గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, నవంబర్ 2018, శుక్రవారం

ఆంధ్రనామ సంగ్రహము -2

జైశ్రీరామ్.
ఆంధ్రనామ సంగ్రహము -2
తే. గట్లరాయనిపట్టి ముక్కంటివెలఁది
యేనుఁగులగొంగతత్తడి నెక్కుదంట
సామిసామేనిఁ జేకొన్న చాన జగము
తల్లి యన గౌరిపేళ్ళొప్పు (ధర నుమేశ)      (9)

తా. గట్లరాయనిపట్టి=పర్వతరాజగు హిమవంతుని కూతురు,   ముక్కంటివెలఁది=త్రినేత్రుని భార్య, ఏనుఁగులగొంగతత్తడి నెక్కుదంట= ఏనుగులకు విరోధియైన సింహమునెక్కెడి ధీరురాలు,  సామిసామేనిఁ జేకొన్నచాన= ణర్తయొక్క యర్థాంగమును గ్రహించినయాడుది  (సామేను=సగముదేహము), జగముతల్లి=లోకముయొక్క తల్లి - అను ఈ 5 ను పార్వతికి పేళ్ళు.

తే. లచ్చి కలుములజవరాలు పచ్చవిల్తు
తల్లి కఱివేల్పునిల్లాలు తల్లితల్లి
కడలికూఁతురు సిరి లిబ్బిపదఁతి తమ్మి
యింటిగరితన శ్రీయొప్పు (మృగధరాంక)         (10)

తా. లక్ష్మి, కలుములజవరాలు=సంపదలుగల యాడుదు,  పచ్చవిల్తుతల్లి=మన్మధుని తల్లి, కఱివేల్పునిల్లాలు=నీలమేఘశ్యాముడైన విష్ణువుకు పత్ని,  తల్లితల్లి=తల్లియైన గంగకు తల్లి, కడలికూతురు= సముద్రుని కూతురు,  సిరి=శ్రీ, లిబ్బిపడతి=నిధులందుండు దేవత,  తమ్మియింటిగరిత=కమలానివాసిని యగునాడుది, అను ఈ 6 ను లక్ష్మికి నామములు

క. తలవాఁకిటను మెలంగెడి
పొలఁతుక పలుకుల వెలఁది పొత్తముముత్తో
నలువపడఁతి కలుములపై
దలికోడ లనంగఁ బరఁగు (ధర) వాణి (శివ)           (11)

తా. తలవాఁకిటను మెలంగెడుపొలఁతుక=శిరస్సునకు ద్వారమైన నోటియందు సంచరించెడి స్త్రీ, పలుకులవెలంది= వాక్కుల కధిదేవత యగు పడుచు, పొత్తము ముత్తో= పుస్తకములందు వెలయునట్టి ముత్తైదువ, నలువపడఁతి=బ్రహ్మదేవుని భార్య,  కలుములపైదలికోడలు=సంపదలకధిదేవతయైన లక్ష్మీదేవికి  కోడలు, ఈ 5 ను సరస్వతీదేవికి పేళ్ళు

సీ. ఇద్దరుతల్లుల ముద్దుబిడ్డఁడు పని, చెఱుపులదొర చేటచెవులవేల్పు
వంకరతొండంబు వాఁ డేనుఁగు మొగంబు, దేవర పాఁపజందెములమేటి
మ్రొక్కువారలపనుల్ చక్కఁజేసెడుసామి, గఱికపూజలమెచ్చు గబ్బివేల్పు
ముక్కంటిపండుల మెక్కెడితిండీండు, ముక్కంటిగారాబు ముద్దుపట్టి
ఆ. పెద్దకడుపువేల్పు పిళ్ళారికుడుముల
తిండికాఁడు కొక్కుతేజిరౌతు
గుజ్జువేలు పొంటికొమ్ముదేవర వెన
కయ్య యన వినాయకాక్య (లీశ)             (12)

తీ. యిద్దఱుతల్లులముద్దుబిడ్డఁడు=గంగాపార్వతుల కిద్దఱకుఁ ముద్దుల కొడుకు, పనిచెఱుపుల దొర=కార్యవిఘ్నముచేయు దేవుడు, చేటచెవులవేల్పు=చేటలవలె వెడల్పయిన చెవులుగల దేవుడు, వంకరతొడంబువాడు= వంకరగానుండు తొండంబు గలవాడు, ఏనుఁగు  మొగంబుదేవర=గజవక్త్రముగల దేవత, పాఁపజందెములమేటి=పాములే యజ్ఞోపవీతముగా దాల్చు ప్రభువు, మ్రొక్కువారలపనుల్ చక్కఁజేసెడు సామి=తన్ను కొల్చినవారి కార్యములను అనుకూలపరచు దేవుడు, గఱికపూజల మెచ్చు గబ్బివేల్పు=గరికపూజకు మెచ్చుకొనెడు  గొప్పదేవుడు, ముక్కంటిపండుల మెక్కెడుతిండిఁడు= తెంకాయలను  తినెడువాడు, ముక్కంటిగారాబు ముద్దుపట్టి=త్రినేత్రుడగు ఈశ్వరునికి  యిష్టుడగు కుమారుడు, పెద్దకడుపు వేలుపు = లంబోదరుడగు వేలుపు, పిళ్ళారి కుడుముల తిండికాడు= కుడుములను తినెడువాడు, కొక్కుతేజి రౌతు = మూషికవాహనము ఎక్కు దేవుడు, గుజ్జువేలుపు=పొట్టిదేవుడు, ఒంటికొమ్ముదేవర=ఒకదంతముగలదేవుడు, వెనకయ్య- ఈ 17 వినాయకుని పేళ్ళు

సీ. పెనుఁబాఁపకవణంబుఁ దినువారువంబురౌతు, గట్టుయేకిమీనిపట్టిపట్టి
ఱెల్లుచూ లార్గురు తల్లులకొమరుండు, గాడుపుసంగడి కానికొడుకు
పుంజుదాలుపు వేలుపులఱేనిదళవాయి, జంటముమ్మోముల దంటవేల్పు
కొంచగుబ్బలి వ్రక్కలించినబలుదిట్ట, రెండాఱుచేతుల దండిమగడు
తే. వేలుపులమూఁకపేరిటి వెలఁదిమగఁడు
వేల్పుగమికాఁడు వెనకయ్య వెనుకవాఁడు
కొమరుసా మన సేనాని కొమరుమిగులు
(విగతభవపాశ కాశీనివేశ యీశ)          (13)

టీ. పెనుబాఁపకవణంబుఁదినువారువమురౌతు= గొప్పసర్పములను  తినియెడి నెమ్మినెక్కు రౌతు, (మయూర వాహనుడు), గట్టులయెకిమీనిపట్టిపట్టి=పర్వతరాజపుత్రి యగుపార్వతికి పుత్రుడు, ఱెల్లుచూలు=ఱెల్లునందు పుట్టినవాడు, ఆర్గురుతల్లులకొమరుండు=షత్కృత్తికలకు పుట్టినవాడు, గాడుపుసంగడికాని కొడుకు = వాయు సఖుడగు అగ్నికి పుత్రుడు, పుంజుదెఆలుపు= కోడిపుంజు ధ్వజమునందు ధరించినవాడు, వేలుపులఱేని దళవాయి = ఇంద్రుని సేనాధిపతి, జంతముమ్మోములదంటవేల్పు= ఆఱుముఖములుగల దేవుడు, కొంచగుబ్బలి  వ్రక్కలించిన బలుదిట్ట=క్రౌంచపర్వతంబును పగులగొట్టిన బలవంతుడు, రెండాఱుచేతులదండిమగడు=పంద్రెండు చేతులుగల వీరపురుషుడు, వేలుపులమూకపేరిటివెలదిమగడు= దేవసేనయను కాంతకు భర్త, వేలుపుగమికాడు= దేవతల సేనాధిపతి, వెనకయ్యవెనుకవాడు= వినాయకుని తమ్ముడు, కొమరుసాము=కుమారస్వామి, ఈ 14 ను కుమార స్వామికి పేళ్ళు

సీ. అలరువిల్తుండు కన్నులవిల్తుఁడు గమ్మ, విలుకాఁడు చక్కెర వింటివాడు
చెఱకువిల్కాఁడు కెంజిగురులవిల్తుఁడు, వెడవిల్తుఁడును బచ్చవిల్తుఁడించు
విల్లుదాలుపు తుంట విలుకాఁడు తియ్యని, ల్కాఁడును జమిలిముక్కాలినారి
విలుకాఁడు చౌవంచ ములుకులుగలదంట, రాచిల్కనెక్కెడు రాయరౌతు
తే. మీనుమొసలిసిడంబుల మేటి చంద
మామయల్లుఁడు వలరాజు మరుడు లచ్చి
కొమరుఁ డనుపేళ్ళ నొప్పును గుసుమధ్న్వి
(విగతభవపాశ కాశీనివేశ యీశ)           (14)

టీ. అలరువిల్తుండు=పుష్పములు ధనుస్సుగా గలవాడు, కన్నులవిల్తుండు=కణుపుల ధనుస్సు గలవాడు, కమ్మ విలుకాడు =తియ్యనిధనుస్సు గలవాడు, చెక్కెరవింటివాడు=పంచదార నొసగు ధనస్సుగలవాడు, చెఱకువిలుకాడు= చెఱకుగడ ధనుస్సు ధరించువాడు, తుంటవిలుకాడు=చెఱకుతుంట విల్లుగాకలవాడు, తియ్యవిల్కాడు=తియ్యని విల్లు గలవాడు, కమిలిముక్కాలినారివిలుకాడు= ఆరుకాళ్ళుగల పురుహులు (తుమ్మెదలు) అల్లెత్రాడుగా గల ధనుస్సు గలవాడు, చౌవంచములుకు గలదంత= ఐదుబాణములుగలయోధుడు, రాచిల్కనెక్కెడురాయరౌతు= శ్రేష్ఠమగు చిలుక నెక్కెడు మేటివీరుడు, మీనుమొసలిసిడంబులమేటి=చేపలు మొసళ్ళు ధ్వజమునందు గల దిట్టరి, చందమామయల్లుడు= చంద్రునకు అల్లుడు, వలరాజు= ప్రేమలకు నధిపుడు, మరుడు, లచ్చికొమరుడు=లక్ష్మీదేవికి పుత్రుడు ఈ 18 ను మన్మధునకు పేళ్ళు

సీ. చలువలఱేఁడు వెన్నెలఱేఁడు రేఱేఁడు, జాబిల్లి రేవెల్గు చందమామ
తమ్ములపగవాఁడు కమ్మవిల్తునిమామ, కలువలఱేఁడు పాల్కడలిపట్టి
జక్కవకవిప్పు ముక్కంటితలపువ్వు, చుక్కలదొర ప్రొద్దుజోడుకోడె
తపసికన్పాప బిత్తరిజింకతాలుపు, కఱివేల్పుడాకన్ను కడలివెన్న
పంటపైరుల యెకిమీడు జంటదంట
చౌకములపాళ్ళ తెలిమిద్ద చలివెలుంగు
వేలుపులబువ్వ చీఁకటి వేరువిత్తు
నెల యనఁగఁ జంద్రు పేళ్ళొప్పు (నీలకంఠ)      (15)

టీ. చలువఱేడు=చల్లదనముగల రాజు, వెన్నెలరేడు = నిశానాథుడు, జాబిల్లి, రేవెల్గు=రాత్రియందు ప్రకాశించువాడు, చందమామ, తమ్ములపగవాడు=కమలకు విరోధి, కమ్మవిల్తునిమామ=మన్మధునికి మామ, కలువలఱేడు = ఉత్పలములకు రాజు, పాల్కడలిపట్టి=క్షీరసముద్రునిపుత్రుడు, జక్కవకవిప్పు=చక్రవాకమిధున బాగపరచువాడు, ముక్కంటితలపువ్వు= ఈశ్వరునికి శిరోభూషణమయినవాడు, చుక్కలదొర=నక్షత్రములకు రాజు, ప్రొద్దుజోడుకోడె = సూర్యునితో సమానుడు, తపసికన్పాప=అత్రిమునీంద్రిన్ని నేత్రమున ఉన్నవాడు బిత్తరిజింకతాలుపు= సొగసైన మృగంబు దాల్చినవాడు, కఱివేల్పుడకన్ను=విష్ణువుయొక్క ఎడమనేత్రము, కడలివెన్న=సముద్రమునందలి వెన్న, పంట పైరులయెకిమీడు=సస్యములకు రాజు, జంటదంటచౌకములపాళ్ళ తెలిముద్ద=పదునారు కళలుగల తెల్లనిబింబము(జంట=రెండు, దంట=రెండు, చౌకము=నాలుగు, రెండురెళ్ళు నాలుగు, నాల్గు నాల్గులు పదహారు), చలివెలుంగు=చల్లనికిరణములు గలవాడు, వేలుపులబువ్వ=దేవతలకాహారమైనవాడు, చీకటివేరువిత్తు=చీకటిని
పోగొట్టువాడు, నెల, అని ఈ 24 ను చంద్రునికి పేళ్ళు.

సీ. వెన్నునివలకన్ను వేఁడివేలుపు ప్రొద్దు, తొవలరాయిడికాఁడు పవలుసేయు
వేలుపు పచ్చగుఱ్ఱాలవజీరుండు, వేడివెలుంగు రేవెల్గుజోడు
జంటాఱుమేనుల సామి చీఁకటిగొంగ, యెఱ్ఱనివేలుపు నివముసూడు
చదలుమానికము ప్రాఁ జదువులపెట్టియ, యేడుగుఱ్ఱములతేరెక్కుజోదు
మువ్వేలుపులయిక్కమ్రొక్కులదేవర, గాములఱేఁడు జక్కవలఱేఁడు
వేయిచేతులఱేఁడు వెలుఁగులయెకిమీఁడు, చెయువులసాకిరి చాయమగఁడు
తే. మింటితెరువరి తమ్మివాల్గంటిమగఁడు
పోరనీల్గెడు మొనగాండ్రు పోవుదారి
జగముచుట్టంబు జమునయ్య జగముకన్ను
నాఁగ సూర్యునిపేళ్ళొప్పు (నాగభూష)           (16)

టీ. వెన్నినువలకన్ను=విష్ణువుయొక్క కుడికన్నైనవాడు, వేడివేలుపు=వేడికి దేవుడు, ప్రొద్దు, తొవలరాయిడికాడు = కలువలకు విరోధి, పవ్చలుసేయువేలుపు=దినకరుడు, పచ్చగుఱ్ఱాలవజీరుండు= పచ్చగుఱ్ఱముల నెక్కెడిరౌతు, వేడివెలుంగు=వేడికిరణంబులు గలవాడు, రేవెల్గుజోడు= రాత్రియందు ప్రకాసించు చంద్రునకు సమానుడు, జంటాఱు మేనులసామి= ద్వాదశాత్ముడూ, చీకటిగొంగ=చీకటిని పోగొట్టు దేవుడు, ఎఱ్ఱనివేలుపు=ఎఱ్ఱని దేహముగలదేవుడు, ఇవముసూడు=మంచునకు శత్రువు, చదలుమానికము=ఆకాశమునకు రత్నము, ప్రాఁజదువులపెట్టియ = వేదముల కునికిపట్టు, ఏడుగుఱ్ఱములతేరెక్కుజోదు, మువ్వేలుపులయిక్క=త్రిమూర్తులకు దావరమైనవాడు, మ్రొక్కుల దేవర=నమస్కారములకు బ్రియుడయిన దేవుడు, గాములరేడు=గ్రహములకు రాజు, జక్కలువలఱేడు = చక్రవాకములకధిపతి, వేయిచేతులఱేడు=సహస్రకిరణుడు, వెలుగుల ఏకిమీడు=వెల్తురులకన్నిటికి ప్రభువు, చెయువులసాకిరి=కర్మలకు సాక్షీభూతుండు, చాయమగడు=ఛాయాదేవికి పెనిమిటి, మింటితెరువరి=ఆకాశమున తిరుగు బాటసారి, తమ్మివాల్గంటిమగడు=పద్మినియను కాంతకు నాథుడు, పోరనీల్గెడు మొనగాండ్రుపోవుదారి= యుద్ధమున చచ్చిన వీరులు స్వర్గలోకమునకు పోవుమార్గమైనవాడు, జగముచుట్టంబు=లోకబాంధవుడు, జమునయ్య=యమునకు తండ్రి, జగముకన్ను= లోకమునకు నేత్రము (ఈ 29 పేర్లు సూర్యునికి నామములు)

సీ. చట్టుపల్ దెగగట్లఁ గొట్టెడుజెట్టి నూ, ఱంచులవాలు చేమించుజోదు
దుగబొట్లపిఱిఁది యైదుకనుంగవలవేల్పు, పాఱుతపసియింటి పంచకోడి
యొడలిచూపొడయఁ డెక్కుడుమొగుల్ గలప్రోడ, నిక్కువీనులజిక్కి నెక్కురౌతు
తెల్లయేనుఁగు నెక్కి తిరిగెడుదొర తూర్పు, మాగానియేలెడు మణియకాఁడు
తే. జమిలిచౌవంచపదులు జన్నములు సేసి
నట్టివేలుపు సోమాసి పెట్టుఁజెట్టు
పొట్టితమ్ముఁడు గల్గిన యట్టివేల్పు
నాఁగ నింద్రునిపేళ్ళొప్పు (నాగభూష)             (17)

టీ. చట్టుపల్ దెగగట్లఁ గొట్టెడుజెట్టి=పర్వతముల ఱెక్కలను చేదించిన దిట్ట, నూఱంచులవాలుచేమించుజోదు= నూరంచులు గల వజ్రాయుధమును చేత దాల్చిన యోధుడు, దుగబొట్లపిఱిఁది యైదుకనుంగవలవేల్పు = సహస్త్రనేత్రుడు (దుగబొట్లపిఱిది యైదు= అనగా రెణ్దుసున్నాలు వెనుకగల అయిదు=500, వానికవలు=వాని జత 500x2=1000) పాఱుతాపసియింటిపంచకోడి= గౌతమునియాశ్రమమున కోడిరూపము ఎత్తినవాడు, ఒడలి చూపొడయడు =దేహమంతయు కన్నులు గల దొర, ఎక్కుడుమొగుల్ గలప్రోడ= మేఘములే వాహనములుగాగ నేర్పుకాడు, నిక్కువీనులజక్కి నెక్కురౌతు= నిక్కు చెవులవాహనమును ఎక్కునట్టి దిట్టరి, తెల్లయేనుఁగునెక్కి తిరిగెడు దొర= ఐరావతమను గజమునెక్కి సంచరించెడు ప్రభువు, తూర్పుమాగానియేలెడు మణియకాడు = తూర్పు దిక్కును పాలించెడి ఉద్యోగస్తుడు, జమిలిచౌవంచపదులు జన్నములుసేసినట్టి వేలుపు= నూఱు యాగములు చేసిన దేవుడు, (జమిలి=రెండు, చౌవంచ=ఐదు, రెండూఇదులు=పదు, పదిపదులు=నూఱు), సోమాసిపెట్టుజట్టు= సోమయాజులపాలిటి కల్పవృక్షము, పొట్టితమ్ముడు గల్గినయట్టివేల్పు= వామనుని తమ్మునిగా గలవాడు, అను ఈ 12 ఇంద్రునికి పేళ్ళు.

ఆ. నీరుపాప గాలినెచ్చెలి యన్నింటి
తిండికాఁడు కప్పుఁ దెరువుజాణ
యంటరానివేల్పు జంటమోములసామి
యగ్గి యనఁగ నొప్పు ననలుఁ (డీశ)            (18)

టీ. నీరుపాప=నీటియందు పుట్టిన బిడ్డడు, గాలినెచ్చెలి= గాలికి మిత్రుడు, అన్నింటితిండికాడు=సర్వభక్షకుడు, కప్పుదెరువు జాడ=నల్లని మార్గము కలవాడు (కృష్ణవర్మ), అంటరానివేల్పు=తాకుటకు వీలుపడనిదేవుడు, జంట మోముల సామి= రెండుముఖముల వేలుపు, అగ్గి, ఈ 7 ను అగ్నిహోత్రుని నామములు

తే. జమునసైదోడు పెతరులసామి జముఁడు
ప్రొద్దుకొమరుఁడు గుదెతాల్పు పోతుజిక్కి
నెక్కియాడెడుబలురౌతు దక్కిణంపు
సామి యన నంతకుం డొప్పు (శ్రీమహేశా)            (19)

టీ. జమునసైదోడు= యమునకు తోడబుట్టినవాడు, పెతరులసామి=పితృదేవతలకు ప్రభువు, జముఁడు= యముడు, ప్రొద్దుకొమరుఁడు=సూర్యుని కొడుకు, గుదెతాల్పు= గుదెను ధరించినవాడు, పోతుజక్కినెక్కి యాడెడు బలురౌతు= దున్నపోతునెక్కెడిబలముగల దిట్ట, దక్కిణంపుసామి=దక్షిణదిశ నేలువాడు, ఈ 7 ను యముని నామములు

ఆ. మూలఱేఁడు సోఁకుమూఁకలఱేఁడు రే
ద్రిమ్మరీఁడు పొలసు దిండిపోతు
రక్కసుండు నల్ల ద్రావువాఁ డనఁగను
నిరృతివేళ్ళు స్వ్ల్లు (నీలకంఠ)                  (20)

టీ. మూలఱేడు=నిరృతిమూలకు అధిపతి,  సోఁకుమూఁకలఱేఁడు=రాక్షసులసేనలకు రాజు, రేద్రిమ్మరీడు= రాత్రులందు తిరుగువాడు, పొలసుదిండిపోతు= మాంసమును దినువాడు, రక్కసుఁడు=రాక్షసుడు, నల్లద్రావువాఁడు = రక్తపానము చేయువాడు. ఈ 6 ను నిరృతికి పేళ్ళు.

ఆ. మేటినీరుచూలి మెయితాలుపులసామి
వల్లెత్రాడుదాల్పు నీళ్ళరాయఁ
డేటిబోఁటిమగల యెకిమీఁడు పడమటి
దొర యనంగ నొప్పు వరుణుఁ (డీశ)               (21)

టీ. మేటినీరుచూలిమెయితాలుపులసామి= విస్తారజలముగల సముద్రమునందు పుట్టిన దేహములుగల జలజంతువులకు వేలుపు, వల్లెత్రాడుతాల్పు= పాశమనెడు ఆయుధమును దాల్చినవాడు, నీళ్ళరాయడు= రసాధిపతి, ఏటిబోటిమగలయెకిమీడు= నదులకు భర్తలయిన సముద్రములకు రాజు, పడమటిదొర= పడమటిదిక్కు నేలెడు రాజు, ఈ 5 ను వరుణునికి పేళ్ళు.
(సశేషమ్.)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.