జైశ్రీరామ్.
ఆధునిక"-భువనవిజయము"-నాటిక"-చిన్నపిల్లలకు.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
వందిమాగదులు"-సాహితీ సమరాంగణ సార్వభౌమా!విజయనగర సామ్రాజ్య
తేజోవిభావ!శ్రీ.శ్రీ.శ్రీ.కృష్ణదేవరాయ సార్వభౌమా!బహు పరాక్!బహు పరాక్!
తెరవెనుక"-స్వాగతం_సుస్వాగతం!
నేటి భువన విజయమునకు అష్షదిగ్గజ కవులు విచ్చేసిరి.
శ్రీకృష్ణదేవరాయలు:-
అష్టదిగ్గజ కవులకు పేరుపేరు వరుసన శుభాభివందనములు.
మంత్రి,సామంత,పురోహిత,దండనాయకులకు సాదరాభివందనములు.
"-దేశభాషలందు తెలుగు లెస్స!
"-ఇంపు సొంపులు గుబాళించు తెనుగు నుడికారములు శ్రవణానంద కరములు.
కాయకష్టములకోర్చి,రేయనక పగలనక శ్రమించు కష్టజీవులు,లోకమునకు
తిండిని చేకూర్చు రైతన్నలు దేశమునకు వెన్నెముక వంటివారు.అట్టివారు
మథు పాన మత్తులై,తృటిలో!ప్రాణాలు గోల్పోవుచున్నారు.హృదయ విదారక
మైన ,ఈవిషయమునకు స్పందించి!నేడే శాసించుచున్నాను.
కం:-కాటుక కన్నులు పాడరి
కూటికి!లోటేర్పడంగ!కుంకుమ తుడిచే!
చేటగు సారా మానుడి!
సూటిగ జీవింప వలెను!శుభములు గల్గున్!
అనుచు,
" పెద్దనార్యా! "-మథువును గొనువారె!జగతి మంగళ కారుల్!"-
ఈసమస్యను తమయల్లిక జిగిబిగితో!పూరింపుడు!
కం:-మృదు వచనామృత జలధి!
మథువన"నమృత మది!సురలు మరి మరిగొని!, యా
పదలందక యుండిరి!యా
మథువును గొను వారె!జగతి మంగళ కారుల్!
అమృతమును దేవతలుత్రాగెదరు.మానవుల కది లభ్యము కాదు.వీరుత్రాగే
మథువు(సారా),ప్రాణములు తీయును.అందుకే మానాలి.
కృష్ణదేవరాయలు"-పెద్దనార్యా!మథువనబడు నమృతమునుత్రాగుటకు
దేవతలేయోగ్యులని,ఆ!యమృతము వారికి మరణములేకుండ చేయునని,
వారే!లోకములకు మేలుజేయు దేవతలని చక్కగ వివరించిరి.
నిగూఢార్ధముగా!దేవతలుకాని,వారగు మానవులు మధువనునామాంతరము
గల సారాను త్రాగిన చని పోవుదు రని చెప్పక చెప్పిరి, బహు పసందుగా నున్నది.
కృష్ణరాయలు"-తిమ్మనార్యు వైపు తిరిగి!"ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు
లంటారు కదా!"
ఇదే సమస్యను ముద్దు లొలికే పలుకులతో పూరింపుడు.
కం:-మదిరాక్షి!వలపు చిలుకగ!
మృదు శయ్యను జేరి వరుని మథురాధర',శో
భ!దురీను లగుచు!మత్తిలి!
మథువును గొనువారె?జగతి మంగళ కారుల్!
కృష్ణదేవరాయలు"భేషు!భేషు! తిమ్మనార్యా! మథువును మథురాధర
మథువుగా మార్చి చక్కగా!పూరించిన మీపూరణము బహుపసందు.
కృష్ణదేవరాయలు"-జనాభా!విపరీతముగా!పెరిగి పోవుచున్నది.వారికి
తిండిగింజలు దొరుకుట కష్టముగా నున్నది.అందుకని కోటాబియ్యం
ప్రజలకిచ్చే పధకాన్ని ప్రవేశ పెట్టాం!ఎలా!ఉంటుంది!మల్లనార్యా!
వివరింపుడు.
కం:-నోటులు లోటైనా సరె!
ఓటుల కిక లోటు రాదు!ఓటమి దవ్వౌ!
నీటుగ మనదే!రాజ్యము!
పాటు పడంగవలె?దేశ ప్రగతికి మీరే!
కృష్ణదేవరాయలు:-ధూర్జటి పల్కుల కేల?గల్గు!నీయతులిత మాథురీ మహిమ"యంటారు.ధూర్జటి కవివరేణ్యా!దానిని మీరెట్లా పూరిస్తారు,
కం:-కోటా తూటాలను గొని
పోటీపడి రాజ్యమేలు పూజ్యుల కిలలో?
కోటలు బీటులు వారిన
కోటుల కిక లోటురాదు!కువలయ నాధా!
శ్రీకృష్ణదేవరాయలు:"
కం:-భద్రం బెయ్యదొ?జెప్పుమ!
నిద్రాళురు కన్ను తెరచి!నేరిమి మీరన్!
సద్రాజ్య!సుఖములందగ!
భద్రకవీ!పలుక వయ్య! భవితవ్యంబున్!
రామభద్రకవి.
కం:-సమ సామ్రాజ్యమునెలకొన
సమతను పాటించి దేశ సంస్కృతి పెంపున్?
తమకపు సిరి పెంపు మరచి!
గమియించిన భద్రరాజ్య !గరిమము పెరుగున్?
భద్ర రాజ్యము గురించి రామభద్రకవీ!భద్రంగా నుపదేశించిరి?బాగు బాగు!
కృష్ణరాయలు"-రామకృష్ణకవీ!వికట కవితా దురీణా!జనాభా నియంత్రణ
మమలు చేయించినా!జనాభా తగ్గుట లేదు.దీనికి మీసందేశ మేమిటి?
కం:-శయ్యాటము పెను పెచ్చగ!
కుయ్యో!మొర్రో!యనియెడు కూనల కనగా!
నుయ్యో!గొయ్యో గాకను!
అయ్యో! జన మెట్లు?తగ్గు!నవనీ నాధా!
శ్రీకృష్ణదేవరాయలు"-భట్టుమూర్తి కవీ!దేశ ప్రగతికి మీ సందేశ మేమిటి?
తే.గీ:-శాస్త్ర విజ్ఞాన సంపత్తి!చక్కబరచి!
జీవయాత్రను సరిజేసి !జీవితముల!
శాంతి సౌభాగ్య శోభిత!జగము వెలుగ!
తీర్చ గావలె! శ్రీకృష్ణ దేవ రాయ!
:శ్రీకృష్ష్ణరాయలు":'అక్షరాస్యత '-విషయంలోచాల ధనము వెచ్చించి
ప్రయత్ని స్తున్నాము.దానివలన ప్రయోజనము చేకూరు తుందని,
మా ప్రగాఢ విశ్వాసము.దీని విషయములో మీసందేశ మేమిటి.!
కం:-చదువను దీపము!జనులకు!
సదమలమగు భవితకెంతొ?సాయము కాగన్!
చదువులు నేర్చిన వారలు!
పదిలపు సుఖ జీవితాన వర లెద రిలలోన్!
రాయలు"జ్ఞాన జ్యోతి భావి గమనమునకు దారి చూపు ననియు,సుఖ
జీవన మందించుననియు,బాగుగా వచించిరి.సంతోషము.
శ్రీకృష్ణదేవ రాయలు:-"స్త్రీ విద్యను మేము ప్రోత్సహించున్నన్నాము.
మంచి దంటారా!
కం:-వనితలు చదివిన చాలును!
ఘనతను సాధింప గలరు!కలియుగ మందున్!
ఘన భవితకు సారధులై
మనుజుల సరి!పాటు పడుచు!మనెదరు భువినిన్!
***ఆధునిక భువనవిజయమును బహు పసందుగా నడిపిన
అష్ట దిగ్గజ కవివరేణ్యులకు! వారి సాహితీ దురీణతకు సర్వదా!
కృతజ్ఞుడను.
"నేటి భువనవిజయమునకు ముగింపుగా________
కం:'రవి గన నేరని తావులు!
కవులే!!యెరుగం గలారు!కాదన వశమే?
కవితా సుమ సోయగ సతి
భవితకు తగు నీతి నొసగి!వరలగ వలెగా?
*************
స్వస్తి
మూర్తి. జుత్తాడ.
జైహింద్.
3 comments:
నమస్కారములు
పిల్లకు ఆశక్తి కరముగా సులభ శైలిలో చక్కగా ఉంది. బాగుంది
క్షమించాలి " పిల్లలకు "
అలాగే, “ఆశక్తి” బదులు “ఆసక్తి” అని ఉండాలనుకుంటాను రాజేశ్వరి గారూ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.