జైశ్రీరామ్.
నేను రచించిన శ్రీమన్నారాయణశతకముపై తమ అమూల్యమైన అభిప్రాయమును పంపియున్నారు.
వారికి ధన్యవాదములు తెలుపుతూ
ఇక్కడ అందరికీ పఠన యోగ్యంగా ఉంచుచుంటిని.
జైశ్రీమన్నారాయణ.
ఇక పఠింపఁగలరు.
మధుపర్కం
రసిక లోక పూజ్యులు , సాహితీ బంధువులకు మాన్యులు శ్రీ చింతా రామ కృష రావు కవి గారు ఆ నారాయణుఁని సంబోధిస్తూ " శ్రీ మన్నారాయణ శతకం" వ్రాశారు . శతకమంతా శార్దూలాలే . చాలా రాజసం గా తిరుగుతూఉంటయ్యి సాహితీ "చింతా "వనం లో .
" శ్రీ మన్నారాయణ" అనేది సంస్కృతం లో సంబోధనా ప్రథమా విభక్తి . అంటే భక్తుడు నారాయణుని దర్శించుకుని సమక్షంలో చూస్తూ పిలవటం ...... . దేముడిని అంత దగ్గరగా చూడటంసాధ్యమా !
ఎందుకు కాదు . "అంతర్బ హి శ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః " అని ఒక పక్కన ఋషులు వారి అపరోక్షాను భూతిని చెబుతుంటే.... లోపల హృదయానికి చాలా దగ్గరగా పిలిస్తే పలికేంత దూరం లోనే ఉన్నాడు నారాయణుడు . అందుకే రామకృష్ణ రావు గారు అంతర్ముఖులై ఈ శతకం వ్రాశా రు.
అదే ఈ శ్రీ మన్నారాయణ అనే సంబోధన .
ఇక ఛందస్సు మాటకొస్తే .. పరిపక్వమైన అంతరంగాలకి ...... ఎందుకో తెలియదు ... శార్దూలం స్పురిస్తుందా అనిపిస్తుంది.ప్రాచీన ఋషుల దగ్గరనుంచి ఎలకూచి బాల సరస్వతి దాకా ..
సంధ్యా వందనం లో"ముక్తావిద్రుమ హేమనీల ధవలై ..". నుంచి
కాళి దాసు శ్లోక చతుష్టయం
" యాస్యత్యద్య శకుంతలేతి .హృదయం ..." మీదుగా
ఎలకూచి బాలసరస్వతి {అజంత పరిచ్చేదంలొ
" కర్ణాంతాయత చారునేత్ర కమలా !కర్పూర చూర్ణ త్రిపా
ద్వర్ణ శ్రీ కర మంత్ర రూపిత విభాస్వద్రూప !చిద్రూప!సౌ
వర్ణోదంచిత మంచబిందుమయ దీవ్యద్దివ్య సింహాసనాం
తర్ని ష్పం ద విహార !హార కలికోద్యత్కాంచికా భూషణా
ఇక రామకృష్ణ రావు గారి పద్యాలూ చూస్తే
మొదటి పాదంలో పరిస్థితి వర్ణన/తీర్మానం ,రెండోపాదం లో కష్టం లేక అనుమానం .. మూడో పాదంలో దాని పుష్టి లేక పరాకాష్ఠ నాలుగో పాదంలో సమస్యా మోక్షణం ... అటు ఇటుగా ఈ విషయం గా సాగుతుంది రావు గారి శతకం . ఇంకా ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు . దీనికి కారణం ఆ ఛందస్సు గంభీర భావానికి బాగా సరిపోవటమా లేక శార్దూలం పేరులో ఉన్న గాంభీర్యమా... ఏమో ... మనమెంతటి వా రం తేల్చటానికి.
ఇక కావ్య గానం ...
ఈ మాట ఎవరు మొదలుపెట్టారో గాని ప్రాచీన కాలం నుంచి మన కవులకు ఉన్న మంచి/చెడ్డ పేరు ఇది. ద్రావిడ కవులు వచనం కూడా పాట గా చదువుతారని రాజశేఖరుడు చెబుతాడు.
గద్యే ప ద్యే అథవా మిశ్రే కావ్యే కావ్య మనా అపి
గేయే గర్భే స్థితః పాఠే సర్వో అపి ద్రావి డః కవిః
ద్రావిడ దేశీయుడగు కవి ప్రతి యొక్కడును కావ్య జ్ఞాన వంతుడై గద్య కావ్యమైనను పద్య కావ్యమైనను చంపు కావ్యమైనను సంగీత గర్భముగా పఠించును . (సప్తమోధ్యాయము కావ్య మీమాంస )
శార్దూలం ఛందస్సు అందుకో గానే పాడాలని అనిపిస్తుందేమో
ఇక పురాణ వాచస్పతి శ్రీ బంకుపల్లె మల్లయ్య సాస్ట్రీ గారైతే సామవేద దండాన్వయ ఉపోద్ఘాతం లో "గానమునాకింత ప్రాధాన్యము ఇవ్వవలెనా అంటే.. ఇవ్వవలెను ,.తపస్సు వలన గాని సమాధి వలన గాని గానము చేత క లిగిన భావోద్రేకము కలుగదు. భావోద్రేకమే భగవంతుని కనుంగొనుటకు సాధనము. "
వారే ఇంకొక చోట " సమస్త వేదమంత్రములును గాన రూపమున సంధానమొనర్చ వీలగునేమో ముందు రానున్న మహర్షులు యోజించ వచ్చును .. " అన్నారు.
అందుకేనేమో ..ఈ పద్యాలూ విన్న గాయకులు (నాతో సహా) మేమంటే మేము అని ముందుకు వచ్చి పద్యాలు పాడుకోవటం మొదలయింది.
శతక గానమంతా భావోద్రేకం తో భగవంతుని కనుక్కునే ప్రయత్నమే కదా. కాలం దృష్ట్యా అధునాతనం కావచ్చు. కానీ భగవంతుడు నిత్య సత్యమే కదా .
పద్యాలకీ మంత్రాలకీ పెద్ద తేడాలేదు.
పురాతన పద్యాలే మంత్రాలు
అధునాతన పద్యాలుకూడమంత్రాలే.అంటే అధునాతన మంత్రాలు
రెండు ఛందస్సు రూపం లో వచ్చినవే .
వేదానికి ఛందస్సు అనేపేరుంది.
ఇక పద్య శిల్పానికొస్తే ..
మన్నారాయణ శబ్దమే శార్దూలాన్ని దూరాహ్వానం చేసింది. ద్విత్వ "న" కార ప్రాస . ద్విత్వ "న" కార ప్రాస దుష్కర ప్రాస కాదు కానీ క్లిష్టానికి అక్లిష్టానికి మధ్యలో ఎక్కడో ఉంటుంది. కనుక నిఘంటువు లో ఉన్న ద్విత్వ న కార "మ"గణా లన్నీ బొట్టుపెట్టించుకుని పిలిపించుకుని మరీ వస్తయ్ . ఇక్క డే కవి జాగ్రత్త పడ్డారు . ఏ మాత్రం కృత్రిమత్వం లేకుండా , ధారా శుద్ధి లోపించకుండా .. తర్కం చెడకుండా , సహజం గా వాలిన తీగ యొక్క సౌందరాన్ని చూపించారు. దీనికి వారిని అభినందించాలి .
ఇక పేరుకి శ తకమైనా 108 పద్యాలుంటయ్యి .ఇది సంప్రదాయం. ఆలయాల్లో పూజ గాని , బహుసంఖ్యాక లింగ ప్రతిష్ఠ లు గాని.
మన వైదికం లో 108 కి ప్రత్యేక స్థానం ఉంది.
దాని అసలు అర్థం ఇప్పుడు చెప్పుకోకపోతే అసలు చెప్పుకునే అవకాశమే రాదు.
వేదకాలంలో త్రేతా యుగం లో..... పది సంఖ్యకే చాల గొప్ప ఉండి ఉంటుంది.
అందుకే యజ్ఞాలు ఎక్కువ చేశా డు అని చెప్పటానికి "దశరథుడు " అన్నారు . యజ్ఞాన్ని వేదం రథం తో పోలుస్తుంది. ఎందుకంటే యజమానిని స్వర్గానికి తీసుకెళ్లే ప్రయాణ సదనం కనుక .
ఇక ద్వాపర యుగానికి నగరాలూ ప్రజలు సంఖ్య పెరిగినట్టుంది. 100 ఎక్కవ సంఖ్య గా చెప్పటం మొదలైంది. అందుకే కౌరవులు 100 మంది అని రాశా డు. వ్యాసుడు. బహుశ ఎక్కువ అని చెప్పటానికి 100 అని చెప్పటం మొదలు పెట్టరేమో .
ఆ విధం గానే "శత మనంతం భవతి " అనే ఆశీర్వచన మంత్రం వచ్చి ఉంటుంది.
రోజూ యజమాని అగ్నహోత్రం చేయాలి . అది ఉదయం సాయంత్రం . అంటే రోజుకి రెండు సార్లు. ఏదైనా కారణం తో అగ్నిహోత్రం చేయటం మానేస్తే 4 రోజుల తరువాత ఆ అగ్ని లౌకికాగ్ని అయిపోతుంది. దాహపాకా లకు మాత్రమే పనికొస్తుంది అంటే ......మంటే.... అవుతుంది. అగ్నిభగవానుడు కాదు. మొత్తం నాలుగు రోజులలో 8 సార్లు అవుతుంది.
అట్లా మానేసినప్పుడు అగ్నిని 100 తో పాటు ప్రాయశ్చిత్త సంఖ్యా అయిన 8 తో గూడా చేయాలి . అందుకని అగ్నికి 108 సంఖ్యా అంత ప్రాధాన్యమయింది.కనుక శతం అన్న చోటల్లా నూట ఎనిమిది అని మనం అను వదించు కోవాలి . కనుక మన వైదిక మతం లో 108 కి ఆ విధం గా ప్రాధాన్యం వచ్చింది . గుడికి వెళ్లే వారు సామాన్యంగా అగ్ని ఉపాసన చేసే వారుండరు. అందుకని దేముడిని శత నామాలతో పూజించవారు అష్టోత్తర శతం చేయిస్థారు
కవిత్వం కూడా ఒక రకం గా అగ్ని ఉపాసనా కదా . దేముడు కూడా అగ్ని ఏ కదా .
:'అహం వై శ్వానరో భూత్వా పచామ్యన్నాం చతుర్విధం" అని విష్ణువే చెప్పాడు.అందుకే దేముడికి సంబంధించినది ఏదైనా 108 సార్లు చేస్తారు. గాయత్రీ జపం తో సహా.
చింత రామకృష్ణ రావు గారు చేసిన శతకం ఉభయ తారకం .. అంటేఆయనకు లోకానికి ఇద్దరికీ ఉపయోగం .
పరోపకారాన్ని మించిన పుణ్యం ఏ తీర్థము ఇవ్వదని కాశీఖండం లో వ్యాసుడు చెప్పాడు కదా
మధుపర్కం అంటే వరపూజలో అల్లుడికి ఇచ్చే పెరుగు తేనె కలిపిన పానీయం ..
ఇట్లు.
అందుకూరి శాస్త్రి.
బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రిగారికి
నా హృదయపూర్వక ధన్యవాదములు.
జైహింద్
8 comments:
పూర్ణయ్య శాస్త్రి గారి సమీక్ష బాగుంది.మరిన్ని పద్యాల్లో వారికి కనిపించిన విషయాలను విశ్లేషిస్తే బాగుండుననిపించింది.మన్నారాయణ అనడంలో కవి యొక్క భక్తి తత్పరత నాకు కనిపించింది.పూర్ణయ్య శాస్త్రి గారికభినందనలు మీద్వారా వారికి.
ఆర్యా. సోమార్కా. ధన్యవాదములండి.
బ్రహ్మశ్రీ సోమర్కమహోదయుల మధుపర్కం శీర్షికలోని అనుశీలనంతో మాఅగ్రజులశతకం చక్కగా అలంకృతమైంది.
సమీక్షకులకు అభివందనములు.
డా.యల్లెస్స్వైవీశర్మ సహోదరులకు ధన్యవాదములు.
నమస్కారములు
బ్రమ్మశ్రీ అందుకూరి చిన పున్నయ్య శాస్త్రిగారి సమీక్ష అద్భుతముగా నున్నది.
అమ్మవారి వాహనమైన శార్దూల వృత్తములో శ్రీ చింతా సోదరుల శ్రీమన్నారాయణ శతకము మనోరంజకముగా అలరించినది.
ఇక 108 కి గల ప్రత్యేకతను , మధుపర్కమును గురించిన విశ్లేషణను తెలియ జెప్పిన గురువులు శ్రీ శాస్త్రి గారికి పాదాభి వందనములు . శ్రీ చింతా సోదరులను దీవించి అక్క .
బాగుందండీ ఇంతకీ ఈ పుస్తకం ఎక్కడ లభ్యము ?
జిలేబి
అక్కయ్యా. మీ అభిమానపూర్వక ఆశీస్సూలకు నా ప్రణామములమ్మా.
సహృదయ జలేబీ గారూ. నమస్తే. మీ వాట్సేప్ ఉంటే , లేదా ఇమెయిల్ ఐడీ ఉంటే తెలిజేస్తే ఆ పుస్తకము పీడీయఫ్ పంపగలనండి.
ఆంధ్రామృతం బ్లాగులోనే 20 - 04 - 2018 నుండి 09 - 05 - 2018 వరకు ఇరవై భాగాలుగా ప్రచురితమయిందండి.
నమస్తే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.