గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, నవంబర్ 2025, సోమవారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్ఫూర్తి గీతం, రచన శ్రీ చింతా రామకృష్ణారావు.గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

జైశ్రీరామ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ఫూర్తి గీతము.

రచన.   …   చింతా రామకృష్ణారావు. 8247384165

గానము ... శ్రీమతి వల్లూరి సరస్వతి.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్ఫూర్తి గీతము.

జయమమ్మ! జయమమ్మ శ్రీ యాంధ్రమాతా! 

జగతికే వెలుగైన శాంత ప్రపూతా! 

జయమమ్మ జయమమ్మ శ్రీ యాంధ్రమాతా!!


1. శ్రీకాకుళాదిగా శ్రీయనంతపురంబు 

వ్యాపించియున్న నీ ప్రఖ్యాత సద్వ్యాప్తి

కారుణ్య పరిపూర్తి, కమనీయ గుణదీప్తి, 

కవుల కెన్నగ సాధ్యమా?  …   మా తల్లి! 

బ్రహ్మకైనను వేద్యమా? మా తల్లి! బ్రహ్మకైనను వేద్యమా? ....   జయమమ్మ! జయమమ్మ ll


2. గోదావరీ, కృష్ణ, తుంగభద్రా, పెన్న, 

కిన్నెరసాని, యా కుందేరు, గోస్తనీ,

గుండ్లకమ్మా, వంశధారా సుధా సార 

సౌందర్యమెన్న గలమా?  …  మా తల్లి

గొంతెత్తి పాడగలమా? మాతల్లి గొంతెత్తి పాడగలమా? ....   జయమమ్మ! జయమమ్మ ll


3. ఆంధ్రామృతోద్భాస మమరావతీ ద్యుతుల్,

వర పోలవర దివ్య వరణీయ భాగ్యముల్

పరమ పావని నీదు ప్రఖ్యాతి గురుతులే

వివరింప సాధ్యమగునా?  …  నీ కన్న

పరమాత్మ వేరె యగునా? నీ కన్న పరమాత్మ వేరె యగునా? ....   జయమమ్మ! జయమమ్మ ll


4. ఆదిశక్తివి నీవు, అన్నపూర్ణవు నీవు,

అవధాని వర్యుల కాటపట్టువు నీవు,

కవుల కాణాచివౌ కల్పవల్లివి నీవు,

చిత్రకవికోవిదులకున్,  …   మా తల్లి

క్షేత్రంబు నీవె జగతిన్,  మాతల్లి క్షేత్రంబు నీవె జగతిన్,  ....   జయమమ్మ! జయమమ్మ ll


5. అన్నవరంబును, సింహాచలంబును,

తిరుమలగిరియును, మంగాపురంబును,

రామతీర్థంబును, శ్రీ హర్షవల్లియున్,

దేవతాప్రాంగణములే,  …  నీ నేల

కల్యాణ తోరణములే, నీ నేల కల్యాణ తోరణములే.  ....   జయమమ్మ! జయమమ్మ ll


6. మహిళావధానులు, మహనీయ సుకవులు,

వేదాంత వేద్యులు, విశ్వప్రపూజ్యులు,

శ్రామికుల్, పాలకుల్, జయమార్గ సూచకుల్

ఆంధ్రతేజము జగతిలో …   మాయమ్మ

సుందరంబుగ వెలుగునే నాతల్లి! సుందరంబుగ వెలుగునే.  ....   జయమమ్మ! జయమమ్మ ll


7. ఆత్మాభిమానులకాలవాలము నీవు

అనితరప్రతిభులనమరియుందువు నీవు,

ఆదిశక్తివి నీవు, అమృతమూర్తివినీవు,

ఆంధ్రమాతా! బిడ్డగా …   మాయమ్మ!

నన్ను నీకే పుట్టనీ! మాయమ్మ నన్ను నీకే పుట్టనీ.  ....   జయమమ్మ! జయమమ్మ ll

జైహింద్.
Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

జైహింద్ మామ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.