గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జనవరి 2025, శనివారం

గతే శోకో న కర్తవ్యో. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  గతే శోకో న కర్తవ్యో - భవిష్యం నైవ చిన్తయేత్।

వర్తమానేన కాలేన - వర్తయన్తి విచక్షణాః॥

తే.గీ.  గడిచినట్టి శోకమునకు కలతఁ బడక,

భవితకైచింత చేయక, ప్రస్తుతమును

గూర్చి చింతించు విజ్ఞాని గొప్పవాఁడు,

చేయవలసిన పనులందు చేవఁ జూపు.

భావము.  గతించి పోయినదాన్ని గూర్చి ఆలోచిస్తూ కూర్చోకూడదు.

జరగబోవు దాన్ని గూర్చి ఆశాసౌధాలు కడుతూ కూర్చోకూడదు, 

విచక్షణ వివేకంగలవారు వర్తమానమునకు అనుగుణంగా చేయవలసిన 

కర్తవ్యాలను చేయుదురు.

జైహింద్.

3, జనవరి 2025, శుక్రవారం

భక్తిసాధనం వారు వ్రాయుటకవకాశం కలిగించిన మకుటం. మంగళాంబికా! నా పద్యదశకము.

0 comments

జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః🙏🏼

మంగళాంబికా!🙏🏼


౧) ఉ.  శ్రీ మధుసూదనుండు, శశిశేఖరుఁడున్, విధి, నిన్ భజించుటన్

శ్రీమదనంత సృష్టి విరచించుట గొప్పఁగఁ జేయఁగల్గిరే,

నీమముతోడ నిన్ గొలుచు నీ వరభక్తుల కాత్మశక్తివై

ప్రేమగ నిన్ భజించునటు ప్రీతిని చేయుము మంగళాంబికా! 


౨) చ.  కమలదళాయతాక్షి! నినుఁ గానని కన్నులు కన్నులెట్లగున్?

బ్రముదముతోడ నీ భజన వర్ధిలఁ జేయని జన్మ జన్మయా?

శ్రమగఁ దలంపఁబోక నినుఁ జక్కఁగఁ జూచెడి భాగ్యమిచ్చుచున్,

సమధిక భక్తితోఁ గొలుచు శక్తినొసంగుమ, మంగళాంబికా!


౩) ఉ.  నీ పదపద్మ సేవను వినిర్మల చిత్తము తోడఁ జేసినన్,

బాపవిదూరులై జనులు వర్ధిలునమ్మరొ భక్తినొప్పుచున్,

హేపరమేశ్వరీ! జనని! హేశివ! శాంకరి! యంచు భక్తితో

నీపరతత్త్వమున్ గొలువనీ, కరుణాకర మంగళాంబికా!


౪) ఉ.  నీదగు మందహాసము గణించుచు నెవ్వఁడు చూడఁ గల్గునో

మోదముతోడ వానికి సమున్నతి గొల్పుదువమ్మ నీవు, స

ద్బోధను పొంది వాఁడు గుణపూర్ణుఁడుగా జగతిన్ బ్రసిద్ధుఁడై

నీదరిఁ జేరగల్గునుగ, నిశ్చయమిద్దియె, మంగళాంబికా!


౫) ఉ.  నీ వనురాగమూర్తివి, వినిర్మలచిత్తము నిత్తువీవె, మా

భావనలందు నీపయిని భక్తిని పూర్తిగఁ గొల్పుదీవె, నీ

సేవలె చేయఁ జేయుచును, చిత్తము నీపయి నిల్పఁ జేయుచున్,

గావుము మమ్ము నీవు, వర కామిత దాయిని! మంగళాంబికా!


౬) ఉ.  నేనిల రామకృష్ణుఁడను, నీ ప్రియ పుత్రుఁడనమ్మ! నీ దయన్

జ్ఞానులతోడ సంగతిఁ బ్రకాశము చిత్తములోనఁ గల్గుటన్

ధీనిధులెన్నునట్టులుగ దివ్యముగా నిను గొల్చు పద్యముల్

మౌనమెలర్ప వ్రాసెదను లక్ష్యము తోడను, మంగళాంబికా!


౭) ఉ)  ఏ జనయిత్రి సత్కృపకు నీశ్వరుడున్ పరితప్తుఁడౌనొ, నా

కేజనయిత్రి సమ్మతిని యీ కవితామృతమే లభించెనో,

యే జనయిత్రి పాదరజమే సృజియింపఁగఁ జాలు సృష్టినే,

యా జనయిత్రి వీవెకద, యన్నులమిన్నవు, మంగళాంబికా!


౮) ఉ.  నీ పదపద్మరేణువె మనీషునిగా యొనరించు భక్తునిన్,

నీ పదపద్మరేణువె యనేకశుభంబులు గొల్పు నిత్యమున్,

నీ పదపద్మరేణువె గణించి నశింపఁగఁ జేయు దుర్గతుల్,

నీ పదపద్మ రేణువె వినిర్గతి నాకగు, మంగళాంబికా!


౯) ఉ.  ఏమని నిన్ గణింతు పరమేశ్వరి! నీ పరతత్త్వమెన్ని, ని

న్నేమని బల్కరింతు పలుకే కరువౌగద నిన్నుఁ జూడ, నీ

కేమని విన్నవించెదను, హే జగదంబిక కావుమంచు, నీ

వే మది నెన్ని కావవలె నీశ్వరి నన్నిల, మంగళాంబికా!


౧౦) మంగళరూపిణీ! జయము, మంగళముల్ మముఁ జేరనిమ్ము, నీ

మంగళ నామ సంస్మరణ మాకు శుభంవులొసంగు నిత్యమున్,

మంగళ కారిణీ! నయసమంచిత వృత్తిని గొల్పి మమ్ములన్

మంగళ కార్యచారులుగ మంచిగ కావుము, మంగళాంబికా!


అమ్మ దయతో🙏🏼

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

భక్తిసాధనం పురస్కారం అందించిన బ్రహ్మశ్రీపండరి రాధాకృష్ణగారికి,ఆస్థానకవి బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మగారికి ధన్యవాద పూర్వక నమస్సులు.

0 comments

 జైశ్రీరామ్.

శా.  సేవాదృక్పథమున్న పండరికి నా శ్రీమంత సత్కారముల్
శ్రీవాణీమహనీయ రూపమున నా శ్రీమత్ప్రభాకర్ ద్యుతుల్
సేవాభావము మెచ్చి యిచ్చుటనె యీ సేవల్ లభించెన్ గదా
ధీవర్యుండగు రాధకున్,  వెలుఁగ తా దేదీప్యమానంబుగా .

జైహింద్

.

నాస్తి మేఘసమం తోయం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జై శ్రీరామ్

శ్లో.  నాస్తి మేఘసమం తోయం - నాస్తి చాత్మసమం బలమ్!

నాస్తి చక్షుఃసమం తేజో - నాస్తి ధాన్యసమం ప్రియమ్!!

తే.గీ.  జలద జలము కన్నను శుద్ధ జలము  లేదు,

ఘన మనోబలమును మించి కనఁగ లేదు,

కన్నులకు కల్గు తేజమ్ము కలుగఁబోదు.

అన్నమునుమించి ప్రియమైన దరయలేము.

భావము.  మేఘ జలముతో సమానమైన శుద్ధ జలము లేదు. ఆత్మ బలముతో 

సమానమైన బలము మరొకటి లేదు. కన్నుతో సమానమైన తేజస్సు గల 

యింద్రియము శరీరములో మరొకటి లేదు. ఆహారముతో సమానమైన 

ప్రియమైన వస్తువు మరొకటి లేదు.

జైహింద్.

2, జనవరి 2025, గురువారం

స్వభావో నోపదేశేన. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్

శ్లో.  స్వభావో నోపదేశేన - శక్యతే కర్తుమన్యథా ౹

సుతప్తమపి పానీయం - పునగచ్ఛతి శీతతామ్ ౹౹

తే.గీ. ఎన్ని యుపదేశములుచేయ నేమి ఫలము?

పుట్టుచునె వచ్చు గుణములో పోవు కనగ,

నెంతగా కాచిననుకాని సుంతయైన

వేడి మిగులునే నీటిలో, వినుత నృహరి!       

భావము.  ఎవరి స్వభావాలు ఉపదేశాలతో మార్చడానికి సాధ్యం లేదు.

బాగా మరగించిన నీరు కూడా మళ్ళీ  చల్లగా అవుతుంది.జన్మ స్వభావాన్ని 

ఎవరివల్ల మార్చడానికి అవ్వదు.

జైహింద్.

మిత్రే నివేదితే దుఃఖే. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.   మిత్రే నివేదితే దుఃఖే - దుఃఖినో జాయతే లఘు

భారం భారవహస్యేన - స్కంధయో: పరివర్తతే.

తే.గీ.  దుఃఖమును మిత్రునకుఁ జెప్ప దుఃఖమణఁగు,

దుఃఖితునిమది తేలికౌన్ దోయజాక్ష!

భుజములనుమార్చి బరువును మోయుచున్న

భారమనిపించదది తగ్గి, భక్తవరద!

భావము.  భుజము మీద బరువుమోసేవాడు ఆ బరువునును రెండుభుజాల 

మధ్యకు మార్చుకుంటే  భారము తగ్గినట్లుగా,  మంచిమిత్రునికి బాధ చెప్పుకుంటే 

బాధపడేవాని దుఃఖము తగ్గి మనసు తేలికపడుతుంది. అంటే మన దుఃఖము 

మన ఆత్మీయయులతో పంచుకుంటే కొంత ఉపశమనము కలుగునని భావము.

జైహింద్.

1, జనవరి 2025, బుధవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా .. ఖండకావ్య రచన పోటీ - 2025. .. నిర్వహణ. .. అవధాన విద్యావికాసపరిషత్.

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

తెలంగాణ సాహిత్య సమాలోచన. దోమకొండ కోటలో తే. 12 - 01 - 2025 న.

0 comments

 జైశ్రీరామ్.



జైహింద్.

శ్రీమదాంధ్రామృత పాఠకులకు 2025. ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు. ... చింతా రామకృష్ణారావు.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీమదాంధ్రామృత పాఠకులకు 2025. ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు.

శా.  *శ్రీమన్మంగళ* యాంగ్లవత్సరముగా   శ్రీలన్ బ్రసాదింపఁగాఁ

బ్రేమన్ వచ్చె ప్రశోభితాద్భుతముగా, వెల్గొందుడీ మీరు, సు

క్షేమంబున్, ధనధాన్యముల్, సుఖములున్, చిద్భావనాభాగ్యమున్,

ధీమాన్యత్వము, వత్సరాంతమును సద్దీప్తిన్, ధరన్ బొందుడీ!

చం.  మనము సతమ్ము నాంగ్లతిథి మానక వాడుచునుండుచుండుటన్

ఘనముగ వత్సరాంతమును గౌరవమొప్ప రహింపఁ గోరుచున్

జనహితమాశచేయుటది చక్కని పద్ధతిగాఁ దలంచెదన్,

మనములఁ గోపగించకుడు, మంచిని గాంచుడు నా ప్రవర్తనన్.

శా.  అమ్మా! కాల మహాస్వరూప జననీ! ఆనంద సంధాయినీ!

సమ్మాన్యంబుగ నీదు భక్తతతి సంస్కారాక్షరప్రాజ్ఞులై

నెమ్మిన్ నీ పదసేవనామృత మతన్ నిత్యంబు వెల్గొందగా

సమ్మోదమ్మున వత్సరాంతమును ధ్యాసన్ జేసి కాపాడుమా.

ఉ.  దైహికమైన రుగ్మతలు తల్లివి నీవె నశింపఁ జేయుమా,

మోహము వాపి, సత్యము నమోఘముగా గ్రహియింపఁ జేయుమా,

దేహమునందు శక్తినిడి, దివ్యముగా శుభకార్యముల్ సదా

స్నేహముతోడ లోకులకుఁ జేయఁగఁ జేయుమ భక్తపాళికిన్.

ఉ.  వేల్పువు నీవె, మానసిక వేదనలన్ దరిఁ జేరనీక, సం

కల్పము సత్ప్రవృత్తిపయిఁ గల్గల్ఁగఁ జేయుచు నాదుకొమ్మ,  యీ

యల్పులమైన మేము పరమార్థము నీవని నమ్మియుంటిమే,

నిల్పుము భక్తితో భువిని నీపదసేవసుఖంబునిచ్చుచున్.

🙏🏼🙏🏼🙏🏼

👍

అమ్మ అనుగ్రహంతో🙏🏻

జైహింద్.