గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఫిబ్రవరి 2024, సోమవారం

తావత్ ప్రమోదతే స్వర్గే యావత్ ... తే తం భుక్త్వా స్వర్గలోకం ... మేలిమిబంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో.  తావత్ ప్రమోదతే స్వర్గే యావత్ పుణ్యం సమాప్యతే|

క్షీణ పుణ్యః పతత్యర్వాగనిచ్ఛన్ కాల-చాలితః|| (భాగవతం)

తే.గీ.  ఎంత వరకు పుణ్యంబుండు నంత వరకె

స్వర్గసుఖములు జీవాళి చక్కగఁ గను, 

క్షీణపుణ్యులు భువిపైకి చేరుచుందు

రందుకే ముక్తి మార్గంబు నందవలయు.                        

భావము.  స్వర్గ లోకాల్లో నివసించేవారు తమ పుణ్యఫలము 

అయిపోయేంత వరకు దేవతా భోగాలను అనుభవిస్తారు. 

ఆ తరువాత వారు కాలక్రమంలో తమకు ఇష్టం లేకపోయినా 

క్రింది లోకాలకు నెట్టివేయ బడుతారు.

శ్లో.  “ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీ‌ణే పుణ్యే మర్త్యలోకం విశంతి |

ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభన్తే || ” 

భగవద్గీత 9-21

తే.గీ. స్వర్గ భోగులు తమపుణ్య చయము తరుగ 

మనుజ లోకంబునే చేరు మరల, పార్థ! 

కర్మబద్ధులకీగతి కలుగుచుండు 

నన్నె నమ్మిన ముక్తి సంపన్నులయెడు. 

భావము.

“ చనిపోయిన వారు విశాలమైన స్వర్గలోకంలో పుణ్యం 

క్షీణించిపోయేదాకా అనుభవించి తరువాత భూలోకంలో జన్మిస్తారు ; 

మూడు ధర్మాలను అనుష్ఠించే కామాభిలాషులు జనన మరణాలు 

అనే రాకడపోకడలను పొందుతున్నారు.”

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.