జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
91. శా. నిన్నున్ గన్నదదెవ్వరయ్య? కలగా సృష్టించి యీ లోకమున్
మన్నుం జేసెడి
నిన్నదేల కనిరో? మా ముందు వారున్నచో
మున్నే
కారణముగ్గడింపుడనుచున్ మోమాటమున్ వీడి శ్రీ
మన్నారాయణ! ప్రశ్న
వేతుము. మమున్ మన్నించు మీప్రశ్నకున్.
భావము.
ఓ
శ్రీమన్నారాయణా! నిన్ను గన్నట్టి ఆ తల్లిదండ్రులెవరు? ఈ లోకమును కలగా కల్పించి మన్నులో కలిపివేయుచున్న
నిన్నువారు ఎందు నిమిత్తము కనియుండిరో? వారే
ఇప్పుడు మా ముందున్నట్లైతే ముందుగా నిన్ను ఎందుకు కనిరో తెలియ జేయుడని నిర్మొహమాటముగా ప్రశ్నించుదుము.
ఈ విధముగా ప్రశ్నించుచున్నందుకు నీవు
మమ్ములను మన్నించుము.
92. శా. వెన్నే చాలదు నిన్ను బోల మదిలో
విశ్వాస మొప్పారినన్.
మిన్నున్ దాకెడి
కొండ చాలదు సుధీ పూర్ణాత్మ కాఠిన్యతన్.
నన్నున్
వెన్నమనంబుతోఁ గనుమయా ! నాలోన నీవుండి. శ్రీ
మన్నారాయణ! దన్ను నీవె కద. ప్రేమంజూడుమెల్లప్పుడున్.
భావము.
ఓశ్రీమన్నారాయణా!
నీకు మాపై విశ్వాసమొప్పారినచో మాపై చూపెడి నీమనసులో గలసుకుమారతకు వెన్నయైనను
సరిపోలదు. ఓ సుధీపూర్ణుడా. కఠినత్వమే కలుగునెడల ఆకాశమునంటెడి కొండైనను సరిపోలనేరదు. నాలో నీవుండి నన్ను నీ వెన్నవంటి మనసుతో కనుము. మాకు ఆధారము నీవేకదా.
ఎల్లప్పడూ ప్రేమతో చూడుము.
93. శా. ఛిన్నంబేలనొనర్తు వీ
బ్రతుకులన్? చిత్రంబుగానుండె.
నీ
విన్నాణంబున సృష్టి
చేసితివిగా. విశ్వంబె నీ స్వంతమై
యున్నం గాని మమున్ కలంచ సుఖమై యొప్పారునా నీకు ? శ్రీ
మన్నారాయణ!
సౌఖ్యదుండవగుమా. మమ్మున్ భువిన్ నిల్పుమా.
భావము.
ఓశ్రీమన్నారాయణా!
ఈ మా బ్రతుకులను విచ్ఛిన్నము చేసెదవేమి? ఇది విచిత్రముగానున్నది. నీ విజ్ఞానముతోనీ
సృష్టి చేసితివి. ఈ సృష్టి మొత్తమే నీ
స్వంతమై యున్నప్పటికీ మమ్ములను కలతలపాలు చేసీననే నీకు సుఖముగానుండి నీకు ఒప్పునాయేమి? నీవు సౌఖ్యప్రదుడవగుము.మమ్ము భూమిపై
మమ్ములను సుఖముగా
ఉండునట్లు చేయుము.
94. శా. ఎన్నన్ నీకును నాకు చాల మరుపే. హే
దేవ! నా తప్పు లె
న్నున్నన్ నీకవి
గుర్తు రావు. కృపనన్నుత్తేజితుంజేయ నీ
వెన్నో చేతు వవన్ని నేను మరతున్. దృష్టంబిదేనయ్య.
శ్రీ
మన్నారాయణ! నీ కృపే
వరముగా మా బోంట్లకున్ దేవరా.
భావము.
హే
దేవా! శ్రీ మన్నారాయణా! గణించి చూచినచో నీకూ నాకూ మరుపే సుమా. నా వల్ల ఎన్ని తప్పులున్నను నీకు అవేవియు
గుర్తుకు రావు. అటులనే నాలో
నిత్యమూ చైతన్యమును కొలుపుచూ నాకొఱకై నీవు ఎన్నో చేయుచుందువు. అవేవియు నాకు గుర్తుకు
రావు. ఇదేకదా మనకు కనబడుచున్న విషయము.
ఓ దేవరా. ఇటువంటి నీ కృపాగుణమే మావంటివారికి వరముకదా.
95. శా. కొన్నే మాకునెఱుంగునట్టులుగ
నింకొన్నింటిపై సందియం
బన్నా కొల్పితివేల ? నీకు తగునా? యాత్మస్వరూపంబు మా
కెన్నంగల్గెడి
శక్తినీయఁ దగదా? యీశా! నినుం గాంచ శ్రీ
మన్నారాయణ! శంకలెల్లఁ దొలగున్.
మాయన్విసర్జించనౌన్.
భావము.
ఓశ్రీమన్నారాయణా!
కొన్నింటిని మాత్రమే మాకు తెలియునట్లుగను, ఇంకొన్నింటి విషయములో సందేహములను కలిగించితివెందులకు ? ఇట్లు సందేహాస్పదముగ చేయుట నీకు తగునా? కోరికతో నిన్ను మేము తెలుసుకొనుట కొ్ఱకు
ఆత్మస్వరూపమును గ్రహింప గల్గెడి
శక్తిని మాకు కల్గించుట నీకు తగదా? నిన్ను చూచినచో మా సందేహములు తొలగిపోవును. మాయను మేము విడిచిపెట్టుట సాధ్యమగును..
జైహింద్
1 comments:
నమస్కారములు
మన్నులో కలిపేదానికి మమ్మల్నెందుకు సృష్టించావయ్య అంటూ ప్రశ్నలతో ఆశ్రీమన్నారాయుణుణ్ణి నిలదీసి అడిగిన పద్యములు అద్భుతముగా నున్నవి . భక్తి ఎక్కువైనప్పుడు ఏదైనా అడగవచ్చునని పెద్దల ఉవాచ . " భక్త రామదాసులా
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.