జైశ్రీరామ్.
కూచిమంచి తిమ్మకవి కృత : వివరణ. శ్రీ పిస్కా సత్యనారాయణ.
బలు తెలి పుల్గు వారువము, బంగరువీణియ, మిన్కుటందెలున్,చిలుక తుటారిబోటియును, జిందపువన్నియ మేనుఁ, బొత్తమున్,
చెలువపు తెల్లతమ్మివిరి సింగపుగద్దెయుఁ గల్గి యొప్పు న
ప్పలుకులచాన, జానలరు పల్కులొసంగెడుఁ గాత నిచ్చలున్.
ప్రతిపదార్థము.
(బలు తెలి పుల్గు = మిక్కిలి తెల్లనైన పక్షి (హంస), వారువము = అశ్వము (వాహనము), మిన్కు = ప్రకాశించు, చిందపువన్నియ = శంఖమువలె తెల్లని, మేను = శరీరము, పొత్తము = పుస్తకము, చెలువపు = అందమైన, తెల్లతమ్మివిరి సింగపుగద్దె = తెల్ల తామరపూవు సింహాసనము, పలుకులచాన = వాక్కులకు అధిదేవతయైన పడతి (సరస్వతి), జానలరు పల్కులు = సహజమైన సుబోధకమైన పలుకులు, నిచ్చలున్ = ఎల్లప్పుడు)
భావము: మిక్కిలి తెల్లనైన హంసవాహనముతో, పాదములకు ప్రకాశించు అందెలతో, శంఖమువంటి శ్వేతవర్ణశోభిత దేహకాంతితో, తెల్లని తామరపూవు సింహాసనముపై అధివసించియున్నది వాణీమాత! ఆమె తన హస్తములలో స్వర్ణవీణ, చిలుక, పుస్తకములను ధరించియున్నది. "అటువంటి వాగ్దేవి తనకు సరళసుందరములైన అచ్చతెలుగు పలుకులను ప్రసాదించి, ఆశీస్సులను అందించుగాక" అని కవి ఆకాంక్షిస్తున్నాడు.
"నీలాసుందరీ పతిణయము" అచ్చతెలుగు కావ్యము. అందుకు అనుగుణంగా ఈ భారతీదేవి ప్రార్థనాపద్యం కూడా అచ్చమైన తెలుగు పదాలతోనే సాగినది.
శ్రీ సతుఅనారాయణ గారికి ధన్యవాదములు.
జైహింద్.
1 comments:
నమస్కారములు
శ్రీ సత్యనారాయణ గారి సరస్వతీ వైభవం శ్లాఘనీయం
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.