గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, నవంబర్ 2025, శనివారం

డా. నలవోలు నరసింహారెడ్డి. మువ్వల - సవ్వడి. ఆవిష్కరణ సందర్భముగా సమర్పించిన పంచరత్నములు.

 జైశ్రీరామ్.


ఓం శ్రీమాత్రే నమః.

డా. నలవోలు నరసింహారెడ్డి.

మువ్వల  -  సవ్వడి.

గ్రంథావిష్కరణ సందర్భముగా నా శుభాకాంక్షలు తెలుపుతూ 

సమర్పించిన 

పంచరత్నములు.

1.శా. శ్రీమన్మంగళ భారతీసతి లసచ్చిద్రూప మాంధ్రమ్ము, స

ద్ధీమంతుల్ నరవోలువంశతిలకుల్ దేదీప్యమానంబుగాఁ

బ్రేమన్ రాజిలఁజేయ పద్య కవితల్ విఖ్యాతిగాఁ జేయుచున్

క్షేమంబున్ గలిగించు లోకమునకున్ చిన్మార్గ సద్వర్తియై.


2.చం.  నిరతము పద్యసద్రచన నేర్పుటకున్ కృషిచేయుచున్, సదా

పరహితమున్ దలంచుచును బాధ్యతగైకొని చేయుచుందు రం

తరములు లేని సౌమ్యులు, ముదంబున చూతురు పల్కరింతురీ

నిరుపమ ధన్యజీవికి గణింపు సరస్వతి తేజమే కనన్.


3.సీ.  ఆంధ్రబాలశతక మసమానముగనైదుసంపుటంబులు ముద్ర నింపుఁ జేసి,

ధీవరేణ్యశతక దీప్తులు వెలయించి, చిగురుమొగ్గలు కూర్చిచిత్తమలర,

నరుణకిరణముల నపురూపముగ వ్రాసి, సంక్రాంతిలక్ష్మి ప్రశస్తి వ్రాసి,

రుణోదయంబను నిరుపమ కృతిఁ జేసి, తెలుఁగు భాషశతకమిలను నిలిపి,

తే.గీ.  అనుపమ ధరణీ వేదన వినఁగఁదెల్పి,

తెలుఁగు సారస్వతచరిత్ర వెలుగులీని,

తెలుగుసారస్వతచరిత్ర తెలియఁ జెప్పి,

మువ్వల సవ్వడిన్ మురిసె నేడు.


4.చం.  గరువ మొకింతలేదు, గుణగణ్యులు, ధారణకంతులేదు, సు

స్తిర వరభావనాన్వితులు, చిత్తసరోజమునందు వాక్సతిన్

నిరుపమరీతి నిల్పి,  మహనీయతఁ దెల్గునకున్ రచించు, స

ద్వరనరసింహరెడ్డి కవిపండితునేమని చెప్పఁజాలుదున్?


5.ఉ.  మంగళమీకవీంద్రునకు, మంగళముల్ మన తెల్గు భాషకున్,

మంగళముల్ సభాస్థలిని మాన్యులకెల్లను నెల్లవేళలన్,

మంగళముల్కవీంద్రులకు,మంగళముల్ వరభక్తపాళికిన్,

మంగళమౌత శాంభవికి, మంగళముల్ మన దేశ మాతకున్.

రచన, సమర్పణ .. చింతా రామకృష్ణారావు.తే.09 - 11 - 2025.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.