జైశ్రీరామ్.
ఆంధ్ర నామసంగ్రహము - 8
స్థావరవర్గుసీ. వలిదిప్ప వడఁకుగుబ్బలి చలిమిరిమల, గట్టులఱేఁడు ముక్కంటిమామ
మంచుఁగొం డన హిమక్ష్మాధరాఖ్యలు చను, వేలుపుఁగొండ జేజేలగట్టు
పుత్తడిగుబ్బలి పూనుకకంచమువాని, విల్లు నా మేరువు పేళ్లు వెలయు
వెలిదిప్ప ముక్కంటిమల వెండికొండ నాఁ, గైలాసపర్వతాఖ్యలు సెలంగు
తే. వెలయుఁ దరిగొండ కవ్వంపుమల యనంగ
మంధరాఖ్యలు కడపటిమల యనంగఁ
జుట్టుఁగొం డనఁ దనరు నీక్షోణియందుఁ
జక్రవాళాద్రి (వృషవాహ శైలగేహ) (1)
టీ. వలిదిప్ప ( వలి = చల్లదనముగల తిప్ప = కొండ), వడకుగుబ్బలి (పా. వణకుగుబ్బలి) వడకునట్లు చేయు పర్వతము, చలిమిరిమల = చల్లని కొండ, గట్టులఱేడు = పర్వతములకు రాజు, ముక్కంటిమామ = శివునకు మామ, మంచుఁగొండ = హిమముగల పర్వతము - ఈ ఆరును హిమవత్పర్వతమునకు పేర్లు. వేలుపుఁ గొండ (వేలుపు + కొండ) = దేవతలు నివసించు పర్వతము, జేజేలగట్టు = దేవతల పర్వతము, పుత్తడుగుబ్బలి = బంగారు పర్వతము, పూనుకకంచమువాని విల్లు = ఈశ్వరుని ధనుస్సు - ఈ నాలుగును మేరు పర్వతమునకు పేర్లు. వెలిదిప్ప (వెలి + తిప్ప) = తెల్లని పర్వతము, ముక్కంటిమల = శివునకు ఉనికిపట్టగు పర్వతము, వెండికొండ = వెండివలె దెల్లని పర్వతము, - మూడును కైలాస పర్వతమునకు పేర్లు. తరిగొండ (తరి + కొండ), కవ్వంపుమల (కవ్వము + మల) - ఈ రెండును మంధర పర్వతమునకు పేర్లు. కడపటిమల = కడగా నుండెడు పర్వతము, చుట్టుఁగొండ (చుట్టు + కొండ) = భూమి చుట్టు నుండెడు పర్వతము - ఈ రెండును చక్రవాళ పర్వతమునకు పేర్లు.
ఆ. తూర్పుఁగొండ నాఁగఁ దొలుగట్టు నాఁగను
బొడుపుగుబ్బ లనఁగఁ బూర్వశిఖరి
పరఁగుఁ గ్రుంకుమెట్టు పడమటికొండ నా
వెలయు నస్తశిఖరి (విశ్వనాథ) (2)
టీ. తూర్పు గొండ (తూర్పు + కొండ) =పూర్వ దిక్కునందుండెడి పర్వతము, తొలుగట్టు = పూర్వదిక్కు నందలి పర్వతము, పొడుపుగుబ్బలి = సూర్యు దుదయించెడు పర్వతము, - ఈ మూడును ఉదయ పర్వతమునకు పేర్లు. క్రుంకుమెట్టు = సూర్యుడస్తమించు పర్వతము, పడమటికొండ = పడమటిదిక్కు నందుండెడి పర్వతము - ఈ రెండును అస్తమయ పర్వతమునకు పేర్లు.
తే. ఒప్పు గిరిపేళ్లు మల గట్టు తిప్ప మెట్టు
కొండ గుబ్బలి నా మేరు (కుధరచాప)
ఱాయి నాఁ గ ల్లనంగను ఱా యనంగ
శిల కభిఖ్యలు దగు నిల (శేషభూష) (3)
టీ. మల, గట్టు, తిప్ప, మెట్టు, కొండ, గుబ్బలి, - ఈ ఆరును పర్వతమునకు పేర్లు. ఱాయి, కల్లు, ఱా - ఈ మూడును శిలకు పేర్లు.
తే. పల్లె, కొటిక కుప్పమ్ము నాఁగ
నూ రనఁగ గ్రామనామంబు లొప్పుచుండుఁ
బట్టణంబున కాఖ్యలు పరఁగుచుండుఁ
బ్రోలనఁగ వీడనంగను (శూలపాణి) (4)
టీ. పల్లె (రూ. పల్లియ), కొట్టిక, కొటిక, కుప్పము, ఊరు - ఈ అయిదును గ్రామమునకు పేర్లు. ప్రోలు, వీడు - ఈ రెండును పట్టణమునకు పేర్లు.
ఆ. ఉనికిపట్టు తావు మనికిప ట్టిర విల్లు
తెంకి యిక్క నట్టు టెంకి యిమ్ము
నెలవు గీము నాఁగ నలరు నివాసదే
శంబునకును బేళ్లు (చంద్రమౌళి) (5)
టీ. ఉనికిపట్టు, తావు, మనికిపట్టు, ఇరవు, తెంకి, యిక్క, నట్టు, టెంకి ఇమ్మి, నెలవు, గీము (గృహశబ్ధ భవము) - ఈ పన్నెండును నివాసస్థానమునకు పేర్లు.
సీ. తెంకాయచె ట్టనఁ డెంకాయమ్రా నన, నారికేళం బొప్పు (నగనివేశ)
మావిమ్రా ననఁగను మామిడిచెట్టన, నామ్రభూజం బొప్పు (నభ్రకేశ)
అత్తిమ్రానన మేడి యనఁగ నౌదుంబర, ధారుణీజం బొప్పు (మేరుచాపా)
యరఁటి యనఁటి నాఁగ నంశుమత్ఫలధారు, ణిరుహం బగు (ధరణీశతాంగ)
తే> యలరుఁ దుంబీశలాటుసమాఖ్య లాను
గంబు సొఱకాయ వదరు నా (గరళకంఠ)
తా డనంగను దాడి నా తాళభూరు
హంబునకు నాఖ్యలై యొప్పు (నంబికేశ) (6)
టీ. తెంకాయచెట్టు, టెంకాయమ్రాను - ఈ రెండును కొబ్బరి చెట్టు పేర్లు. మావిమ్రాను, మామిడిచెట్టు - ఈ రెండును చూతవృక్షమునకు పేర్లు. అత్తిమ్రాను, మేడి - ఈ రెండును అత్తిచెట్టుకు పేర్లు. అరటి, అనటి - ఈ రెండును కదళీ వృక్షమునకు పేర్లు. అనుగము, సొఱకాయ వదరు - ఈ మూడును సొఱకాయ పేర్లు. తాడు, తాడి - ఈ రెండును తాటిచెట్టు పేర్లు.
సీ. మొక్క మోక నిసువు మొలక మో సనఁగ నం, కురమునకు బేళ్లు (కుధరచాప)
యిగు రనఁ దలిరు నా జిగురు నా జివు రనఁ, బల్లవనామముల్ పరఁగు (నీశ)
మ్రా ననఁ జె ట్టన మ్రాఁ కన భూరుహ, నామధేయము లగు (వామదేవ)
పువు పువ్వు పూ నాఁగఁ బుప్పము విరి యల, రనఁ గుసుమాఖ్య లైయలరు (నీశ)
తే. గుబురు దట్టము జొంపంబు గుంపు తఱచు
నాఁగ నిబిడంబు పేళ్లొప్పు (నందివాహ)
వల్లరిసమాఖ్య లగుచు వర్తిల్లు దీఁగ
తీవ తీవియ తీవె నాఁ (ద్రిపురవైరి) (7)
టీ. మొక్క, మోక, నిసువు, మొలక, మోసు - ఈ అయిదును అంకురమునకు పేర్లు. ఇగురు, తలిరు, చిగురు, చివురు - ఈ నాలుగును పల్లవముల పేర్లు. మ్రాను (రూ. మాను), చెట్టు, మ్రాకు, - ఈ మూడును చెట్టునకు నామములు. పువు, పువ్వు, పూ, పుప్పము (పుష్పశబ్ధభవము) విరి, అలరు, - ఈ ఆరును పుషపు పేర్లు. గుబురు, దట్టము, జొంపము, గుంపు, తఱచు - ఈ అయిదును సందులేక యుండువానికి పేర్లు. తీగ, తీవ, తీవియ, తీవె (రూ. తీగె) - ఈ నాలుగును తీగకు పేర్లు.
ఆ. అగ్రమున కభిక్య లగుచుండుఁ దుద సుద
కొన యనంగ వేక్షకోటరమున
కలరుఁ బేళ్లు తొఱట తొలి తొఱ్ఱ తొఱ నాఁగ
(నాగహర రజతనగ విహార) (8)
టీ. తుద, సుద, కొన _ ఈ మూడును అగ్రమునకు పేర్లు. తొఱట, తొలొ, తొఱ్ఱ, తొఱ - ఈ నాలుగును చెట్టుతొఱ్ఱకు పేర్లు.
ఆ. ఇక్షువున కభిఖ్య లీక్షితిఁ గన్నుల
మ్రాను చెఱకు తియ్యమ్రా ననంగఁ
దనరు దవ యనంగఁ దలవాఁడె నాఁగఁ ద
దగ్రమున కభిఖ్య లగు (గిరీశ) (9)
టీ. కన్నులమ్రాను = గనుపులుగల చెట్టు, చెఱకు, తియ్యమ్రాను = మధురమైన వృక్షము - ఈ మూడును చెఱకునకు పేర్లు. దవ, తలవాడె - ఈ రెండును చెఱకు కొనకు పేర్లు.
క. అగుఁ బే ళ్లుత్పలమునకుం
దొగ తొవ గల్వ గలు వనఁగఁ దోయజ మొప్పుం
దగఁ దమ్మి తామరనఁగా
మొగడన మొగ్గ యబఁ దనరు ముకుళంబు (శివా) (10)
టీ. తొగ, తొవ, కల్వ, కలువ - ఈ నాలుగును ఉత్పలములకు పేర్లు. తమ్మి తామర - ఈ రెండును తామరపువ్వు నకు పేర్లు. మొగడ, మొగ్గ - ఈ రెండును ముకుళమునకు పేర్లు.
తే. ఎసఁగుఁ జెందొవ చెందొగ యెఱ్ఱగలువ
యనఁగ రక్తోత్పలంబు రక్తాబ్జ మొప్పు
నిలను గెందమ్మి కెందామ రెఱ్ఱదామ
రనఁగఁ జెందమ్మి చెందామరన (మహేశా) (11)
టీ. చెందొవ, చెందొగ, ఎఱ్ఱగలువ - ఈ మూడును ఎఱ్ఱని కలువకు పేర్లు. కెందమ్మి, కెందామర (కెంపు + తామర), ఎఱ్ఱదామర, చెందమ్మి, చెందామర - ఈ అయిదును ఎఱ్ఱతామరపువ్వునకు పేర్లు.
క. గొడుగు గొడు వెల్లి యనఁ జె
న్నడరు ఛత్రంబు కేతనాహ్వయము లగున్
సిడె మనఁగఁ డెక్కె మనఁగాఁ
బడగ యనన్ డా లనంగఁ (బర్వతధన్వీ) (12)
టీ. గొడుగు, గొడువు ఎల్లి - ఈ మూడును ఛత్రమునకు పేర్లు. సిడెము, టెక్కెము, పడగ (పతాక శబ్ధ భవము), డాలు - ఈ నాలుగును ధ్వజమునకు పేర్లు.
క. మఱుఁ గనఁగ నోల మనఁగాఁ
మఱు వనఁగాఁ జా టనంగ మా టన వరుసం
బరఁగు ని వెల్ల నగోచర
ధరణీనామంబు లగుచు (దర్పకమదనా) (13)
టీ. మఱుగు, ఓలము, మఱువు, చాటు, మాటు _ ఈ అయిదును కన్నులకు కనపడని ప్రదేశమునకు నామములు.
క. పొసఁగుఁ దృణాఖ్యలు పులు నాఁ
గస వనఁగాఁ బూరి యనఁగ గడ్డి యనంగా
వసుమతిలో నెన్నంబడు
ససి సస్సెము పై రనంగ సస్యం (బభవా) (14)
టీ. పులు, కసవు, పూరి, గడ్డి - ఈ నాలుగును తృణమునకు పేర్లు. ససి, సస్సెము, పైరు - ఈ మూడును ధాన్యమునకు పేర్లు.
ఆ. తెలుపు దెల్ల వెల్ల తెలి వెలి నాఁగ నా
హ్వయము లమరు ధవళవర్ణమునకుఁ
గప్పు నలుపు నల్ల కఱ యన నాఖ్యలౌ
నీలవర్ణమునకు (నీలకంఠ) (15)
టీ. తెలుపు, తెల్ల ,వెల్ల, తెలి, వెలి, - ఈ అయిదునును ధవళవర్ణమునకు పేర్లు. కప్పు, నలుపు, నల్ల, కఱ (పా. కఱి) - ఈ నాలుహును నీలవర్ణమునకు నామములు.
ఆ. కెంపు దొగరు దొవరు గెంజాయ యెఱు పెఱ్ఱ
యనఁగ నరుణకాంతి కాఖ్యలయ్యె
నళిది పసుపుచాయ యనగ హారిద్రవ
ర్ణమునకు కాఖ్యలగుఁ (బినాకహస్త) (16)
టీ. కెంపు, తొగరు, తొవరు, కెంజాయ (కెంపు + చాయ) ఎఱుపు, ఎఱ్ఱ _ ఈ ఆరును ఎఱ్ఱని కాంతికి పేర్లు. అళిది (రూ. హళిది) పసుపుచాయ - ఈ రెండును హారిద్ర వర్ణమునకు పేర్లు.
ఆ. శ్యామవర్ణమునకు నామంబు లగుచుండుఁ
బసరుచాయ యనఁగ బచ్చ యనఁగ
వన్నె డాలురంగు వన్నియ జిగి జోతి
చాయ యనఁగ బరఁగు జగతిఁ గాంతి (17)
టీ. పసరుచాయ, పచ్చ - ఈ రెండును ఆకుపచ్చ వన్నెకు నామములు. వన్నె (వర్ణ శబ్ధభవము) డాలు, రంగు, వన్నియ, (ప్ర. వర్ణము), జిగి, జోతి, చాయ (ప్ర. ఛాయ) - ఈ ఏడును కాంతికి నామములు.
తే. మానికము లన రతనముల్ నా నెసంగు
నవని మాణిక్యములకు సమాహ్వయములు
మెఱుఁ గనంగను నిగ్గు నా మెఱయుచుండు
నాఖ్య లుత్కృష్టకాంతికి (నభ్రకేశ) (18)
టీ. మానికము (ప్ర. మాణిక్యము) రతనము (ప్ర. రత్నము), - ఈ రెండును రత్నములకు పేర్లు. మెఱుఁగు, నిగ్గు - ఈ రెండును విశేషకాంతికి పేర్లు.
తే. జడధిపే ళ్లగు మున్నీరు కడలి సంద్ర
మనఁగ మడుఁగన మడువు నా హ్రదము దనరుఁ
బరఁగు నాఱవసంద్రంబు పాలవెల్లి
జిడ్డుకడలి పాల్కడలి నా క్షీరజలధి (19)
టీ. మున్నీరు (మును + నీరు)= మొదటిసృష్టి, కడలి, సంద్రము (ప్ర. సముద్రము), - ఈ మూడును సముద్రమునకు పేర్లు. మడుగు, మడువు - ఈ రెండును హృదము పేర్లు. ఆఱవ సంద్రము, (లవణ, ఇక్షు, సుర, సర్పి, దధి, క్షీర, నీర సముద్రములలో ఇది ఆరవది), పాలవెల్లి (పాలు + వెల్లి) = క్షీర ప్రవాహము, జిడ్డుకడలి = జిడ్డుకల సముద్రము, పాల కడలి = క్షీర సముద్రము - ఈ నాలుగును క్షీర సముద్రమునకు పేర్లు.
క. నంజె యన మడి యనంగను
మంజుల కేదారభూసమాఖ్యలు వెలయుం
బుంజె యనఁ జేను పొల మనఁ
గం జన మరుభూమిపేళ్లు (కాయజదమనా) (20)
టీ. నంజె, మండి _ ఈ రెండును మాగాణిభూమికి పేర్లు. పుంజె, చేను, పొలము - ఈ మూడును మెట్టభూమి పేర్లు. కంజ యనగా నిర్జల ప్రదేశమునకు పేరు.
క. ధరణిన్ వివరాఖ్య లగున్
బొఱియ కలుగు లాఁగ బొక్క బొంద యనంగా
దరి యొడ్డు గట్టనంగాఁ
బరఁగుం దీరంబు పేళ్లు (ప్రమథగణేశా) (21)
టీ. బొఱియ, కలుగు, లాగ, బొక్క, బొంద - ఈ అయిదును బొంద పేర్లు. దరి, ఒడ్డు, గట్టు - ఈ మూడును తీరమునకు పేర్లు.
ఆ. అస లనంగను ఱొంపి నా నడు సనంగ
బుఱద నా నొప్పు గర్దమంబునకు బేళ్లు
భూమికి సమాఖ్యలగు బువి పుడమి నేల
మన్ను పంటవలంతి నా (మదనదమన) (22)
టీ. అసలు ఱొంపి, అడుసు, బుఱద - ఈ నాలుగును అడుసునకు పేర్లు. బువి (ప్ర. భువి), పుడమి (ప్ర. పృథివి), నేల మన్ను, పంటవలంతి = పంతలనొసగు దేవి - ఈ అయిదును భూమి పేర్లు.
( సశేషమ్ )
జైహింద్.
1 comments:
నమస్కారములు
పాండితీ స్రష్టకు ప్రణామములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.