గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఆగస్టు 2025, మంగళవారం

శ్రీలక్ష్మీ సహస్రమున స్వయంకల్పిత వృత్తములు.

జైశ్రీరామ్. 

శ్రీ లక్ష్మీ సహస్రములో స్వయం కల్పిత వృత్తములు

అక్షయ వృత్తము.

గణములు.   య   ర   ర   య   జ   ర   గ…యతి. 12వ అక్షరము…ప్రాస 

కలదు.

లక్ష్మీ.స..493. ఓం *అకారాదిక్షకారాన్తసర్వవిద్యాధిదేవతా*యై నమః.

నామ వివరణ. 

అకారము మొదలు క్షకారము వరకు ఉన్న సమస్తవిద్యలకు దేవత మన అమ్మ.

స్వయంకల్పిత అక్షయ వృత్తము.

*అకారాదిక్షకారాన్తసర్వవిద్యాధిదేవతా* భవానీ!

ప్రకాశంబున్ వికాసంబు గొప్పగా వర్ధిలంగఁ జేయుమీవే,

యకారాది క్షకారంత సర్వమీవై కవిత్వమై వెలుంగన్

ప్రకాశించున్ బ్రబోధించు దైవమున్, భాసిలంగఁ జేయునమ్మా! 

అమందాక్రాంత వృత్తము.
గణములు...య - భ - న - త - త - గ - గ.  యతి11వ అక్షరము.
ప్రాస నియమము కలదు
లక్ష్మీ.స..728. ఓం *స్మృతిప్రజ్ఞా*యై నమః I
నామ వివరణ. 
శ్రుతులలో ఉండు స్మృతికి సంబంహించిన ప్రకృష్ట జ్ఞానము తల్లి.
స్వయంకల్పిత అమందాక్రాంత వృత్తము.
*స్మృతి ప్రజ్ఞా*! యతులిత గుణా! చిత్తమున్ వెల్గుమమ్మా,
స్మృతిప్రజ్ఞాభినుతముగ నామేధనే గొల్పుమమ్మా!
స్తుతంబౌ నీ యతులితమతిన్ జూప యత్నింపనిమ్మా,
నితాంతంబున్ నిరుపమ గతిన్ నేర్పుతో నుండనిమ్మా.

అర్థవిశేష వృత్తము.
గణములు…..  స  ర  స  మ  త  జ  గ  …. యతి  12….ప్రాస 
నియమము కలదు.
745. ఓం *బ్రహ్మవిష్ణుమహేశాది జ్ఞాతవ్యార్థవిశేషగా*యై నమః ।
నామ వివరణ. 
త్రిమూర్తులకూ తెలివ్యక్తమగు జ్ఞానము కలిగిన జనని.
స్వయంకల్పిత అర్థవిశేష వృత్తము.
కనగా *బ్రహ్మ విష్ణుమహేశాది జ్ఞాతవ్యార్థవిశేషగా*
మననీ నిన్నిలన్ గనుచున్ శ్రీమన్మార్గంబందు సుఖంబుగా,
జననీ! సుస్థిరంబుగ నిన్నే ధ్యాసన్ నిత్యంబు గణింపనీ,
క్షణ మైనన్ నిరర్థక మౌనా శ్రీ కాంతా నీదరినుండగా 

అష్టాదశచతుష్షష్ఠిపీఠికా వృత్తము.

గణములు.   స   భ   య   జ   త   ర.  యతి. 11వ అక్షరము.  ప్రాస నియాము కలదు. 

449.  ఓం *అష్టాదశచతుష్షష్ఠిపీఠికా విద్యయా యుతా*యై నమః.

నామ వివరణ. 

అష్టాదశపీఠములుగా చతుష్షష్టిపీఠములుగా విద్యా సమన్వితయై 

యొప్పుచున్న జనని.

స్వయంకల్పిత అష్టాదశచతుష్షష్ఠిపీఠికా వృత్తము.  

*విదితాష్టాదశచతుష్షష్ఠి పీఠికా విద్యయా యుతా!*

సదయన్ గాంచుమిక నన్నున్ ప్రశాంతిగానుండఁ జేయుమా,

హృదయంబందునవసించంగహృద్యమౌ పద్యముల్ సుధీ!

సుధలంజిందగరచింతున్విశుద్ధ!నీపై శుభాకృతీ!


ఉచ్ఛ్రిత పద వృత్తము.
గణములు. …   న   త   స   త   స     …   యతి 9వ అక్షరము.  ప్రాస కలదు.
931. ఓం *అత్యుచ్ఛ్రితపదాంతస్థే* నమః. 
నామ వివరణ. 
అత్య్న్నతమయిన పదాంతమందు ఉన్న జనని మన అమ్మ.
స్వయంకల్పిత చ్ఛ్రిత పద వృత్తము.
అహము *నత్యుచ్ఛ్రితపదా న్తస్థా*! యణచుమా.
యిహము తోపాటు పరమిమ్మా నాకు కృపతో,
స్పృహను నన్నుంచుచును సేవింపన్ గనుమిలన్,
దహర సన్మార్గమున తల్లీ నన్ నిలుపుమా.


కనకాభరణ వృత్తము. 

గణములు…. న  య  ర  ర  భ  జ  గ….. యతి 12వ అక్షరము . ప్రాస నియమము కలదు.

927. ఓం *కనత్సౌవర్ణరత్నాఢ్యా*యై నమః

నామ వివరణ. 

ప్రకాశించు బంగారము, రనాలు కలిగిన జనని.

స్వయం కల్పిత కనకాభరణ వృత్తము. 

సకల *కనత్ సౌవర్ణ రత్నాఢ్య*! సర్వాభరణ భూషితా! 

ప్రకటిత తేజోద్భాసవీవేను, భావోద్ధతిని గొల్పుమా,

నికర సుధోద్భాసాక్షరంబైన నిత్యంబనగ నీవెగా

సుకవితలో నీవేసుధన్ జింది శోభావళిగ జేయుమా.


కాంతిపుంజ వృత్తము.

గణములు…. త  స  మ   య   జ   గ….. యతి 9వ అక్షరము.

406.  ఓం *కైవల్యపదవీరేఖా*యై నమః.

నామ వివరణ. 

మోక్షమార్గము మన జనని.

స్వయం కల్పిత కాంతిపుంజ వృత్తము.

*కైవల్యపదవీరేఖా! * కాంతిరేఖా! మనోహరీ!

భావంబునను నీవేగా ప్రాణమై కాంతి చిందుదే,

జీవాత్మవయి నీవే  నా చిత్తమందున్ వెలుంగుదే,

దేవీ! గొలుపుమా నీదౌ దీప్తి నాలో, నమోస్తు తే.


కారణత్రయ వృత్తము.

గణములు…… స  ర  భ  మ  స  వ.  యతి.. 10వ అక్షరము. ప్రాస కలదు.

906. ఓం *జగదుత్పత్తిసంస్థాపన సంహారత్రయకారణా* యై నమః ।

నామ వివరణ. 

సృష్టి స్థితి లయ కారకురాలు అమ్మ.

స్వయంకల్పిత కారణత్రయ వృత్తము.

*జగదుత్పత్తిసంస్థాపనసంహారత్రయకారణా*!

నిగమాంతాక్షరానంత! గణింతున్నీ కృప కోసమే,

మొగమాటంబదేలన్ దగ పొల్పున్ నన్నిలఁ జూడగా,

జగమేలే నినున్ నామది సంస్థాపించి నుతించెదన్.


కారుణ్యవృత్తము.

గణములు    మ  ర  ర  య  య  …  యతి9వ అక్షరము. ప్రస కలదు.

686. ఓం *కారుణ్యాకారసమ్పత్త*యే నమః ।

నామ వివరణ. 

కరుణతో కూడిన ఆకారమే సంపదగా కల తల్లి.

స్వయంకల్పిత కారుణ్యవృత్తము.

*కారుణ్యాకారసమ్పత్తి*! కావగా రమ్ము నన్నున్,

నీ రూపంబున్ సతంబెన్ననిమ్ము నాదైవ మీవే,

ధారాశుద్ధిన్ గృతిన్ గొల్పి, తత్కృతిన్ నీవె కొమ్మా,

శ్రీరమ్యాకార! నాలోని చింతలన్ బాపుమమ్మా!


కాళీ అశ్వధాటివృత్తము. యతిస్థానంలో ప్రాసయతితో కూడిన అశ్వధాటి. 

152. ఓం *విశ్వమ్భరా*యై నమః ।

నామ వివరణ.

విశ్వముయొక్క సమస్త భారమును భరించు జనని మన అమ్మ.

స్వయంకల్పిత కాళీఅశ్వధాటి

*విశ్వంభరా*! మదిని విశ్వాసమున్ గొలిపి శశ్వచ్ఛుభంబరయనీ,

విశ్వేశ్వరీ! కృపను నాశ్వాసవై నిలిచి విశ్వంబునన్ నిలిపితే,

విశ్వప్రసిద్ధమగు విశ్వేశు గాధలను శశ్వత్ ప్రభన్ గొలువనీ,

విశ్వాత్మ నీవె కద, విశ్వాస మొప్ప కృతి నశ్వోద్ధతిన్ గొలుపనీ.


క్లీంకార వృత్తము.గణములు. మ  య  త  త  ర, … యతి8వ అక్షరము. 

లక్ష్మీ.స..1000. ఓం *క్లీఙ్కారార్థసావిత్ర్యై* నమః।

నామ వివరణ.

క్లీంకారముయొక్క అర్థమయిన సవిత్ర స్వరూపిణి మన అమ్మ.

స్వయంకల్పిత క్లీంకార వృత్తము.

*క్లీఙ్కారార్థ సావిత్రీ*! కీర్తిసంపద్ప్రదా సుధీ!

శఙ్కాదూర! శ్రీదేవీ!  శక్తియుక్తి ప్రదాతవై

జఙ్కున్ బాపి నన్నేలే చక్కనమ్మా! సుధాంబుధీ!

యఙ్కాఙ్కంబునన్ నీవే,యాత్మ రూపాదులన్ సుధీ!


ఛిద్ర విరోధీ వృత్తము. 

గణములు..  య   స   జ   స   గ.    యతి. 9వ అక్షరము. ప్రాస కలదు.

865. ఓం *గృహచ్ఛిద్రనివారిణ్యై* నమః ।

నామ వివరణ. 

కుటుంబకలహములను నివారించు దయాస్వరూపిణి అమ్మ.

స్వయంకల్పిత ఛిద్ర విరోధీ వృత్తము. 

*గృహచ్ఛిద్ర నివారిణీ*!  గృహము దేహం

బె, హర్షంబు గతించెనే, యిట మదంబా!

గృహచ్ఛిద్రము చేతనే,  కృపను నీవే

మహత్వంబున మాపుమా, మనగనిమ్మా.


దయాపాంగ వృత్తము.

గణములు…న  య  య  మ  భ   ర. యతి.  11వ అక్షరము. ప్రాస కలదు.

987. ఓం *సదయాపాఙ్గసన్దత్తబ్రహ్మేన్ద్రాది పదస్థిత*యే నమః ।

నామ వివరణ. 

తన దయతో తడిసిన వంచబడిన శిరస్సులుకలిగిన బ్రహ్మేంద్రాదులులను కలిగిన 

జనని.

స్వయంకల్పిత దయాపాంగ వృత్తము.

వర *సదయాపాఙ్గసన్దత్తబ్రహ్మేన్ద్రాది పదస్థితా*!

నిరుపమ జ్ఞానాక్షమిమ్మమ్మా, నిన్ గాంచన్ మది నిత్యమున్,

పరమన నీవే కదమ్మా నీపై భక్తిన్ దయనీయుమా,

సురుచిర సౌందర్యతేజంబా!  చూడంగా నను రాగదే.


దివ్యాంబర దీప్తీ వృత్తము.
గణములు.  త   స   మ   జ   జ   గ.  యతి… 9వ అక్షరము…  ప్రాస నియమము కలదు.
988. ఓం *అవ్యాహతమహాభాగ్యా* యై నమః .
నామ వివరణ. 
అంతులేని మహాభాగ్యురాలు అమ్మ.
స్వయం కల్పిత దివ్యాంబర దీప్తీ వృత్తము.
*అవ్యాహత మహాభాగ్యా*! హార నూపుర శోభితా!
దివ్యాంబర మహావీధిన్  దీప్తివై కనిపించుమా
సవ్యంబుగ సుసాధ్యంబై సన్నుతుల్ గను శాంభవీ!
దివ్యాంబర మహా వృత్తాధీశ్వరీ జయరూపిణీ!

దైవ సన్నుత వృత్తము.

గణములు..  ర   త   మ   య   ర  ..  యతి.  9వ అక్షరము. ప్రాస కలదు.

973. ఓం *దేవతానాందేవతా*యై నమః ।

నామ వివరణ. 

దేవతలకే దేవత మన అమ్మ.

స్వయం కల్పిత దైవ సన్నుత వృత్తము.

*దేవతానాం దేవతా*! స్వాధీనమై నిన్ గొల్వనీ!

జీవితాంతంబీవెగా రాజిల్లఁ జేయన్ గల్గితే

భావమందున్, బోధయందున్ వా ఙ్మయంబందీవెయై

కావరమ్మా, సామ భాసా! కల్పవల్లీ! సంస్తుతుల్.


ధ్యానానంద వృత్తము.
గణములు… న   మ   త   త   గ…. యతి 10వ అక్షరము.  ప్రాస కలదు.
697. ఓం *సత్యజ్ఞానాత్మికానన్దా*యై నమః ।
నామ వివరణ. 
సత్యము జ్ఞానములతో ఆనందమయయై యుండు జనని.
స్వయంకల్పిత ధ్యానానంద వృత్తము.
అనుపమా! *సత్యజ్ఞానాత్మికానన్ధ*! నీ
ఘనతనే నిత్యమ్మెన్నంగ కాదమ్మరో!
సునిశితంబౌసుజ్ఞానంబుశోభిల్లు నీ
కు నిరతంబున్ ప్రేమన్ మ్రొక్కకూర్మిన్ ధరన్.

నక్షత్ర వృత్తము.  
గణములు.  స  జ  య  య త  ర  యతి  11వ అక్షరము. ప్రాస నియమము కలదు.
750. ఓం *కృత్తికాదిభరణ్యన్తనక్షత్రేష్ట్యార్చితోదయా*యై నమః ।
నామ వివరణ. 
కృత్తిక మొదలు భరణి వరకూ గల నక్షత్రములచే అర్ఇంపఁబడు జనని మన అమ్మ.
స్వయం కల్పిత నక్షత్ర వృత్తము.  
వినుతింతునిన్ కృపతోశాంభ వీదేవీ! నీవు కావుమా
నను *కృత్తికాదిభరణ్యన్తనక్షత్రేష్ట్యాచితోదయా*!
ప్రణతుల్ సదా గొనుమా, నిన్ను వర్ణింతున్ గావ్యమందునన్
మననిమ్ము,  నీపదముల్ పూజ్య  మానా! సేవించుచిద్ధరన్.

నీలా సంసేవ్య వృత్తము.
గణములు…  మ   ర   మ   య   జ   గ..  యతి 9వ అక్షరము. ప్రాస కలదు.
960. ఓం *భూమీనీలాదిసంసేవ్యా* యై నమః ।
నామ వివరణ. 
భూదేవి, నీలాదేవి లచే మిక్కిలి సేవింపబడు జనని.
స్వయం కల్పిత నీలా సంసేవ్య వృత్తము.
*భూమీ నీలాది సంసేవ్యా*! భుక్తి ముక్తి ప్రదాయినీ!
ప్రేమే నాపైన నీకున్న బ్రీతితో కావు మీశ్వరీ!
యేమాత్రంబైన నిన్ నిత్యంబీశ్వరీ! కొల్వకుంటినా?
శ్రీమాతా! భక్తమందారా! శ్రీకరంబై కనన్ గదే.

న్యాయమీమాంస వృత్తము.
గణములు….య  ర  మ  య  జ  గ….యతి..9వ క్షరము….ప్రాస నియమ్ము కలదు.
559.  ఓం *పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతా*యై నమః.
నామ వివరణ. 
పురాణము, న్యాయము, మీమాంస, ధర్మశాస్త్ర, ఆగమములలో వినిపించు జనని.
స్వయంకల్పిత న్యాయమీమాంస వృత్తము.
పరంబున్గొల్పుమా నాకున్ బ్రాభవంబున్ గనంగ నిన్
పరంధామా! జయంబిమ్మా, భక్తితోఁ గొల్చెదన్ నినున్
పురాణాదుల్ గనన్ నీవే ముద్దుగా నేర్పుమా లస
*త్పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతా! *

పుణ్యశ్లోకీ వృత్తము.
గణములు…  మ   ర   ర   య   య.  యతి. 9 వ అక్షరము.   ప్రాస కలదు.
816. ఓం *పుణ్యశ్లోకప్రబన్ధాఢ్యా*యై నమః ।
నామ వివరణ. 
పుణ్యప్రద శుభశ్లోకాన్విత ప్రబంధములలో ఉన్న జనని.
స్వయంకల్పిత పుణ్యశ్లోకీ వృత్తము.
*పుణ్యశ్లోకప్రబన్ధాఢ్య*! పూజలన్ బొందుమమ్మా!
గణ్యంబౌ నీ పదాబ్జాళి కాంచుటెట్లోగదమ్మా,
పుణ్యంబుండున్ సదా నిన్నుఁ బూజలన్ గొల్వనీ, ప్రా
మాణ్యంబీవే కదా, గాంచుమా ననున్, కన్నదీవే.

బిందునాద కళావృత్తము.
గణములు.  ర  స  మ  జ  జ  గ….యతి 9వ అక్షరము. ప్రాస కలదు. 
313.  ఓం *బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా* యై నమః.
నామ వివరణ. 
బిందుస్థానమునకు, నాదమునకు, కళలకు అతీతమయిన తల్లి మన అమ్మ. 
బిందువు, నాదము, కళలకు ఆత్మ అమ్మయే.
స్వయం కల్పిత బిందునాద కళావృత్తము.
*బిందునాదకళాతీతా బిందునాదకళాత్మికా !*
మందగించెడి నా బుద్ధిన్ మాత! నీ కృప కాచునే,
సుందరంబగు నీరూపున్ చూచినంస్పృహ కల్గెడున్
బిందునాదకలన్నాకున్ విందుచేయుము శాంభవీ!

బీజపాలికా వృత్తము.
గణములు.  ..... మ  ర  య  జ  గ….. యతి 9వ అక్షరము. ప్రాస నియమము కలదు.
997. ఓం *ఐం హ్రీం శ్రీం బీజపాలికా*యై నమః ।
నామ వివరణ. బీజాక్షరములయిన ఐం హ్రీం శ్రీం నకు పాలకురాలు అమ్మ.
స్వయం కల్పిత బీజపాలికా వృత్తము.
*ఐం హ్రీం శ్రీం బీజపాలికా*! యాత్మనుండుమా! 
ఐం హ్రీం శ్రీం శ్రీ సరస్వతీ! యద్భుతాక్షరా
ఐం హ్రీం శ్రీం పార్వతీసతీ! యక్షసేవితా!
ఐం హ్రీం శ్రీం దక్షపుత్రికా! హాయినిమ్మికన్.

బ్రహ్మాండ వృత్తము.
గణములు, మ ర మ ర జ గ……యతి 9వ అక్షరము..ప్రాస కలదు.
804. ఓం *బ్రహ్మాణ్డాన్తర్బహిర్వ్యాప్తా*యై నమః ।
నామ వివరణ. 
బ్రహ్మాండమంతటా వెలుపల లోన వ్యాపింక్ష్హియుండు జనని అమ్మ.
స్వయంకల్పిత బ్రహ్మాండ వృత్తము.
*బ్రహ్మాండాన్తర్భహిర్వ్యాప్తా*! బ్రహ్మాండమీవె సన్నుతా!
బ్రహ్మంబై నన్ ప్రవర్ధింపన్, భావంబునందునుండుమా,
బ్రహ్మోద్భాసీ! వరానందా, భక్తిన్ ప్రవృద్ధి చేయుమా,
బ్రాహ్మీ మూర్తీ! ప్రభాపూర్ణా! భద్రంబు నీవె కొల్పుమా

భ్రూప్రభా వృత్తము. గణములు.   మ   ర   ర   య   య   యతి 9వ అక్షరము.  
748. ఓం *భ్రూమధ్యేభాస్కరాకారా*యై నమః ।
నామ వివరణ. 
భ్రూమధ్యమున సూర్యుని వహించియున్న జనని.
స్వయంకల్పిత భ్రూప్రభా వృత్తము.
గణములు.   మ   ర   ర   య   య   యతి 9వ అక్షరము.  ప్రాస నియమము కలదు.
*భ్రూమద్యే భాస్కరాకార* పుణ్య గణ్యాంబవీవే,
యేమా తేజంబు నీ చెంత నిట్టులుండన్ బ్రపూజ్యా!
క్షేమంబే నీ కృపన్ గల్గు చిత్తమందుండ నీవే.
శ్రీమాన్యా! నిన్నుఁ బ్రార్థింతు జ్ఞేయమున్ దెల్ప నాకున్.

మాంగల్య గౌరీ వృత్తము.
గణములు… న   ర   త   త   త   గ.  యతి.   12వ అక్షరము. ప్రాసకలదు.
972. ఓం *మఙ్గలానాంమఙ్గలా* యై నమః ।
నామ వివరణ. 
మంగళములకే మంగళములు మన అమ్మ.
స్వయంకల్పిత మాంగల్య గౌరీ వృత్తము.
మహిత *మఙ్గలానాంమఙ్గలా*! నిన్ మదిన్  గొల్చెదన్,*
మహిమ నీ కృపన్ నేఁ గాంతునమ్మా,  మనోజ్ఞప్రభా!
విహిత కర్మగా నిన్ గొల్తు భక్తిన్ విధాత్రీ! మదిన్.  
సహనశీలమున్ శాంతంబు, నిమ్మా, సదా వెల్గగన్.

మాతులఙ్గ వృత్తము.
గణములు…..న   ర   స   మ   వ …. యతి 8వ అక్షరము….. ప్రాస నియమము కలదు.
943. ఓం *మాతులఙ్గమయం ఖేటం బిభ్రత్యై* నమః ।
నామ వివరణ. 
దానిమ్మతో చేసిన కవచమును పట్టుకొనిన జనని.
స్వయంకల్పిత మాతులఙ్గ వృత్తము.
మహిత *మాతులఙ్గమయం ఖేటం బిభ్రతీ*!
మహిమతో సదా సుమనోజ్ఞంబౌ కావ్యమున్
మహిని నిన్నుఁ జూప మదంబా వ్రాయింపుమా
స్పృహను నిల్పి నన్నుక్షితిన్ వెల్గన్  గానుమా.

మృణాలి వృత్తము.

గణములు. …..య   స   భ   మ   జ   గ   …   యతి 9వ అక్షరము.  ప్రాస కలదు.

128. ఓం *ఇడాపిఙ్గలికామధ్యమృణాలీతన్తు రూపిణ్యై* నమః ।

నామ వివరణ.

మనలోనుండు ఇడ, పింగల, అను నాడుల మధ్యనుండెడి సుషుమ్నాడి తామరతూడుదారము ఆకారములో ఏది యుండునో ఆ రూపము అమ్మయే.

స్వయంకల్పిత మృణాలి వృత్తము.

*ఇడాపిఙ్గలికామధ్యమృణాలీతన్తు రూపిణీ!*

వడిన్ నీవిక రావమ్మ! భవానీ! భాసురాంబికా!

కడన్ నిల్పగ నేలమ్మ! గణించమ్మా ననున్ సతీ!

కడున్ గౌరవ తత్వం బిఁక నీవేయిమ్ము గొప్పగా!


రోగవివర్జ వృత్తము.
గణములు …. స  జ  య  త భ  ర.  యతి..11వ అక్షరము.. ప్రాస కలదు.
267.  ఓం ఈషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితాయై నమః.
నామ వివరణ. 
దారేషణ, పుత్రేషణ, ధనేషణ, అను ఈషణత్రయమునుండిపూర్తిగా విముక్తి పొందియున్న 
తల్లి మన అమ్మ, సమస్త రోగములనూ విడిచిన తల్లి మన జనని.
స్వయంకల్పిత రోగవివర్జ వృత్తము.
సతి! యీషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా!
క్షితిపై ధనాదుల నాశింపన్ కీడు ప్రాప్తమగున్ గదా,
స్తుతియింతు నిన్ త్రయనిర్ముక్తిన్ సుప్రదా కలిగించుమా
నుతమార్గమందు మదంబా  నిన్నున్ స్తుతింపగఁ జేయుమా.

వశీకర వృత్తము.
గణములు.  జ   స   జ   జ   గగ.  యతి 9వ అక్షరము. ప్రాసకలదు.
971. ఓం *వశీకృతజగత్పత* యే నమః ।
నామ వివరణ. 
విశ్వప్రభువగు భగవానుని ఆకర్షించు జనని.
స్వయంకల్పిత వశీకర వృత్తము.
*వశీకృత జగత్పతీ*! పరమార్థమీవే,
నిశాచరు గణంబు నన్ నిలువంగ చేయున్,
ప్రశాంతమును కోల్పడన్ రహియింపఁ జేయన్
విశేషముగ నిన్ను,నేవిధినౌన్ మదంబా!

విభ్రాజిదాకృతి వృత్తము.
గణములు.  త   మ   స   జ   గగ. …యతి. 9వ అక్షరము.
477. ఓం *అష్టాష్టవిభ్రాజద్వికృతాకృత*యే నమః.
నామ వివరణ. 
ఎనిమిదెనిమిదుల(64) కళలలో ప్రకాశించు జనని అమ్మ.
స్వయంకల్పిత విభ్రాజిదాకృతి వృత్తము.
*అష్టాష్టవిభ్రాజద్వికృతాకృతీ! * నుతింతున్,
దృష్టిన్ సదా నీపైనిడి, తృప్తిగా వసింతున్,
కష్టంబులన్ వారించు ప్రకాశ మిమ్ము నాకున్,
స్రష్టాకృతీ! నీవే నను సాకుమా, మదంబా!

వీర విక్రమ వృత్తము.
గణములు.  స  జ  య  జ  భ  ర.   యతి11వ అక్షరము. ప్రాస నియమము కలదు.
793 ఓం *కాలికేయ మహోదార వీర విక్రమ రూపిణ్యై* నమః
నామ వివరణ. 
కాళికేయ అను సర్పముయొక్క గొప్ప బలమునకు కారణమయిన తల్లి మన అమ్మ.
స్వయంకల్పిత వీర విక్రమ వృత్తము.
*విను కాలికేయమహోదార వీరవిక్రమరూపిణీ*!
ఘనమైన నీ  కృపనే  చెప్పఁగా తలంతును చెప్పనీ,
క్షణమైన నీ దయనే పొందగా మదిన్ గనుచుండెదన్,
మననిమ్ము, నీకృపచే ప్రాణమౌ ననున్ గననిమ్మిలన్.

వైఖరీ వృత్తము. 
గణములు.  న  య  స  త  త  జ  గ   …  యతి 12. ప్రాస నియమము కలదు.
737. ఓం *అసంఖ్యేయపరార్ధాన్త స్వరవ్యఞ్జనవైఖర్యై* నమః ।
నామ వివరణ. ఆసంఖ్యాకమయిన వర్ణమాలలకు, హల్లులకు,మరియు అచ్చులకు 
పుట్టినిల్లు అమ్మ.
స్వయంకల్పిత వైఖరీ వృత్తము. 
వసుధ *నసంఖ్యేయపరార్ధాన్త-స్వరవ్యఞ్జనవైఖరీ*! 
యసమ సభాపూజ్య సుధారాశీ!యనంతాక్షర రూపిణీ!!
విషయ పరిజ్ఞానమదేదీ దేవి! లేదమ్మ,నిజంబిదే
కసరక నేర్పించుము నీవే, లోక కామ్యార్థము నీవెగా.

వ్యోమమధ్యస్థ వృత్తము.
గణములు.  య  ర  మ  య …..యతి…  8వ అక్షరము.    ప్రాస నియమము కలదు.
781. ఓం *సముద్రవ్యోమమధ్యస్థా*యై నమః ।
నామ వివరణ. 
సముద్రాకాశముల మధ్యనుండు జనని.
స్వయం కల్పిత వ్యోమమధ్యస్థ వృత్తము.
*సముద్ర వ్యోమ మధ్యస్థా*! నిన్ స్మరింతున్,! 
రమాదేవీ! మదంబా! రక్షించుమమ్మా!
ప్రమాణంబీవె నాకున్, రాణింపనిమ్మా,
సమస్తంబున్ సృజింపన్ శక్తిప్రదాత్రీ!

శక్త్యోపాసన వృత్తము.
గణములు….   న  స   స  భ  జ  జ   గ…. యతి12వ అక్షరము. ప్రాస కలదు.
926. ఓం *నవకోటిమహాశక్తిసముపాస్యపదామ్బుజా*యై నమః ।
నామ వివరణ. 
నవకోటి మహాశక్తి సమన్వితులచే పూజింపబడు జనని.
స్వయంకల్పిత శక్త్యోపాసన వృత్తము.
:జయము *నవకోటిమహాశక్తిసముపాస్య-పదామ్బుజా*!
భయము విడనాడి ప్రవర్తించి వసుధన్ మనజేయుమా,
ప్రియముజనపాళిపయిన్ జూపు వినుతంబుగ నమ్మరో!
రయమునను కావగ రావేల  రమణీమణికొల్చినన్.

శ్రీంబీజ వృత్తము.
గణములు...  న  త  స  త  జ  వ…. యతి12వ అక్షరము..ప్రాస కలదు.    
996. ఓం *శ్రీంబీజ జపసన్తుష్టా*యై నమః ।
నామ వివరణ. 
శ్రీం అను బీజాక్షర జపముచేయునంతలో సంతోషించు జనని.
స్వయంకల్పిత శ్రీంబీజ వృత్తము.  
వినుత  *శ్రీంబీజ జప సంతుష్టా*! వినుతిన్ వినుమా
కనుమ నాలోని వర భావాలన్  కరుణం గొలుపన్
ధనములిమ్మంచు నిను కోరన్, బాధలు పెట్టకుమా,
మనము నీవల్ల గను సంతృప్తిన్, మదిలో నిలుమా.

సదాచార వృత్తము.
గణములు…… స  స  భ  య  య  గ ….యతి 10వ అక్షరము. ప్రాస కలదు.
814. ఓం *సర్వాగమసదాచారమర్యాదా*యై నమః ।
నామ వివరణ. 
సమస్త వేదములలో గల ఆచారములను పాటించు జనని అమ్మ.
స్వయం కల్పిత సదాచార వృత్తము.
జయమిమ్మిక *సర్వాగమ సదాచార మర్యాదా*!
భయమున్ విడి నిన్ గొల్చెద భవానీ! శుభాకారా!
నయమార్గము వీడన్  నిను నయోద్భాస, మాయమ్మా!
ప్రియమౌ వర ముక్తిన్ గొలిపి ప్రోవంగదా మాతా!

సద్యోజాత వృత్తము.
గణములు.  మ   ర   ర   ర   య.  యతి. 11వ అక్షరము. ప్రాస కలదు.
916. ఓం *సద్యోజాతాదిపఞ్చాగ్నిరూపా*యై నమః ।
నామ వివరణ. 
సద్యోజాతముమున్నగు పంచాగ్నులస్వరూపము అమ్మ.
స్వయం కల్పిత సద్యోజాత వృత్తము.
*సద్యోజాతాదిపఞ్చాగ్నిరూపా*! జయంబు నీకున్,
విద్యాబుద్ధుల్ కృపన్ గొల్పినీవే వివేకమిమ్మా, 
వేద్యంబై నీవునాకున్  కృపన్ భావిఁ జూపుమమ్మా,
సద్యోజాతా! ప్రపంచంబు నీవే సదాత్మవీవే.

సాధన ఫల వృత్తము.
గణములు…  స  భ  య  జ  ర…  యతి 9వ అక్షరము..  ప్రాస కలదు.
992. ఓం *నిఃశ్రేయసపదప్రాప్తి సాధనంఫలా*యై నమః ।
నామ వివరణ. 
శుభప్రదమయిన శంకర పద ప్రాప్తిసాధనా ఫలితమునందించు జనని.
స్వయంకల్పిత సాధనా ఫల వృత్తము.
వర *నిఃశ్రేయస పదప్రాప్తి సాధనంఫలా*!
కరుణింపంగదె ననున్ క్రాంతి రూప శాంభవీ!
నిరపాయంబుగ ననున్  నీవ చూడు ధాత్రిపై
వరపాదా!  కొలువనీ భావబంధమొప్పఁగన్.

సువర్ణవృత్తము.
గణములు.  భ   మ   య  జ   త   ర.  యతి. 11వ అక్షరము. ప్రాస నియమము కలదు.
624. ఓం *అకారాది క్షకారాన్త సర్వవర్ణాకృతస్థలాయై* నమః ।
నామ వివరణ. అకారము మొదలు క్షకారము వరకు ఉన్న అన్ని వర్ణములకు అమ్మయే 
స్వరూపము.
స్వయంకల్పిత సువర్ణవృత్తము.
స్వర్ణ *వకారాది క్షకారాన్త సర్వవర్ణాకృతస్థలా*!
స్వర్ణ సముద్భాసా! మదాంధంబు చక్కగా త్రుంచుమమ్మరో!
కర్ణ సుపర్వంబైన నీ నామ గానముంజేయఁ జేసి, సౌ
పర్ణ మనోజ్ఞంబైన కావ్యంబువై వెలుంగన్ గదే సుధీ!

సౌభాగ్యద వృత్తము.   
గణములు…త   స   ర   జ   జ   గ.  యతి.. 9వ అక్షరము.
783 ఓం *సౌభాగ్యరసజీవాతవే* నమః ।
నామ వివరణ. 
అమ్మ వివిధ రకాల సంపద.
స్వయం కల్పిత సౌభాగ్యద వృత్తము.   
*సౌభాగ్య రస జీవాతు*! సంస్తుతుల్ శుభకారిణీ!
నా భాగ్యమయి నాలోన నవ్వుచున్ విలసిల్లుమా,
శోభావహవు,నాలోని శోభనీవని యెంచెదన్,
నా భావమున నీవుండి, నాకు తోడుగ నుండుమా.

సౌవర్ణ చషక వృత్తము.
గణములు…..త   స   భ   ర   గ.  ..   యతి.  10వ అక్షరం. ప్రాస కలదు.
944. ఓం *సౌవర్ణచషకం బిభ్రత్యై* నమః ।
నామ వివరణ. 
చేతితో బంగారు గొబ్బెమ్మను పట్టుకొనిన జనని.
స్వయంకల్పిత సౌవర్ణ చషక వృత్తము.
*సౌవర్ణ చషకం బిభ్రతి*!  సాధురక్షా!
నీవే జనని నాకున్ గతి నిత్య పూజ్యా!
భావింతు నిను నాలో గని, భాను తేజా!
సేవింప నిను సౌఖ్యంబులు చెందు నన్నున్

హృదయపీఠికా వృత్తము.

గణములు. … త   స   ర   జ   న   త   ర.  యతి…12వ అక్షరము.,, ప్రాస నియమముకలదు.

449. ఓం *అష్టాదశచతుఃషష్టి-పీఠికా*యై నమః.

నామ వివరణ. 

పదునెనిమిదియు, అరువదినాలుగు పీఠములనొప్పారు జనని మన అమ్మ.

స్వయంకల్పిత హృదయపీఠికా వృత్తము.

*అష్టాదశ చతుష్షష్టి పీఠికా!* యనుపమ విజ్ఞాన పేటికా!

కష్టంబులనుపోవంగఁ జేయుమా, కమలదళాక్షీ, నితాంతమున్,

సృష్టిన్  జనుల రక్షింతు వీవెగా శ్రితజనమందార!  సన్నుతుల్,

నష్టంబులనుపోఁగొట్టి, కావుమా, ననుగను తల్లీ! ప్రశాంతిగా..

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.