జైశ్రీరామ్.
ఆంధ్రనామ సంగ్రహము - 7
క. బెడఁద దెస చేటు చేడ్పాడ్గొడ వాత్రం బంగలార్పు గోరంబు దొసం
గిడుమ వెత కస్తి యంగద
కడగం డ్లనఁ జను విపత్తు (గౌరీరమణా) (59)
టీ. బెడద, దెస చేడ్పాటు, గొడవ, ఆత్రము, అంగలార్పు, గోరము, దొసంగు, ఇడుము, వెత, కస్తి, అంగద, కడగండ్లు - ఈ పదునాల్గును ఆపదకు పేర్లు.
క. వెల జట్టి విలువ రో యనఁ
గలనుడువులు దనరుచుండు గ్రయనామము లౌ
వెలయంగ వంగసము నాఁ
గొల మన వంగడము నాఁగఁగుల మొప్పు (శివ) (60)
టీ. వెల, జట్టి, విలువ, రో - ఈ నాలుగును క్రయమునకు పేరులు. వంగసము, కొలము, వంగడము - ఈ మూడును కులమునకు పేర్లు.
క. క్రమ్మఱ నెప్పటి వెండియుఁ
గ్రమ్మఱి తిరుగన్ మఱిన్ మరల మగుడను నా
నిమ్మహిఁ బునఃపదంబున
కిమ్ముల నివియాఖ్యలగు (మహీధరచాపా) (61)
టీ. క్రమ్మఱన్, నెప్పటి, వెండియున్, క్రమ్మఱి, తిరుగన్, మఱి, మరలను, మగుడను - ఈ ఎనిమిదియు ఇంకను అను నర్ధముగలవి.
ఒకమరి యొకపరి యొకమా
టొకసా రొకతేప యనఁగ నొకపా రనఁగా
నొకవిడుత యొక్కతూ కన
నొకతడవ యనంగ మఱియు నొకతుఱి యనన్ (62)
తే. ఏకవారం బనుట కొప్పు నిన్ని పేళ్ళు
జగతిఁ బల్మాఱు వేమాఱు సారె పెక్కు
మాఱు లెన్నెనిమార్లనఁ బరగు నాఖ్య
లగుచు నివి బహువారంబు లనుట (ఖీశ) (63)
టీ. ఒకమరి, ఒకపరి, ఒకమాటు, ఒకసారి ఒకతేప, ఒకసారి, ఒకవిడుత, ఒకతూకు, ఒకతడవ, ఒకతూరి _ ఈ పదుయును ఏకపర్యాయమనుటకు పేర్లు. పల్మాఱు (రూ.పలుమాఱు) పలుమాఱు, వేమాఱు, సారె, పెక్కు మాఱులు, ఎన్నేని మాఱులు - ఈ నాలుగును మాటిమాటికి అనుటకు పర్యాయములు.
తే. త్వరితమున కొప్పుఁ బేళ్లు చెచ్చరను సరగ
వేగిరము, వేగ వేళము వెసను వడిగ
గ్రక్కునను గ్రద్దన ననంగఁ గ్రన్న ననఁగ
గొబ్బునను దిగ్గున ననాంగఁ (గుధరచాపా) (64)
టీ. చెచ్చెర (చర+చర) సరగ, వేగిరము, వేగ, వేళము, వెసన్, వడిగన్, గ్రక్కునన్, గ్రద్దనన్, క్రన్నన, గొబ్బునను, దిగ్గునన్, - ఈ పండ్రెండును శీఘ్రముగా అనుటకు పేర్లు.
క. కలవు వివరింపఁగా నా
ఖ్యలు వరుసన్ నిర్గమించె ననుటకు ధరలో
వెలువడియె వెళ్లె వెడలెను
వెలలెననం (జిత్ప్రకాశ విశ్వాధిపతీ) (65)
టీ. వెలువడియెను, వెళ్లెను, వెడలెను, వెలలెను -ఈ నాల్గును పయనమయ్యె ననుటకు పేర్లు.
క. వినుతియొనరించె ననుటకుఁ
దనరున్ నామంబు లగుచు ధరపై నగ్గిం
చెను గైవారము సేసెన్
గొనియాడెను బొగడె ననఁగ గొండాడె ననన్ (66)
టీ. అగ్గించెను, కైవారము సేసెను = స్తోత్రము చేసెను, కొనియాడెను, పొగడెను, కొండాడెను - ఈ ఐదును స్తోత్రము చేసెననుటకు నామములు.
సీ. చుట్టలు విందులు చుట్టాలు బందుగు, లనఁ జను బంధు సమాహ్వయములు
వఱలు నన్యుఁడు లాతివాఁ డనఁగా వింత, వాఁ దనఁగాఁ బెఱవాఁ దనంగ
వ్యాజంబునకు నామమౌ నెపం బనఁగ న, న్వేషించె ననుటకౌ వెదకె నెమకె
నరసె రోసె ననంగ నారసెఁ దడవె నాఁ, గాంక్షకుఁ బేరు లౌఁ గ్రమముతోడఁ
తే. గ్రచ్చు కోరిక తమి కోర్కి యిచ్చ యనఁగ
నెపుడు నెడపక యుడుగక యెల్లపు డన
నిచ్చ యనయంబు నాఁగను నిచ్చ లనఁగఁ
దనరు నాఖ్యలు సతతం బనుట (కీశ) (67)
టీ. చుట్టలు (ఏక. చుట్టము ) విందులు, చుట్టాలు, బందుగులు - ఈ నాలుగును బంధువునకు పేర్లు. లాతివాడు, వింతవాడు, పెఱవాడు - ఈ మూడును అన్యుడనుటకు పేర్లు. నెపము, వ్యాజమునకు పేరు. వెదకెను, నెమకెను, అరసెను, రోసెను, అరసెను, తడవెను - ఈ ఆరును విచారించెననుటకు పేర్లు. క్రచ్చు, కోరిక, తమి, కోర్కి, ఇచ్చ - ఈ నాలుగును ఆపేక్షకు పేర్లు. ఎపుడు, ఎడపక, ఉడుగక, ఎల్లపుడు, నిచ్చ, అనయము, నిచ్చలు - ఈ ఏడు ను సర్వదా అనుటకు పర్యాయములు.
సీ. తనరుఁ బ్రవేశించె ననుటకు నాఖ్యలు, తూకొనెఁ జొచ్చెను దూఱె ననఁగ
నంఘ్రితాడితుఁ జేసె ననుటకు బేళ్లగుఁ, దాఁచెఁ గాళ్ల గ్రుమ్మెఁ దన్నె ననఁగ
నాలస్య మొనరించె ననుటకుఁ జెల్లు నా, మమ్ములు తడసెను మసలె ననఁగఁ
ద్యక్తంబు గావించె ననుటకు నాఖ్య లౌ, వీడెను వదలెను విడిచె ననఁగ
తే. దాఱుమాఱయ్యె వీడ్వడెఁ దడఁబడె నన
నాఖ్య లొప్పు విపర్యస్తమయ్యె ననుట
కలరుఁ బ్రహరించె ననుట కాహ్వయము లడిచెఁ
గొట్టె మొత్తెను మోఁదె నాఁ (గుధరనిలయ) (68)
టీ. తూకొనెను, చొచ్చెను, తూఱెను - ఈ మూడును ప్రవేశించెను అనుటకు పేర్లు. తాచెను, కాళ్ళ గ్రుమ్మెను, తన్నెను - ఈ మూడును కాలితో దన్నెననుటకు పేర్లు. తడసెను మసలెను - ఈ రెండును ఆలస్యము చేసెను అనకు పేర్లు. వీడెను, వదలెను, విడిచెను - ఈ మూడును పరిత్యజించెను అనుటకు నామములు. తాఱుమాఱయ్యెను, వీడ్వడెను, తడబడెను - ఈ మూడును హెచ్చుతక్కువయ్యెను అనుటకు పేర్లు. అడిచెను, కొట్టెను, మొత్తెను, మోదెను - ఈ నాలుగును ప్రహరించె ననుటకు పేర్లు.
సీ. ముందట నెదుటను మ్రోల ముంగల నాఁగ, నాఖ్యలౌ సముఖమందనుట (కభవ)
యలయిక బడలిక యలపు సేద యనంగ, శ్రమమున కాఖ్యలౌ (శమనదమన)
తాలిమి యోరుపు తాలిక నాఁగను, క్షమకు నాహ్వయములౌ (జర్మవసన)
ఠవళి బవంతంబు టక్కు దుత్తూరంబు వెడ్డు నా ఛద్మమౌ (విషమనేత్ర)
తే. వెఱ పనఁగ నెద యనఁగను వెఱ యనంగ
నళు కనఁగ భీతి కాఖ్యలౌ (నసితకంఠ)
నిమ్మళం బన నెమ్మి నా నెమ్మది యనఁ
దనరుఁ బేళ్లు నిరాతంకమునకు (నీశ) (69)
టీ. ముందటను, ఎదుటను, మ్రోలన్, ముంగలన్ - ఈ నాలుగును సమ్ముఖమందనుటకు పేర్లు. అలయిక, బడలిక, అలపు, సేద - ఈ నాలుగును శ్రమమునకు పేర్లు. తాలిమి (రూ. తాల్మి) ఓరుపు, (రూ. ఓర్పు) తాలిక - ఈ మూడును క్షమకు పేరులు. ఠవళి, బవంతము, టక్కు, దుత్తూరము, వెడ్డు _ నాల్గును కపటమునకు పేర్లు. నిమ్మళము, నెమ్మి, నెమ్మది, (నెఱ + మది = నిండు మనస్సు) - ఈ మూడుని నిర్భయమునకు పేర్లు.
సీ. అసదు కొంచెము సైక మలఁతి యన్నుప చిన్న, నలికంబు సన్నంబు నాఁ దనర్చు
స్వల్ప మెక్కుడు నాఁగఁ జాల నెంతేనియు, మిగులఁ దద్దయుఁ దద్ద మిక్కిలి యనఁ
బెద్దయు ననునివి పేళ్లగు భృశముగా, ననుటకు నుత్కటమయ్యె ననుట
కగుఁ బేళ్లు వెగ్గలంబయ్యెఁ గ్రిక్కిఱిసె వె, క్కసమయ్యె ననునివి క్రమముతోడ
తే. స గ్గెఁ గుందె డోంకెఁ దగ్గెను సడలెను
క్రుంగె సుబ్బణంగె స్రుక్కె ననఁగఁ
దనరుఁ బేళ్లు క్షీణదశ నొందె ననుటకు
(నీశ్వరీసనాథ విశ్వనాథ) (70)
టీ. అసదు, కొంచము, సైకము, అలతి, అన్నువ, చిన్న నలికము, సన్నము - ఈ ఎనిమిదియు కొంచమనుటకు పేర్లు. ఎక్కుడు, చాలన్, ఎంతేనియున్, మిగులన్, తద్దియున్, తద్ద, మిక్కిలి, పెద్దయున్, - ఈ ఎనిమిదియు అధికముగా ననుటకు పేర్లు. వెగ్గలమయ్యెను, క్రిక్కిఱిసెను, వెక్కసమయ్యెను, - ఈ మూడును హెచ్చయ్యె ననుటకు పేర్లు. సగ్గె, కుందె, డొంకె, తగ్గె, సడలె, క్రుంగె, ఉబ్బణగె, స్రుక్కె - ఈ ఎనిమిదియు క్షీణదశనొందె ననుటకు పేర్లు.
ఆ. మించు వాసి మేలు మేటి పె చ్చె చ్చన
నధికమునకు నాఖ్య లగుచు వెలయుఁ
బసులు నాఁగఁ జెయువులనఁ జేత లన నొప్పుఁ
గర్మమునకుఁ బేళ్లు (చర్మవసన) (71)
టీ. మించు, వాసి, మేలు, మేటి, పెచ్చు, ఎచ్చు - ఈ ఆరును అదిక మనుటకు పేర్లు. పనులు, చెయివులు, చేతలు - ఈ మూడును కార్యమునకు పేర్లు.
ఆ. అనిపె ననిచెఁ బనిపెఁ బనిచె నంపెను బంపెఁ
బుచ్చె గెలుపుమనియె బొమ్మటనియె
ననఁగ నివి సమాహ్య లగును ప్రస్థాపించె
ననెడు క్రియకు (నీశ యభ్రకేశ) (72)
టీ. అనిపెను, అనుచెను, పమిపెను, పనిచెను, అంపెను, పంపెను, పుచ్చెను, గెలుపుమనెను, పొమ్మటనియె _ ఈ తొమ్మిదియు పయనముచేసి పంపెను అనుటకు నామములు.
తే. కొదవ కొద కుందు తగ్గు తక్కువ కొఱంత
వెలితి కొఱ లొచ్చు కడమ నా వెలయు న్యూన
సమభిధానము లర సాము సగము సవము
నాఁగ నర్ధాహ్వయంబు లౌ (నాగభూష) (73)
టీ. కొదవ, కొద, కుందు, తగ్గు, తక్కువ, కొఱత, వెలితి, కొఱ, లొచ్చు, కడమ - ఈ పదియును న్యూనతకు పేర్లు. అర, సాము, సగము, సవము _ ఈ నాలుగును అర్ధమనుటకు పేర్లు.
తే. పేళ్లు పశ్చాత్తనుటకును జెల్లు వెనుకఁ
బిదపఁ దర్వాతఁ బదపడి పిమ్మట నన
మునుపు మును మున్ను తొలి తొల్లి ముందు తొలుత
ననఁగఁ బూర్వపదార్థఖ్య లౌ (గిరీశ) (74)
టీ. వెనుకన్, పిదపన్, తర్వాతన్, పదపడి, పిమ్మటన్ - ఈ ఐదును అనంతరం అనుటకు పేర్లు. మునుపు, మును, మున్ను, తొలి, తొల్లి, ముందు, తొలుత - ఈ ఏడును పూర్వమనుటకు పేర్లు.
ఆ. పాఱుఁబోతు పిఱికి పంద కోఁచ యనంగఁ
బేళ్లు దనరు సమర భీరువునకు
దిట్ట యుక్కుతునియ గట్టిడెందంబువాఁ
డనఁగ ధైర్యవంతుఁ డలరు (నీశ) (75)
టీ. పాఱుబోతు, పిఱికి, పంద, కోచ, - ఈ నాలుగును యుద్ధమున భయపడువానికి పేర్లు. దిట్ట, ఉక్కుతునియ, గట్టిడెందమువాడు - ఈ మూడును ధైర్యవంతునకు పేర్లు.
తే. పౌజు చేరువ మొత్తంబు బారు తుటుము
దండు పరి గమి కూటువ పిండు దాఁటు
మూఁక దళమును బేళ్లు సమూహమునకు
(భుజగవరహార యవిముక్తపురవిహార) (76)
టీ. పౌజు, చేరువ, మొత్తము, బారు, తుటుము, దండు, పరి, గమి, కూటువ, పిండు,, దాటు, మూక దళము - ఈ పదమూడును సమూహమునకు పేర్లు.
సీ. పూనె నూనెను దాల్చె నానెను మోచె నా, వహియించె ననుట కౌ (నహివిభూష)
నామము లిచ్చాటనము చేసె ననుటకు, వరుసతోఁ దఱిమెను బఱపె వెలిచెఁ
దోలెను ఱొప్పె నా (ద్రుహిణాదిసురనుత), త్రిప్పెను నాఁ గ్రమ్మరించె ననఁగ
మగిడించె ననఁగను మరలించె నన సమా, హ్వాయములై పరఁగు నివర్తితంబు
తే. చేసె ననుటకు (సురముని సిద్ధసేవ్య)
యడ్డగించెను నా నిల్పె ననఁగ నాఁగె
నన నివారించె ననుటకు నాక్య లమరు
(నగసుతానాథ గుహగజాననసనాథ) (77)
టీ. పూనెను, ఊనెను, తాల్చెను, ఆనెను, మోచెను - ఈ ఐదును ధరించె ననుటకు పేర్లు. తఱిమెను, పఱపెను, వెలిచెను, తోలెను, ఱొప్పెను - ఈ అయిదును ఊచ్ఛాటనము చేసె ననుటకు పేర్లు. త్రిప్పెను, క్రమ్మఱించెను, మగిడించెను, మరలించెను, నిల్పెను, ఆగెను - ఈ మూడును నిరోధించెననుటకు పేర్లు.
తే. దండ చేరువ సంగడి దాపు చెంత
సరస చెంగట యొద్ద డగ్గఱ కురంగ
టండ పజ్జయు నా సమీపాఖ్య లమరు
(రమ్యధవళాంక కలశనీరధినిషంగ) (78)
టీ. దండ, చేరువ, సంగడి, దాపు, చెంత, సరస, చెంగట, ఒద్ద, డగ్గఱ, కురంగట, అండ, పజ్జ, - ఈ పన్నెండును సమీపమందనుటకు పేర్లు.
తే. అచట నచ్చట నచ్చోట నందు నాడ
నచొట నచ్చొట నక్కడ నయ్యెడ నట
ననఁగఁ దత్ప్రదేశంబునం దనుట కాహ్య
లయ్యె (భక్తవిధేయ యార్యాసహాయ) (79)
టీ. అచట, అచ్చట అచ్చోట, అందు, ఆడ, అచొట, అచ్చొట, అక్కడన్, (ఆ+కడన్)= ఆ దిక్కున, ఆయ్యెడన్ (ఆ = యెడన్) = ఆ ప్రదేశమున, అటన్ - ఈ పదియు ఆప్రదేశమం దనుటకు పేర్లు.
క. ఇరుగెలఁకుల నిరువంకల
నిరుదెస నిరుచక్కియందు నిరుపక్కియలం
దిరుగ్రేవల నిరుగడ నన
బొరిఁ బేళ్లగు నుభయపార్శ్వముల ననుట (కజా) (80)
టీ. ఇరుగేలకులన్, ఇరువంకలన్, ఇరుదెసన్, ఇరుచక్కియందున్, ఇరుపక్కియలందున్, ఇరుగ్రేవలన్, ఇరుగడన్ - ఈ ఏడును రెండువైపులందు అనుటకు పేర్లు.
క. నవముగ ధరలో నీమా
నవవర్గువు వేడ్కఁ జదివినను వ్రాసిన మా
నవులకు ననవరతంబును
శివుఁ డవిముక్తేశ్వరుండు చెలువం బొసఁగున్ (81)
ట. ఎవరీ మానవవర్గు వ్రాయుచున్నారో లేక చదువుచున్నారో, వారికి కాశీవిశ్వేశ్వరుని దయవలన సకలసంపదలు కలుగును.
మానవవర్గు సమాప్తము.
( సశేషమ్ )
జైహింద్.
1 comments:
నమస్కారములు
అద్భుతమైన ఆంధ్ర నామములను తెలియ జేప్పినందులకు కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.