గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, మే 2018, గురువారం

శ్రీమన్నారాయణ శతకము. 14/20వ భాగము. 66 నుండి 70 రచన చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
66. శా. పిన్నల్ నిర్మల చిత్తశోభితులెగా. పెద్దౌదురవ్వారలే.
పిన్నన్ లేని దురంత దుష్కృతులిలన్ బెద్దైనచో నబ్బునే !
ఎన్నాళ్ళిట్టులొనర్తువీవిటుల నీకే చెల్లునేదైన. శ్రీ
మన్నారాయణ ! నిర్మలత్వమిడి సన్మార్గంబునన్ నిల్పుమా. 02 . 03 . 2018.
భావము.  ఓ శ్రీమన్నారాయణా! పసివారునిష్కల్మష మైన మనస్సు కలవారే కదా. ఆ పసివారే పెరిగి పెద్దవారగుదురు. భువిపై బాల్యమందు లేని దురంతమైన చెడ్డ పనులు పెద్దవారవగానే వచ్చునా ?   ఈ విధముగా నీవు ఎంత కాలము చేయుదువు? ఏదైనా నీకే చెల్లును కదా! మాకు నిర్మలత్వమును ప్రసాదించి మంచి మార్గములో నిలుపుము.
67. శా. సున్నంబైననునన్నమైన నొకటే శుద్ధాత్మవిజ్ఞానికిన్.
ఖిన్నుండవ్వడు పొంగిపోడు తెగడన్ గీర్తించినన్ భూమిపై.      
విన్నాణంబది నీవు గొల్పినదెగా వెల్గొందునీరీతి. శ్రీ
మన్నారాయణ ! జ్ఞానభాగ్యవరదా! మాకున్ బ్రసాదించుమా.   03 . 03 . 2018.
భావము. ఓశ్రీమన్నారాయణా! విశుద్ధమైన ఆత్మజ్ఞానము కలవానికి సున్నమైనను , అన్నమైనను ఒక్కటేకదా. భూమిపై అతనిని నిందించినను , పొగడినను చిన్నపుచ్చుకొనడు అటులనే పొంగిపోడు.  ఆట్టి విజ్ఞానము నీవు కలిగించినదే కదా. ఈ విధముగా ప్రకాశించును. జ్ఞాన భాగ్యమును వరముగనొసంగువాడా. మాకునూ ప్రసాదింపుము.
68. శా.నిన్నున్ మించిన భక్త రక్షకుని నే నెన్నన్ దగన్ బృథ్విపై.
నన్నున్ మించిన స్వార్థ వర్తనుడు కానన్ రాడదెట్లందువా
నిన్నున్నామదిలోనె శాశ్వితముగా నిల్వంగ వాంఛింతు. శ్రీ
మన్నారాయణ! నాది స్వార్థమె కదా. మన్నించు నా స్వార్థమున్.  06 . 04 . 2018.
భావము.  ఓ శ్రీ మన్నారాయణా! భూమిపై నిన్ను మించిన భక్త రక్షకుని నేను గుర్తింప దగను. నన్ను మించిన స్వార్థపరుడు కనిపించనే కనిపించడు. అది యేవిధముగా అని అందువేమో. నిన్ను శాశ్వితముగా నా హృదయమునందునే యుండవలసినదిగా కోరు కొందును. నాది స్వర్థమే కదాఅట్టి నా స్వార్థమును మన్నించుమా.
69. శా. వెన్నల్ బాలు మనంబులే. కయికొనున్ వెన్నుండటంచున్ ఘనుల్
మన్నున్ మెక్కకు. వెన్నవంటి మదులన్ మన్నించిగైకొమ్మటం
చున్నిన్నార్తిని కోరుచుందురు గదా. శుద్ధాత్మ సంభాస! శ్రీ
మన్నారాయణ! నీవె శాశ్వితము. నన్ మన్నించి చేకొమ్మయా. 05 . 03 . 2018.
భావము.
శుద్ధాత్మతో ప్రకాశించు ఓ శ్రీ మన్నారాయణా ! మహాత్ములు తమ మనస్సులే యని , అవి నీవు స్వీకరింతువని భావించి , నీవు మన్ను తినుట యెందులకు ? మా మనసులే వెన్న పాలు , స్వీకరించుమని నీదరికార్తితో చేరి కోరంచుందురు.నీవే మాకు శాశ్వము. నన్ను నీవు మన్ననముతో చేనుకొము.

70. శా. కన్నుల్ కాంచెడి శక్తి కోల్పడును. నిన్ గానంగ జ్ఞానాక్షి నా
కున్నన్జాలును. నీవొసంగుమది నాకున్ దివ్య చక్షుప్రదా!
ఎన్నాళ్ళైహిక దృష్టితో మనగనౌనీశా! పరంధామ ! శ్రీ
మన్నారాయణ! భక్తి గొల్తు నిను. శ్రీ మాతాహృదీశా.హరీ. 06 . 03 . 2018.
భావము.
ఓ శ్రీ మన్నారాయణా ! లక్ష్మీతల్లియొక్క హృదయేశ్వరా ! శ్రీవారి రీ !  మాకు కలిగియున్న యీ కన్నులు కొన్నాళ్ళకు వాటీకి ఊఃడే చూచే శక్తీని కోల్పోవును. నిన్ను నేను చూచుట కొఱకు నికు జ్ఞాన నేత్రముండిన చాలును. నిన్ను నేను సేవిఃతును. అది నాకొసగుము. ఐహిక దృష్టితో ఎన్నాళ్ళు జీవనము కొనసొగించనగును?
జైహింద్

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
జై శ్రీమన్నారాయణా . నమోనమ:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.