జైశ్రీరామ్.
శ్లో. ఆత్మాత్వం గిరిజామతి స్సహచరా: ప్రాణాశ్శరీరం గృహం
పూజా తే విషయోపభోగ రచనా నిద్రా సమాధిస్థితి:
సంచార: పదయో: ప్రదక్షణవిధి: స్తోత్రాణి సర్వాన్గిరో
యద్య త్కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనం ||
శా. నీవే యాత్మవు, బుద్ధి దుర్గ, స్వజనుల్ నీవైన నా ప్రాణముల్,
భావింపన్ గుడి నాశరీరమయ, సేవల్ నీకు నా కార్యముల్,
దేవా నిద్ర సమాధి, నా నడకయే దీపించు నిన్ చుట్టుటల్,
నావాక్కుల్ గన స్తోత్రముల్, గొనుమయా! నావర్తనల్ సేవగా.
భావము.
ఓ పరమేశ్వరా! నా ఆత్మవు నీవే . నా బుద్ధిగిరిజయే. నా పంచప్రాణములు సహచరులే.
నా శరీరమే యిల్లు. నా విషయోపభోగరచననలే నీకు నేను చేయు పూజ. నా నిద్రయే సమాధి. నా పాదములు ఇటునటుతిరుగుటయే నీకు నేను చేయు ప్రదక్షిణలు. నేను నిత్యమూ పలికెడి నా మాటలే నీకు నేను చేయు స్తోత్రములు. నేను యేయే కర్మలనొనరించుచుంటినో అదంతయూ నీ ఆరాధనయే. నీవు నన్ను అనుగ్రహించుము.
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.