గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, నవంబర్ 2018, మంగళవారం

ఆంధ్రనామ సంగ్రహము - 6

జైశ్రీరామ్.
ఆంధ్రనామ సంగ్రహము - 6
ఆ. ఎడసెఁ బాసె వేఱుపడెఁ బురివిచ్చె నా
నలరు భేద మయ్యె ననుట పేళ్ళు
స్వవశ మయ్యె ననుట కవుఁ బేళ్లు లోనయ్యె
నగ్గమయ్యె ననఁగ (నసమనేత్ర)              (37)

టీ. ఎడసెన్, పాసెన్, వేఱుపడెన్, పురివిచ్చెన్ - ఈ నాలుగును వియోగమయ్యె ననుటకు బేరులు. లోనయ్యెన్ అగ్గమయ్యెను - ఈ రెండును స్వాధీనపడె ననుటకు పేర్లు.

ఆ. అగు గృహీతమయ్యె ననుటకుఁ బేళ్లగ
పడియెఁ జేపడియెను బట్టువడియెఁ
జిక్కువడియెఁ దగిలెఁ జిక్కెఁ దగుల్పడె
ననఁగ (నగనివేశ యభ్రకేశ)                (38)

టీ. అగపడియెన్ (అగ్గము+పడియెను) = ఆధీనమయ్యెను, చేపడియెను (చే+పడియెను) = చేత చిక్కెను, పట్టువడియెను = పట్టుచిక్కెను, చిక్కువడియెను, తగిలెను, చిక్కెను, తగుల్పడెను, ఈ తొమ్మిది యును గృహీతమయ్యె ననుటకు పేర్లు.

తే. అనియె నొడివె వక్కాణించె నాడెఁ జెప్పె
వినిచె వాక్రుచ్చెఁ బలికె నాఁ జను వచించె
ననుట కాలించె నాలకించెను వినె నన
నలరు నవధరించె నంటంట కాఖ్య (లీశ)         (39)

టీ. అనియెను, నొడివెను, వక్కాణించెను, ఆడెను, చెప్పెను, వినిచెను, వాక్రుచ్చెను, పలికెను - ఈ ఎనిమిదియు చెప్పె ననుటకు పర్యాయములు. ఆలించెను, ఆలకించెను, వినెను - ఈ మూడును అవధరించె ననుటకు పేర్లు.

క. కనియెను చూచెను కాంచెను
కనుఁగొనెఁ గన్గొనె ననంగ హలయవి పేళ్లె
చను వీక్షించె నటంటకు
(ఘనతరగోరాజగమన కాయజదమన)              (40)

టీ. కనియెను, చూచెను, కాంచెను, కనుఁగొనెను, కన్గొనెను - ఈ అయిదును దర్శించెననుటకు పేర్లు.

క. చనుఁ గృతగమనుఁడ నయ్యెద
ననుటకు నామంబు లగుచు నవని నరిగెదన్
జనియెదఁ బోయెద నేగెద
పనివినియెద ననెడునట్టి పలుకులు (రుద్ర)            (41)

టీ. అరిగెను, చనియెను, పోయెను, ఏగెను, పనివినియెను - ఈ అయిదును బయలుదేఱె ననుటకు పేర్లు.

ఆ. ద్విగుణమున కభిఖ్యలగు తిబ్బ డిమ్మడి
జంట దంట దుగయు జమిలి రెట్టి
యినుమడి యన మిథునమున కాఖ్యలగు జోడు
దోయి కవ యనంగ (ధూతకలుష)                   (42)

టీ. ఇబ్బడి, ఇమ్మడి, జంట, దంట, దుగ, జమిలి, రెట్టి (రెంట) ఇనుమడి - ఈ ఎనిమిదియు రెండింతలకు పేర్లు. జోడు, దొయి, కవ - ఈ మూడును మిధునమునకు పేర్లు.

సీ. ఒండొకఁ డొకటి యెండొక్కొం డన నగు నేక, మీరు రెండిరు నాఁగ నెసఁగు ద్వయము
తిగ మూఁడు మూ ర్నాఁగ దగు ద్రయి తీవంచ, నాలు నాల్గు చౌ యన నగుఁ జతుష్క
మెసఁగుఁ జౌవంచ యైదే ననఁ బంచకం, బా ఱిరుమూఁడి తిగనగ నొప్పు
షట్కంబు ఋషిసంఖ్య నత చక్కుపగడ యే, డన నొప్పు నష్ట సంఖ్యకును బేళ్లు

తే. దనరు నిరునాలు గెనిమిది దచ్చి యనఁగఁ
బరఁగు నీరాఱు పండ్రెండు బార యనఁగఁ
ద్వాదశమునకు నాఖ్యలు ధరణియందు
(వినుతకరుణాసనాథ శ్రీవిశ్వనాథ)               (43)

టీ. ఒండు, ఒక్కఁడు, ఒకటి, ఒక్కండు - ఈ నాలుగును ఏకసంఖ్యకు నామములు. ఈరు, రెండు, ఇరు - ఈ మూడును ద్వయమునకు పేర్లు. తిగ, మూఁడు, మూరు - త్రితయమునకు పేర్లు. తీవంచ = మూడునొక్కటియు, నలు, నాలుగు, చౌ - ఈ నాలుగును నాలుగునకు పేర్లు. చౌవంచ = నాలుగునొక్కటియు, ఐదు (రూ. అయిదు) ఏను - ఈ మూడును పంచసంఖ్యా నామములు. ఆఱు, ఇరుమూడు = రెండు మూడులు, ఇత్తుగ (ఇరు+తీగ) = రెండు మూడులు, - ఈ మూడును షత్సంఖ్యా నామములు. సత (సప్త శబ్ధభవము) చక్కుపగడ = ఆఱునొక్కటియు, ఏడు - ఈ మూడును సప్తసంఖ్యకు పేర్లు. ఇరు నాలుగు = రెండు నాలుగులు, ఎనిమిది, దచ్చి - ఈ మూడును అష్ట సంఖ్యకు నామములు. ఈరాఱు = రెండాఱులు, పండ్రెండు, బార - ఈ మూడును ద్వాదశ సంఖ్యకు పేర్లు.

తే. జరిగె నూడెను జాఱెను నుఱికే వెళ్లెఁ
బాఱెఁ బఱచెను దెలఁగె నప్పలుకు లెల్ల
నవనిలోనఁ బలాయితుండయ్యె ననుట
కాఖ్యలై యొప్పుఁ (జెంద్ర రేఖావతంస)             (44)

టీ. జరిగెను, ఊడెను, జాఱెను, ఉఱికెను, వెళ్లెను, పాఱెను, పఱచెను, తొలగెను, _ ఈ ఎనిమిదియు పరుగెత్తె ననుటకు పేర్లు.

క. వేంచేసెను వచ్చెం జను
దెంచెను విచ్చేసె నరుగుదెంచె ననఁగ నే
తెంచె నన నయ్యె నాగతుఁ
డంచుం బలుకుటకు నాఖ్య (లంబరకేశా)        (45)

టీ. వేంచేసెను, వచ్చెను, చనుదెంచెను (చను+ తెంచెను) విచ్చేసెను, అరుగుదెంచెను, అరుదెంచెను, ఏతెంచెను (పా> ఏగుదెంచెను) - ఈ తొమ్మిదియు ఆగతుడయ్యె ననుటకు పేర్లు.

తే. నాఁటిసుత నాఁటినుండియు నాఁటఁగోలె
నాఁటఁబట్టి నాఁడుమొదలు నాఁగ నాహ్వ
యమ్ము లయ్యె దదారభ్య యనుట కవని
(వినుతకరుణాసనాథ శ్రీవిశ్వనాథ)            (46)

టీ. నాఁటిసుత, నాఁటినుండి, నాఁటఁగోలె, నాఁటఁబట్టి, నాఁడు మొదలు _ ఈ అయిదును, ఆదిమొదలు = ఆదినము నుండి అనుటకు పేర్లు.

తే. వైరమునకును ధర సమాహ్వయము లమరుఁ
గంటు పగ మచ్చరంబు సూడోంటమి యన
వలపు కూరిమి మేలు నా నలరుఁ బేళ్ళు
మోహమునకును (శారదాంబుదనిభాంగ)            (47)

టీ. కంటు, పగ మచ్చరము, (మత్సర శబ్ధభవము) సూడు, ఒంటమి - ఈ అయిదును విరోధమునకు పేర్లు. వలపు, కూరిమి (కూర్మి) మేలు - ఈ మూడును మోహమునకు పేర్లు.

క. పెనఁకువ జగడము కయ్యం
బని బవరము కలను చివ్వయాలము పోట్లా
టన దురము పోరు నాఁగాఁ
జను యుద్ధంబునకుఁ బేళ్ళు (చంద్రార్ధధరా)       (48)

టీ. పెనఁకువ, జగడము, కయ్యము (కలహ శబ్ధభవము) అని, బవరము, కలను, చివ్వ, ఆలము, పోట్లాట, దురము, పోరు - ఈ పదకొండును యుద్ధమునకు పేర్లు.

ఆ. సదమదంబు సేసెఁ జక్కాడె నుగ్గాడెఁ
జదిపెఁ బీఁచమడచెఁ జంపెఁ గెడపె
నుఱుముసేసెఁ గ్రుంచెఁ బరిమార్చెఁ దెగటార్చె
మన్ని గొనియెఁ దునిమె మడిపె ననఁగ               (49)

తే. హతము గావించె ననుటకు నాఖ్యలయ్యె
మనిపె నేలెను బ్రతికించె మంచెఁ బ్రోచె
సాఁకె నన నొప్పు నాఖ్యలు సరవితోడ
నరయఁ బోషించె ననుటకు (నంబికేశ)              (50)

టీ. సదమదంబు సేసె, చుక్కాడె, నుగ్గాడెన్, చదిపెన్, పీచమడఁచెన్, చంపెన్, కెడపెన్, నుఱుముచేసెన్, త్రుంచెన్, తెగటార్చెను, మన్నిగొనియెన్, తునిమెను, నుడిపెను _ ఈ పదునాల్గును సంహరించెననుటకు పేర్లు. మనిపెను, ఏలెను, బ్రతికించెను, మంచెను, ప్రోచెను, సాకెను _ ఈ తొమ్మిదియును రక్షించెననుటకు పేర్లు.

క. ధరలో శూరాహ్వయములు
పరఁగున్ మొనకాఁ డనంగ బం టనఁగా బో
టరియన వడిగలవాఁ డన
బిరు దన వాఁడిమగఁ డనఁగ (భీమకపర్ధీ)             (51)

టీ. మొనకాడు, బంటు (భట శబ్ధభవము) పోటరి (పోటు+ అరి)= శౌర్యము గలవాడు, వడిగలవాడు, బిరుదువాడిమగడు - ఈ ఆరును శూరునికి పేర్లు

తే. బాసట యనంగఁ దోడ్పాటు నా సమాహ్వ
యంబు లగుచుండు రెండు సాహాయ్యమునకు
నాఖ్యలు శుభంబునకును లగ్గనఁగ బా గ
నంగ మేలన లెస్స యనంగ (నీశ)                          (52)

టీ. బాసట, తోడ్పాటు, - ఈ రెండును సాహాయ్యమునకు పేర్లు. లగ్గు, బాగు, మేలు, లెస్స - ఈ నాలుగును క్షేమమునకు పేర్లు.

ఆ. కూలె నీల్గెఁ జచ్చెఁ గాలంబు సేసెను
గడసె సమసె నాఱె మడిసెఁ జెల్లెఁ
బెద్దనిదురవోయె బిద్దె దోరెను గంతు
గొనియె ననుటపేళ్లగును మృతునకు              (53)

టీ. కూలెను, నీల్గెను, చచ్చెను, కాలంబుచేసెను, కెడసెను, సమసెను, ఆఱెను, మడిసెను, చెల్లెను, పెద్దనిదురపోయెను, బిద్దెను, దీరెను, గంతు గొనియెను - ఈ పదమూడును మృతి నొందెననుటకు పేర్లు.

సీ. తిమ్మనైనది యనఁ దిన్ననైనది యన, జానైన దనఁగ బాగైన దనఁగ
నాణెమైన దన విన్నాణమైనది యన, మానైన దనఁగ లెస్సైన దనఁగ
బిన్ననైనది యనఁ జెన్నైన దన నలు, వైనది యనఁగ జెల్వైన దనఁగఁ
బొనరినయది యన నొనరిన దనఁగఁ జొ, క్కటమైన దనఁగ జక్కని దనంగ
సొబగైన దనఁగను సొంపైన దనఁ గొమ, రైనది యన గొనబైన దనఁగఁ
దోరమైన దన సింగారమైనది యన, మేలైన దనఁగ మెచ్చైన దనఁగ

తే. మురువుగలయది యొప్పైన దొఱపుగలది
యందమైనది తనరిన దలరినట్టి
దనఁగఁ బరఁగిన దనఁ బేళ్ళు తనరుచుండు
మంజులం బైన దనుటకు (మదనదమన)                   (54)

టీ. తిమ్మనైనది, తిన్ననైనది, జానైనది, బాగైనది, నాణెమైనది, విన్నాణమైనది, మానైనది, లెస్సైనది, పిన్ననైనది, చెన్నైనది, నలువైనది, చెల్వైనది, పొనరినయది, ఒనరినది, చొక్కటమైనది, చక్కనిది, సొబగైనది, సొంపైనది, కొమరైనది, గొనబైనది, తోరమైనది, సింగారమైనది, మేలైనది, మెచ్చైనది, మురుపుగలయది, ఒప్పైనది, ఒఱుపు గలది, అందమైనది, తనరినది, అలరినట్టిది, పరగినది - ఈ ముప్పదిఒకటియు సౌందర్యమునకు పేర్లు.

తే. కపుర మనఁ గప్పురం బన గప్ర మనఁగఁ
బుడమిఁ గర్పూర మొప్పుఁ దాంబూల మొప్పు
వీడియము వక్కలాకులు విడెము తమ్మ
లంబు వీడెంబు వీడ్య మనం (బురారి)                    (55)

టీ. కపురము, కప్పురము, కప్రము - ఈ మూడును కర్పూరమునకు పేర్లు. వీడియము - రూ. విడియము, వక్కలాకులు, విడెము, తమ్మలము, వీడెంబు, వీడ్యము - ఈ ఆరును తాంబూలమునకు పేర్లు.

తే. వెలయుచుండును సిరి లచ్చి కలిమి యనెడు
పేళ్ళ సంపద యెద్దడి పేదఱికము
లేమి నిప్పచ్చరము నెవ్వలేమి డనఁగ
నలరు దారిద్ర్యమునకు నాఖ్యలు (గిరీశ)               (56)

టీ. సిరి (శ్రీ శబ్ధభవము) లచ్చి కలిమి - ఈ మూడును సంపదకు పేర్లు. ఎద్దడి, పేదఱికము, లేమి, నిప్పచ్చరము, నెవ్వ, లేమిడి - ఈ ఆరును దారిద్ర్యమునకు పేర్లు.

తే. మగతనం బన గండన మగఁటిమి యనఁ
బౌరుషంబున కాఖ్యలై పరఁగుచుండు
నుక్కు చేగ దిటము చేవ యుదుటు గట్టి
దిట్ట ముఱిది బిగువు నాగ ధృతికిఁ బేళ్ళు             (57)

టీ. మగతనము, గండు, మగటిమి - ఈ మూడును పౌరుషమునకు పేర్లు. ఉక్కు, చేగ, దిటము, చేవ, ఉదుటు, గట్టి, దిట్టము, ఉఱిది, బిగువు - ఈ ఆరును ధైర్యమునకు పేర్లు.

తే. నద్ధు నా బొంకు నాఁగ దబ్బర యనంగఁ
గల్ల నాఁగ హుళిక్కి నాఁజెల్లుఁ బేళ్లు
ధర నసత్యమునకును సత్యంబు పరఁగు
నిజ మనగఁ నిక్కువం బన నిక్క మనగ             (58)

టీ. బద్దు, బొంకు, దబ్బర, కల్ల, హుళిక్కి - ఈ అయిదును అసత్యమునకు పేర్లు. నిజము,  నిక్కువము, నిక్కము - ఈ మూడును సత్యమునకు పేర్లు.
( సశేషమ్ )
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మన తెలుగు భాష విసిష్టతను ఛందో బద్ధమైన పద్య రూపములో తెలియ జేస్తున్నందులకు కృతజ్ఞతలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.