జైశ్రీరామ్.
ఆధ్వర్యవము వహించిన వారు. బ్రహ్మశ్రీ భాగవతగణనాధ్యాయి ఊలపల్లి సాంబశివరావు, మహాలక్ష్మీ స్వరూపిణి ఊలవల్లి లలిత. దంపతులు.
రస్తు .. శుభమస్తు .. అవిఘ్నమస్తు
శ్రీ విశ్వావసునామసంవత్సరంలో భాగవతరత్న పురస్కార గ్రహీత అయిన
డా. కలవకుంట ఈశ్వరబాబు భాగవతోత్తములకు
అభినందనపంచరత్నాలు.
రచన .. చింతా రామకృష్ణారావు.
శా. శ్రీమన్మంగళ కల్వకుంట కులజా! శ్రీ యీశ్వరాఖ్యా! సుధీ!
శ్రీమద్భాగవతోత్తముల్ తమరిలన్ శ్రీరత్నమంచెంచినా
రోమాన్యుండ! జయంబు మీకగుత, స్నేహోదార సంపత్ప్రభన్
శ్రీమంతుండగు నారసింహుఁడు కృపన్ చెన్నార మిమ్మేలుతన్.
సీ. కలవకుంట యనెడి ఘనవంశమందున వెలుగుచునున్నట్టి వేల్పులయిన
మాన్య దొరస్వామి మందడి తండ్రియున్, రాజేశ్వరీదేవి ప్రథిత జనని,
యాదవాన్వయమున నాదరంబున మిమ్ము కని,పెంచి, ఘనతను కనఁగఁ జేయ,
చిననాటి గురువులు చెలగెడిమార్గమే చిత్తమందు ప్రబలి సత్తువొసగ,
తే.గీ. దినదినంబున నభివృద్ధి దీక్షను గని,
చిన్నరెడ్డయ్య గురుమార్గ మెన్నిమీరు
భాగవతమున చినచిన్న పాత్రలపయి
శోధనంబున కృషిచేసి శుభము కనిరి.
శా. డాక్టర్ జ్యోత్స్న సఖీలలామ సతియై డాయన్ మిమున్, తృప్తిగాన్
డాక్టర్ పట్టమునందినారు ధర వీడన్ బోని సద్దీక్ష, స
మ్యక్ టంకారము బోలుగాత్రమున సమ్మాన్యంపు సద్బోధనన్
డాక్టర్. ఈశ్వర! శిష్యపాళిమదులన్ డాయన్ దగున్ మేలుగాన్.
శా. ఏతన్మాత్రులు కారటంచు విలసద్ హృద్యంపు సమ్మానమున్
బ్రీతిన్ భాగవతోత్తముల్ గొలిపిరో విఖ్యాత! మీకున్, ధరన్
ఖ్యాతిన్ గాంతురు మీరు, దీని వలనన్, గణ్యాత్మ! మీ పుత్రుఁడౌ
చేతన్ కృష్ణయు, పుత్రియౌ లిఖితయున్, క్షేమంబుగా వెల్గెడున్.
ఉ. మంగళమౌత మీకు, శుభమంగళమొందుత జ్యోత్సయున్, లసన్
మంగళమౌత చేతనుకు, మంగళమౌ తమ పుత్రికిన్, జగ
న్మంగళమూర్తియౌ హరికి, మంగళసాంబశివాఖ్య శక్తికిన్
మంగళమౌత, నిత్యశుభమంగళముల్ మనదేశమాతకున్. .. స్వస్తి.
మంగళమ్ మహత్ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
జైహింద్.
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.