జైశ్రీరామ్.
శ్రీ లలితా సహస్రమున స్వయంకల్పిత వృత్తములు.
అరుణ ప్రభాపూర్ణ వృత్తము.
గణములు స జ త మ ర వ....యతి 10 వ అక్షరము.ప్రాసనియమము కలదు.
12. ఓం నిజారుణ ప్రభాపూరమజ్జద్భ్రహ్మాండ మండలాయై నమః.
నామ వివరణ.
తన అరుణ కాంతులతో ముంచఁ బడిన బ్రహ్మాండ మండలములు కలది అమ్మ. ఆత్మ జ్ఞాని తనను తాను బ్రహ్మముగా నెఱుఁగుచు తనలోననే గల బ్రహ్మాండమండలమున వ్యాపించిన అమ్మవారి అరుణారుణ ప్రభను అత్మ శక్తితో చూడగలుఁగును. అట్టి వ్యాప్తి కలది అమ్మ.
స్వయం కల్పిత అరుణ ప్రభాపూర్ణ వృత్తము
నిను నే కవిత్వమందున్ గణింపన్ సాధ్యంబొకో సుధా
మ! *నిజారుణ ప్రభాపూరమజ్జద్భ్రహ్మాండ మండలా*!
నిను నంతటన్ గణింతున్ మనీషాళిన్ వెల్గుచుందువే
వనితాకృతుల్ గనంగన్ భవానీ! నీవే వెలుంగుదే.
అష్టమీ చంద్ర కళ వృత్తము.
గణములు. ర ర భ జ జ ర గ. యతి 16 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
15. ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థలశోభితాయై నమః.
నామ వివరణ.
అష్టమి నాటి అర్థచంద్రాకరమయిన నొసటి ప్రదేశంతో ప్రకాశించునది జనని.
స్వయం కల్పిత అష్టమీ చంద్ర కళ వృత్తము.
*అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థల శోభితా*! నమస్తే,
కష్టముల్ వాపి మమ్మేలుమ పరాత్పర! మమ్ము కావుమీవే,
నిష్టతో నేను నిన్ గొల్తును శుభాస్పద! కావు నీవె నన్నున్
నష్టపోనీయ కీజన్మను గుణాలయ! కాపు నాకు నీవే .
ఆనందవల్లి వృత్తము. గణములు.. మ స ర మ జ గ. యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
365. ఓం స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానందసంతత్యై నమః.
నామ వివరణ.
తన ఆనందములో లవలేశమాత్రమే అయిన బ్రహ్మాద్యానంద సమూహము కల
జనని.బ్రహ్మానందము అనేటువంటివి ఈ తల్లి ఆనందములో అణుమాత్రమే. అట్టి ఆనందముల
సమూహము కల తల్లి.
స్వయం కల్పిత ఆనందవల్లి వృత్తము.
*స్వాత్మానంద లవీ భూత బ్రహ్మా ద్యానంద సంతతీ*!
ఆత్మజ్ఞానము లేదమ్మ! హాయిన్ బొందంగ సాధ్యమా?
స్వాత్మన్నీవె వసింపంగ సాంతంబీవేగ చూడనౌ
నాత్మ జ్ఞానము నాకి మ్మహమ్మే పాయన్, శుభాస్పదా!
ఆహ్లాదకౌముది వృత్తము. గణములు.. స త న స ర వ. యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
403. ఓం మహా కామేశ నయన కుముదాహ్లాద కౌముద్యై నమః.
నామ వివరణ.
మహా కామేశ్వరుని కన్నులనెడి కలువలకు ఆనంద వికాసములు కలిగించు వెన్నెలవెల్లువ అమ్మ.
స్వయం కల్పిత ఆహ్లాదకౌముది వృత్తము.
సుమతీ! మాపై కృపను వసుధపై నుండరాదొ నీ
కు, *మహా కామేశ నయన కుముదాహ్లాద కౌముదీ*!
సుమతుల్ నీ వాగ్భవమగు సుధలన్ గ్రోల నుండిరే,
నిమిషంబైనన్ నిను గనని భవంబెన్న వ్యర్థమే.
కదంబ మంజరీ వృత్తము.
గణములు..జ ర ర జ జ గ. యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
21. ఓం కదంబమంజరీ క్లప్త కర్ణపూర మనోహరాయై నమః.
నామ వివరణ.
కడిమి పూలతో చేయఁబడిన కర్ణాభరణములతో మనోహరమైన తల్లి.
స్వయం కల్పిత కదంబ మంజరీ వృత్తము.
*కదంబమంజరీక్లప్త కర్ణపూర మనోహరా*!
మదంబ వీవెగా, కావు మమ్ము నీవిక ప్రేమతో,
ముదంబుతోడ నాపూజ పూర్తిగా గ్రహియింపుమా,
హృదిన్ వసించి నీవున్న హృద్య కావ్యము వెల్వడున్.
కనకాంగద వృత్తము.
గణములు....." స .. స .. భ .. జ .. జ .. గ " . యతి ..... 9 వ అక్షరము. ..... ప్రాస నియమము కలదు.
31. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః.
నామ వివరణ.
బంగారముతో చేయఁబడిన కేయూరములు, అంగదములు ధరించిన కమనీయ భుజములు కలది
మన జగన్మాత.
స్వయం కల్పిత కనకాంగద వృత్తము.
మనమందున నిన్ నేను మనమందును శాంభవీ!
వినుతించెద నే నిన్ను వినుతిన్ విను శాంభవీ!
కనికారము నీకున్నఁ గని నన్ గృపఁ బ్రోవుమా,
*కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా*!
కమలసేవిత వృత్తము. గణములు. జ .. ర .. భ .. య . జ . గ., యతి 9వ అక్షరము.
590. ఓం కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవితాయై నమః
నామ వివరణ.
పరమేశ్వరీ కటాక్షవీక్షణములెవరి యందుండునో అట్టివారిని కోటి మండి లక్ష్ములు
సేవించుచుందురు, ఆవిధముగా లక్శ్ములచే సేవిండు కటాక్షములు కలది అమ్మ.
స్వయం కల్పిత కమలసేవిత వృత్తము.
ప్రాస నియమము కలదు.
*కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవితా *!
జటాధరుండు నీతోడ సదయన్ వెల్గుతన్ మదిన్,
కుటుంబ రక్షకుల్ మీరు, కొలువుండన్ శుభంబ, నీ
కటాక్షముల్ కృపన్ నాకు గనుచు న్నీవె యిమ్మికన్,
కరాంగుళి వృత్తము.
గణములు న . భ . య . య . న . ర. యతి. 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
80. ఓం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః
నామ వివరణ.
రెండు చేతుల వేలి గోళ్ళనుండి ఉత్పన్నమయిన నారాయణుని దశావతారములు కలది అమ్మ.
స్వయం కల్పిత కరాంగుళి వృత్తము.
నిను వినా కనగ నేరన్, గణించన్ బరము, కావుమా
నను *కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతీ*!
మనములో నిలిచి, మన్నించుమా శాశ్వతముగా సతీ!
కనుము నన్ ఘనముగా నీవికన్, బాధలను బాపుమా.!
(ప్రణుతులమ్మ! శుభదాయీ! నివారింపుమిక బాధలన్.,)
కర్పూరవీటికా వృత్తము.
గణములు. త ర భ మ జ గ. యతి. 11వ అక్షరము. ప్రాస నియమము కలదు.
26. ఓం కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరాయై నమః.
నామ వివరణ.
కర్పూరము మొదలయిన సుగంధ ద్రవ్యములతో కూడిన తాంబూలము వేసుకొనుటచే దిక్కుల
చివర వరకు వ్యాపించిన తాంబూల పరిమళములు కలది అమ్మ.
స్వయం కల్పిత కర్పూరవీటికా వృత్తము.
*కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా*!
కార్పణ్యమున్ విడన్ జేసి, ననున్ గాపాడు తల్లివే,
దర్పంబునే మదిన్ బాపు. మహోదారా! మహేశ్వరీ!
కర్పూరహారతిన్ నీకు మనోజ్ఞా సేవఁ జేయనీ.
కామేశప్రియ వృత్తము.
గణములు. మ .. త .. త .. ర .. ర .. వ " . యతి ..... 10. .....వ అక్షరము. ప్రాస నియమము కలదు.
39. ఓం కామేశ జ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్వితాయై నమః.
నామ వివరణ.
కామేశ్వరునకు మాత్రమే తెలియఁబడిన మృదువయిన ఊరుద్వయ శోభిత అమ్మ.
ఊరుద్వయమును ఉ ఊ లుగ మనం సంకేతిస్తే ఉ సౌభాగ్యాన్ని, ఊ మర్దవాన్ని సూచిస్తాయి. ఈ
మార్దవ సౌభాగ్యాల సంధాన కర్త్రి అయిన అమ్మ అయ్యవారికి మాత్రమే సమగ్రంగా తెలియఁబడును..
స్వయం కల్పిత కామేశప్రియ వృత్తము.
మా *కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా*!
శ్రీకారంబందున్ నినుంగాంచ చిత్త మందున్ ముదంబునే,
నాకున్ నీ కైదండయే యండ, నాకుఁ గూర్చున్ శుభంబులన్,
లోకంబందున్ వేచు నన్ బాధలున్ గృపన్ జూచి కావుమా.
కామేశ్వరాస్త్ర వృత్తము.
గణములు. .. స . ర . య . స . భ . ర. .. యతి 11 వ అక్షరము. .. ప్రాస నియమము కలదు.
82. ఓం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ స భండాసుర శూన్యకాయై నమః.
నామ వివరణ.
కామేశ్వరాస్త్ర ప్రయోగానికి భండాసురునితో పాటు పూర్తిగ దగ్ధమైపోయిన శూన్యక పట్టణము కలది
అమ్మ.
స్వచ్ఛమైన ప్రేమామృతంలో నిర్మలమైన జ్ఞానాగ్నిలో లీనమైన అహంకారాజ్ఞాన స్థావరము కలది
అమ్మ.
స్వయం కల్పిత కామేశ్వరాస్త్ర వృత్తము.
క్షితిపైఁ బుట్టఁ జేసి, నన్నిట్లు చికాకుం బడఁ జేసితే,
మితియే లేని మాయ నన్ బట్టె, స్మృతిన్ బాపుచు నుండెనే,
బ్రతిమాలించుకొందువేలో? బరమేశానివి. కావు నన్
సతి! *కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ స భండాసుర శూన్యకా*!
కామేశ్వరీ వృత్తము.
గణములు . త . స . ర . స . జ . గ యతి 9 వ అక్షరము . ప్రాస నియమము కలదు.
77. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః.!
నామ వివరణ.
కామేశ్వరుని మఖావలోకముమాత్రమున గణేశ్వరుని కల్పించిన జనని.
స్వయం కల్పిత కామేశ్వరీ వృత్తము.
*కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా*!
నామాళిని నినున్ గాంతు నా మది వెల్గుమీవిఁకన్,
హేమాభ తను! వీకున్నదే కనలేని దేదియున్,
శ్రీమాతవు ప్రభాపూర్ణ! చేకొని కావుమా ననున్.
కురువింద వృత్తము.
గణములు. స స త మ జ గ.. యతి 11వ అక్షరము. ప్రాస నియమము కలదు.
14. ఓం కురువింద మణిశ్రేణీ కనత్ కోటీరమండితాయై నమః
నామ వివరణ.
కురువిందములనుండి పుట్టిన మణులవరుసచే ప్రకాశించుచున్న కిరీటము కలది జగన్మాత..
స్వయం కల్పిత కురువింద వృత్తము.
*కురువింద మణిశ్రేణీ కనత్ కోటీరమండితా*!
తెరవేది నినున్ గొల్వన్ సుబుద్ధిన్ నీవు గొల్పమిన్?
వర సేవలు నేఁ జేయంగ సద్భక్తిన్ మనన్ వలెన్,
వర భక్తిని నాకిమ్మింక నే వర్ధిల్లగా సతీ!
కౌసుంభ వృత్తము.
గణములు. "త .. భ .. త .. ర .. ర .. వ " . యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
37. ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తట్యై నమః
నామౌచిత్యము.
ఉదయించుచున్న సూర్యుని వలె అరుణ తేజముతో కనఁబడు వస్త్రముతో నొప్పుచున్న
కటిప్రదేశము కలది జగజ్జనని.
స్వయం కల్పిత కౌసుంభ వృత్తము.
భ*వ్యారుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తటీ*!
సవ్యంబుగా నిను వర్ణించి చక్కగా నేను వ్రాయనా?
భవ్యాత్మవీవని నిన్గొల్చి, పాప భారంబు వీడనా,
కావ్యాళిలో నినుఁ గాంచంగఁ గమ్మగా నుండు నమ్మరో!
851. ఓం జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిన్యై నమః.
నామ వివరణ.
పుట్టుక, వృద్ధాప్యము, మరణము అను వాటితో బాధపడు మానవులకువిశ్రాంతిని కలిగించు జనని.
స్వయం కల్పిత (కౌసుంభ వృత్తము.)తప్తజన విశ్రంతిద వృత్తము.
గణములు.. ర స భ య జ గ. యతి 9 వ అక్షరము.... ప్రాస నియమము కలదు
*జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయినీ*!
సన్మనోజ్ఞ శుభాకార సతమున్ నన్ను గావుమా,
మన్మతిన్ ప్రభవించున్ సుమధురంబైన భావనల్
జన్మ నీయని ముక్తిన్ నిజముగానిమ్ము సత్ కృపన్.
చక్రరాజ వృత్తము.
గణములు .. ర . స . ర . భ . జ . గ యతి .9 వ అక్షరము. ... ప్రాస నియమము కలదు.
68. ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః.
నామ వివరణ.
చక్రరాజ రథమునందుంచఁబడిన ఆయుధములచే అలంకరింపఁబడినది....శ్రీచక్రములో ఆత్మజ్ఞాన
సంపత్తితో అలంకరింపఁబడినది, సూర్యుఁడినే యిరుసుగా కలిగి ఖగోళమున అలంకరింపఁబడిన
సూర్యకుటుంబమనే ఏక చక్రమును అధిరోహించినది జగజ్జనని.
స్వయం కల్పిత ... చక్రరాజ వృత్తము.
*చక్రరాజ రథా రూఢ సర్వాయుధ పరిష్కృతా*!
వక్ర మార్గము నాకేల? వర్ధిల్లెదను సత్ప్రభన్,
చక్రి పూజిత శంభుండె సద్భాగ్యమగు నాకిలన్
విక్రమంబున మౌఢ్యంబు వీగంగనికఁ జేయుమా.
చలన్మీన వృత్తము.
గణములు.. జ త త య ర వ. యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
18. ఓం వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచనాయై నమః.
నామ వివరణ.
ముఖ కాంతి అనెడి ప్రవాహములో కదలాడుచున్న చేపల జంటతో సమానమైన కనుబొమ్మలు కలది
మీనాక్షి.
స్వయం కల్పిత చలన్మీన వృత్తము.
భవాని నీదౌ కృపా దృష్టి పరంబున్ గొల్పునమ్మరో!
కవిత్వ మీవై ప్రవాహంబుగ రమ్మా వెల్గులీనుచున్,
ప్రవేశమిమ్మింక నీ దివ్య పదమ్ముల్గాంచ, సత్యభా
స! *వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచనా*!
జ్వాలామాలిని వృత్తము.
గణములు......మ స ర మ జ గ. యతి 9 వ అక్షరము. .... ప్రాస నియమము కలదు.
71. ఓం జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకార మధ్యగాయై నమః.
నామ వివరణ.
జ్వాలామాలిని అనే నిత్యాదేవతచే ఆవరించఁబడిన అగ్నిప్రాకారములో మధ్యగా ఉండుతల్లి
శ్రీమాత.
మనలో నేను తాను అనే పదాలతో చెప్పఁబడే ఆత్మస్థానముననుండు జనని.
ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు ఎక్కడ లీనమై ఎక్కడనుండి ప్రారంభింపఁబడునో అచ్చట ఉండునది
శ్రీలలితాంబిక. ....
స్వయం కల్పిత...జ్వాలామాలిని వృత్తము.
*జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకార మధ్యగా*!
నీ లీలల్ వివరింపంగ నేనేరీతిన్ దగన్ గనన్
బాలా! నాకిల నీదండ వహ్నిప్రాకారమేకదా,
జాలిన్ జూపుమ,దేవీ ప్రశాంతిన్ నిత్యంబు గొల్పుమా.
తటిల్లతా వృత్తము.
గణములు. స .. ర .. య .. స .. న .. ర " . యతి 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
34. ఓం నాభ్యాలవాల రోమాలి లతా ఫల కుచద్వయ్యై నమః.
నామ వివరణ.
నాభి అనే పాదులో నూగారు అనే తీగకు పళ్ళువలె యొప్పుచున్న స్థనద్వయముతో ప్రకాశించు
జనని లలితాంబ.
స్వయం కల్పిత తటిల్లతా వృత్తము.
భ్రమలన్ మున్గి నే సుధాపూర్ణ పరంబు నిలఁ గాంచనే
క్షమతో నీవె నన్ను రక్షించగ నుంటి విట శ్రీసతీ!
క్షమ నీరూపు, నా చెడున్, నీవె శమింపగ నొనర్చు వై
ళమె, *నాభ్యాలవాల రోమాలి లతా ఫల కుచద్వయీ*!
(కౌసుంభ వృత్తము.)తప్తజన విశ్రంతిద వృత్తము.
గణములు.. ర స భ య జ గ. యతి 9 వ అక్షరము.... ప్రాస నియమము కలదు.
851. ఓం జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిన్యై నమః.
నామ వివరణ.
పుట్టుక, వృద్ధాప్యము, మరణము అను వాటితో బాధపడు మానవులకువిశ్రాంతిని కలిగించు జనని.
స్వయం కల్పిత (కౌసుంభ వృత్తము.)తప్తజన విశ్రంతిద వృత్తము.
*జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయినీ*!
సన్మనోజ్ఞ శుభాకార సతమున్ నన్ను గావుమా,
మన్మతిన్ ప్రభవించున్ సుమధురంబైన భావనల్
జన్మ నీయని ముక్తిన్ నిజముగానిమ్ము సత్ కృపన్.
తమోపహ వృత్తము.
గణములు..న జ య స న ర వ. యతి 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
44. ఓం నఖ దీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః.
నామ వివరణ.
తనకు నమస్కరించు జనులయొక్క అజ్ఞానమును పారద్రోలఁ గలిగిన కాలి గోరుల కాంతితో
నొప్పునది అమ్మ.
స్వయం కల్పిత తమోపహ వృత్తము.
మది నిలుమమ్మ! భవానీ! సుమనోహర కవిత్వరూపిణీ!
పదిలముగా మముఁ గాపాడి భవాంబుధిని దాటఁజేయుమా,
ముదమున నిన్నునుతింతున్ సముదంచితముగా వరాంగి!, జ్ఞా
నద! *నఖ దీధితి సంఛన్న నమజ్జన తమోగుణా*! నతుల్.
తమోభేదము వృత్తము. గణములు.. ర స ర య జ గ. యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
404. ఓం భక్త హార్ద తమో భేదభానుమద్భాను సంతత్యై నమః.
నామ వివరణ.
భక్తుల హృదయగతమయిన అజ్ఞానమనెడి అంధకారమునురూపు మాపునట్టి కాంతితో కూడిన
సూర్యకిరణముల సమూహము అమ్మ.
స్వయం కల్పిత తమోభేదము వృత్తము.
*భక్త హార్ద తమో భేద భానుమద్భాను సంతతీ*!
శక్తినిచ్చు మదంబా! ప్రశాంత చిత్తంబు నిమ్మికన్,
భక్తి తత్పరతన్ నిన్ను వర్ణనంబేను చేసెదన్,
యుక్తితో తమమున్భేదమొప్పుగా నీవె పాపుమా.
తాటంకయుగళీవృత్తము.
గణములు..త స భ జ జ గ. యతి 9 వ అక్షరము. ... ప్రాస నియమము కలదు.
22. ఓం తాటంకయుగళీభూత తపనోడుపమండలాయై నమః.
నామ వివరణ.
చెవికమ్మల జంటగా సూర్యచంద్ర మండలములు కల జనని లలితాంబ.
స్వయం కల్పిత తాటంకయుగళీవృత్తము.
*తాటంకయుగళీభూత తపనోడుపమండలా*!
పాటింతు నినుఁ బూజించు వరణీయ విధానమున్
కోటీశ్వరుఁడ నీవున్న కొలువై మది నేనికన్,
వాటిల్లు శుభ సౌఖ్యాళి వరణీయ శుభప్రభా!
తాండవ సాక్షి వృత్తము. .....గణములు.. జ స భ త జ గ. యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
232. ఓం మహేశ్వర మహాకల్ప మహా తాండవ సాక్షిణ్యై నమః!
నామ వివరణ.
సృష్టిని లయము చేయు వేళలో శివుఁడుమహాతాండవము చేయుసమయమున సృష్టిలో
అమ్మ తప్ప మరెవ్వరూ లేని సమయములో ఆ తల్లియే ఆనాట్యమునకు సాక్షిగా
ఉన్నందున మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షి..
స్వయం కల్పిత తాండవ సాక్షి వృత్తము.
*మహేశ్వర మహాకల్ప మహా తాండవ సాక్షిణీ* !
యిహంబునను నీవే మహిమొప్పన్ ననుఁ గావుమా.
మహిన్ శుభములన్ గొల్ప మనోజ్ఞంబుగఁ గొల్తు నిన్
మహేశ్వరునితోనుండు మదిన్, జేసెద సేవలన్.
దేవ సంస్తుత వైభవ వృత్తము.
గణములు. .. ర . త . య . జ . భ . ర. .. యతి 11 వ అక్షరము. .. ప్రాస నియమము కలదు.
83. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవాయై నమః.
నామ వివరణ.
బ్రహ్మ విష్ణువు ఇంద్రుఁడు మున్నగు దేవతల చేత స్తుతింపఁబడు వైభవము కలది అమ్మ.
ఆత్మజ్ఞానముతో స్తుతింపఁబడు వైభవము కలది అమ్మ.
స్వయం కల్పిత దేవ సంస్తుత వైభవ వృత్తము.
జీవ మీవే, నామదిలోనుండి సేవలందుదు వీవెగా,
భావమీవే, యన్నిట నీదైన ప్రాభవంబె కనంబడున్,
నీవె నా కీర్తిన్ భువిపైఁ బెంచు నిర్మలాత్మవు, కొల్తు నిన్
దేవి! *బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా*!
దేవీవైభవ వృత్తము.
గణములు....." మ న మ ర ర వ " . యతి. 10 వ అక్షరము. .....ప్రాస నియమము కలదు.
64. ఓం దేవర్షి గణ సంఘాత స్తూయమా నాత్మ వైభవాయై నమః.
నామ వివరణ.
బ్రహ్మాది దేవతల యొక్క, వశిష్ఠాది ఋషుల యొక్క ఆదిత్యాది గణదేవతల యొక్క సమూహము చేత
స్తోత్రము చేయఁబడుచున్న తన యొక్క గొప్పతనము కలది మన అమ్మ. భండాసుర
నిర్మూలనార్థమై వీరందరూ అమ్మవారి ఆవిర్భావం నిమిత్తము సామూహికముగా స్తుతించిరి.
దేవగణమయిన అచ్చులతోను, ఋషిగణమయిన హల్లులతోను, సంఘాత సంకేతముగా
గ్రహింపదగు క్ష కారముతోను, అనగా ఏబది అక్షరములతో స్తుతింపఁబడునది మన అమ్మ..
స్వయం కల్పితము దేవీవైభవ వృత్తము.
శ్రీదేవీ! నినుఁ గనన్ నేరన్ జిత్తమందున్, స్మరించెదన్,
నే దీనుండను మహాకాళీ! నీవు చూడంగదే సతీ!
నీ దివ్యాంచిత మహత్కాంతిన్ నేర్పుతో నాత్మ చూడ లే
దో? *దేవర్షి గణ సంఘాత స్తూయమా నాత్మ వైభవా*!
ద్విజ పంక్తి వృత్తము.
గణములు. త త మ స ర వ. యతి. 10వ అక్షరము. ప్రాస నియమము కలదు.
25. ఓం శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలాయై నమః.
నామ వివరణ.
శుద్ధవిద్య దగ్గరనుండి అనుత్తర దీక్ష వరకు గల ముప్ఫైరెండు దీక్షలను తీసుకున్న శ్రేష్ఠుల చేత
పొందదగిన జనని.అని బాహ్యార్థముగా తోచుచున్నదియే ద్విజపంక్తి అనగా పైపన్నులుపదునారు
క్రింది పన్నులు పదునారు ఆ ముప్పదిరెండు పన్నుల ముఖద్వారము నుండి ప్రకాశవంతముగా
వెలువడు శ్రీవిద్యా స్వరూపిణి అమ్మ అని గ్రహింపవలసి యున్నది.
స్వయం కల్పిత ద్విజ పంక్తి వృత్తము.
శ్రీ శుద్ధ విద్యల్ సమస్తంబున్ జిర కీర్తిన్ మహోద్ధతిన్,
శ్రీశక్తివౌ నీ ప్రభావంబై చెలగున్ సత్యమిద్ది, దే
వీ! *శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వలా*!
యా శుద్ధ విద్యల్ ననున్ జేర్చే యసమానాంబవీవెగా.
నవనీత వృత్తము.
గణములు. న స మ భ జ గ. యతి. 9వ అక్షరము. ప్రాస నియమము కలదు.
24. ఓం నవవిద్రుమబింబశ్రీన్యక్కారి రదనచ్ఛదాయై నమః
నామ వివరణ.
అప్పుడే సానపట్టిన పగడముకన్నా దొండపండు కన్నా ఎరుపయిన పెదవులతో ప్రకాశించునది
జగజ్జనని.
స్వయం కల్పిత నవనీత వృత్తము.
*నవవిద్రుమబింబశ్రీన్యక్కారి రదనచ్ఛదా*!
కవన మధువున్ గ్రోలన్ గామేశ్వరిగ రమ్మికన్,
శ్రవణమధురంబౌ ధారాపాత కవితన్ దయన్
నవ రసములుప్పొంగన్ నా నుండి ప్రభవింపనీ.
నాసాభరణ వృత్తము.
గణములు..మ స ర భ జ గ. యతి 9వ అక్షరము. ప్రాస నియమము కలదు.
20. ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః.
నామ వివరణ.
నక్షత్ర కాంతిని కూడా తిరస్కరించెడి నాసాభరణములు అలంకరించుకొనినది శ్రీమాత.
స్వయం కల్పిత నాసాభరణ వృత్తము.
శ్రీ రమ్యాక్షరనామా! ప్రసిద్ధ స్మిత ముఖాంబుజా!
నీ రక్షావలయంబందు నేనుంటి నిట వెల్గుచున్
*దారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా*!
కోరన్ నే నిహ సౌఖ్యంబు, కొల్వుండు మది నిత్యమున్
పద్మరాగ వృత్తము.
గణములు. ర స భ జ జ గ. యతి. 9వ అక్షరము. ప్రాస నియమము కలదు.
23. ఓం పద్మరాగశిలాదర్శపరిభావి కపోల భువేనమః.
నామ వివరణ.
పద్నరాగశిలలు అను అద్దములను మించిన నునుపైన కాంతులీనుచున్న చెక్కిళ్ళు కలది మన
అమ్మ.
స్వయం కల్పిత పద్మరాగ వృత్తము.
*పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూ*!
పద్మమై నిను సేవింతుఁ బరమార్థమదే కదా,
పద్మపత్ర విశాలాక్షి! వరభావ సుధా నిధీ!
పద్మజోద్భవు దేవేరి వరలించిన కైతవా?
పాదపంకజ వృత్తము.
గణములు జ . ర . భ . భ . జ . గ. ... యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.45.. ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః.
నామ వివరణ.
పద్మముల కాంతికి మించిన కాంతి కలిగిన పాదద్వయముతో ప్రకాశించునది జగన్మాత.
స్వయం కల్పిత పాదపంకజ వృత్తము.
*పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా*!
మదంబ! నీ పదాబ్జంబు మదిన్ నిలుపనీ కృపన్,
హృదబ్జమందు నీవుండి కృతుల్ వెలయఁ జేయుమా,
ముదంబు గల్గు నిన్నెన్నఁ బునర్జనన ముండదే.
పాదాబ్జ ధూళిక వృత్తము.
గణములు.. భ త మ స ర వ. యతి 9 వ అక్షరము ప్రాస నియమము కలదు.
289. ఓం శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికాయై నమః.
నామ వివరణ.
వేదములనెడి స్త్రీలయొక్క పాపిటలను సిందూరముగా ధరించునట్లు చేయబడిన పాద
పరాగము కలది అమ్మ.
స్వయం కల్పిత పాదాబ్జ ధూళిక వృత్తము.
శ్రీ *శ్రుతి సీమంత సిందూరీ కృత పాదాబ్జ ధూళికా*!
ఆశ్రిత మందార సందేహంబుగ కన్పించు నింతయున్,
విశ్రమమేలా నిజంబున్ వేల్పుగ కన్పింపఁ జేయగన్?
నీ శ్రమ ముక్తి ప్రదంబై, నిల్పుత నన్నింక నీశ్వరీ!
పాశుపత వృత్తము.
గణములు. న . త . య . య . భ . ర. యతి 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
81. ఓం మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః.
నామ వివరణ.
తాను ప్రయోగించిన మహాపాశుపతాస్త్రాగ్నిలో పూర్తిగ నిర్మూలింపఁబడిన రాక్షసులసైన్యము కలది
అమ్మ.
అజ్ఞాన ఆసురీభావాలను ఒకే ఒక అద్వితీయమైన సంకల్పశక్తితో అంతము చేయునది అమ్మ.
స్వయం కల్పిత పాశుపత వృత్తము.
వినుత పాదాబ్జ యుగా! నిన్నె విశ్వాసంబున నిల్పితిన్
మనమునందున్, సతమున్ గావుమా నీవే, కనఁ గోరెదన్
నిను, *మహా పాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా*!
కని మదిన్ గల్గెడి దుష్టాళిఁ కాలం జేయుమ, సత్ కృపన్.
పున్నాగ వృత్తము
గణములు ర ర ర భ జ గ....యతి 9 వ అక్షరము.ప్రాస నియమము కలదు.
13. ఓం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః.
నామ వివరణ.
సంపంగి, అశోకము, పున్నాగము, మొదలగు పూవుల వాసనలతో నలరారుచున్న కేశసంపదతో
నొప్పు జనని లలితాంబ.
స్వయం కల్పిత పున్నాగ వృత్తము.
*చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా*!
చంపకంబుల్ నినుం జేరఁ జక్కంగ నిట పద్యముల్
సొంపు నీతీరునన్ గోరి చూచున్ గరుణతో సతీ!
యింపుగా సౌరభంబున్ గ్రహించన్ దగును నీవిఁకన్.
ప్రౌఢ విక్రమ వృత్తము.
గణములు .. స . స . ర . త . జ . గ. యతి .. 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
19. ఓం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయై నమః.
నామ వివరణ.
అప్పుడే వికసించినటువంటి సంపంగి పూవు వంటి నాసిక కలది దాక్షాయని.
స్వయం కల్పిత ప్రౌఢ విక్రమ వృత్తము.
*నవచంపక పుష్పాభ నాసాదండవిరాజితా*!
కవనాకృతిలో నీవు కావ్యంబై ప్రభవింపుమా,
నవ జీవన మార్గంబునన్ నీవే నడిపించుమా,
భవ బంధములన్నీవె పారంద్రోలుమ, పాహిమామ్.
బాలావిక్రమ వృత్తము.
గణములు .. ర . స . ర . త . జ . గ. యతి .. 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
74. ఓం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః!
నామ వివరణ.
భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలయిన బాలాదేవి విక్రమము చూచి
సంతోషించునది అమ్మ. మనలో భ్రమలను పుట్టించి,వంచించే ఆసురీ శక్తులను నిర్మూలించి,
మనలను కాపాడే బాలాత్రిపురసుందరి విక్రమమునకు సంతసించు తల్లి.
స్వయం కల్పిత బాలావిక్రమ వృత్తము.
*భండ పుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా*
భండపుత్రులె దుర్మార్గ భావంబుల్ నను వ్రేచెడిన్
పండువెన్నెలగానీవ భావాతీత శుభాకృతిన్
నిండుగా మదిలోనుండి నిత్యా! రక్షణ సేయుమా.
భువనావళి వృత్తము.
గణములు.. మ న త జ స వ. యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
281. ఓం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యై నమః.
నామ వివరణ.
కనురెప్ప తెరవబడుటతోను, మూయబడుటతోను ఉత్పన్నమైలీనమైన భువనములు కల
తల్లి, తన కనురెప్పపాటు కాలములోనే సృష్టి మొత్తమును సృష్టి స్థితి లయలు చేయుజనని.
స్వయం కల్పిత భువనావళి వృత్తము.
మాయా మోహములవేలా? రమణీయ శుభ నామ! దే
వీ! *యున్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళీ*!
శ్రేయస్కారివిగ, నన్నారసి, ముక్తి కలిగించుమా,
నీ యాజ్ఞన్ భువిని నేనుంటిని, కావుమిక శాంభవీ!
మంత్రిణీ వృత్తము.
గణములు .. స మ న స న ర వ. యతి .. 11వ అక్షరము. ప్రాస నియమము కలదు.
75. ఓం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితాయై నమః.
నామ వివరణ.
మంత్రిణీదేవిచే విరచింపఁబడిన విషంగ వధకు సంతోషించునది ఈ లోకమాత.
విషంగుఁడు, విశుక్రుఁడు భండాసురుని సోదరులు.. విషంగుఁడు మనలో లంపటత్వాన్ని
రెచ్చగొట్టేవాడు.అమ్మవారి మంత్రి అయిన శ్యామలాదేవి విషంగుని వధించుట చూచి
సంతోషించునది మన అమ్మ.
స్వయం కల్పిత మంత్రిణీ వృత్తము.
విను, *మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా*! కృపన్.
వినయంబున్ బాపున్ గుణమది విషంగుడె కనంగ, వింటివా?
కనుమమ్మా! యోచింపకుమ, తగ వీడునటుఁ జేయుమా సతీ!
ఘనమౌ నీ నామంబిల శుభ కరం బది గ్రహింపఁ జేయుమా.
మందస్మిత వృత్తము.
గణములు. త ర ర మ జ గ. యతి. 9వ అక్షరము. ప్రాస నియమము కలదు.
28. ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసాయై నమః.
నామ వివరణ.
తన పతియయిన కామేశ్వరుని మనసున భావించుట చేత
పరమేశ్వరానందముపొందినందునకలిగిన చిన్న చిరునవ్వుతోకూడిన అందమయిన జనని.
స్వయం కల్పిత మందస్మిత వృత్తము.
*మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా*!
సౌందర్య రాశి వీవమ్మ! సౌభాగ్యాకారివీవెగా,
కందున్ మనంబు నీ వింకఁ గాదన్నన్ నన్నుఁ గావుమా,
బంధంబులన్ విడన్ జేయభద్రాత్మా! నిన్నుఁ జేరుదున్.
మధ్య కూట వృత్తము.
గణములు. .. స . త . య . జ . త . ర. యతి. 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
86. ఓం కంఠాధః కటి పర్యంత మధ్య కూట స్వరూపిణ్యై నమః.
నామ వివరణ.
కంఠము నుండి నడుము వరకూ ఉన్న భాగాన్ని పంచదశీ మంత్రములోని మధ్య కూట
స్వరూపముగా కలది అమ్మ. కామేశ్వరుని స్థానమై అనురాగాలకు కేంద్రమైన హృదయ స్థానము నుండి కంఠము కటి మధ్య ప్రదేశమునుమధ్యకూట స్వరూపముగా కలది అమ్మ.
స్వయంకల్పిత మధ్య కూట వృత్తము.
అనురాగంబున్ గన, నిన్నున్మహార్తితోఁ గొల్చెదన్ శివా!
నను నీ భక్తున్ సుఖ మార్గంబునన్ శుభోద్దీప్తి వెల్గనీ,
కని నన్నింకన్ ధరణిన్ నిల్పగా సతం బీవు చూపు ప్రే
మను, *గంఠాధః కటి పర్యంత మధ్య కూట స్వరూపిణీ*!
మహాసేవిత వృత్తము. గణములు. జ స మ జ జ గ. యతి 9వ అక్షరము. ప్రాస నియమము కలదు.
614. ఓం సచామర రమా వాణీ సవ్య దక్షిణ సేవితాయై నమః.
నామ వివరణ.
కుడియెడమల లక్ష్మీ సరస్వతులచే వింజామర సేవలందుకొను శక్తి మన అమ్మ.
స్వయం కల్పిత..... మహాసేవిత వృత్తము..
*సచామర రమా వాణీ సవ్య దక్షిణ సేవితా*!
సుచేతనము నీవేగా, శుద్ధ సద్గుణ రూపిణీ!
యచేతనమె యీ దేహంబమ్మ! నీవిట లేనిచో,
ప్రచోదనము నీవేగా భక్త బంధ విమోచనీ!
మాణిక్య మకుట వృత్తము.
గణములు. ర .. భ .. య .. య .. న .. ర " . యతి 11. వ అక్షరము. ప్రాస నియమము కలదు.
40. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః.
నామ వివరణ.
మాణిక్యములతో నొప్పుమకుటాకాకారముతో ప్రకాశించు మోకాళ్ళు కలది జనని.
స్వయం కల్పిత మాణిక్య మకుట వృత్తము.
సౌమ్య! *మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా*!
రమ్య సుజ్ఞాన శుభ తేజంబుఁ బ్రార్థించెద నొసంగుమా,
గమ్య మీవేను మది గాంచంగఁ గల్యాణ శుభ రూపిణీ!
సామ్యమే లేని వర రూపా! ప్రసాదింపుము మహోద్గతిన్.
మిథ్యా జగతి వృత్తము.
గణములు . త . స . భ . భ . ర . వ యతి .. 10 . ప్రాస నియమము కలదు.
992. ఓం అవ్యాజ కరుణామూర్త్యై నమః.
నామ వివరణ.
కారణము లేకనే కరుణను గను చల్లని తల్లి మన అమ్మ.
స్వయం కల్పిత మిథ్యా జగతి వృత్తము.
*అవ్యాజ కరుణామూర్తి*! మహాత్ములనుందువీవెగా,
సవ్యంబుగ నినున్ నేనిల సంస్తుతియింతు నమ్మరో!
భవ్యంబుగ మదిన్ నిల్చి, ప్రభావము చూపుమమ్మ నీ
యవ్యాజ కరుణన్ నేనిల హాయిగ వ్రాసెదన్ గృతుల్.
ముక్తాఫల వృత్తము.
గణములు. స .. మ .. య .. జ .. త .. ర " . యతి ..... 10 వ అక్షరం.. ..... ప్రాస నియమము కలదు
32. ఓం రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితాయై నమః.
నామ వివరణ.
రత్నములు పొదగఁబడిన కంఠమున ధరించు చింతాకు అనే ఆభరణముతో కదలుచున్న
ముత్యాలహారముతో కూడుకొనియున్న తల్లి. ధ్యాన లక్ష్య శుద్ధిని బట్టి ధ్యానించువారికి ఆయా
ఫలములను ఇచ్చు తల్లి.
స్వయం కల్పిత ముక్తాఫల వృత్తము.
కరుణాసాంద్రా! నీవు నన్నున్ గనన్ శుభంబుల్ వరించుగా,
పరమానందంబందు నేనున్ బరంబుఁ బొందన్ సుసాధ్యమౌన్,
స్థిర సౌఖ్యంబున్ బొందనౌన్ వాసిగా, కృపం గాంచు, శ్రీ శుభం
కర *రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా*!
మృగనాభి వృత్తము.
గణములు. భ భ త స స వ. యతి 1౦ వ అక్షరము. ప్రాస నియమము కలదు.
16. ఓం ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషకాయై నమః.
నామ వివరణ.
కస్తూరీ తిలక మను మచ్చతో కూడిన విశేషమైన ముఖచంద్రయే శ్రీమాత.
స్వయం కల్పిత మృగనాభి వృత్తము.
శ్రీ *ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషకా*!
నీ ముఖ శోభయె జీవంబు నియతిన్ బ్రబలించగా
మేమిట నీదరి వర్ధిల్లమె సనాతనని! శాంభవీ!
నీ మనమందున మేముండ నిరపాయము మాకిటన్.
యోగినీగణ వృత్తము.
గణములు.. ర య జ ర స వ. యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
237. ఓం మహాచతుష్షష్టికోటి యోగినీ గణ సేవితాయై నమః.
నామ వివరణ.
ఒక్కొక్క ఆవరణలో అరువదినాలుగుకోట్ల చొప్పున తొమ్మిది ఆవరణములలోను
యోగినులచే పూజింపబడు తల్లి లలితాంబ.
స్వయం కల్పిత యోగినీగణ వృత్తము.
ఓ *మహాచతుష్షష్టికోటి యోగినీ గణ సేవితా*!
నీ మనోజ్ఞ రూపంబు చూచి నేను పొంగెద నీశ్వరీ!
ధీమణుల్ నినుం గాంచుచుంద్రు, తృప్తితో మది నిన్ గొల్తురే,
నీమమొప్ప నేనున్ నినున్ గణించుచున్ మది పొంగనీ.
రథారూఢ వృత్తము.
గణములు.......న జ య జ త ర....యతి...11వ అక్షరము.......ప్రాస నియమము కలదు.
70. ఓం కిరి చక్ర రథారూఢ దండనాథా పురస్కృతాయై నమః.
నామ వివరణ.
వరాహములచే లాగఁబడు చక్రములు గల రథమునెక్కిన వారాహి యను దండనాథ చే
సేవింపఁబడునది. జ్ఞానమను వారహిచే సేవింపఁబడునది అమ్మ. ఆమె దండనాయిక.
అంతశ్శత్రువులను దండించు జనని.
స్వయం కల్పిత ... రథారూఢ వృత్తము.
ధర *కిరి చక్ర రథారూఢ దండనాథా పురస్కృతా*!
గురుతర శత్రుల షట్కం బగోచరంబై వహించెడున్,
సరగున నా మదిలో నుండి సంహరించంగ వేడెదన్
తెరవు నినుంగని పొంగన్ బ్రదీప్తమౌ జ్ఞానమిమ్మికన్..
రశనాదామ వృత్తము.
గణములు. ర .. స .. భ .. య .. జ .. గ " . యతి ..... 9. .....వ అక్షరము. ప్రాస నియమము కలదు.
38. ఓం రత్నకింకిణికా రమ్య రశనాదామ భూషితాయై నమః.
నామ వివరణ.
రత్నమయమైన చిఱుగజ్జలతో అత్యంత రమణీయంగా ఉండే ఒడ్డాణపు త్రాడు కలది జనని.
స్వయం కల్పిత రశనాదామ వృత్తము.
*రత్నకింకిణి కారమ్య రశనా దామ భూషితా*!
నూత్నమౌ శుభమార్గంబును నినుం గాంచఁ గొల్పుమా,
యత్నమేనొనరింతున్ జయము నాకున్ లభించనీ
రత్నమేకద నీపాద రజ మాత్మన్ వెలుంగనీ.
లలితామోద వృత్తము.
గణములు. ..స .. భ . య .. జ .. త .. ర. యతి 11 వ అక్ష్రము.....ప్రాస నియమము కలదు.
65. ఓం భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్వితాయై నమః.
నామ వివరణ.
భండుఁడు అను రాక్షసుని వధించుటకు ప్రయత్నించు స్త్రీదేవతల సేనలతో చక్కగా
కూడియున్నది మన అమ్మ. అజ్ఞాన మద అహంకారముల స్వరూపమే భండాసురుఁడు. అట్టివానిని నశింపఁ జేయుటకు జ్ఞానముతో కూడిన భావాలకు ప్రతీకలైన శక్తి సేనలతో సన్నద్ధురాలైన జ్ఞాన
చైతన్య చిద్రూపిణి అమ్మ.
స్వయం కల్పిత లలితామోద వృత్తము.
భయమున్ బాపుమ, ప్రమోదమ్ము వర్ధిలన్ జేయుమా కృపన్,
నియతిన్ నిన్ మదిని సేవింతు నిత్యమార్గంబు నందికన్,
ప్రియ సద్భాషణము నీచేత వృద్ధియౌనమ్మరో సతీ!
జయ *భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా*!
వాగ్భవ వృత్తము.
గణములు. .. స . త . య . ర . న . ర. యతి. 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
85. ఓం శ్రీమద్వాగ్భవ కూటైకస్వరూపముఖపంకజాయై నమః.
నామ వివరణ.
మంగళకరమైన వాగ్భవ కూటము ద్వారా సూచింపఁబడే ముఖపద్మము కలది అమ్మ.
స్వయంకల్పిత వాగ్భవ వృత్తము.
కరుణాంభోధీ కన రావేలా? కళా నిలయ మీవెగా,
పరమానందంబున వర్ధిల్లన్ బ్రశాంతిగ మనంగనౌన్
వరలింపంగన్ నను నీదేగా ప్రభావ మిల లేరు నీ
సరి, *శ్రీమ ద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజా*!
వారాహి వృత్తము.
గణములు . ర . త . న . మ . ర . వ. .. యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
76. ఓం విశుక్రప్రాణ హరణ వారాహీ వీర్య నందితాయై నమః.
నామ వివరణ.
విశుక్రుని ప్రాణములను హరించిన వారాహి యొక్క పరాక్రమమునకు సంతోషించునది జగన్మాత.
శుక్ర వికార ఆసురీ గుణమును యోగదండమును పట్టి యోగమార్గము ద్వారా రికట్టే దండనాథ
అయిన వారాహీదేవి పరాక్రమమున్కు సంతోషించు తల్లి.
స్వయం కల్పిత వారాహి వృత్తము.
భావనాకాశమ్మున గల బ్రహ్మాండంబీవె పార్వతీ!
జీవితాంతంబున్ శుభగతి సేవింతున్ నిన్నుసమ్మతిన్,
నీ విధానంబున్ దెలుపుము నిన్ గొల్వన్,, దిక్కు నీవె రా
వా! *విశుక్రప్రాణ హరణ వారాహీ వీర్య నందితా!*
విఘ్నయంత్ర నాశిని వృత్తము.
గణములు .. న . ర . య . జ . త . ర. .. యతి 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
78. ఓం మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః.
నామ వివరణ.
మహా గణేశ్వరునిచే నశింపఁ జేయఁబడిన విశుక్రుఁడు ప్రయోగించిన జయవిఘ్నయంత్రమునకు
మిక్కిలి సంతోషించినది అమ్మ.
స్వయం కల్పిత విఘ్నయంత్ర నాశిని వృత్తము.
లలి విశుక్రుడష్ట విఘ్నమ్ములన్ ననున్ బాధ పెట్టుచో
నిలువలేను, గావుమో యమ్మ! నీవె నా కోర్కెఁ దీర్చుమా,
కలవరంబుఁ బాపుమా నన్ను కావ, నీ రక్షణేచ్ఛ దీ
పిలు, *మహా గణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా!*
శక్తికూట వృత్తము.
గణములు. .. స . య . య . జ . త . ర. యతి. 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
87. ఓం శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః.
నామ వివరణ.
శక్తి కూటముతో సామ్యమున్న కట్యధోభాగమును ధరించినది అమ్మ.
స్వయంకల్పిత శక్తికూట వృత్తము.
ధనమేల నీవున్న నాకున్ ముదంబు నిల్చున్ మనంబునన్,
గొన మీవె నాకున్, ధనంబే యగున్ జిదానంద రూప! భా
వనమందు నీవుండి దేవీ! ప్రభావమిమ్మింక. ప్రేమతోఁ
గను *శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణీ*!
శక్తి ప్రభ వృత్తము...గణములు ...మ మ య య ర ర గ...యతి 10వ అక్షరము.ప్రాస నియమము కలదు.
658. ఓం ఇచ్ఛాశ్డక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపాయై నమః.
నామ వివరణ.
గుణత్రయ స్వరూపిణి మన అమ్మ.
స్వయం కల్పిత శక్తి ప్రభ వృత్తము..
శ్రీ *యిచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపా*! నమస్తే.
నీ యీ శక్తుల్ గాంచంగ నెట్లేని యత్నించంగనిమ్మా భవానీ!
మాయామోహాదుల్ నన్నుఁ జేరన్ మహిన్ నీవే కృపన్ బాపుమమ్మా.
నీయాజ్ఞా వర్తిన్ గాన నీశాని! నన్నున్ గావు మీవే సతంబున్.
శింజానమణిమంజీర వృత్తము.
గణములు....త . స . ర . య . జ . గ . ..... యతి . 7 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
46. ఓం శింజానమణిమంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః.
నామ వివరణ.
చిఱు సవ్వడి చేసే అందమైన మణిమంజీరాలతో అలంకరింపఁబడిన పాదములు కలది మన
అమ్మ.
స్వయం కల్పిత శింజానమణిమంజీర వృత్తము.
రంజిల్లు మది నీ రమ్య పాద ధూళిన్ ధరించగన్,
సంజాత ఫలమై శాంతి నా మదిన్ నిండుచుండెడున్,
కంజాత నయనా! గర్వమున్ విడన్ జేయుమమ్మరో!
*శింజానమణిమంజీర మండిత శ్రీ పదాంబుజా*!
శ్రీమౌక్తిక వృత్తము.
గణములు.. న భ త ర స వ. యతి 10 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
290 ఓం సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికాయై నమః.
నామ వివరణ.
సమస్త ఆగమశాస్త్రములనెడి ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచఁబడిన ముత్యము
అమ్మ.
స్వయం కల్పిత శ్రీమౌక్తిక వృత్తము.
భసిత దేహునితోఁ గూడి భావనన్ విహరించుమా
యసమ భక్తిని నాలోన హాయిగాఁ గలిగించుమా,
రససమంచిత పద్యాళి ప్రార్థనన్ విని యాలకిం
చు, *సకలాగమ సందోహ శుక్తి సంపుటమౌక్తికా*!
శ్రీవిరాజిత వృత్తము.
గణములు. జ స భ య జ గ. యతి. 8 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
29. ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీవిరాజితాయై నమః.
నామ వివరణ.
సాటియే లేని నునుపైన అందమైన చుబుకము కల తల్లి లలితాంబ.
స్వయం కల్పిత శ్రీవిరాజిత వృత్తము.
*అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా*!
మనంబునను నీవే మహిమతో వెల్గు శాంభవీ!
ఘనంబగునొ నీకున్ గరుణతో మమ్ము గాచుటే?
మనోజ్ఞమగు నీ నామమును మాలోన వెల్గనీ.
షోడశ కళాపూర్ణ వృత్తము. గణములు. భ త త స స వ. యతి 10వ అక్షరము. ప్రాస నియమము కలదు.
610. ఓం ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజితాయై నమః.
నామ వివరణ.
పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఉన్న తిథులయందు పూజింపబడు తల్లి.
స్వయం కల్పిత....షోడశ కళాపూర్ణ వృత్తము.
సుప్రతిభా! జీవనామోద శుభ వర్ధన శాంభవీ!
సప్రముదాంబాంజలుల్ షోడశకళాత్మ! గ్రహింపుమా,
యప్రతిమానా! సతీ నా జయము వెన్కను శక్తి నీ
దే! *ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజితా*!
సముత్సుక వృత్తము.
గణములు .. త .. ర .. భ .. భ .. జ .. గ. యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
73. ఓం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణసముత్సుకాయై నమః.
నామ వివరణ.
నిత్యా దేవతల యొక్క పరాక్రమాటోపములను చూచి సంతోషము పొందు తల్లి లలితాంబ.
పరాక్రమాటోపములను ప్రదర్శించు ఆత్మ శక్తిని చూచి సంతోషించెడిది మన అమ్మ.
స్వయం కల్పిత సముత్సుక వృత్తము.
*నిత్యా పరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా*!
సత్యంబు నిత్యమున్ నేఁ బచరించు నటులన్ గృపన్
స్తుత్యా! యొనర్పుమా నాకు శుభంబులను గొల్పుమా,
భృత్యుండ నేను నీ చెంతఁ బ్రియంబుఁ గన నుండెదన్.
880. ఓం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయై నమః. 878.
నామ వివరణ.
సంసారమనెడి బురదలో కూరుకొనిపోవుచున్నవారిని ఉద్ధరించు పండితురాలు అమ్మ.
స్వయం కల్పిత....సముత్సుక వృత్తము.
*సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితా*!
సంసార మగ్నుఁడన్ నేను, జయాఢ్య! ననుఁ గావుమా.
కంసారినే మనంబందిక నిల్పు కృపఁ జూపుచున్.
హంసోహమందు నీవీ యహమున్ దొలఁగఁ జేసినన్.
సరసీరుహ వృత్తము.
గణములు. ..స . ర . య . జ . త . ర. యతి 11 వ అక్షరము. .... ప్రాస నియమము కలదు.
79. ఓం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః.
నామ వివరణ.
భండాసురుఁడు ప్రయోగించిన అస్త్ర శస్త్రాలకు ప్రత్యస్త్రములు వర్షించినది అమ్మ.
దుస్సంకల్పములనే అస్త్రశస్త్రాలను మూలములోనే నశింపఁ జేయునది అమ్మ.
స్వయం కల్పిత సరసీరుహ వృత్తము.
వినుతింతున్ బరాత్పరీ! నిన్ను విశ్వసింతున్ మనంబునన్
గను విందై కనంబడన్ నమ్మికన్ నినున్ జేర రానొకో
కని నాలోని దుర్మతిన్ బాపి కావుమ నీవే కృపాబ్ధి,! ధ్యా
సను, *భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ*!
సల్లాప వృత్తము.
గణములు. స ర భ త జ గ. యతి 10వ అక్షరము. ప్రాస నియమము కలదు.
27. ఓం నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛప్యై నమః.
నామ వివరణ.
శ్రీమాత పలుకులు వీణానాదముకన్నా మహనీయముగా ఒప్పియున్నవి. వీణా నాదముకన్న
మధురమయిన సరససల్లాపములు గల తల్లి ఈ జగదంబ.
స్వయం కల్పిత సల్లాప వృత్తము.
*నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ*!
సుజనాత్మస్థ! నన్ బ్రోచుమ శుద్ధాత్మగ వెల్గుచున్,
బ్రజలే నీ సుతుల్ గాచుమ, భక్తిన్ నినుఁ గొల్తురే,
భజియింతున్ గృపన్ జూడుమ, పాపంబులఁ బాపుమా.
సల్లాలిత వృత్తము.
గణములు. .. మ త ర జ జ గ. ...యతి...7 వ అక్షరము. ...ప్రాస నియమము కలదు.
67. ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతాయై నమః.
నామ వివరణ.
అశ్వారూఢ అనే దేవత చేత అధిష్ఠించఁ బడిన అధిక సంఖ్యలో గల గుఱ్ఱాలచే ఆవరింపఁ
బడినది.ఇంద్రియములనదుపులోనుంచి, శాశ్వత జ్ఞాన సముపార్జనకు దారితీయించగల వాటిచే
సేవింపఁబడునది మన అమ్మ.
స్బయం కల్పిత ...సల్లాలిత వృత్తము.
*అశ్వారూఢాధిష్ఠి తాశ్వకోటి కోటి భిరావృతా*!
శశ్వత్ సౌఖ్యంబిమ్ము, సాధ్య మీవెయై మది వెల్గుచున్,
విశ్వంబందున్ నిన్నె వేల్పువంచు భావనఁ జేసెదన్,
విశ్వేశుం డాలింపఁ బిల్చు నిన్నె సృష్టిని జేయగన్.
సింధురవ్రజ వృత్తము.
గణములు........ర ర య జ భ ర ....యతి....11వ అక్షరము.......ప్రాస నియమము కలదు.
66. ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయై నమః.
నామ వివరణ.
సంపత్కరీదేవి చేత చక్కగా అధిరోహింపఁబడిన ఏనుగుల సమూహము చేత సేవింపఁబడినది జగన్మాత..
చిత్త వృత్తులే సంపత్కరీదేవి. జ్ఞానేంద్రియములవలన చిత్తవృత్తులేర్పడును. ఈ శబ్దాదులే
ఏనుగుల సమూహము. సంపత్కరి ఈ సింధురవ్రజను అదుపులో పెట్టి మంచిపనులు చేయించును.
వటిచే సేవింపఁబడును.
స్బయం కల్పిత సింధురవ్రజ వృత్తము.
సేవ్య! *సంపత్కరీ సమారూఢ సిందుర వ్రజ సేవితా*!
సవ్య మార్గంబునన్ బ్రయాణింపఁ జాల నన్ గరుణింపుమా
భవ్య లక్ష్యంబుతో నినున్ గాన వచ్చితిన్, గనిపింపుమా.
దివ్యమౌ నీదు తేజమే నాకు దీప్తిఁ గొల్పును భార్గవీ!
సుఖాసీన వృత్తము. ....గణములు.. మ ర ర జ జ గ.. యతి 9 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
249. ఓం పంచ ప్రేతాసనాసీనాయై నమః.
నామ వివరణ.
బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను ఆసనముగా కలిగి కూర్చొని యున్న తల్లి
లలితాంబ. పంచ భూతాత్మక దేహ పీఠముపై అధివసించు జనని.
స్వయం కల్పిత సుఖాసీన వృత్తము.
*పంచ ప్రేతాసనాసీన! పార్వతీ పరమేశ్వరీ*!
కాంచన్ నిన్నున్ మనంబందు గౌరవంబు రహించునే,
పంచత్వంబున్ గనన్ నేను, భారమీవు వహించుటన్,
మంచిన్ నీవే మదిన్ బెంచు, మాన్యతన్ మహనీయతన్.
స్మరతూణీర వృత్తము.
గణములు. స .. జ .. య .. భ .. త .. ర " . యతి 11 వ అక్షరము. ప్రాస నియమము కలదు.
41. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికాయై నమః.
నామ వివరణ.
ఆరుద్ర పురుగులచేత పొదగఁబడిన మన్మథుని అమ్ములపొది వంటి జంఘములు కలిగిన తల్లి
మన తల్లి.
స్వయం కల్పిత స్మరతూణీర వృత్తము.
మహి*తేంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘికా*!
మహిమాన్వితంబగు మంత్రాళిన్ మహిమోపేత కావవే,
యిహ సౌఖ్యమున్ బర సౌఖ్యంబున్ హృది నీ వుండి కొల్పుదే
సహియింపు నా దురితాళిన్, శ్రీసతి సద్భాగ్య దాయివై.
హ్లాదచంద్రిక వృత్తము. గణములు.. త ర భ త జ గ. యతి 8 వ అక్షరము. ప్రాస నియమము కలదు
357. ఓం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమః.
నామ వివరణ.
ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపములనెడి ఆగ్నిచేత తపింపబడువారలకు
తాపముపశమించునట్లు చేయుచు మిక్కిలి సంతోషమును కలుగచేయు వెన్నెల మన అమ్మ.
దారేషణ పుత్రేషణ ధనేషణ లతో తపించు భక్తుల తాపమును చల్లార్చుచు సంతోషమును
కలుగజేయు వెన్నెలయే మన అమ్మ.
స్వయం కల్పిత హ్లాదచంద్రిక వృత్తము.
*తాపత్రయాగ్ని సంత ప్త సమాహ్లాదన చంద్రికా*!
నీ పాద పద్మ పూజన్ నిరతంబే నిలఁ జేసెదన్,
శ్రీ పార్వతీ! మదంబా! స్థిర చిత్తంబును గొల్పుమా,
నీపైన భారముండెన్ నిరవద్యంబుగఁ జేయుమా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.