జైశ్రీరామ్.
ఆంధ్రనామశేషము - 1 -- అడిదము సూరకవి
ఆంధ్రనామశేషము -- అడిదము సూరకవిక. శ్రీగౌరీప్రియవల్లభ
రాగద్వేషాదిరహిత రమ్యచరిత్రా
యోగిధ్యేయపదాంబుజ
భోగివలయ రామచంద్ర పురవరనిలయ (1)
టీ. శ్రీగౌరీవల్లభ = శోభయుక్తురాలయిన పార్వతీదేవికి ప్రియనాధా! రాగద్వేషాదిరహిత= రాగద్వేషదిదోషములు లేనివాడా! రమ్య చరిత్రా = మనోహరమైన చరితములుగలవాడా! యోగిధ్యేయపదాంబుజ = నిష్ఠగలవారిచే ధ్యానము చేయదగిన పాదారవిందములు గలవాడా! భోగివలయ = సర్పములు హస్తకంకణములుగా గలవాడా! రామచంద్రపురవరనిలయా = శ్రేష్ఠమైన రామచంద్రపురము నివాసముగా గలవాడా (ఓపార్వతీశా!)
వ. అవధరింపుము (2)
ఆ. ఆంధ్రనామసంగ్రహమునందుఁ జెప్పని
కొన్ని తెలుఁగు మఱుఁగులన్ని గూర్చి
యాంధ్రనామశేష మనుపేరఁ జెప్పెద
దీనిఁ జిత్తగింపు దేవదేవ (3)
తా. దేవదేవా! ఆంధ్రనామసంగ్రహమున చెప్పక విడచిన కొన్ని తెలుగు కఠినపదములగూర్చి ఆంధ్రనామశేష మనుపేరుతో చెప్పబూనితిని. దానిని మనఃపూర్వకముగా నాలకింపుము.
క. తఱి య జ్జద ననసమయం
బ్య్ఱఁ డనఁగను సరకుసేయకుండె ననఁగ బే
ళ్ళొఱ పగు గణింపఁ డనుటకుఁ
(గరిచర్మాంబరత్రినేత్ర గౌరీమిత్రా) (4)
టీ. తఱి, అజ్జు, అదను - ఈ మూడును సమయమునకు పేర్లు. ఉఱఁడు, సరకుసేయకుండెను - ఈ రెండును లక్ష్యపెట్టడనుటకు పేర్లు.
తే. పెంపుసెందెను దామరతంపరయ్యెఁ
బ్రబలె నెగడెను గొనసాగె బలిసె పెరిఁగె
ననఁగ రేకెత్తె ననఁగ బేళ్ళయ్యె వృద్ధి
బొందెననుటకు (శేషాహిభూషితాంగా) (5)
టీ. పెంపుసెందె, తామరతంపరయ్యె, ప్రబలె, నెగడె, కొనసాగె, బలిసె, పెరిగె, రేకెత్తె - ఈ ఎనిమిదియు వృద్ధిపొందె ననుటకు పేర్లు.
తే. పేర్మి యర్మిలి మక్కువ కూర్మి నెమ్మి
నెనరు గాదిలి గార్రాము నెయ్య మింపు
ప్రేముడి యనుంగు ము ద్దన బ్రియమునకును
నామధేయంబు లయ్యెఁ (బినాకపాణి) (6)
టీ. పేర్మి, ఆర్మిలి, మక్కువ, కూర్మి, నెమ్మి, నెనరు, గాదిలి, గారాము, (రూ. గారము), నెయ్యము, ఇంపు, ప్రేముడి, అనుంగు, ముద్దు - ఈ పదమూడును ప్రియమునకు పేర్లు.
క. ఒనఁగూర్చె ననఁగ సమకూ
ర్చె ననన్ వీల్పఱిచె ననఁగఁ జేకూర్చెను నా
ననుకూలపఱిచె ననుటకుఁ
దనరును నామంబులై (సుధాకరమకుటా) (7)
టీ. ఒనఁగూర్చెను, సమకూర్చెను, వీల్పఱిచెను (రూ. వీలుపఱిచెను) చేకూర్చెను - ఈ అయిదును అనుకూలపఱిచె ననుటకు పేర్లు.
క. చరియించె ననుట కాఖ్యలు
తిరిగెను జెరలాడె ననఁగ ద్రిమ్మరె ననాఁ గ్రు
మ్మరె ననఁగ మసలె ననఁగా
(బురదానవహరణ శేషభుజగాభరణా) (8)
టీ. తిరిగె, చెరలాడె, త్రిమ్మరె, క్రుమ్మరె, మసలె - ఈ అయిదును చరియించె ననుటకు పేర్లు.
తే. ఆఱుమూఁడయ్యెఁ గచ్చువిచ్చయ్యె ననఁగ
బెడిసె బుసివోయె ననఁగను జెడియె ననఁగ
నాఖ్య లగుఁ గార్యవైకల్యమయ్యె ననుట
(కంధకాసురహరణ రౌప్యాద్రిశరణ) (9)
టీ. ఆఱుమూడయ్యె, కచ్చువిచ్చయ్యె, బెడిసె, బుసివోయె, చెడియె = ఈ అయిదును కార్యము చెడెననుటకు పేర్లు.
క. అలజడి నెంజలి పిమ్మట
సిలు గుత్తలపాటు వంత వంత సేగి నెగుల్ గొం
దల మలమ టడరు గో డు
మ్మలిక వనటఁ గుందు నా నమరు దుఃఖాఖ్యల్ (10)
టీ. అలజడి, నెంజలి, పిమ్మట, సిలుగు, ఉత్తలపాటు, (ఉత్తలము + పాటు) వంత, సేగి, నెగులు, కొందలము, అలమట, అడరు, గోడు, ఉమ్మలిక (రూ. ఉమ్మలికము) వనట, కుందు - ఈ పదిహేనును దుఃఖమునకు పేర్లు.
క. అఱిది వెఱం గచ్చెరు వ
బ్బర మబ్రం బనఁగ జిత్రమునకుం బే ళ్ళౌ
సరణికిఁ బేళ్ళగుఁ ద్రో వనఁ
దెరు వన దారి యన బాట తె న్నన (నభవా) (11)
టీ. అరిది, వెఱఁగు, అచ్చెరువు, అబ్బురము, అబ్రము _ ఈ అయిదును చిత్రమునకు పేర్లు. త్రోవ, తెరువు, దారి, బాట తెన్ను, - ఈ అయిదును మార్గమునకు పేర్లు.
తే. ఐదుపదిచేసె వెనుకముందయ్యె జుణిఁగె
వీఁగె వెన్నిచ్చె వెనుకంజ వేసె ననఁగ
వోహటించె ననంగఁ బేళ్ళొప్పుచుండు
నహవపరాఙ్ముఖుం డయ్యె ననుట (కభవ) (12)
టీ. అయిదుపదిచేసె (ముందునకొక యడుగుపెట్టి యుద్ధము సెయమన్న వాడు జడిసి కాలు వెనుకకు పెట్టుట) వెనుకముందయ్యె, జుణిగె, వీగె, వెన్నిచ్చె = వీపు చూపెను, వెనుకంజవేసె (వెనుక + అంజ + వేసెను) = బ్వెనుక
అడుగు పెట్టెను, ఓహటించె - ఈ ఏడును యుద్ధమందు పరాఙంఖు డయ్యె ననుటకు పేర్లు.
తే. మోహరించెను దండెత్తె మొనసె దాడి
చేసెఁ బోటొగ్గెఁ గోల్తలు చేసె మాఱు
కొనియె దళమెత్తె ననఁగ బేళ్లొనరుచుండు
నాహవోద్యోగ మొనరించె ననుట (కభవ) (13)
టీ. మోహరించె, దండెత్తె, మొనసె, దాడిచేసె, పోటొగ్గె, కోల్తలు చేసె, మాఱుకొనియె, దళమెత్తె - ఈ ఏడుయు యుద్ధ ప్రయత్నము చేసెననుటకు పేర్లు.
అహవోన్ముఖతకు నోల మాస గొనక
పిఱుతివియ కీడఁబో కనఁ బేళ్లు దనరు
నబ్బెస మొనర్చెఁ గఱచె నా నభ్యసించె
ననుట కభిదానములు (చంద్రమావతంస) (14)
టీ. ఓలమాసగొనక, పిఱుతివియక, ఈడఁబోక, - ఈ మూడును యుద్ధవిముఖతకు పేర్లు. అబ్బెసమొనర్చె, కఱచె, -ఈ రెండును అభ్యసించె ననుటకు నామములు.
( సశేషమ్ )
జైహింద్.
1 comments:
నమస్కారములు
ఆడిదం సూరకవి గొప్ప కవిపండితుడు
కనకాభిషేకం చేసినప్పుడు " ఒకసారి పానం చేసిన నీటిని త్రాగడం అలవాటు లేదు " అని ఆనాణెములు తీసుకొన లేదట. ఆయన పద్యములు రసరమ్యములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.