జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
56. శా. మున్నే వేదములుగ్గడించె నిను సంపూర్ణుండుగా. సత్యమే.
అన్నీ కాంచుచునుండ
నిక్కమని నాకర్థంబయెన్ నిన్నునే
మన్నన్ దక్కువె.
నిత్య సత్యమగు నిన్నాత్మన్ సదా నిల్పి , శ్రీ
మన్నారాయణ! కాంతు నేను. కృపతో మన్నించి లోన్ వెల్గుమా.
భావము.
నిన్ను
సంపూర్ణుడవని వేదములానాడే ఉగ్గడించినవి. నిజమే.అన్నీ చూచుచున్నప్పుడు ఇది సత్యమని
నాకర్థమయినది. నిన్ను ఏమన్నను అది తక్కువే
యగును. నిత్య సత్యమైన నిన్ను నా ఆత్మలో నిత్యము నిల్పి నేను చూచుకొనుచుందును. కృపతో నీవు నాలో
ప్రకాశించుము.
57. శా. మిన్నంటున్ మది హర్షచంద్రికలు నీ
మీదన్మనంబుంచినన్.
జన్నంబుల్ పని
లేదు. నీ తలపులే సద్యజ్ఞ సత్కార్యముల్.
మన్నించే గుణ గణ్య !
మములన్ మన్నించి కాపాడు. శ్రీ
మన్నారాయణ !
యజ్ఞతత్వమిదె కాన్ మా యజ్ఞమీవే సదా.
భావము.
ఓశ్రీమన్నారాయణా
! నీపైనే మనసును నిలబెట్టినచో మా సంతోషములు ఆకాశమునంటును. యజ్ఞములతో పనియేమున్నది. నిన్నుగూర్చిన ఆలోచనలే
మంచి యజ్ఞములు చేయుట యనెడి మంచిపనులు
మన్నించేటువంటి
గుణము కలిగి యుండుట చేత గణింపబడువాడా !మమ్ములను మన్నించి కాపాడుము. ఓ
శ్రీ మన్నారాయణా !
యజ్ఞతత్వము ఇదే అయి యుండగా యెల్లప్పుడూ మాయజ్ఞము నీవే సుమా.
58. శా. పన్నీటన్ నిను సేవ చేయు ఘనులౌ
భక్తాళికిన్ భాష్పముల్ . . . ?
కన్నీటిన్ గలిగించు
దుష్ట తతికిన్ కామ్యార్థ సంప్రాప్తియున్ . . . ?
విన్నన్ నవ్వెరె నీ
విలాస గతికిన్? విశ్వంబు నిట్లేల
శ్రీ
మన్నారాయణ!
చేయుచుంటి వకటా! మా మంచి
నీకొప్పదా?
భావము.
ఓ
శ్రీమన్నారాయణా! నీకు పన్నీటితో స్నానము చేయించుట మున్నగు సేవలు చేయు భక్తుల సమూహమునకు కన్నీరు , ఇతరులచే కన్నీరు పెట్టించు దుర్మార్గుల
సమూహమునకు కామ్యార్థలాభము,
అయ్యో ఇట్టి నీ
విలాసముతో కూడిన నడవడి విన్నవారు నవ్వరా? నీవు
సృష్టిని ఈ విధముగా ఎందుకు చేయుచుంటివి? మా
మంచితనము నీకు ఒప్పదా?
59. శా. కన్నుల్ గొల్పి, కనంగఁ జేసి, మదిలో కాంక్షల్ ప్రవర్ధింప, నీ
వన్నెల్
చిన్నెలశాశ్వితంబులను దేవా! నీవు కల్పించి, మ
మ్మున్నిల్పంగను
ద్రోహిగాఁ, దలచితో? పూజ్యుండ! ధర్మంబె? శ్రీ
మన్నారాయణ! మంచి
దృష్టినిడినన్ మర్యాదగా మెల్గమే?
భావము.
ఓ
శ్రీమన్నారాయణా! మాకు కన్నులనిచ్చి అన్నిటినీ చూచునట్లు చేసి, ఈ చూచుట మూలముఅ మాలో కోరికలను ప్రకోపింపఁ
జేయుట కొఱకు లోకములో అశాశ్వితమైన వన్నెలు చిన్నెలు నీవే కల్పించి మమ్ములను ద్రోహిగా నిలుప
దలచినావా? నీకిది ధర్మమగునా? నీవు మంచి దృష్టినే ప్రసాదించినచో మేము
మర్యాదగా ప్రవర్తింపకుందుమా?
60. శా. తిన్నన్ నీ కృప లేనినాడరుగదే దీపించు దధ్యన్నమై
నన్నీసత్కృప గల్గ
రాళ్ళయినజీర్ణంబౌనిదే వింత. నీ
కన్నన్ వింత మరేమి
కల్గు భువి? శ్రీకాంతా! మనోద్భాస!. శ్రీ
మన్నారాయణ ! జీర్ణ
శక్తినిడుమా మన్నించి జీవాళికిన్. 24 . 02 . 2-18.
భావము.
ఓ
శ్రీ మన్నారాయణ ! నీ కృప లేకపోయినచో మేము తీనెడి ప్రకాశవంతమైన పెరుగూ ఆన్నమైనా జీర్ణము కానేరదు. నీ కృప
కలిగియున్నచో రాళ్ళైనా జీర్ణమగును కదా. ఇదే విచిత్రము. నీకన్నా వింత భూమిపై మరేమి ఉండును ? లక్ష్మీదేవి హృదయమున ప్రకాశించువాడవైన
హరీ ! జీవాళిని మన్నించి జీర్ణశక్తీని ప్రసాదించుము.
జైహింద్.
1 comments:
నమస్కారములు
ఆ శ్రీమన్నారాయణుని కృపలేనిదే మానవాళికి జీవన సరళి సూన్యమని , అంతా ఆ భగవంతుని దయ అని స్తుతించిన విధము అద్భుతముగా నున్నది. ధన్య వాదములు . సోదర
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.