గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, నవంబర్ 2018, గురువారం

ఆంధ్రనామశేషము - 4

జైశ్రీరామ్.
ఆంధ్రనామశేషము - 4 - అడిదము సూరకవి (చివరిభాగం)
సీ. బిట్టు గ ట్టనఁ బెల్లు పెద్దయుఁ దద్దయు, నురవడి పరువడి యుద్దవిడియుఁ
బనివడి పదపడి బలివిడి తలకొని, నెట్టన యెంతేని నెఱి గరంబు
లలి వార కేడ్తెఱ పెలుచ వావిరి యన, నఱిముఱి యనఁ బొరిఁ బొరి యనంగ
గడుఁజాల మిగిలంగ గాటం బనంగ న, త్యంతముగ ననుట కాఖ్య లయ్యె

తే. నుడుకు సెక వెట్ట వేఁడిమి యుబ్బ యావి
యుక్క యన నొప్పు నామంబు లుష్ణమునకుఁ
దాల్మి యోరిమి సైరణ తాళుకొంట
సైఁచు టోర్చుట యనఁగను క్షాంతి పేళ్లు                (57)

టీ. బిట్టు, గట్టి, పెల్లు, పెద్దయు, తద్దయు, ఉరవడి, పరువడి, ఉద్దవిడి పా. ఉద్దపడి, పనివడి పదపడి బలివిడి, తలకొని, నెట్టన, ఎంతేని, నెఱి, కరము, లలి వారక, ఏడ్తెఱ, పెలుచ, వావిరి, అఱిముఱి, పొరిపొరి, కడు, చాల, మిగుల, గాటము - ఈ పదిహేడును అత్యంతమనుటకు పేర్లు. ఉడుకు, సెక, వెట్ట, వేడిమి, ఉబ్బ, అవి, ఉక్క - ఈఏడును ఉష్ణమునకు నామములు. తాల్మి 9రూ. తాలిమి), ఓరిమి, సైరణ, తాళుకొంట, సైచుట, ఓర్చుట - ఈ ఆరును క్షాంతికి పేర్లు.

తే. పెద్దనిద్దురఁ జెండించెఁ బిలుకుమార్చె
గీటణంచెను గుదెతాల్పు వీటి కనిచెఁ
గూలిచెను రూపుమాపెను నేలఁగలిపె
ననఁగ హతిచేసె ననుట కాఖ్యలు దనర్చు               (58)

టీ. పెద్దనిద్దుర చెందించె, పిలుకుమార్చె, గీటణంచె, గుదెతాల్పు వీటికనిచె = యమపురికి పంపెను, కూలిచె, రూపుమాపె, నేలగలిపె - ఈ ఏడును చంపె ననుటకు పేర్లు.

క. పరిచేర్ణ మయ్యె ననుటకు
వరుసన్ నామంబు లగుచు వర్తిలుచుండున్
దుఱుమయ్యెన్ బరుమయ్యెన్
నుఱుమయ్యెన్ బిండియయ్యె నుగ్గయ్యె ననన్                  (59)

టీ. తుఱుమయ్యె, పరుమయ్యె, నుఱుమయ్యె, పిండియయ్యె, నుగ్గయ్యె - ఈ అయిదును చూర్ణమయ్యె ననుటకు పేర్లు.

క. కునుకె నిదురించెఁ గూర్కెను
గనుమోడ్చె ననంగ నిద్రగనుటకు బేళ్ళౌ
గనువిచ్చె ననఁగ మేల్కొనె
ననఁగఁ బ్రభోధంబు నొందె ననుటకుఁ బేళ్ళౌ         (60)

టీ. కునికె, నిదురించె, కూర్కెను, కనుమోడ్చెను - ఈ నాల్గును నిద్రపోయెను అనుటకు పేర్లు. కనివిచ్చె, మేల్కొనె - ఈ రెండును నిద్రలేచె ననుటకు పేర్లు.

క. డులిచె వదలించె నూడ్చెను
దొలగించెన్ బాపె ననఁగ ద్రోచె ననంగ
వెలికొత్తె ననఁగ బేళ్లై
యలరున్ విఘటన మొనర్చె ననుటకు (శర్వా)              (61)

టీ. డులిచె, వదలించె, ఊడ్చె, తొలగించె, పాపె, త్రోచె, వెలికొత్తె _ ఈ ఏడును విఘటన మొనర్చె ననుటకు పేర్లు.

క. పొలయలుక యనఁగ నెయ్యపు
టలుక యనం బ్రణయకలహ మలరారుఁ గుచం
బుల కొప్పు నామములు గు
బ్బలనంగాఁ జన్ను లనఁగఁ బాలిండ్లనఁగన్            (62)

టీ. పొలయలుక, నెయ్యపుటలుక (నెయ్యము+అలుక- నెయ్యపు + అలుక-నెయ్యపుటలుక) - ఈ రెండును ప్రణయకలహమునకు నామములు. గుబ్బలు, చన్నులు పాలిండ్లు (పాలు+ఇండ్లు = పాలుండుచోట్లు) - ఈ మూడును కుచములకు నామములు.

తే. చౌటిమున్నీ రనఁగ నుప్పు సంద్రమనఁగ
రాజిలుచు నుండు లవణవారాశి పేళ్లు
కాలు వన బట్టె యనఁగను జా లనంగఁ
గుల్య కభిధాన మై పొల్చుఁ (గుధరనిలయ)          (63)

టీ. చౌటిమున్నీరు, ఉప్పుసముద్రము - ఈ రెండును లవణ సముద్రము పేర్లు. కాలువ, (రూ.కాల్వ) బట్టె, జాలు - ఈ మూడును కుల్యకు నామములు.

తే. పెల్లగించెను బెకలించెఁ బెఱికె ననఁగ
నాఖ్య లుత్పాటన మొనర్చె ననుట కలరు
నాహ్వయంబులు చేదించె ననుట కయ్యెఁ
జించె నన వ్రచ్చె నన వ్రక్కలించె ననఁగ           (64)

టీ. పెల్లగించె, పెకలించె, పెఱికి - ఈ మూడును ఉత్పాటన మొనర్చె ననుటకు పేర్లు. చించె, వ్రచ్చె, వ్రక్కలించె - ఈ మూడును చేదించె ననుటకు నామములు.

తే. కనుమొఱఁగె నేమఱించె నాఁగను నిగూఢ
వర్తన మొనర్చె ననుట కాహ్వయము లడరు
మొయి లన మొగు ళ్లనంగను మొనయు మబ్బు
లన ఘనంబుల కాఖ్యలై (యభ్రకేశ)                 (65)

టీ. కనుమొఱగె, ఏమరించె - ఈ రెండును నిగూఢవర్తనము చేసె ననుటకు పేర్లు. మొయిలు, మొగళ్లు, మబ్బులు - ఈ మూడును మేఘములకు నామములు.

క. పగ ఱనఁగ మార్తు రనఁగను
పగవాం డ్రనఁ బగతు రనఁగఁ బరిపంథికిఁ బే
ళ్లగు మెగ మనంగ మెక మన
మృగమునకు నభిక్య లయ్యె (మేరుశరాసా)                 (66)

టీ. పగఱు, మార్తురు, పగవాండ్రు, పగతురు - ఈ నాలుగును విరోధికి నామములు. మెగము, మెకము - ఈ రెండును మృగమునకు పేర్లు.

తే. ఇంకె నడుగంటె వట్టె నానివిరె ననఁగ
నిర్జలం బయ్యె ననుటకునెగడుఁ బేళ్లు
నిండెఁ గ్రిక్కిఱిస్వ్ ననఁ బూర్ణించె ననుట
కాఖ్యలై తనరారు (సుధాంశుమకుట)                  (67)

టీ. ఇంకె, అడుగంటె, వట్టె, ఇవిరె - ఈ నాలుగును నిర్జలమయ్యె ననుటకు నామములు. నిండె, క్రిక్కిఱిసె - ఈ రెండును పూర్ణించె ననుటకు పేర్లు.

తే. పెచ్చు పెరిగె ననం బురివిచ్చె మోఱె
నన విజృంభించె ననుటకు నాఖ్యలయ్యెఁ
దిండికాఁ డనఁ దిండీఁడు తిండిపోత
నంగ భక్షకునకు దనర్చుఁ బేళ్లు                  (68)

టీ. పెచ్చుపెరిగె, పురివిచ్చె, మీఱె - ఈ మూడును విజృంభించెననుటకు పేర్లు. తిండికాడు, తిండీడు, తిండిపోతు - ఈ మూడును భక్షకునకు పేర్లు.

క. పెనఁగొనె గిఱికొనియెను వల
గొనియెన్ మెలికొనియెఁ జుట్టుకొనె సుడిగొనె నాఁ
గను నులిగొనె నన నాఖ్య ల
గును వలయిత మయ్యె ననుటకును (శితికంఠ)             (69)

టీ. పెనగొనె, గిఱికొనె, వలగొనె, మెలికొనె, చుట్టుకొనె, చుట్టుకొనె, సుడికొనె, నులిగొనె - ఈ ఏడును వలయిత మయ్యె ననుటకు పేర్లు.

సీ. మొగరా లన స్తంభములు చిట్టకము దంభ, మెరగలి వనవహ్ని యొడ్డె మూర్ఖుఁ
డుడుగర యుపహార మూఱట విశ్రాంతి, మొద లని యనఁగను మూల మనుట
తఱు లన తళులు చిందమనంగ శంఖంబు, తఱ టనాంగఁ గశాభుధాన మయ్యె
దమ టనఁ గీల పదం బగు మెట్టన, గాయకులకుఁ బేరు గాణ లనఁగ

తే. మృత్యువునకును బే రయ్యె మిత్తి యనఁగ
మకుటమున కాఖ్య లగు బొమిడిక మనంగ
నోముట యనఁగఁ బోషించు టూడిగంబు
సేవ కభిధానమై యొప్పు (శేషభూష)                  (70)

టీ. మొగరాలు = స్థంభము, చిట్టకము = దంభము, మిష, ఎరవలి -పా.ఎరగలి=కాఱుచిచ్చు, ఎడ్డె = మూర్ఖుడు, ఉడుగర = కానుక, ఊఱట, విడుమర, మొదలు = మూలము, తఱులు = మడతలి, చిందము = శంఖము, తఱటు = జూటి, చబుకు, తమట = నిప్పుమంట, మెట్ట = పాదము, గాణ = గాయకుడు, మిత్తి (ప్ర. మృత్యువు) = చావు, బొమిడికము =  కిరీటము, ఓముట = పోషించుట, ఊడిగము = సేవ.

సీ. ఎట్టకేల కనంగ నెనయును సకృదర్థ, మఖిలం బటంటకు నంతపట్టు
ఏకాకి యొక్కటనేకులు పలువురు, వేనవేల్ పెక్కండ్రు వేరు రనఁగ
నలరు నో చేదర్థ మై9 కానినాఁ డన, నేతాదృశులె యంట కిట్టివారె
మిన్నక యూరకయున్నఁ దూష్టీమర్థ, మనుసరించి యుటంట కగును దొట్టి

తే. యొండొకఁ డనంగ మఱియు వేఱొకఁడు లాఁతి
వాఁడు పెఱవాఁడు దక్కినవాఁడనంగ
నన్యునకు నాఖ్య లగుచుఁ బెంపారుచుండు
(శతఘటితశూల వైయాఘ్రచర్మచేల)                 (71)

టీ. ఎట్టకేలకు = ఒకానొకప్పుడు, అంతపట్టు = అఖిలమును, ఎక్కటి = ఏకాకి, పలువురు, వేనవేలు, పెక్కండ్రు, వేవురు - ఈ నాలుగును అనేకులు. కానినాడు = అటుకాకపోయిన, ఇట్టివారె = ఈలాటివారే యనుట, మిన్నక, ఊరక - ఈ రెండును తూష్ణీమర్థకములు. తొట్టి = అనురించి. ఒండికడు, వేఱొకడు, లాటివాడు, వెఱవాడు, తక్కునవాడు - ఈ అయిదును అన్యునకు పేర్లు.

నానార్థములు

క. వడి యనఁగాఁ గాలం బగు
వడి యన వేగంబునకు వర్తిలు బేరై
మడి యనఁ గేదారం బగు
మాడి యనఁగా శుద్ధికిని సమాహ్వాయ మయ్యెన్            (72)

టీ. 1. వడి = కాలము, వేగము. 2. మడి = వరిచేను, శుద్ధి

క. ఈ డనఁగ వయసుపే రగు
నీ డన సామ్యంబునకును వెసఁగును బేరై
నా డన రాజ్యము పేరగు
నాఁ డనఁ దత్కాలమం దనఁగఁ బెంపారున్            (73)

టీ. 1. ఈడు = వయస్సు, సాటి. 2. నాడు = దేశము, అప్పుడు (రెండవ అర్థమున "నాఁడు" అని యరసున్న గలదు)

క. మొన యన సైన్యముపే రగు
మొన యనఁగా నగ్రభాగమునకును బే రౌ
దొన యనఁ దూణీరం బగు
దొన యన నవసానమునకుఁ దొడరును బేరై             (74)

1. మొన = సైన్యము, ముందుభాగము. 2. దొన = అమ్ములపొది, కొన.

క. వె న్ననఁగ బీజమంజరి
వె న్ననఁ జరమాంగమునకు వెలయును బేరై
కన్ను లనం బర్వంబులు
కన్ను లనన్ లోచనములు (కంఠేకాలా)                  (75)

టీ. 1. వెన్ను = కంకి, వీపు. 2. కన్ను = గణుపు, నేత్రము.

క. తమ్మి యనఁ దరువిశేషము
తమ్మి యనం బంకజాభిధానం బయ్యెన్
నెమ్మి యనఁ బ్రియముపేరగు
నెమ్మి యన మయూరమునకు నెగడుం బేరై              (76)

టీ. 1. తమ్మి = వృషవిశేషము, తామర. 2. నెమ్మి = సుఖము, నెమలి.

క. దండ యనన్ సాన్నిధ్యము
దం డన సుమమాలికాభిధానం బయ్యెన్
మం దనఁ బ్రకోష్ఠ మయ్యెన్
మం డన మృత్పాత్రకును సమాహ్వయ మయ్యెన్             (77)

టీ. దండ = చేరువ, పూలదండ. 2. మండ = ప్రకోష్ఠము, మంటికుండ.

క. తెలుఁగుం గబ్బపుమర్మము
తెలుఁగుకవీంద్రులకుఁ దేటతెల్లము గాఁగన్
దెలియఁగ నడిదము సూరయ
చెలువారఁగ నాంధ్రనామశేషముఁ జెప్పెన్            (78)

సటీకాంధ్రనామశేషము
సంపూర్ణము
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సూర కవి గారికి ప్రణామములు
మాకందించిన సోదరులు శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.