గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఆగస్టు 2020, శనివారం

నేడు తెలుఁగు మాతృభాషా దినోత్సవము. ఈ సందర్భముగా తెలుఁగు ప్రాశస్త్యము.

జైశ్రీరామ్.

నేడు తెలుఁగు మాతృభాషా దినోత్సవము. ఈ సందర్భముగా తెలుఁగు ప్రాశస్త్యము.

తెలుంగు భాషకన్నఁ జూడ తీయనైనదేదిరా?
వెలుంగు చిందు దివ్య భాష విశ్వమందు తెల్గురా.
కలంగనేల తెల్గు పల్క గౌరవంబు పోదురా.
చెలంగరా తెలుంగు పల్కి శ్రీధరున్ స్మరించుచున్.

తెలుఁగె లోకమునందున వెలుఁగు లొలుకు,
వెలుఁగు తిమిరంబునే బాపి నిలుపు మనను,
నిలుచు మనమంత జగతిని నిలుపనగును,
వెలుగు జగతికి మూలము తెలుఁగె యగును.

శ్రీకరమైన యక్షర ప్రసిద్ధిని గన్నది తెల్గుభాష, ర
త్నాకరమిద్ది సుద్దులకు, నవ్యమనోజ్ఞసుభాషణామృతం
బీకమనీయభాష తరమే యిల తెల్గును నిర్వచింప యా
శ్రీకర బ్రహ్మయున్ తెలుఁగు చిత్తమునిల్పి గ్రహించు నేర్పినన్.

మనమునఁ గల్గు భావన నమాంతము బల్కిన యంత దెల్పు నీ
ఘనమగు తెల్గు భాష. కొరగాని స్వరంబది లేదు తెల్గునన్,
క్షణములలోన నేఱ్వఁ దగు కమ్మని తెల్గు నెఱుంగనెంచినన్,
వినయ విధేయతల్ గొలిపి వేల్పులనే గనఁజేయు భాషయౌన్.

గిరిధరుండు తెలుఁగు కీర్తిని గనుచు నిం
డుగను మెచ్చి పోత నగ నిల వెలు
గునటు భాగవతము కూర్మితో వ్రాసెరా.
తెలుఁగుకన్న మిన్న తెలుప గలదె?
( ఈ పద్యమున నామగోపన చిత్రము కలదు. మొదటి మూడు పాదములలో మొదటి అక్షరములు గి.డు.గు.)

చింతా రామకృష్ణారావు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.