జైశ్రీరామ్.
1.శా:-శ్రీ మద్దివ్య రసాను భూతు లెలయన్ శ్రేయోభి రామంబుగా
రామున్ రమ్య గుణాభి రాము చరితన్ రమ్యంబుగా గూర్చిరే
నీమాలంకృత కావ్య రీతు లలరన్, నిస్తౌల్య సత్ కీర్తియున్,
క్షేమంబున్, వర భాగ్యముల్ కనుఁడయా! శ్రీరాము నాశీస్సులన్!
2.సీ:- ప్రాగుషోదయ కాల భాగ్యంబుగా నెంచి,
కనులార చిత్రాలు కాంచి కాంచి,
మించిన సత్ ప్రేమ మేధలో కదలాడ
రామ కృష్ణుని గాంచి రమ్య ధృష్టి
పంచ రత్నాలలో ప్రణుతి నోంకారమై
రామ భీజ మహిమ రాజిలంగ,
శ్రీరామ! మా రామ! రఘు రామ! యనుచును
భక్తితో నుతియించి, బరగ దలచి!
తే.గీ:- కోర కుండక కృతి కేను కూర్మి కతన
వ్రాయు చుంటిని దీవించి, ప్రణుతు లిడుచు!
రామ తారక మంత్రంబు రహిని వెలుగ!
జీవ ముక్తిని కాంక్షించి!జీవ తతికి!
3.సీ:-ఏ జిహ్వ రాముని యింపార బల్కునో
యా జిహ్వ జిహ్వయౌ యవని పైన
యా రామ నామమే యే మనంబునకంటు
నా మనంబగు నెన్న నవని మిన్న!
యీ రామ కీర్తన లింపొంద శృతమౌనొ
ఆ మాన్యు శ్రోత్రముల్హాయి గనును!
యే రామ శతకంబు యీ రాము కృతి యాయె
రాఘవ ప్రోక్తమై ప్రబలు నదియె,
తే.గీ:-రామ కృష్ణాఖ్య! నుత కవి రాజ తిలక!
జన్మ జన్మల పుణ్య మీ జన్మ కాగ,
భాష మాధుర్య శోధిత మాన్య చరిత!
చిత్ర గర్భ కృతి వధాన్య! శ్రీలు కనుడు!
4.సీ:-ఊల పల్లి సువంశ! యుద్యత్ఘన సు కీర్తి
లలిత సాంభ శివుల లాల నాన
రాఘవ శతకంబు రమ్యమై రహి నిల్చు
కల్ప కల్పాంతర కాలమిలను,
జన్మ సార్ధక మాయె, జగదేక రాముండు
రామ కృష్ణుని మేధ సోమ మేర్చె!
రామ రామ యనగ రమ రామమౌ గదే?
రమణి సీతమ్మయే రక్ష కాగ,
తే.గీ:-జీవ సౌఖ్యంబు జేకూర్చి, జీవ సరళి,
నిండు నూరేండ్లు భక్తి తా నెలకొనంగ,
శివుని భద్రత నెంచిన జీవి యేను!
సతత మాశీస్సు లందింతు, శర్వు దయను.
5.సీ:-వెలుగైన తెలుగుకే విలువ తా పెంపేర్చి,
విన్యాసములు జేయు వేద్యు డౌచు,
చిత్రాలు బంధాలు, చిన్ముద్ర లను కూర్చి,
ముద్రిత ప్రతులకే మోద మేర్చి,
గర్భ మర్మ మెరిగి, కంజాత సుమములు
గర్భ కవిత పూజఁ గ్రాలఁగ నిడి!
భావి తరములెల్ల బాగు తెల్గన బొల్చు
తెలుగు చేతలవెల్గఁ దీర్చి రార్య!
తే.గీ:- తెలుఁగు పద్యంబు మహిమతో వెలుగఁ జేయ
తేనె లొలికెడి తెన్గుకు దీప్తిఁ గొలిపి
రామ కృష్ణాఖ్యు! ధరణిపై రాజిలితిరి,
తెలుగు చిత్ర సత్కవులలోఈ దీప్తి గనిరి.
జైహింద్
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.