఞాన గుణ, ఆనంద స్వరూపం పర బ్రహ్మమే. యాజ్ఞావల్క్యమహర్షి ని బ్రహ్మ వేత్త గా, అధిగమించరాని పండితోత్తమునిగా అందరూ భావించి ప్రశంసించారు. అతడినే అనుసరించి జన్మలు చరితార్ధం చేసుకోవాలి నిర్ణయించుకొన్నారు.

  అప్పుడు జనక చక్రవర్తి యాజ్ఞవల్క్య మహర్షితో ‘’పరమ పురుషా !శతకోటివందనాలు. నీ దశావతార మహిమ తెలియక కొందరు అపోహపడి భంగపడ్డారు. వేలకొలది విద్వా౦సులున్న ఈ సభలో ‘’బ్రహ్మిస్టుడవు ‘’అని ఖ్యాతి గడించావు. మా పురంలో ఉంటూ బ్రహ్మ విద్యావ్యాప్తి చేస్తూ, పరబ్రహ్మ తత్వాన్ని నాకు వివరంగా బోధించి నన్ను ధన్యుడిని చెయ్యి ‘’అని సభాముఖంగా ప్రకటించాడు. యాజ్ఞవల్క్యుడు ‘’సార్వ భౌముడు తలచుకొంటే కానిదేమున్నది ‘’అని తన అంగీకారం తెలిపి , చాలాకాలం మిధిలానగరం లోనే ఉంటూ జనకునికి బ్రహ్మ విద్య నేర్పుతూ జనులకు ఐహికాముష్మిక జ్ఞానమార్గం బోధించాడు. గార్గి తనతో వచ్చిన మైత్రేయి దృష్టి అంతా యాజ్ఞావల్క్యుని పైనే ఉన్నదని, ఆమె మనసంతా అతడు వ్యాపించి ఉన్నాడని ఆమె అతడిని గాఢంగా ఇస్టపడుతోందని, ఇంటికి వెడుతూ గ్రహించింది.

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -24

  వివాహం సంతానం

గార్గి తన అన్న మిత్రునితో కూతురు మైత్రేయి వివాహ విషయం కదిలించింది. యుక్తవయసు వచ్చి౦ది కనుక  వివాహం చేయాలని ఆమె మనసులో మాట కనుక్కోమని సోదరికి చెప్పాడు. ఆమె అడిగింది. దానికి మైత్రేయి ‘’బిడ్డల అభిప్రాయం తలి దండ్రులకు తెలిసే ఉంటుంది ‘’అన్నది. గార్గి ‘’మాకు తెలిసినా నీ నోటిలోనుంచి ఆ మంచి మాట వినటం మాకు సంతోషం కదా ‘’అంది. అప్పుడు మైత్రేయి తాను యాజ్ఞవల్క్యమహర్షి వాదన విన్నాక అయన బ్రహ్మ వేత్త అని అందరూ నిర్దారించారుకనుక ఆయననే పెళ్లి చేసుకొంటే ఉచితంగా ఉంటుందని పిస్తోందని అన్నది. మిత్రుడు ‘’యాజ్ఞవల్క్యుడు ఇప్పటికే కాత్యాయనిని వివాహమాడి అన్యోన్యంగా కాపురం చేస్తున్నాడు. అలాంటివాడు మళ్ళీ మన అమ్మాయిని పెళ్లి చేసుకొంటాడా?’’అని సందేహించాడు. దీనికి గార్గి పూర్వం జరిగిన ఒక విషయం గుర్తు చేసింది. ఒకసారి యాజ్ఞవల్క్యుడు తపస్సు చేసుకొంటుంటే పెద్ద పులి ఆయనపై దూక బోతుంటే మిత్రుడు తన సహచరుల చేత దాన్ని చంపించగా మహర్షి అతడిని పొగిడిన విషయం ఇది వరకే తానూ చెప్పిన అసంగతి గుర్తు చేసి, ఇప్పుడు మనపిల్లను పెళ్లి చేసుకోమని అడిగితె కాదనడు అని ధైర్యం చెప్పింది. అతడు ‘’అలాంటి మహర్షిని ఏ క్రూర మృగం హాని చేయలేదు. నాకు ఆయనను కాపాడే  అవకాశమిచ్చాడు అంతే. ఇదొక గొప్ప విషయం కాదు ఆయనకు చెప్పటానికి .కానీ నాప్రయత్నం నేను చేస్తాను ‘’ అన్నాడు .

  వెంటనే యాజ్ఞావల్క్యుని చేరి, తానొక కోరికతో వచ్చానని దాన్ని తీర్చమని విన్నవించాడు. ’’మీ కోరిక తెలిస్తేనే కదా నేను ఆలోచించి చెప్పగలను ‘’అన్నాడు. ’’నాకుమార్తె మైత్రేయి నా సోదరి గార్గి పెంపకంలో పెరిగి జ్ఞానురాలై జనక సభలో మీ చర్చ చూసి మిమ్మల్ని వివాహం చేసుకోవాలని సంకల్పించి మాకు తెలియజేసింది ‘’అన్నాడు. ఆయన ‘’ఈ శరీరం ఒక వనితకు ఇదివరకే ఇచ్చేశాను. ఇప్పుడు దానిపై నా పెత్తనం లేదు ‘’అన్నాడు. మహాత్మా !కాత్యాయిని దేవి అనుమతిస్తే మీకు అభ్యంతరం లేదని మీ మాటలవలన అర్ధమయింది ‘’అనగా ‘’అవును ఆమెయే తన సొత్తును ఇతరులకిచ్చే అధికారం కలిగి ఉంది ‘’అన్నాడు. సంతోషించి సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళాడు .

   జరిగిన విషయం గార్గి మొదలగు వారితో చెప్పి, మైత్రేయిని వెంటబెట్టుకొని యాజ్ఞవల్క్య గృహానికి వెళ్లి కాత్యాయానికి కూడా విషయమంతా నివేదించాడు. మైత్రేయిపై గల వాత్సల్యంతో తాను తప్పక వారిద్దరి వివాహానికి గట్టిగా ప్రయత్నం చేస్తానని వాగ్దానం చేసింది. ఒకరోజు కాత్యాయని భర్తతో ‘’స్వామీ! నా కోరిక ఒకటి మీరు తప్పక తీర్చాలి ‘’ అన్నది. అదేమిటో చెప్పమన్నాడు. ’’నా చెలికత్తె మైత్రేయి ఎప్పుడూ నా దగ్గర ఉండేట్లు మీరామెను పెళ్లి చేసుకోవాలి ‘’అని చెప్పింది. ఆయన ‘’పిచ్చిదానిలాగా ఉన్నావు. నీ భర్తను వేరొకరికిస్తావా?’’అన్నాడు . ’’మేము వేరుకాదు. ఒక్కరమే. నా శరీరానికి నేను సుఖం చేకూర్చుకో కూడదా?’’ అని అడిగింది. ’’ఐతే నీ కోరిక తీరుస్తాను ‘’అనగా  ఆ సంతోష వార్త వెంటనే గార్గికి తెలియ జేసింది కాత్యాయని. మిత్రుడు పెళ్లి ఏర్పాట్లు చేసి ఒక శుభ ముహూర్తంలో మైత్రేయీ యాజ్ఞవల్క్య వివాహం ఘనంగా జరిపించాడు. జనక రాజు మహర్షులు వివాహానికి విచ్చేసి పరమానంద భరితులయ్యారు.  యాజ్ఞావల్క్యుని బ్రహ్మ విద్యా వ్యాప్తికి అన్నివిధాలా సహకరించే సహధర్మ చారిణి మైత్రేయి అని అందరూ మెచ్చుకున్నారు.

    యాజ్ఞవల్క్య, మైత్రేయి తరచుగా బ్రహ్మవాదం లో కాలం గడిపారు. కాత్యాయినీ యాజ్నవల్క్యులకు చంద్ర కాంతుడు, మహా మేఘుడు, విజయుడు అనేముగ్గురు లోక ప్రసిద్ధులైన కుమారులు జన్మించారు అని శేషధర్మం, సంశయ తిమిర దివాకరంలలో ఉన్నది – యాజ్ఞవల్క్య సుతా రాజన్ త్రయోవై లోక విశ్రుతాః - చంద్రకాంత మహామేఘ విజయా బ్రాహ్మణోత్తమాః   ‘’(శేష ధర్మం )

‘’మైత్రేయీ అనపత్యా, కాత్యాయన్యాశ్చచంద్రకాంత – మహా మేఘ, విజయ నామా స్త్రయః పుత్రా అభూవత్ ‘’(సంశయ తిమిర దివాకరం)

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -25

యోగ బోధ

ఒక రోజు బ్రహ్మవేత్తలతో ఉన్న యాజ్ఞవల్క్యుని గార్గి ‘’యోగతత్వాన్ని సంపూర్ణంగా తెలియ జేయండి ‘’అని అడిగింది .యాజ్ఞవల్క్యుడు ‘’నేను పూర్వం బ్రహ్మ వలన విన్నదే మీకు చెబుతాను .జ్ఞానానికి ప్రవర్తకం, నివర్తకం అని రెండుమార్గాలను వేదం చెప్పింది .కామ సంకల్పక పూర్వమైన వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవర్తకం అంటారు .ఇది అవలంబిస్తే స్వర్గం లభిస్తుంది .కాని పుట్టుక చావు నిరంతరంగా ఉంటుంది .కామ సంకల్పం ,విధ్యుక్తమైన కర్మ నివర్తకం .దీన్ని అచరిస్తే ముక్తి లభిస్తుంది .శ్రుతులలో బ్రాహ్మణులకు నాలుగు ,క్షత్రియులకు మూడు ,వైశ్యులకు రెండు శూద్రులకు ఒకటి ఆశ్రమాలు చెప్పబడినాయి .బ్రాహ్మణుడు బ్రహ్మ చర్య వ్రతం చేస్తూ ,వేద, వేదాంగాలు అధ్యయనం చేసి ,స్నాతుడై సవర్ణ స్త్రీని వివాహమాడి ,పుత్రులను పొంది విదిప్రకారం భార్యతో కలిసి హోమం చేస్తూ ,చివరికి నిర్జన ప్రదేశం లో నిత్యమూ అగ్నిహోత్ర సమక్షం లో తపస్సు చేస్తూ ,ఆత్మలో అగ్నిని ఆరోపించుకొని విధి ప్రకారం సన్యసించి పరమాత్మ క్షేత్రియుడు అయ్యే వరకు నిత్యకర్మ చేయాలి .

  క్షత్రియుడు సన్యాసాశ్రమం వరకు ,వైశ్యుడు వానప్రస్థాశ్రమం వరకు ,శూద్రుడు శుశ్రూష తో నిత్యం గృహస్తాశ్రమంలో ఉండాలి .నాలుగు ఆశ్రమాలలో ఉన్నవారు కోరికలు లేని విధ్యుక్త కర్మలే చేయాలి అని నాకు బ్రహ్మ బోధించాడు ‘’అన్నాడు .గార్గి ‘’జ్ఞానం తో విధ్యుక్త కర్మ చేసేవారికి ముక్తికలుగుంది అన్నారు కదా ఆ జ్ఞానం ఎలాంటిది ?’’అని అడిగింది .మహర్షి ‘’జ్ఞానం యోగాత్మకమైంది .అది అష్టాంగ సంయుతం .జీవాత్మ ,పరమాత్మల సంయోగమే యోగం .దానికి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధి అనే ఎనిమిది అ౦గా లున్నాయి .యమ నియమాలు మళ్ళీ పదేసి రకాలు. ఆసనాలు ఎనిమిది అందులో ఉత్తమోత్తమాలు మూడు .ప్రాణాయామం  మూడు రకాలు.ప్రత్యాహారం అయిదురకాలు.ధారణ అయిదురకాలు .ధ్యానం పదహారు విధాలు .సమాధి ఒకే విధానం ‘’అని వివరించాడు .

మహర్షులంతా యోగీశ్వరుడు అంటే వాజసనేయ యాజ్ఞవల్క్యమహర్షి మాత్రమే కాని వేరెవరూకాదన్నారు .మాఘ శుద్ధ పౌర్ణమి రోజున కణ్వ గురువైన యాజ్ఞవల్క్య మహర్షికి  యోగీంద్ర పట్టాభి షేకం జరిగి నట్లు  ‘’సహస్రనామావళి ‘’అనే గ్రంధం లో ఉన్నదని శ్రీ భాగవతుల లక్ష్మీ పతి శాస్త్రి గారు రాశారు . .

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -26

             ప్రబోధం

ఒకరోజు యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళగా అత్యంత భక్తీ శ్రద్ధలతో పూజించి ‘’గోవులు కావాలనా లేక నా చేత  ఏదైనా అర్ధవంతమైన ప్రశ్న అడిగి౦చు కోవాలనా తమరు దయ చేశారు ?’’అని అడిగాడు గౌరవంగా .’’రెండిటికోసం వచ్చాను  బ్రహ్మం గురించి ఇదివరకుఎవరైనా  నీకు  చెప్పినదంతా నాకిప్పుడు చెప్పు జనకరాజా ‘’అన్నాడు మహర్షి .’’వాక్కే బ్రహ్మ ‘’అన్నాడు రాజు .’’వాగ్బ్రహ్మ శరీరం స్థితి చెప్పు ?”’అంటే తనకు ఆగురువు చెప్పలేదన్నాడు .మహర్షి ‘’వాగ్బ్రహ్మ ఒక పాదం అంటే అతడు పలకాల్సింది ఇంకా మూడు వంతులుంది .’’అనగా దాని శరీరం స్థితుల గురించి వివరించమని కోరాడు రాజు .’’వాక్కే శరీరం ఆకాశం అంటే పరమాత్మ .ఆశ్రమం పరబ్రహ్మ లో నాలుగవ భాగమైన ఈ బ్రహ్మం నే ప్రజ్ఞ అంటారు .దీనినే ఉపాసించాలి .అన్నాడు .’’ప్రజ్ఞత అంటే వాక్కును తెలుసుకో దగిన శాస్త్రం ఏది ‘’?అని అడిగాడు .’’వాక్కునే ప్రజ్ఞత అంటారు .ఎందుకంటె ఆవాక్కుతోనే వేద శాస్త్ర పురాణాలు యజ్ఞ యాగాలు ధర్మ శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసుకో బడతాయి .వాక్కును బ్రహ్మ అని ఉపాసిస్తే అది అతడిని విడిచి వెళ్ళదు అతడు సకల భూతాలను ప్రేమిస్తాడు .ఈలోకం లో ఉన్నంతకాలం దేవుడుగా ,చనిపోయాక దేవతలో కలిసిపోతాడు .’’అనగా ఆనందించి రాజు ఆయనకు ఏనుగుల్లాంటి నూరు ఎద్దులను ఇస్తానన్నాడు .మహర్షి ‘’రాజా !శిష్యుని  కృతార్దుడిని చేయకుండా అతడి నుంచి ధనం తీసుకో రాదని మా తండ్రి చెప్పారు .ఇంకెవరైనా ఆచార్యుడు ఏదైనా చెబితే నాకు వివరించు ‘’అన్నాడు .జనకుడు ‘’ఉదంకుడు ప్రాణం లేని వాడికి ఏమీ కలుగదు కనుక ప్రాణమే బ్రహ్మం అని చెప్పాడు ‘’అనగా ఆ ప్రాణానికి శరీరం ఏమిటో ఆశ్రమం ఏమిటో ఆ గురువు చెప్పాడా ?’’అని అడుగగా చెప్పలేదన్నాడు .ప్రాణం ఏకపాదం మాత్రమే అంటే ఇంకా మూడు వంతులు ఉన్నది .వివరించమని అడుగగా ‘’ప్రాణ రూపపరబ్రహ్మానికి ప్రాణమే  శరీరం .ఆకాశమే  ఉత్పత్తి స్థానం .అది ప్రేమ రూపమైనదని భావించి ఉపాసించాలి ‘’అన్నాడు

  ‘’ప్రియత ‘’అంటే ?’’ప్రాణమే ప్రియత .ఎందుకంటె ప్రాణం కాపాడుకోటానికి ధనం సంపాదిస్తారు .యాగార్హత లేకపోయినాయాగం చేయిస్తుంది .తీసుకో కూడనివి తీసుకొనేట్లు చేస్తుంది .భయ పెట్టె దిక్కుకే ప్రాణ రక్షణకోసం వెడతాడు .కనుక ప్రాణమే పరబ్రహ్మం .ప్రాణ రూప బ్రహ్మాన్ని ఉపాసిస్తే ప్రాణం అతడిని వదలదు .అతడితో భూత సంతతి అంతా స్నేహంగా ఉంటుంది .ఈ లోకంలో దేవుడుగా భావింపబడి చనిపోయాక దేవతలలో కలిసిపోతాడు .’’అని చెప్పగానే జనకుడు పరమ సంతోషం తో అతడికి వెయ్యి ఎడ్లు ఇస్తానన్నాడు .

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -27

శిష్యుడిని కృతార్దుడిని చేశాకే ఏదైనా గ్రహించాలి అని చెప్పి వేరే గురువేదైనా చెప్పాడా అని అడిగాడు .వృష్ణుని కొడుకు బర్కుడు నేత్రాలే బ్రహ్మ అన్నాడని చెప్పగా .మహర్షి నేత్రానికి నేత్రమే  శరీరం. ఆకాశమే ఆశ్రయం .నేత్ర స్వరూప బ్రహ్మాన్ని సత్యంగా ఉపాసన చేయాలి కన్ను చూసిందే సత్యం కనుక అదే పరబ్రహ్మ .నేత్రబ్రహ్మనుపాసిస్తే అతడిని వదలదు .అతనితో సకలభూతాలు స్నేహం చేస్తాయి .ఈలోకంలో దేవుడిగా పూజింపబడి చనిపోయాక దేవత లో కలిసిపోతాడు .రాజు మళ్ళీ వేయి వృషభాలిస్తానన్నాడు  .పాతమాటే మళ్ళీ చెప్పగా రాజు భరద్వాజ పుత్రుడు గర్ద భీతుడు శ్రోత్రమే బ్రహ్మమన్నాడని చెప్పగా మహర్షి ‘’శ్రోత్ర బ్రహ్మానికి శ్రోత్రమే శరీరం ,ఆకాశమే ఆశ్రయం .దీన్ని అనంతం అని ఉపాసించాలి .అనంతం అంటే దిక్కులే .శ్రోత్రం శ్రవణ బ్రహ్మోపాసకుడిని విడువదు .అందరి మైత్రి లభించి ఈ లోకం లోదేవుడిగా పూజ్యతపొంది మృతి చెందాక దేవతలో ఐక్యమౌతాడు .సంతృప్తి చెందినరాజు మళ్ళీ వెయ్యి ఎద్దులిస్తాననగా ,ఇంకెవరైనా ఏదైనా చెబితే వివారించమన్నాడు .జాబాలి అనే ఆమె పుత్రుడు సత్యకాముడు మనస్సు బ్రహ్మని చెప్పాడన్నాడు రాజు  .మహర్షి ‘’మనో బ్రహ్మకు శరీరమే స్థానం  .ఆకాశమే ఆశ్రయం. మనోబ్రహ్మాన్ని ఆనంద స్వరూపంగా భావించి ఉపాసి౦చాలి .ఆనందత అంటే మనస్సే.మనస్సు చేతనే స్త్రీని పొంది ప్రతి రూపమైన పుత్రుడిని పొందుతున్నాడు .ఆపుత్రుడే ఆనందానికి హేతువౌతున్నాడు .కనుక మనస్సు పరబ్రహ్మం .దీన్ని ఉపాసిస్తే మనసు విడిచిపోదు .ఈలోకంలో పూజ్యత దక్కి పరలోకం లో దేవత లో కలిసిపోతాడు .మళ్ళీ వెయ్యి వృషభాల కానుక రాజు ప్రకటించగా ,ఇదివరకటిమాటేచెప్పగా రాజు శాకల్యుడు హృదయమే బ్రహ్మ అని చెప్పాడనగా యాజ్ఞవల్క్యుడు ‘శరీరమే హృదయ౦ ఆకాశమే ఆశ్రయం .దాన్ని స్థితి అని భావి౦చి ఉపాసి౦చాలి .స్థితత అంటే హృదయమే .హృదయమే పరబ్రహ్మ హృదయోపాసకుని హృదయం విడిచి పెట్టదు .అతనితో సర్వభూతాలు మైత్రి తో ఉంటాయి ఈలోకం లో పూజనీయుడై మరణించాక దేవతలో ఐక్యమౌతాడు ‘’అని చెప్పగా మళ్ళీఏనుగుల్లాంటి వెయ్యి వృషభాలు కానుక గా ప్రకటించగా తనతండ్రి చెప్పిన మాట జ్ఞాపకం చేసి దానం గ్రహించలేదు యాజ్ఞవల్క్య మహర్షి ‘’

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -28

ఒక రోజు విదేహరాజు జనకుడు ఆసనం దిగి  యాజ్ఞవల్క్య   మహర్షి చెంతకు వచ్చి’’భగవాన్ !నమస్కార శతం. నాకు ఈ రోజు బ్రహ్మోపదేశం చేయమని మనవి చేసుకొంటున్నాను ‘’అన్నాడు అత్య౦త వినయ విధేయతలతో.దానికి మహర్షి యాజ్ఞవల్క్యుడు ‘’మహారాజా !నువ్వు ఉపనిషత్తులు సాకల్యంగా విని సమాహితాత్ముడవయ్యావు .నువ్వు పూజ్యుడవు సార్వ భౌముడవు వేదాధ్యయనం చేసి జ్ఞాన విజ్ఞాన సముపార్జన చేసిన ధీమతివి .ఈ దేహాన్ని విడిచాక ఎక్కడికి పోతావో తెలుసా ?’’అని అడిగాడు .తెలియదన్నాడు రాజు .తెలియకపోతే తానే చెబుతానని ‘’కుడికంటి లోని పురుషుడిని ఇంధుడు అంటారు .అంటే ప్రకాశించేవాడు అతడినే అప్రత్యక్షం గా ఇంద్రుడు అంటారు .కారణం దేవతలు పరోక్షప్రియులు ,ప్రత్యక్ష శత్రువులు కూడా .ఎడమకంటిలోని పురుష రూపం పత్ని ,అన్నం కూడా అవుతుంది .అంటే కుడికంట్లోప్రకాశించే పురుషుడు భోక్త , భర్త ఇంద్రుడు అనీ ,ఎడమకంటిపురుష రూపం భోజ్యమైన అన్నం, అతని భార్యఇంద్రాణి  అవుతున్నాయి.జాగ్రదావస్థలోకుడి ఎడమ నేత్రాలలోని పురుష రూపాన్ని ‘’విశ్వ’’ శబ్ద౦ చే తెలియ జెప్పారు .ఇది స్త్రీ పురుష ద్వంద్వం .ఈ స్త్రీ పురుషులకు హృదయాకాశమే  సంభోగ స్థానం .అందులోని రక్తపు ముద్దవారికి అన్నం .నాడీ తంతువులే  వస్త్రాలు .హృదయం నుండి పైకి వెళ్ళే నాడులే వారు సంచరించే మార్గం .ఒకవెంట్రుక ను వెయ్యి భాగాలుగా చీలిస్తే ఏర్పడే అతి  సూక్ష్మనాడులు హితములని పిలువబడి హృదయం మధ్యలో ఉంటాయి .తిన్న అన్నం ఈ నాడులద్వారా వ్యాపించి దేహాన్ని వృద్ధి చేస్తుంది .స్థూల దేహాన్ని వృద్ధి చెంది౦చే  ఆహారం కంటే ,దేవతా శరీరాన్ని వృద్ధి చెందించే అన్నం చాలా  సూక్ష్మమైనది .ఈ దేవతా శరీరాన్నే లింగ శరీరం అంటారు .స్థూల దేహ సంబంధమైన విశ్వాత్మకంటే , సూక్ష్మ దేహ సంబంధ తైజసాత్మ ఇంకా  సూక్ష్మ  అన్నం చేత వృద్ధి పొందుతుంది .తైజసుడు స్వప్నావస్థలో కంఠంలో ఉండి ప్రకాశిస్తాడు కనుక ఆ అవస్ద లో తైజసుడని పిలువబడతాడు .

‘’ విశ్వాత్మ నుండి తైజసాత్మ,తైజసాత్మనుండి ప్రాజ్ఞాత్మ పొందేవాడికి తూర్పు దిక్కు ను పొందినప్రాణాలు తూర్పు దిక్కు అవుతాయి .అలాగే దక్షిణ దిక్కువి దక్షిణ దిక్కు ,పడమరకు పోయేవాటికి పడమటి దిక్కు, ఉత్తరానికి పోయేవాటికి ఉత్తర దిక్కు,  పైకి పోయేవాటికి ఊర్ధ్వ దిక్కు క్రిందికి పోయేవాటికి అధో దిక్కు అవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సకల ప్రాణాలు సకల దిక్కులౌతాయి .ఈ ఎరుక గలవాడు సర్వాత్మకమైన ప్రాణాన్ని ఆత్మ స్వరూపంగా మార్చుకొంటాడు .అనగా ప్రత్యగాత్మ లో సర్వాత్మకమైన ప్రాణాన్ని ఉపసంహరించి ‘’నేతి, నేతి అంటే ఇదికాదు ఇది కాదు అనుకొంటూ అన్నిటినీ నిషేధించి, చివరకు ఆత్మను పొందుతాడు .ఆత్మ గ్రహింప శక్యం కాదు కనుక గ్రహి౦ప బడదు .శరీర ధర్మం లేనిదికనుక శిధిలం కాదు .దేనితోనూ కలవదు కనుక ఒంటరిదై ఉంటుంది  .దేనిచేత గ్రహి౦పబడదు  ,పీడింపబడదు .గ్రహణం సంగమం శిధిలం అనే ధర్మాలు లేవుకనుక ఆత్మ హింస పొందదు. అంటే నశించదు .మహారాజా జనకర్షీ !నువ్వు ఇపుడు జననమరణ నిమిత్త భయం లేకుండా అభయం పొందావు కదా  ?’’అన్నాడు .

  జనకుడు ‘’మహాత్మా !మీరూ భయరహితులు అగుదురుగాక .భయరహితమైన బ్రహ్మాన్ని తెలియ జేసినందుకు కృతజ్ఞతలు నమోవాకములు .ఈ విదేహ దేశాన్ని హాయిగా అనుభవించండి .నేను మీ దాసుడను ‘’అన్నాడు చక్రవర్తి జనకుడు .రాజువద్ద సెలవు తీసుకొని ఆశ్రమానికి వెళ్ళాడు మహర్షి .కొంతకాలం తర్వాత  మళ్ళీ రాజు దగ్గరకు వచ్చాడుకానీ ఆయనకు ఏమీ చెప్పకూడదు అనుకొన్నాడు .కాని పూర్వం వీరిద్దరూ అగ్ని హోత్ర విషయమై చాలా చర్చించారు .అప్పుడు యాజ్ఞవల్క్యుడు ‘’నీ ఇష్టమొచ్చిన ప్రశ్నలు అడుగవచ్చు ‘’అన్నాడు .కనుక ఇప్పుడు జనకుడే ముందుగా ‘’మహర్షీ !కర చరణాదులైన అవయవాలున్న ఈ పురుషుడి గమన సాధనమైన తేజస్సు ఏది ?’’అని అడిగాడు .’’సూర్య తేజస్సుతోనే కూర్చుంటాడు అనేక చోట్లకు తిరుగుతాడు .లౌకిక వైదికకర్మలు చేస్తాడు ‘’అని బదులిచ్చాడు .సూర్యుడు అస్తమించగానే తేజస్సు లేని వాడౌతాడుకదా అని సందేహించిన రాజుకు ‘’చంద్ర తేజస్సుతో సకలం నిర్వహిస్తాడు ‘’అనగా సూర్య చంద్రులిద్దరూ అస్తమిస్తే ?’’అనగా ‘’అగ్ని తేజస్సుతో అన్నీ నిర్వహిస్తాడు .అగ్నికూడా ఆరిపోతే వాక్కు అతని తెజస్సై అన్నీ చేయిస్తుంది ‘’అన్నాడు .’’వాక్కు కు తేజస్సు ఉందని ఎలా తెలుస్తుంది ?’’జనకుని ప్రశ్న.’’చీకటిలో ఏదైనా కూసినా అరచినా మాట్లాడినా అది మనదగ్గరుందా దూరంగా ఉందా అనే  జ్ఞేత్రం ద్వారా తెలుసుకొంటాం .కనుక సూర్యచంద్ర అగ్నులు లేనప్పుడు వాక్కే తేజస్సు అవుతుంది .’’వాక్కు కూడా లేకపోతె ?’’అన్న ప్రశ్నకు  ‘’ఆత్మయే తేజస్సు అయి అన్నీ చేయిస్తుంది ‘’అని బదులిచ్చాడు యాజ్ఞవల్యుడు .

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -29

‘’ప్రాణాలలో ఉన్న విజ్ఞానమయ ఆత్మ గురించి వివరించండి?’’అని జనకర్షి అడుగగా మహర్షి ‘’హృదయం లో, కంఠంలో ఉన్న తేజో రూప పురుషుడి నే ఆత్మ అంటారు .ఈ ఆత్మను బుద్ధి ధ్యాని౦చేప్పుడు ధ్యానించే దాని లాగా ,బుద్ధి ఇంద్రియాలు చలిస్తున్నప్పుడు చలించే దానిలాగా ఉండి,బుద్ధితో సమానమైన ఇహ ,పర లోకాలను రెండిటిని అనుసరించి తిరుగుతుంది .ఈ ఆత్మయే ఈ లోకం లో మృత్యురూపాలను అతిక్రమిస్తుంది .ఆత్మస్వరూప పురుషుడు శరీరం లో ఉన్నప్పుడు బుద్ధితో సమానుడై స్వప్నాది అవస్థలలో ప్రవర్తిస్తూ ,పాపరూప మైన దేహేంద్రియ సముదాయ మును విడుస్తూ ,గ్రహిస్తూ పుట్టి అవి తానే అనే అభిప్రాయం తో పాపరూప దేహే౦ద్రియాలతో కూడి ఉంటాడు .చనిపోయి వేరొక దేహాన్ని పొందినపుడు ,పాపరూప శరీరేద్రియాలను విడిచి పెడతాడు .ఇలా జనన మరణ పరిభ్రమణం లో సంసారం వడిలో మోక్షం పొందేదాకా ఉంటాడు .కనుక ఆత్మా జ్యోతిస్సు దేహెంద్రియాలకంటే వేరైనది అని గ్రహించాలి .ఆపురుషుడికి ఈలోకం, పరలోకమే కాకుండాఈ రెండిటికి మధ్య సంధిస్థానంగా ఉండే  మూడవలోకం స్వప్న స్థానం అవుతుంది .ఇక్కడి నుంచి ఇహ పర లోకాలని చూస్తాడు .ఈ పురుషుడు విజ్ఞాన లక్షణాలతో పరలోకం లో ఉండి,విద్యా కర్మలయొక్క విజ్ఞానాన్ని ఆశ్రయించి స్వప్నం లో పాపఫల దుఖాన్ని,  పుణ్యఫల సుఖాన్ని చూస్తాడు .స్వప్న౦ లో ఉన్నప్పుడు ఈ లోకం లోని కొంచెం మాత్రమే గ్రహించి ,తానే శరేరాన్ని పడేసి ,వాసనామయ స్వప్న దేహాన్ని మాయాస్వరూపంలాగా నిర్మించుకొని, తన తేజస్సుతో నిద్రిస్తాడు .ఈ అవస్థసలో స్వయం జ్యోతి ఔతాడు ‘’అని వివరించాడు యాజ్ఞవల్క్యుడు .

  ‘’స్వప్నం లో రధాలు గుర్రాలు మార్గాలు ఉండవు  .మరి ఎలావచ్చాయనే సందేహం కలుగుతుంది .పురుషుడే స్వప్నం లో వాటిని కల్పించుకొంటాడు .అక్కడ సంతానం సుఖం లేవు .వీటినీ ఆత్మ సృష్టించుకొంటు౦ది .చెరువులు బావులు ఉండవు .వాటినీ ఆత్మయే సృష్టించు కొంటుంది . అంటే స్వప్నం లో కనిపించేవన్నీ ఆత్మ సృష్టించినవే .కనుక ఆత్మయే కర్త .వీటిపై కొన్ని శ్లోకాలున్నాయి లున్నాయి ‘’అనగా వాటి తాత్పర్యం చెప్పమన్నాడు జనకుడు .యాజ్ఞవల్క్యుడు ‘’హిరణ్మయుడు లేక హంస స్వరూపుడు అయిన పురుషుడు స్వప్నం చేత దేహానికి నిశ్చేస్టత కలిగించి తాను  నిద్రించకుండా ,నిద్రించేవాడిని చూస్తాడు .తేజస్సుకల ఇంద్రియమాత్ర రూపాన్ని పొంది, మళ్ళీ జాగృత స్థానం చేరుతున్నాడు .అమృతుడు హిరణ్మయుడు ,ఏక హంసుడు ఐన ఆ పురుషుడు అంటే ఆత్మ ,ప్రాణవాయువు చేత ఈ గూడు లాంటి శరీరాన్ని కాపాడుకొంటూ దానికి బయట తిరుగుతూ మరణం లేక కామం ఉన్న చోటికి పోతాడు .స్వయం జ్యోతి అయిన ఆత్మ స్వప్నం తర్వాత అధికమైన దేహ భావాన్ని ,నీచమైన పశుపక్ష్యాది భావం పొంది అనేక రూపాలను సృష్టిస్తుంది .ఆనందం నవ్వు భయం ఉన్నట్లు ప్రవర్తిస్తుంది .లోకులు ఈ క్రీడా స్థానాలనే చూస్తారుకాని ఎవ్వరూ ఆత్మను చూడరు .గాఢ నిద్రలో ఉన్నవాడిని అకస్మాత్తుగా లేపద్దని అంటారు .అలా లేపితే ఆత్మ నేత్రాది రూపాలను పొందలేదు .అప్పుడు గుడ్డితనం ,చెవుడు మొదలైనవి ఏర్పడుతాయి .అప్పుడు అతడికి చికిత్స చేయటం చాలాకష్టం .కనుక ఆత్మ స్వరూపం మృత్యు రూపమైన దేహెంద్రియాలను అధిగమించి స్వయం జ్యోతి స్వరూపమౌతోంది .కొందరు విజ్ఞులు ఆత్మకు జాగృతస్థానమే  స్వప్న స్థానం అంటారు కానీ ఇది కుదరదు .జాగృతస్థానం లో దేన్ని  చూస్తాడో, నిద్రా స్థితిలోనూ దాన్నే చూస్తాడు .స్వప్నం లో నేత్రాది ఇంద్రియాలు లేకపోయినా స్వయం జ్యోతి రూపమైన జాగ్రత్ వాసనవలన తానే కల్పించుకున్నవన్నీ చూస్తుంది .కనుకజాగృత్, స్వప్నాలు వేరు వేరు .ఒకటికానేకాదు .స్వప్నం లో ఆత్మ స్వయం జ్యోతి అని గ్రహించాలి ‘’అన్నాడు .’’మహాత్మా !మీబోధనకు వెయ్యిఆవులు కానుకగా ఇస్తాను .ఇంకనాకు మోక్షసాధనాన్ని అనుగ్రహించండి ‘’అని కోరాడు జనకర్షి .

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -30

‘’స్వయం జ్యోతిస్వరూపుడైన ఆత్మ స్వప్నం నుంచి సుషుప్తి పొందగోరి స్వప్నం లోనే మిత్ర బంధులాదిగా దర్శనం చేత అనురాగం పొంది ,అనేక విధాలుగా సంచరిస్తూ , పుణ్యపాపఫలాలను చూస్తూ’’ సంప్రసాదం ‘’అంటే  జాగ్రతలో దేహెంద్రియాది వ్యాపార సమూహం వలన పుట్టిన కాలుష్యాన్ని వదిలేసి వాటి వాసనలైన స్వప్న వ్యాపారాలను విడిచేసి నిర్మలమైన గాఢ సుషుప్తి లో ఉండి,మళ్ళీ స్వప్నం కోసం పూర్వం పొందినట్లు ప్రతి స్థానం పొందు తుంది .కాని పుణ్యపాపాలచే బంధింప బడదు . కనుక ఆత్మ అసంగమం ఐనది. దేనితోనూ కలిసి ఉండదు. కనుక ఆత్మకు మరణం లేదు .’’అని మోక్ష సాధనం గురించి మొదలుపెట్టి చెప్పాడు యాజ్ఞవల్క్యుడు జనకంహారాజుకు .రాజు మళ్ళీ వెయ్యి గోవులను కానుక ఇస్తానని చెప్పి మిగిలిన విషయాలు వివరించమని కోరాడు .

  ‘’ఆత్మ జాగ్రదవస్థలో కూడా బంధుమిత్రాదులతో అనురాగం పొంది క్రీడిస్తూ పుణ్యపాపాలకు బద్ధం కాకుండా మళ్ళీ స్వప్న స్థానం లోనే ప్రతిస్థానం పొందుతుంది .నీటిలోని చేప ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డుకు తిరుగుతున్నట్లు ఆత్మ స్వప్న, జాగ్రత స్థానాలలో సంచరిస్తుంది .పక్షి ఆకాశం లో తిరిగి తిరిగి మళ్ళీ తన గూటికి చేరినట్లు ,ఆత్మకూడా దేనికీ అంటక,దేన్నీ ఆశించకుండా తనరూపాన్ని తాను  పొందుతుంది .శరీరం లో ‘’హితం ‘’అనే పేరుగల సూక్ష్మనాడులు వాతం ఎక్కువైతే నల్లగా ,పిత్తం ఎక్కువైతే పసుపుగా ,,శ్లేష్మం ఎక్కువైతే తెల్లగా ఈ మూడు సమాన౦గా ఉంటే ఎర్రగా అవుతాయి .అంతః కరణ ప్రవృత్తి ఆశ్రమం గా కలిగి ,మిధ్య ఐన జాగ్రత్ వాసనలవలన స్వప్న దృక్కులున్న ఆత్మను శత్రువులు    వెంబ డించినట్లు ,నూతిలోపడినట్లు భావనకలుగుతుంది .జాగృతం లో చూసిన భయానక విషయాలే స్వప్నం లోనూ కనిపిస్తాయి .అవిద్యవలన ఆ భయం కలుగుతుంది. అంటే స్వప్నం లో లేకపోయినా అజ్ఞానం చేత ఉన్నాయని అనుకొంటాడు ,. మళ్ళీ జాగృత స్థితికి వచ్చి తన్ను తాను  తెలుసుకొని ,సర్వం నేనే అనుకొంటాడు. అదే ఆత్మకు’’ పరలోకం ‘’అనగా ఆత్మ స్వప్నం లో మోక్షం పొందినట్లు పొందుతోంది .సుషుప్తి పొందక, కోరికలేక ,స్వప్నాన్ని చూడకుండా ఉండటమే ఆత్మకు రూపం .అది కోరికలను,  పాపాలను అతిక్రమించినది ,భయరహితమైనది పురుషుడు లేక ఆత్మ ప్రాజ్ఞాతతో ఉన్నా, లోపలా బయటా ఉన్నదాన్ని తెలుసుకోలేడు.ఇదే ఆత్మ స్వరూపం. లోకాలు లోకాలుకావు .దేవతలు దేవతలుకారు .ఆత్మ శుభ అశుభ కర్మలను అతిక్రమించి ఉంటుంది ‘’

  ‘’ద్రష్ట ఐన ఆత్మ దృష్టికి నాశనం లేనేలేదు .ద్రష్ట స్వరూపమైన ఆత్మకంటే భిన్నమైనది లేదు .దేన్నీ చూడకపోయినా ,చూసేదే అవుతుంది .దాని సర్వే౦ద్రియజ్ఞానానికి నాశనమే ఉండదు ‘’అన్నాడు .జనకుడు ‘’ఎందువలన ఆత్మ విశేష జ్ఞానాన్ని తెలుసుకో లేకపోతోంది ?’’ప్రశ్నించాడు .మహర్షి ‘’ఏకాకృతి ఐన ఆత్మకు స్వభావమైన అజ్ఞానం చే స్వప్నం లో తనలో లేని వేరొక వస్తువు ను కల్పించి పొందిస్తుంది .జాగ్రదవస్థలో అజ్ఞాన సంకల్పిత వస్తువులకు వేరుగా ఉంటూ అన్నీ చూస్తూ ఆఘ్రాణిస్తూ రుచి చూస్తూ భిన్నమైన జ్ఞానం కలిగి ఉంటుంది .చూడ దగిన రెండో వస్తువు లేని ద్రష్ట అవుతుంది .సుషుప్తిలో స్వకీయ తేజస్సుపొందుతుంది అదే బ్రహ్మ లోకం. అదే విజ్ఞానమయ ఆత్మకు ఉత్తమగతి సంపత్తు, పరమానందం అవుతుంది .ఇతర భూతాలూ ఈ ఆనంద అంశం యొక్క కళను అనుసరించి జీవిస్తాయి .మనుష్యులలో ‘’రాద్ధుడు’’ అనేవాడు ఉపభోగ కరణ సంపత్తి కలవాడై ప్రభువై ,సమస్త మానుష భోగాలచే సంపన్నతముడు ఔతాడు. అదే మనుషులకు పరమానందం .ఇలాంటి వంద మానుషానందాలు  పితరులకు ఒక ఆనందం తో సమానం .వంద పితృ దేవతానందాలు ఒక గంధర్వానందం .వంద గంధర్వానందాలు ఒక దేవతానందం .వంద దేవతానందాలు ‘’అజాన దేవుడి’’కి అంటే పుట్టగానే దేవత్వం పొందినవాడికి ఒక ఆనందమౌతుంది .ఇలాంటివి వందయితే ప్రజాపతి లోకానందమౌతుంది. శ్రోత్రియుడు ,అవృజినుడు ,అకామ హతుడు ఐనవాడు హిరణ్యగర్భ ఆనందం తో సమానమైన ఆనందం కలవాడౌతాడు .ఈ బ్రహ్మలోక ఆనందామే పరమానందం .ఇక ఆనందం ఎన్నటానికి సాధ్యమే కాదు .అదే బ్రహ్మలోకం లేక బ్రహ్మానందం .’’అని చెప్పగా జనకుడు మహదానందం పొంది మళ్ళీ వెయ్యి ఆవులనిస్తున్నట్లు చెప్పి  మోక్ష సాధనలో మరిన్ని విశేషాలు తెలియ జేయమని కోరాడు .

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -31

జనకుడు మహా మేధావి అని గ్రహించి యాజ్ఞవల్క్యుడు ‘’పరమానంద  స్వరూపమైన ఆత్మ స్వప్నం లో రమి౦చి చరించి ,పుణ్య పాపాలు చూసి ,తిరిగి బుద్ధాంతం చేత ప్రతి స్థానం పొందుతుంది .స్వప్నాంతం అంటే స్వప్న స్థానం బుద్ధాంతం అంటే జాగ్రత స్థానం .శరీరం ఊర్ధ్వ శ్వాసం వలన శరీరమైన ఆత్మ ప్రాజ్ఞాత్మచే అధిస్టించ బడి ధ్వని చేస్తూ ,వేరే దేహాన్ని పొందుతుంది .ప్రాజ్ఞాత్మ అంటే  స్వయం జ్యోతి అయిన పరమాత్మ .ముసలితనం రోగాదుల చేత కృశించినపుడు  జీవుడు అవయవాలు వదిలి వేరే శరీరం లోకి చేరుతాడు  .కర్మఫలం తెలిసిన బ్రహ్మ స్వరూపుడైన జీవాత్మ కోసం పైలోకం లో ఎదురు చూస్తుంటారు .ఊర్ధ్వ శ్వాస లో మరణిస్తే సకల ప్రాణాలు ఆత్మను పొందుతాయి ‘’అనగానే జనకుడు ‘’ఏకాలం లో దేహాన్ని విడుస్తాడో చెప్పండి ‘’అని అడిగాడు .యాజ్ఞవల్క్యుడు ‘’మరణకాలం లో స్వయం ప్రకాశాత్మ మోహా మొహాలు లేనిదైనా, మోహం ఉన్నది అవుతుంది .వాగింద్రియాలు ఆత్మనుపొంది ,హృదయాకాశం లో ప్రవేశిస్తాయి .చాక్షుసు అంటే సూర్యాంశ స్వభావం కల పురుషుడు మరణకాలం లో అధిష్టాన దేవత అయిన అగ్ని మొదలైనవాటిని వాక్కు మొదలైనవి పొందగా విముఖుడై పరావర్తనం చెందినవాడు అవుతాడు .పురుషుడు ఇంద్రియ సముదాయం తో ఎకీ ఏకీభ వి౦చినపుడు చూడడు, వినడు, వాసన, రుచి కూడా చూడడు పలకడు స్పృశించడు అని ప్రాజ్ఞులు చెప్పారు ఇలా అన్ని ఇంద్రియాలు పరమపదం పొంది ,విజ్ఞానమయమైన  ఆత్మతో కలిస్తే ,హృదయ రంధ్రం యొక్క ,జీవన నిర్గమ స్థానమైన నాడీద్వారం ప్రకాశిస్తుంది .అప్పుడు ఆత్మ బయటికి కన్ను ,శిరస్సు వగైరా లనుండి బయటకు వెడుతుంది   .ఇలా విజ్ఞానమయ ఆత్మ లేచిపోయినపుడు ప్రాణాలు దాన్ని అనుసరిస్తాయి . ప్రాణాలు అంటే వాక్కు మొదలైన ఇంద్రియాలు .ఆత్మ కర్మా దీనం వలన స్వప్నం లో లాగా ,విశేషజ్ఞానం కలదై ప్రకాశించే దానినే పొందుతుంది .విద్యాకర్మలు పరలోకానికి వెళ్ళే ఆత్మను అనుసరిస్తాయి .విషయ ప్రజ్ఞ అంటే కర్మఫల రూపమైన వాసన కూడా అనుసరిస్తుంది .పూర్వ వాసనవలన మళ్ళీ పొందిన శరీరం లో  ఆత్మభావన పొందుతుంది .ఉన్నదేహాన్ని వదిలి దాన్ని అచేతనం చేసి ,పిత్రియ ,గాంధర్వ ,దైవ ,ప్రాజా పత్య  బ్రహ్మ లేక ఇంకేదైనా రూపం పొందుతుంది .ఇది పూర్వపు దానికంటే కొత్తగా శుభకరంగా ఉంటుంది ‘’అని చెప్పగా జనకుడు జీవుడికి బద్ధసంజ్ఞ కల ఉపాదులేవి ?అని అడిగాడు .

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -32

ఉపాధుల గురించి చెబుతూ యాజ్ఞవల్యుడు ‘’జనన మరణ ప్రవాహరూపమైన సంసారం కల జీవుడు సంపూర్ణ పరబ్రహ్మమే .ఈ పరబ్రహ్మం దేహం లో బుద్ధితోకూడి విజ్ఞానమయమవుతుంది .మనసుతోకలిసి మనోమయమౌతుంది .ప్రాణం తోకలిసి ప్రాణమయమౌతుంది  .నేత్రాలతో నేత్రస్వరూపం  శ్రోత్రం తో శ్రోత్ర స్వరూపం అలాగే పృధ్వీ జల వాయు ఆకాశ తేజోమయ అజోమయ గ్రామమయ అకామమయం,క్రోధ అక్రోధమయం ,ధర్మ అధర్మమయ సర్వమయం అవుతోంది .కనుక మంచి చేస్తే మంచివాడు చెడు చేస్తే చెడ్డవాడు అవుతున్నాడు .కొందరు పురుషుని కామమయుడ౦టారు .కర్మఫలం అపేక్షించేవాడు కర్మఫలం పొందుతాడు .అతని మనసు దేనిమీద లగ్నమైతే అదే కర్మలి౦గ మవుతోంది .ఈలోకం లో చేసిన కర్మఫలం పరలోకం లో అనుభవించి ,కర్మఫలావసానం పొంది ,మళ్ళీ ఆలోకం నుంచి ఈలోకానికి కర్మలు చేయటానికే  వస్తాడు .  కర్మఫలం కోరక ,కోరికలు లేక ఆత్మకాముడు అవుతాడుఐన  వాడి ప్రాణాలు విడిచిపోవు .ఇక్కడే బ్రహ్మమై పరబ్రహ్మమౌతాడు .హృదయం లోఇహ పర కోరికలు లేనివాడు చావులేనివాడౌతాడు.ఈ శరీరం లోనే పరబ్రహ్మ అవుతాడు. ప్రాణమే బ్రహ్మము .ప్రాణమే జగత్తును ప్రకాశి౦ప జేసే  విజ్ఞాన స్వరూప తేజస్సు .’’అని చెప్పగా  ‘’మళ్ళీ వెయ్యి ఆవులనిస్తున్నాను.మోక్షం కలుగుతుంది అని చెప్పే మంత్రాల అర్ధం చెప్పండి  ‘’అన్నాడు జనకుడు .

   యాజ్ఞవల్క్యుడు ‘’పరమాత్మ స్వరూపమైన బ్రాహ్మణుడు బ్రహ్మ విద్యా రూపమైన మోక్షమార్గం తెలుసుకోవాలి .ఆత్మ తత్త్వం తెలిసి ,నేనే పరబ్రహ్మ అని అని ప్రత్యక్షం చేసుకోన్నవాడే సర్వానికి కర్త అవుతాడు .వాడే ఆత్మ. ఆత్మ వాడే .వాడికి సర్వం ఆత్మ. .సర్వానికి వాడే ఆత్మ .కనుక అద్వితీయం, ఏకం అయిన పరమాత్మ నేనే అని తెలుసుకోవాలి .పరబ్రహ్మాన్ని తెలుసుకొంటే ముక్తులౌతారు .తాను  నాశరహితమైన పరబ్రహ్మంను  తెలుసుకొని పరమాత్ముడనయ్యానని ఉపాసన చేస్తే, ఆ పరబ్రహ్మ తేజం ప్రాణానికి ప్రాణం నేత్రానికి నేత్రం ,మనసుకు మనసు అని తెలిస్తే పరబ్రహ్మాన్ని నిశ్చయంగా తెలుసుకోన్నవాడౌతాడు .సద్గురు ఉపదేశం, పరమార్ధ జ్ఞానం మనసును సంస్కరిస్తుంది .ఇలాంటి మనసు చేతనే పరబ్రహ్మం ను తెలుసుకోవాలి ‘’అన్నాడు మహర్షి .

  జనకుడు ‘’వాక్కు ,మనసులకు అతీతుడైన పరాబ్రహ్మాన్ని చూడటానికి మనసు ఎలా సాధనం అవుతుంది ?’’అని ప్రశ్నించాడు .మహర్షి ‘’మనసు పరబ్రహ్మాన్ని గోచరి౦ప నిది అయినా , శ్రవణ మనన నిధి ధ్యాసాదులచేత సంస్కరి౦ప బడి పరబ్రహ్మాకారం అవుతుంది .అలాంటి మనసు చేత పరబ్రహ్మను  అనుసరించి  చూడాలి .పరబ్రహ్మ దర్శన విషయం లో ఏకత్వం లేదు .ఇలా చూసినవాడు మరణం వలన చావు పొందుతాడు. ఈ పరబ్రహ్మ నిత్యం .అప్రమేయం. దీన్ని అనేక రకాలుగా అనుసరించి చూడాలి .ఈ ఆత్మ గొప్పది .ధృవమైంది ,జన్మలేనిది ధర్మాధర్మాలు లేనిది .ఆకాశం కంటే  సూక్ష్మమైనది .అలాంటి పరమాత్మను తెలుసుకొని ప్రజ్ఞ కలిగించుకోవాలి .ప్రాణం లో విజ్ఞానమయ స్వరూపుడు .గొప్పవాడు ,పుట్టులలేని ఆత్మ స్వరూపుడు .అతడు బుద్ధి యొక్క విజ్ఞానానికి ఆశ్రయమైన ఆకాశం లో ఉంటాడు. అన్నీస్వాధీనం లో ఉంటాయి.నియామకుడు .ప్రభువు .ఇతడిని వేదవాక్యాలతో,యజ్ఞం తపస్సు చేత  తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు .పరమాత్మ లోకం కావాలనుకోనేవారు సన్యసిస్తారు .ఆత్మ సకల కార్య ధర్మాలను అతిక్రమించి ఉంటుంది .సర్వం తానే అయిఉంటుంది .దేనికీ అంటుకోదు .పాపాలను అతడే దహించి వేస్తాడు. ఇతడే విపాపుడు అంటే పాపరహితుడు. విరజుడు అంటే కామరహితుడు. అవిచికిత్సుడు అంటే సందేహ నివర్తకుడు .అతడే బ్రహ్మం .అదే బ్రహ్మలోకం ‘’అని బ్రహ్మోప దేశ ప్రసంగాన్ని ముగించాడు యాజ్ఞవల్క్యుడు .

  జనక చక్రవర్తి పరమాన౦ద భరితుడై ‘’మహాత్మా మహర్షీ యాజ్ఞవల్క్య అవతార పురుషా !నీకు నా విదేహ రాజ్యం అంతా ఇచ్చేస్తున్నాను .ఇకనుంచి నేను మీ సేవకుడను ఆజ్ఞాపించండి ‘’’అని వేడుకొన్నాడు .జనకపురం లో ఉండి  యాజ్ఞవల్క్యుడు ఋషులకు బ్రహ్మోపదేశం చేశాడు .యోగాభ్యాసం చేయించాడు .

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -33.

తురీయాశ్రమం

ఒకసారి మిధిలానగర వనం లో శిష్యులతో జనకమహారాజుతో ఉన్న యాజ్ఞవల్క్యునితో బృహస్పతి ‘’మహర్షీ !దేవుల అంటే ఇంద్రియాల ,దేవయజనాల అంటే ఇంద్రియ అధిష్టాన దేవతల,బ్రహ్మ సదనానికి కురుక్షేత్రం ఏది ?’’అని అడిగాడు .’’అవిముక్తమే కురుక్షేత్ర౦ .ఎక్కడికి పోయినా అదే కురుక్షేత్రం అనే భావన తో ఉండాలి .అందులోనే జీవకోటి ప్రాణాలు ఉత్క్రమణ చెందేటప్పుడు రుద్రుడు అంటే మనసు ,తారకము అంటే సంసార తరణకారణమైన బ్రహ్మం, ఆ కారణం వలన  అమృత వంతుడై మోక్షం పొందుతాడు కనుక అవిముక్తాన్ని సేవించాలి  ‘’అన్నాడు. మహర్షి.అత్రి ‘’అన౦త ,అవ్యక్తాత్మను ఎలా తెలుసుకోగలం ?’’ప్రశ్నకు ‘’ఉపాస్య మైన ఆత్మ అవ్యక్తం లోనే ప్రతిస్టింప బడి ఉంది. అది వరణలో, కాశి లో ప్రతిస్టింపబడి ఉంది. అన్ని ఇంద్రియాల పాపా లను నశి౦ప జేసేదే కాశి .అవిముక్తం యొక్క స్థానం లేక ధ్యాస భ్రువు  ఘ్రాణం ల యొక్క మధ్య ప్రదేశం .ఇదే ద్యౌర్లోకం అంటే మస్త ,కపాల రూప స్వర్గ లోకం.,పరలోకం అంటే చుబుకావ సానమైన భూలోకం  యొక్క సంధి అవుతుంది. అది అ౦తరిక్షలోకం తో సమానం .అన్నీ ఈ అవిముక్తం లోనే సంధానం చేయబడతాయి కనుక సంధి అని పిలుస్తారు బ్రహ్మవేత్తలు .దీనిలోనే ఉపాసిస్తారు ‘’అని వివరించగా శిష్యులు ‘’దేన్ని  జపిస్తే మోక్షం వస్తుంది?’’అని అడిగారు .’’శతరుద్రీయం జపిస్తే .అది అమృతం అనే పేరుకలది .వాటివలననే అమృతుడౌతాడు ‘’అని సెలవిచ్చాడు .

  జనకుడు ‘’సన్యాసం గురించి వివరించండి ?’’అని అడుగగా ‘’విరక్తి శూన్యుడు బ్రహ్మ చర్యం పూర్తి చేసి ,స్నాతకుడై మొదటి ఆశ్రమ౦ పై విరక్తుడుకావాలి. ఒకవేళ దానిమీదే ఆసక్తి ఉంటె ఒకటి నుంచి నాలుగు వేదాలు లేక షడంగాలు న్న స్వశాఖ కాని గురు శుశ్రూష పూర్వకంగా అధ్యయనం చేసి సమావర్తనం అనే కర్మ చే ముగించి యవ్వనం రాగానే గార్హస్త్యాశ్రమను  స్వీకరించాలి . దీనిపై ఇచ్చ లేకపోతే కందమూలాలు ఆహారంగా అగ్ని హోత్రం చేస్తూ  లేక అగ్ని హోత్రం లేకుండాకూడా అరణ్యం లో ఉండాలి. వనస్తాశ్రమ౦  తీసుకున్నాక దానిపై కోరిక లేకపోతే చతుర్దాశ్రమ౦ సన్యాసాశ్రమ౦  లేక ప్రవృజాశ్రమం తీసుకోవాలి .’’అని వివరించగా ‘’వైరాగ్యంకలిగితే సన్యాసం లో విశేషాలు వివరించండి ‘’?అని కోరగా ‘’బ్రహ్మ చర్య  గృహస్థాశ్రమం   వనాశ్రమం లలో దేనిలోను౦చైనా  సన్యసించ వచ్చు .వ్రతి కాని అవ్రతికాని స్నాతుడుకాని అస్నాతుడుకాని అగ్నిహోత్రుడుకాని అనగ్ని హోత్రుడుకానీ కూడా  సన్య సించ వచ్చు’’అనగా ‘’దీనికి కాలపరమైన నియమాలున్నాయా ?’’అడిగాడు జనకుడు ‘’ఎప్పుడు వైరాగ్యం పుడితే అప్పుడే సన్యాసిగా మారవచ్చు ‘’అన్నాడు మహర్షి .

  ‘’సాగ్నికుడికి సన్యాసం లో ఇష్టి విశేషాలేమిటి ?జనకుని ప్రశ్నకు ‘’కొందరు ప్రజాపతి దేవతా ఇష్టిని మాత్రమే చేస్తున్నారు .అది విధానం కాదు. అగ్ని దేవతాత్మక ఇష్టి నే చేయాలి .కారణం అగ్ని అంటే సాధనాత్మఅయిన ప్రాణం .తర్వాత దానికంటే గొప్పదైన’’ త్రైధాతవేయమైన ఇష్టి’’ చేయాలి. అంటే ఇంద్ర దేవతాకమైన ఇష్టి చేయాలి .ఇది సత్వం –శుక్ల రూపం ,రజము –లోహ రూపం ,కృష్ణము –కృష్ణ రూపం కలది కనుక ఆపేరొచ్చింది .దీన్ని యధావిధిగా పూర్తి చేసి  ‘’ఆయంతే’’అనే మంత్రం తో అగ్నిని ఆఘ్రాణి౦చాలి ‘’అని చెప్పగా  ‘’నిరగ్ని కులకు సన్యాస విధి ఏది ?అని ప్రశ్నించిన రాజుకు ‘’గ్రామం లేక శోత్రియ స్థానం నుంచి పవిత్రాగ్ని తెచ్చి విరజాహోమాన్ని పురుష సూక్తం తో యదా శాస్త్రంగా వ్రేల్చి పూర్ణాహుతి చివర ‘’అయంతే యోనిః’’అనే మంత్రం తో అగ్నిని ఆఘ్రాణి౦చాలి .ఒకవేళ అగ్నిహోత్రం లభించకపోతే జలాలలో హోమం చేయాలి కారణం జలాలే సర్వదేవతలు .ఉదకస్థలం లో పూర్ణాహుతి నిర్వహించి ‘’సర్వాభ్యోదేవతాభ్యో జుహోమి స్వాహా ‘’అనే మంత్రం తో హోమం చేసి హుత శేషాన్ని భుజించాలి .హుత శేషం రోగ నివారకం అమృతం  ప్రణవమే ఈ మూడురూపాల కు మోక్షం అని తెలుసుకోవాలి. అదేబ్రహ్మం దానినే జపించాలి ‘’అని స్పస్ట పరచాడు .’’

   ఆత్రిముని ‘’యజ్ఞోపవీతం లేనివాడు బ్రాహ్మణుడు ఎలా ఔతాడు “’అని అడుగగా ‘’స్వసాక్షికమే అంటే స్వయం ప్రకాశ రూపమే పరమహంసకు యజ్ఞోపవీతం .ప్రైషానంతరం శిఖా ,యజ్నోపవీతాలను ఉదకం లో పడవేసి  మూడు సార్లు ఆచమనం చేయాలి .ఇదే పరివ్రాజకులకు విధి .వీరాద్వం లో నడిచి కాని ,అనాశక వ్రతం ఆచరి౦చి కాని, నీటిలో పడికాని మహా ప్రస్థాన మెక్కి కాని శరీరాన్ని విడిచిపెట్టాలి .సన్యాసి కాషాయాంబర దారి  శిఖా కేశ మీసాలు లేనివాడు ,అపరిగ్రహుడు  శుచి  అద్రోహి ప్రాణం నిలవటానికి మాత్రమే  మాధుకరం భిక్ష చేసి  భుజించేవాడు అయితే బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడు ‘’అని విడమరచి వివరించాడు యాజ్ఞవల్క్యుడు .

జనకుడు ‘’ఆతుర సన్యాసం ‘’విశేషాలు చెప్పండి మహాత్మా !’’అని అడిగాడు .’’మనసు వాక్కు చేత సన్య సి౦చాలి  .ఇది వేదమార్గం  దీనిననుసరిస్తే  బ్రహ్మవేత్త ఔతాడు.సంవర్తకాదులు ,పరమ హంసలు రహస్యమైన ఆచారాలు పాటిస్తూ ఇతరులకు ఉన్మత్తులుగా అనిపిస్తారు .పరమహంసలు త్రిదండం కమండలం ,శిక్యం , ,పవిత్ర జలపాత్ర,శిఖా ,యజ్ఞోపవీతాలను ‘’భూ స్వాహా ‘’అనే మంత్రం చేత జలం వదిలి ఆత్మ సాక్షాత్కారం పొందాలి .యదా జాత రూపజాతుడు అంటే దిగంబరుడు నిర్ద్వంద్వుడు ,నిష్పరిగ్రహుడు ,బ్రహ్మ సాక్షాత్కార వంతుడు ,పరిశుద్ధ హృదయుడు అయి ,ప్రాణ ధారణం కోసం నియమిత కాలాలలో కడుపు అనే పాత్రలో భిక్షాన్నం ఉంచాలి .లాభానస్టాలు సమానంగా భావించాలి  .శిధిల దేవాలయం, పుట్ట వృక్షమూలం ,కుమ్మరి ఇల్లు ,  అగ్ని హోత్ర శాల , ఇసుక దిబ్బ ,కొండగుహ ,చెట్టు తొర్ర సెలయేరు ఎడారి లలో ఎక్కడైనా నివసించాలి .నిర్మముడు ,అప్రయత్నుడు ,ప్రణవ ధ్యాన పరాయణుడు ,అంతర్ముఖుడు అయి, సన్యాసం తో దేహాన్ని త్యజించాలి ‘’అని చెప్పి భార్య మైత్రేయితో ‘’నేనూ ఊర్ధ్వాశ్రమానికి అంటే  సన్యాసాశ్రమానికి పోవాలను కొంటున్నాను.దీనికి నీ అనుమతి నాకు కావాలి .నీకు కాత్యాయినితో పాటు నా ధనాన్ని సమానంగా ఇచ్చేస్తాను ‘’ .అన్నాడు యాజ్ఞవల్క్యుడు.

   మైత్రేయి ‘’మీరు ఇచ్చే ధనమే కాదు  సమస్త ద్రవ్యాలతో కూడిన ఈ భూమి నంతా నాకు ఇస్తే మాత్రం నేను ముక్తురాలనౌతానా ?’’అని ప్రశ్నించింది .’’ముక్తికలుగదు కాని సుఖజీవనం లభిస్తుంది ‘’అన్నాడు .’’ముక్తినివ్వని ఆ ధనంనాకు వద్దు . మోక్షసాధన మే చెప్పండి ‘’అన్నది .’మైత్రేయిని దగ్గరకు రమ్మని కూర్చోబెట్టుకొని ఆప్యాయంగా ‘’నీకు ఇష్టమైన మోక్షసాధనం గురించి చెబుతాను .ఏకాగ్ర చిత్తం తో విను .భర్త తన ప్రయోజనం కోసం కాక ఆత్మ కోసమే ప్రియుడు ఔతాడు  .అలాగే భార్యాపుత్రులు డబ్బు అన్నీ తమ ప్రియానికై ప్రియం కాక ఆత్మ ప్రయోజనానికే ప్రియం ఔతాయి ..మనన నిధి ధ్యాసాదులవలన విజ్ఞానం చేతా సమస్తమూ తెలుస్తాయి .ఆత్మ స్వరూపాన్ని అతిక్రమించి ఏదీ ఉండదు .అప్పుడే సర్వం ఆత్మ స్వరూపమౌతుంది .నామ రూప వికారాలు కల జగత్తుకంటే పూర్వమే ప్రజ్ఞాన ఘన రూపమైన ఆత్మ ఉన్నది .వేదాలనుంచి వాదాలదాకా సకలానికి ముఖ్యస్థానం అదే .’’అన్నాడు . చర్మానికి సమస్త స్పర్శలు ,జిహ్వకు సకలరూపాలు ,నాసికకు అన్ని రకాలైన గంధాలు ,నేత్రానికి అన్ని రూపాలు ,చెవికి సకల శబ్దాలు మనసుకు సకల సంకల్పాలు  బుద్ధి సకల విద్యలకు ,చేతులు సకలకర్మలకు యోని సకలాన౦దానికి , గుదం సకల మల విసర్జనకు ,పాదాలు సకలగామనాలకు వాక్కు సకల వేదాలకు ముఖ్య స్థానాలౌతున్నాయి ‘’అని వివరించాడు.

  మైత్రేయి ‘’కనిపించేదంతా లయమైతే సర్వం బ్రహ్మం ఎలా ఔతుంది ?’’అని అడిగింది మైత్రేయి .’’బాహ్యాభ్యంతరం లేని ఆత్మ ప్రజ్ఞాన ఘనమైందే. అంటే విశేష జ్ఞానం యొక్క ఘన స్వరూపం ఔతోంది .ఈ ఆత్మ భూతాలనుండి పుట్టి ,వాటిని అనుసరించి మరణిస్తుంది .జ్ఞానోదయానికి ముందు విశేష జ్ఞానం కలిగి మరణం తర్వాత భేదమనేది లేని బ్రహ్మం ఔతుంది .’’అన్నాడు .’’తమరు పరబ్రహ్మం లో విరుద్ధ ధర్మాలున్నాయని చెప్పటం చేత నాకు భ్రాంతి కలుగుతోంది .ఇదివరకు జీవాత్మ విజ్ఞాన ఘన స్వరూపం అని చెప్పారు మీరు .చనిపోయాక జీవాత్మకు ‘’నేను వీడు ‘’అనే లక్షణాలు కల విశేష జ్ఞానం లేదని ఇప్పుడు అంటున్నారు ?’’అని అడిగింది .యాజ్ఞవల్క్యుడు ‘’నేనలా చెప్పలేదే .అజ్ఞానం చేత ఆత్మకు దేహే౦ద్రియ మైన జీవభావం కలిగింది .అది జ్ఞానం చేత నశి౦చగా ,శరీరాది సంబంధ మైన సంజ్ఞఅంటే నేను వీడు అనే భావం ఉపాధి లేకపోవటం వలన నీరు లేకపోతె చంద్రుని ప్రతిబింబం కనపడనట్లు లేకుండా పోతుంది . సర్వం ఆత్మ స్వరూపమైనప్పుడు దేనితో చూస్తాడు ఆఘ్రాణిస్తాడు రుచి చూస్తాడు పలుకుతాడు ?ఆత్మకంటే వేరే ఏదీ లేకపోవటం వలన ఇతరాలను తెలుసుకోవటానికి వీలే లేదు .నేతి నేతి నిశ్చయ భావనతో ఆత్మ ఆకారం లేనిదని తెలుసు కోవాలి .ఆత్మయే ఆత్మను తెలుసుకోవాలి .ఇదే అమృతత్వం ‘’అన్నాడు .’

   ఇలా యాజ్ఞవల్క్య మహర్షి బ్రహ్మవాదిని అయిన మైత్రేయికి అమృత తత్వాన్ని బోధించి సన్యసించి ,నిత్యాన౦దు డయ్యాడు .

 ఓం ఇతి  తత్సత్

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర సంపూర్ణం .

ఆధారం – 

శ్రీ భాగవతుల లక్ష్మీ పతి శాస్త్రి గారు రచించిన ‘’కణ్వ గురు వాజసనేయ యాజ్ఞ వల్క్య చరిత్రం ‘’.

ప్రకటన……శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ....ఉయ్యూరు. ..... సెల్ నెంబర్.9989066375   

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.