గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, మే 2018, శనివారం

శ్రీమన్నారాయణ శతకము. 16/20వ భాగము. 76 నుండి 80 రచన చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
76. శా. వెన్నన్ బోలిన మానసుండవనుచున్ వేమారు నిన్గొల్త్రు కా
వన్నిన్ వేడుచు భక్తపాళి. కనవో ? వారిన్ గృపన్ జూడవో ?
నిన్నేనమ్మిన భక్తులన్ నిలుపుమా. నిర్భాగ్యులన్ గాచు శ్రీ
మన్నారాయణ ! నమ్మకంబు కలుగన్.  మా మాట మన్నింపుమా.
భావము.  నిర్భాగ్యులను కాపాడెడి స్వభావమున్న ఓశ్రీమన్నారాయణా! వ్నవనీత సుకుమా హృదయుడవని భక్తులు తమను కాపాడమని , నిన్ను సేవించి అనేక పర్యాయములు నిన్ను వేడుకొందురు. అది నీవు గమనింపవా ? వారిని కృపతో చూడవా నిన్ను మాత్రమే నమ్ముకొనిన భక్తులను నిలుపుము.నీపై మాకు నమ్మకము. కలుగునట్లు చేయుటకు మామాట మన్నింపుము.

77. శా. కన్నా ! కన్నులు కల్గినట్టి ఘనులే గర్వాంధతన్ వర్తిలన్
కన్నుల్లేని కబోదిగా పుడమిపై గాంచున్ గదా జన్మమున్.
ఎన్నంజాలరదేలనో? వలచు దుష్కృత్యంపు దుర్వృత్తి. శ్రీ
మన్నారాయణ! మార్పుకొల్పుమనఘా ! మౌఢ్యంబు పోకార్పుమా.
భావము.  ఓ కన్నయ్యా ! కన్నులు కల్గిన మహనీయులే గర్వాంధ ప్రవృత్తులైనచో భూమిపై కన్నులు లేని కబోదిగా జన్మింతురు కదా. ఈ విషయమును వారు ఎందుచేతనోగుర్తింపరు. చెడు వర్తనతో కూడిన ప్రవృత్తినే ఈష్టపడుదురు.  పాపరహితుడవైన ఓ శ్రీమన్నారాయణా ! అట్టివారీలోని మౌఢ్యమును నశింప జేయుము. వారిలో
మార్పును తీసుకురమ్ము.

            శ్రీ చక్రాల రాజారావు కవివరులు విధముగా తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసియున్నారు.
                చింతావారిమనోభిరామమగుసచ్చిద్బావమందాకినీ  
                ప్రాంతోద్యానవనాంతసీమ రమణీయాకారపుంస్కోకిలా
                స్వాంతోద్భూతమనోజ్ఞగీతగతపద్యమ్మున్స్వరైకావిధిన్   
                సంతోషాత్మఁబఠించితిన్ముకుళితస్వాంతాన వందించితిన్

78. శా. నిన్నున్ గూర్చిన భక్తి సంయుత కథల్ నేర్పున్ ప్రబోధించు శ్రీ
మన్నారాయణ మానవుండవయి నీ మాహాత్మ్యముల్ నీవె మా
కున్నిత్యమ్ము వివేకమున్ దెలుపు వైకుంఠా! చిదానంద ! శ్రీ
మన్నారాయణ! భక్తపక్ష! శుభముల్ మాకబ్బు నీ సత్కృపన్.  
భావము. వైకుంఠా! చిదానందరూపా !  శ్రీమన్నారాయణా !  నీకు సంబంధించిన భక్తి కథలను నేర్పుతో ప్రబోధించు శ్రీమన్నారాయణ మానవుడవయి, నీ కథలను నీవే నిత్యము మాకు వివేకముతో తెలుపుచుంటివా. భక్తుల పక్షము వహించువాడా !   నీ వలననే మాకు పుణ్యము లభించుచున్నది.

79. శా. కన్నా ! నీవె యనంతకృష్ణుడవు సత్ కామ్యార్థముల్ తీర్చ మీ
కున్నానంచును నన్ను చేరుదువు దీనోద్ధారకా నీవె న
న్నన్నాయంచును. నాదు భాగ్యఫలమై. యాత్మన్ ప్రదీపించు శ్రీ
మన్నారాయణ! తమ్ముడా యనుచు నిన్ మర్యాదతో పిల్వగన్. .
భావము.  ఓ కన్నా ! ఆత్మలో ప్రకాశించు శ్రీమన్నారాయణా ! నీవు అనంతకృష్ణుడవే. ఓ దీనౌద్ధారకా ! నేను నిన్నుతమ్ముడా యని మర్యాదతో పిలుచుకొను విధముగామంచి కామితార్థములను తీర్చుట కొఱకు మీకు నేనున్నానని నాభాగ్య ఫలమై అన్నాయని పిలుచుచు నన్ను  చేరుదువు కదా.

               శ్రీ చక్రాల రాజారావు కవివరులు విధముగా తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసియున్నారు.
                    హృద్యభావార్థసంబద్ధపద్యమిద్ది   
                భక్తితాత్పర్యసంయుక్తపద్యమిద్ది
                    పద్మనేత్రకృపాపాత్రపద్యమిద్ది   
                భవమునందంగదిక్సూచిపద్యమిద్ది


80. శా. నిన్నే గాంతును సోమయాజులయెడన్, నీవే సదా చూచుచున్,
నన్నున్ దోష విహీన సద్వరుగ  గానం జేయ యత్నింతువే.
నిన్నున్ నమ్మిన దోషమెట్లు కలుగున్ నీవే సదా రక్ష. శ్రీ
మన్నారాయణ! పాపతాప హరణా! మామ్ పాహి సర్వేశ్వరా.
భావము.  ఓ శ్రీమన్నారాయణా! యాజ్ఞికులగు సోమయాజులలో నిన్నే చూతును. నీవే యెల్లప్పుడూ నా రచనలను  చూచుచు నన్ను దోషమేమాత్రము లేని మంచివారిలో శ్రేష్టునిగా చూపు యత్నము చేయుదువు కదా. నిన్నేనమ్ముకొనిననాడు దోషమేవిధముగా కలుగును? ఎల్లప్పుడూ నీవే మాకు రక్ష. పాపతాపమును హరించు సర్వేశ్వరా! నన్ను కాపాడుము.
జైహింద్

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.