గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఆగస్టు 2020, శనివారం

వినాయక చతుర్థి సందర్భముగా మీకు నా శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఓం నమో నారాయణాయ..
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః.
ఆర్యులారా! వినాయక చతుర్థి సందర్భముగా మీకు నా శుభాకాంక్షలు.
ఆ జణేశుని మహదాశీర్వాదం మీకు పూర్తిగా లభించాలని కోరుకొంటున్నాను.
ఆ పరమాత్మను నేను ప్రార్థిస్తున్నాను.
ఈ వినాయక చతుర్థి సందర్భముగా ఆస్వామికి భక్తితో నేను సమర్పించుచున్న పద్యపుష్పపంచకము.
అవధరింప మనవి.

శ్రీమన్మంగళ భావనాంచిత ఘనా! శ్రీ పార్వతీ నందనా !
క్షేమంబున్ శుభ సంహతిన్, సుగుణ సచ్ఛీలంబులున్ గొల్పు నీ
వేమా దిక్కని నమ్ము మమ్ము సతమున్ బ్రీతిన్ ప్రవర్ధింపఁగా
శ్రీమంతంబుగఁ జేయ రమ్ము భువికిన్ చిద్రూప విఘ్నేశ్వరా!

గణాధిపా నమోస్తుతే ప్రకాశమీయ రమ్మికన్,
ప్రణామముల్ గ్రహింపుమా, వరంబులిమ్ము నీవు, సద్
గుణాలమింక మాకిలన్  సుగోచరంబుగాన్ గృపన్
క్షణంబు నీవు నిల్చి కూర్చి కావుమా వినాయకా!

జయంబు నిశ్చయంబు నిన్ను చక్కగా భజించినన్
ప్రియం బెలర్ప నీదు పూజఁ దృప్తిఁ జేయువారికిన్
క్షయంబగున్ దురంత దుష్ట కార్యదుష్ఫలంబులే.
భయంబు బాప రమ్ము నీవు భవ్యుఁడా! వినాయకా!

కరావలంబమిచ్చి మమ్ము కావగావలెన్ గృపన్,
నరాంతకుల్ దురాత్ములున్ ధనాశతో మహాత్ములన్
నిరంతరంబు వ్రేచుచుంట నీవుచూడలేదొకో
నిరీక్షణేలఁ గావగా గణేశ! శ్రీ వినాయకా!

సుమంగళాత్ములై రహింపఁ జూడవేమి భక్తులన్?
సమంచి తార్ద్ర చిత్తులన్ ప్రశస్త పుణ్య మూర్తులన్,
దమ క్షమాదిసద్గుణాఢ్య దక్షులన్ గ్రహింపుమా
సుమంగళంబులిమ్ము సత్య శోభితా వినాయకా.!

స్వస్తి.                    
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.