గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, నవంబర్ 2018, గురువారం

ఆంధ్రనామ సంగ్రహము 1. .. .. .. పైడిపాటి లక్ష్మణ కవి.

జైశ్రీరామ్.
ఆంధ్రనామ సంగ్రహము
పైడిపాటి లక్ష్మణ కవి

క. శ్రీపతివంద్యు విశాలా
క్షీపతిని భజించి యిష్టసిద్ధులు వరుసన్
బ్రాపింపఁగ గణనాథుని
శ్రీపాదంబులకు నెఱిఁగి చెందిన వేడ్కన్             (1)
శ్రీ పైడిపాటి లక్ష్మణకవి ఇష్టదేవతా ప్రార్థనముతో ఆంధ్రనామ సంగ్రహము అనెడి గ్రంథ రచనకు పూనుకొనెను.

క. నతభక్తలోకరక్షా
రతికిం జంచత్కృపాతరంగితమతికిన్
శతమఖముఖసురనుతిసం
గతికిన్ మహిమోన్నతికిని గాశీపతికిన్              (2)

తే. అంకిత మొనర్తుఁ దెనుఁగుపేళ్ళరసి కూర్చి
గరిమతో నాంధ్రనామ సంగ్రహ మనంగ
నమరుకృతిఁ బైఁడిపాటి యేకామ్రమంత్రి
సుతుఁడఁ గవిలక్ష్మణాఖ్యుఁడ సుజనహితుఁడ     (3)

(పైడిపాటి ఏకామ్రమంత్రి కుమారుడను, సజ్జనుల కిష్టుడనైన పైడిపాటి కవిలక్ష్మణుఁడను నేను తలచిన కోర్కెలు నెరవేరుటకై శ్రీమహావిష్ణువుచే పూజింపదగిన విశాలాక్షిపతి యగు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి పిదప విఘ్నేశ్వరుని మహిమగలపాదములకు మ్రొక్కి దేవేంద్రుడు మొదలగు దేవతలచే మ్రొక్కులందువాడయిన కాశీవిశ్వనాథునికి అంకితముగా తెలుగుపేళ్ళన్నియు చేర్చి ఆంధ్రనామ  సంగ్రహమను గ్రంథము నొనర్చెదను)

తే. దేవమానవస్థావర తిర్యగాఖ్య
వర్గు లొనరింతు నానార్థ వర్గుఁ గూడ
వర్గములు గాఁగ గూర్తు నాహ్వయములందు
నిడుదు వివరించునెడల సంస్కృతపదంబు      (4)

(ఇందు దేవవర్గు, మానవవర్గు, స్థావరవర్గు, తిర్యగ్వర్గు, నానార్థవర్గు అను ఐదువర్గులను రచించెదను. పర్యాయపదములన్నియు తెలుగుపదములుగా ఉండును. అర్థము వివరించుటకై ఈపర్యాయపదములకు చివర సంస్కృతపదమును ఉంచెదను)
(దేవవర్గునందు దేవతలు వారికి సంబంధించినవి చెప్పబడినవి. మానవ వర్గునందు మనుష్యులు వారికి సంభందించిన వివరములు, స్థావరవర్గు నందు కొండలు చెట్లు మొన్నగు నచరములు గురించి, తిర్యగ్వర్గునందు పశుపక్ష్యాదులకు సంబందించిన వానిని గూర్చి, నానార్థువర్గునందు ననేకార్థములయి పదముల గురించి వివరింపదడినది)

క. శ్రీలలనాధిప వంద్య వి
శాలాక్షి ప్రాణనాథ శతమఖముఖది
క్పాలాభీష్టద సమధిక
శీలా కాశీనివేశ శ్రీవిశ్వేశా!           (5)
(లక్ష్మీనాథుడగు విష్ణుచేత కొనియాడదగినవాడవు. కాశీవిశాలాక్షికి మగడవు. ఇంద్రాదిలోకపాలుర కోర్కెలు నీడేర్చువాడవు గొప్ప స్వభావము గలవాడవు నైన కాశీపురియందు వెలయుచున్న యోవిశ్వేశ్వరా! నీవు నా గ్రంథమును అవధరింపుము)

దేవవర్గు

సీ. ముక్కంటి యరపది మోముల వేలుపు, మినుసిగదయ్యంబు మిత్తిగొంగ
గట్టువిల్తుఁడు గఱకంఠుఁ మిక్కిలి, కంటిదేవర బేసికంటివేల్పు
వలిమలల్లుఁడు మిన్నువాలతాలుపు కొండ, వీటిజంగము గుజ్జువేల్పుతండ్రి
వలరాజుసూడు జక్కులఱేనిచెలికాఁడు, బూచులయెకిమీఁడు పునుకతాల్పు

తే. విసపుమేఁతరి జన్నంపు వేఁటకాఁడు
బుడుతనెలతాల్పు వెలియాల పోతురాజు
తోలుదాలుపు ముమ్మొనవాలుదాల్పు
నాఁగ భవదాఖ్య లొప్పు (నంధకవిపక్ష)        (6)

తా. ముక్కంటి=మూడు నేత్రములుగలవాడు, అరపదిమోములవేలుపు= ఐదుముఖములు గల దేవుడు, మినుసిగదయ్యంబు=ఆకాశము జుట్టుగా గలదేవుడు, మిత్తిగొంగ=మృత్యువునకు శత్రువు, (మిత్తి-ప్రకృతి,మృత్యువు), గట్టువిల్తుడు= మేరుపర్వతము ధనుస్సుగా గలవాడు, కఱకంఠుఁడు=నల్లని కంఠము కలవాడు, మిక్కిలి కంటిదేవర=హెచ్చునేత్రములు గల దేవుడు, బేసికంటివేల్పు=మూడునేత్రములు గలదేవుడు, వలిమలల్లుడు=మంచుకొందయొక్క (హిమవంతుని) అల్లుడు, మిన్నువాకతాలుపు=(మిన్ను=ఆకాశము, వాక=నది) ఆకాశగంగను శిరసున ధరించువాడు, కొండవీటిజంగము=కైలాసపర్వతము నివాసముగాగల భిక్షుకుడు, గుజ్జువేల్పుతండ్రి=పొట్టిదేవర యగు విఘ్నేశ్వరుని జనకుడు, వలరాజు సూడు= మన్మధునికి శత్రువు, జక్కులఱేని చెలికాడు=(జక్కులు=యక్షులు, వారికి ఱేడు కుభేరుడు, అతనికి స్నేహితుడు) కుబేరునికి మిత్రుడు, బూచులయెకిమీడు=పిశాచములకు అధిపతి, పునుకతాల్పు=కపాలధారి, విసపుమేతరి=విషము తిన్నవాడు, జన్నంపువేటకాడు=దక్షునియజ్ఞము ధ్వంసము చేసినవాడు, బుడుతనెలతాల్పు= బాలచంద్రుని శిరమున దాల్చినవాడు, వెలియాలిపోతురౌతు=తెల్లనియాబోతు నెక్కు యోధుడు, తోలుదాలుపు= పులితోలుచర్మమును) ధరించువాడు, ముమ్మొనవాలుదాల్పు=మూడుమొనలుగల ఆయుధమును (త్రిశూలమును) ధరించినవాడు, నాగన్ =అని ఈ ఇరువదిరెండును, అంధకపక్ష=అంధకాసురునికి శత్రుడా, భవత్ ఆఖ్యలు ఒప్పును= నీ పేళ్ళనదగును) (ఈ పద్యములో 22 ను ఈశ్వరుని పేర్లు)
సీ. సోఁకుమూకలగొంగ చుట్టుగైదువుజోదు, పచ్చవిల్తునితండ్రి లచ్చిమగడు
పులుఁగుతత్తడిరౌతు వలమురితాలుపు, నెన్నుఁడు కఱివేల్పు వెన్నదొంగ
నునుగాడ్పుదిండిపానుపునఁ బండెడిమేటి, బమ్మదేవరతండ్రి తమ్మికంటి
పదివేసములసామి పసిఁడిపుట్టముదాల్పు, కఱ్ఱినెచ్చెలి తరిగట్టుదారి
తే. యాలకాపరి వ్రేఁతల మేలువాడు
పాలకడలల్లుఁడును బక్కిడాలుఱేడు
ఱేయుఁబవలును జేయుకన్దోయివాఁడు
మామమా మన హరి యొప్పు శ్రీమహేశ       (7)

తా. సోకుమూకలగొంగ=రాక్షస సమూహములకు శత్రువు, చుట్టుగైదువుజోదు= గుండ్రనియాయుధమును (సుదర్శనము) దాల్చువీరుడు, పచ్చవిల్తుతండ్రి=పచ్చనివిల్లు గలమన్మధునికి తండ్రి, లచ్చిమగడు=లక్ష్మికి భర్త, పులుగుతత్తడిరౌతు=గరుడవాహనము ఎక్కెడివీరుడు, వలమురితాలుపు=పాంచజన్యమను శంఖమును ధరించువాడు, వెన్నుడు=అంతటా వ్యాపించువాడు, కఱివేల్పు=నల్లను మేనిచాయ గలవాడు, వెన్నదొంగ=వెన్నను అపహరించినవాడు, నునుగాడ్పుదిండిపానుపున బండెడుమేటి= మృదువైన వాయువును భక్షించెడు శేషతల్పమున పండెడు దొర, బమ్మదేవర తండ్రి=బ్రహ్మదేవునికి తండ్రి, తమ్మికంటి=కమలములవంటి కన్నులు గలవాడు, పదివేసములసామి= దశావతారములెత్తిన దేవుడు, పసిడిపుట్టముదాల్పు=పీతాంబరమును ధరించినవాడు, కఱ్ఱినెచ్చెలి=అర్జునునకు ముఖ్యమిత్రుడు, తరిగట్టుదారి=కవ్వపుగొండను (మందరపర్వతమును) మోసినవాడు, ఆలకాపరి=పశువులను మేపినవాడు, వ్రేతలమేలువాడు= గోపికాస్త్రీలను రక్షించువాడు, పాలకడలల్లుడు= పాలసముద్రునికల్లుడు, పక్కిడాలు ఱేడు=గరుడధ్వజము గలవాడు, రేయుబవలును చేయుకన్దోయివాడు=  సూర్యచంద్రులు నేత్రములుగా కలవాడు, మామమామ=మామయగు సముద్రునికి మామ అనన్ (శ్రీమహేశా) హరి యొప్పున్.
(ఈ 22 పేర్లును విష్ణువునకు పేర్లు)

సీ. పక్కిడాల్వేలుపు పొక్కిలి పసిబిడ్డఁ, డంచతేజినెక్కి యాడురౌతు
మనెడుప్రొద్దులనొసళ్ళను వ్రాయుదేవర, చదువులబేలుపు జన్నిగట్టు
తెలిదమ్మిగద్దియ గొలువుండురాయఁడు, నిక్కపుజగమేలు నేర్పుకాఁడు
కడుపుబంగారుబొక్కసముఁ జేసినమేటి, పోరోగిరముతిండి పోతుతండ్రి

ఆ. నలువ తమ్మిచూలి నలుమొగంబులవేల్పు
వేల్పు పెద్దపలుకు వెలఁదిమగఁడు
తాత బమ్మ యన విధాతనామములొప్పు
(నఘవినాశ యీశ యభ్రకేశ)         (8)

తా. పక్కిడాల్వేలుపు పొక్కిలిపసిబిడ్డఁడు= గరుఢధ్వజుడైన విష్ణువుయొక్క నాభికమలమునందు పుట్టిన చిన్న బిడ్డడు, అంచతేజినెక్కియాడు రౌతు= హంసవాహనారూఢుడు, మనెడుప్రొద్దునొసళ్ళనువ్రాయుదేవర=మానవుల జీవితకాలమును మోములందు వ్రాసెడువేల్పు, చదువులవేలుపు=విద్యలకు ప్రభువు, జన్నిగట్టు=యజ్ఞోపవీతమును దాల్చినవాడు, తెలుదమ్మిగద్దియఁ గొలువుండురాయఁడు=తెల్లనితామరపువ్వు అనెడి సింహాసనమందు గూర్చుండు ప్రభువు, నిక్కపుజగమేలు నేర్పుకాడు= సత్యలోకమును పాలించెడి ప్రభువు, కడుపుబంగారు బొక్కసము చేసినమేటి=హిరణ్యగర్భుఁడు, పోరోగిరముతిండిపోతుతండ్రి= జగడమే ఆహారముగా గలిగిన నారదునకు తండ్రి, నలువ= నాలుగు నోళ్ళుగలవాడు, తమ్మిచూలి=విష్ణువు నాభికమలమునందు పుట్టినవాడు, నలుమొగంబులవేల్పు=చతుర్ముఖుడగు దేవుడు, వేల్పుపెద్ద=దేవతలకు పెద్దవాడు, పలుకువెలఁదిమగఁడు=వాక్కులదేవియగు సరస్వతికి భర్త, తాత=పితామహిడు, బమ్మ=బ్రహ్మ. (ఈ 16 ను బ్రహ్మయొక్క పేర్లు)
( సశేషమ్ )
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.