జైశ్రీరామ్.
పద్య పక్షమ్ ఛందస్సు ( 3 )
ఆర్యులారా! వందనములు.
తే.గీ. పద్య పక్షము - ఛందస్సు
ప్రథమమందు
కృతుల శ్రీకార మారంభ మతులితమని,
లఘువులు గురువులగు వర్ణ
లక్షణములు,
తెలుసుకొంటిమి మదిలోన నిలుపుకొనుచు.
తే.గీ. పిదప త్ర్యక్షర గణములు, ప్రీతి నెఱిగి, ల - గ - లల - గగ - లగ - గలముల నెఱిఁగితిమి.
సూర్య చంద్రేంద్రగణములు చూచితి మిక
యతులఁ బ్రాసల నెఱుఁగుదు మతులితముగ.
బహు ద్వివిధ కంద తేటగీతి
గర్భ చంపకమాల.
చ భువి నుతమౌనదీ తెలుఁగు పూజ్యత నొప్పెడి
దివ్య భాష సత్
జన హితమైనదై వసుధ
సద్గతిఁ గొల్పెడి భవ్య భాష కాం
చ నియతులన్ సుగుణ
సన్నుత ప్రాసల శోభనాంగి తో
చును కృతులన్ కవి ప్రముఖ
సూచిత బంధన పద్య శోభచేన్.
శుభాస్పద భాషార్ణవములలో
ఆంధ్రామృతార్ణవము నిరుపమానముగా, నిష్కళంకముగా. జగజ్జేగీయమాన తేజో విరాజితముగానొప్పియుండుటకు
కారణము మన భాషలోని జిగిని బిగిని ద్విగుణీకృతము చేయఁగల వ్యాకరణము, ఛందశ్శాస్త్రము, అలంకారశాస్త్రములు మనకు కలిగి ఉండుటయే.
అట్టి శాస్త్ర సమ్మతముగ
పూర్వ కవులు రచించిన కావ్యములు నిత్య విరాజితములు.
మనకు ఆదర్శములు.
వారి రచనా మార్గములు
మనకు అవశ్యమనుసరణీయములు.
ముఖ్యముగా తెలుఁగు పద్యరచనకు
సంబంధించిన అనేకమైన అంశములు మనము తెలుసుకొనవలసి యున్నది. ప్రాథమిక పరిజ్ఞానము కొఱకు
ప్రస్తుతము మనము అత్యవసరమైనవి తెలుసుకొనే ప్రయత్నము మాత్రమే చేయుచున్నామని మనవి చేయుచున్నాను.
నేడు కొన్ని యతులను గూర్చి తెలుసుకొను
ప్రయత్నము చేయుదుము.
యతులు
తెలుఁగులో పద్య రచన
చేయునప్పుడు యతినియమము కలచోటులలో మనము అనేక సందేహములు కలుగుట అనుభవైకవేద్యము.
ఈ విషయములో మనము ఛందశ్శాస్త్రము
ఏమి చెప్పుచున్నదో స్పష్టముగా గ్రహించినచో అటువంటి సందేహములు తీరునని నా భావన.
పద్యమున కాని, శ్లోకమున కాని
ప్రతీ పాదము మొదటి అక్షరమునకు
వళి లేక యతి అని సంజ్ఞ.
ఆద్యోవళిః. అని నిర్దేశించిన సంస్కృతమున ఛందశ్శాస్త్రములో
యతిర్విచ్ఛేద
సంజ్ఞకః
అని వివరింపఁబడెను.
శా. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో / వక్షోముఖాంగేషు యే
ఇది నన్నయ భారతాంధ్రీకరణములో
మొదటి శార్దూలము.
ఇది సంస్కృత వృత్తము ఇందు ౧౨ వ అక్షరముపై యతి అనగా ౧౨ వ అక్షరము తరువత విచ్ఛేదనము
పాటింపఁబడెననుటకిది ఉదాహరణము.
తెలుఁగున మాత్రము యతి
స్థానమున ఉండు
హల్లునకు, దానితో ఉండు అచ్చునకు యతిపాటించవలెను.
అనగా యతి పాటించ వలసినచోట
యతిగా అచ్చు ఉన్నకాని ఆచ్చుతో కూడినహల్లు ఉన్న కాని ఏ వర్ణము కలదో యతి స్థానములో కూడా అచ్చుకాని ఆచ్చుతో కూడినహల్లు కాని అచ్చు హల్లు కలిసి ఉన్న
మిత్రవర్ణము కాని మాత్రమే రావలెనని నియమము.
క. ఎన్నిట యతి
రావలె నని
రన్నిట
సంస్కృతమునందు నగు విచ్ఛేదం
బెన్నిట యతిరావలె
నని
రన్నిటఁ దెలుఁగునకు
మొదలియక్షర మమరున్. (ఛందోదర్పణము 129)
ఉదా. శా. శ్రీ (శ్+ర్+ఈ) వాణీ గిరిజల్ ముదంబునను బ్రే / రే (ర్+ఏ)పించు భక్తిన్ మదిన్.
ఈ తెలుఁగు పద్యపాదము
శార్దూలము. యతి ౧౨ అక్షరములపై చెల్లును అనగా ౧౩వ అక్షరము మొదటి అక్షముతో మైత్రి కలదైనదై ఉండవలెనని
గ్రహింపనగును.
క. స్వరగణము కకారాద్య
క్షరములతో సంధిఁ జెసి
కదిసినచోఁ ద
త్స్వరము కొని చెప్పునది
వ
ళ్ళరవిందజ సదృశ! కవిజనాశ్రయ కృతులన్.
హల్ లో ప్రాణమగు అచ్చు
ఉన్ననే ఉచ్చరింపఁబడును.
ఈ విధముగ ఉండెడి అచ్చు సహజముగా ఉండునవియు, సంధి
జరుగుటచే వచ్చునవియు మనమెఱుఁగ వలెను.
వివరణ. కేకి అను వర్ణములందు హల్లులలో
నున్న ప్రాణములగు అచ్చులు సహజముగ నున్నవి.
ఇటువంటి చోట ఆ హల్లునకు, అచ్చునకు కూడా యతి పాటించ
వలెను.
అతనికేమి అనుదానిలో
రెండు పదములున్నవి.
అతకి ఏమి ఈ రెండు పదములకు సంధి జరుగుట వలన కి అనే హల్లులో ఉన్న ఇ కారము తొలగిపోయి పరపద
ఆద్యక్షరమగు ఏ అను అచ్చుతో కూడి కే గా మారినది.
ఇట్టి చోటులలో పర పద
ఆది వర్ణమునకే యతి చేయవలెను.
ఉదా.
మిధ్య యంచు లోకమెంచుదు
రిద్ధర ( లోకమ్
+ ఉ + ఎంచుదురు=లోకమెంచుదురు )
నెందరన్న తప్పు. హే ముకుంద! ( ఇద్ధరన్ + ఎందరు = ఇద్ధరనెందరు
)
య (య్+అ) నిన నొప్పు చూడన
(న్+అ) యహల మైత్రిచే
మిత్రులార చూచి మేలు కలుగు.
యతికి
పర్యాయపదములు.
విరతి -
విశ్రాంతి -
విశ్రామము -
విశ్రమము -
శ్రాంతి -
విరమణము -
విరమము. - విరామము యతి.
యతులు 4
విధములు ౧) స్వర వళులు . ౨. వ్యంజన
యతులు. 3. ఉభయ యతులు. ౪. ప్రాసయతులు.
౧. స్వర యతులు .
స్వరములనగా ప్రాణములు లేక అచ్చులు. అచ్చుల మైత్రికి సంబంధించి చెప్పఁబడిన యతులు స్వరయతులు.
ఇవి ఏడు విధములు.
1) స్వరమైత్రి వళి. 2) స్వర ప్రథాన వళి. 3) లుప్త
విసర్గక స్వర వళి. 4) ఋ వళి. 5) ఋత్వ సంబంధ వళి.
6) ఋత్వసామ్య
వళి. 7) వృద్ధి వళి.
వివరణ.
1) స్వరమైత్రి వళి .
౧. అ ఆ ఐ ఔ . { పరస్పరము మైత్రి వలన యతి చెల్లును } ఇది అకార యతి.
ఉదాహరణ.
ఆ.వె. అనృత రహిత మహితులా
(ల్+ఆ)ప్తులు కావలె.
న
(న్+అ)నుపమాన
సుజనులై (ల్+ఐ)న మేలు.
అధిక శక్తి తోడనౌ (న్+ఔ) ద్ధత్యమొదవును
సుజల
రక్షణమున శోభఁ గొలుప.
౨. ఇ ఈ ఋ ౠ ఎ ఏ { పరస్పరము మైత్రి వలన యతి చెల్లును } ఇది ఇకార యతి.
ఆ.వె. ఇలను కవుల మైత్రి ఈనాటి శుభయోగ
మిం(మ్+ఇం)త కన్న గల సుకృ
(క్+ఋ) తమదేది?
ఎల్లవేళలందు ని (న్+ఇ) టువంటి సత్కవు
లె (ల్+ఎ)
లమిఁ గొలుపు శుభము లె
(న్+ఎ)
న్ని కృష్ణ!
౩. ఉ ఊ ఒ ఓ { పరస్పరము మైత్రి వలన యతి చెల్లును } ఇది ఉకార యతి.
తే.గీ. ఉభయ కవిమిత్ర నార్మంచి ఊరుకొనక
ఉన్న కవులను చేర్చితా
నొ (న్+ఒ) క్కచోట
ఉత్తమంబైన పద్యంబులో (ల్+ఓ) హొ యనఁగ
వ్రాయఁ జేసిరి గణపటువర్ధనుఁడయి.
పైన
తెలిపిన క్రమంలోనే అచ్చులకు యతి మైత్రి చెల్లును.
హల్లులలో
వుండే అచ్చులు పై క్రమంలోనే ప్రయోగించవలెను.
ఛందోదర్పణమున స్వరయతులు
ఆ. అగు
నకారమునకు నైత్వౌత్వములు వడి - ఈకి ఋత్వమునకు నేత్వ
మమరు
నుత్వమునకు
నోత్వ మొనరు నీగతి స్వర - యతులు విస్తరిల్లు నబ్జనాభ! (ఛందోదర్పణము.82)
క.
స్వరములు దీర్ఘము హ్రస్వము
- నరయఁగ నొక్కవిధ మెన్న యతులకు సంధ్య
క్షరము
లగునచ్చులందు సు - చరితా!
హ్రస్వములు లేవు సంస్కృతభాషన్. (ఛందోదర్పణము.83)
క.
అలఘుచతుస్సంధ్యక్షర - ములలో నై
యౌలు దక్క మొదలిటిరెంటన్
దెలుఁగునను
హ్రస్వదీర్ఘము - లొలయును
నెఏలనంగ నొఓ లనఁగన్. (ఛందోదర్పణము.84)
క. క్రియ
నై యౌలకు హ్రస్వ - ద్వయము
లమరు నాంధ్రభాషితప్రకరలో
నయిదనఁ
దగు నైదనుచో - జయకీర్తీ!
యవు ననంగఁ జను నౌ ననుచోన్. (ఛందోదర్పణము.85)
2) స్వర
ప్రథాన వళి.
అచ్చులకు
సంధి అయిన చోట పర పదంలోని మొదటి అచ్ {వంశ్+అ = వంశ +
అబ్ధి దీనిలో అబ్ధి అనే పదంలోని " అ " అనే అచ్చు} కే యతి పాటించ వలెను.
ఉదాహరణ.
తే.గీ. అహితములు పల్కనే
పల్క రాం (రు+ఆం)
ధ్ర కవులు..
శ్రీ (శ్రీ+ఈ) శునైనను నెదిరింతురిం
(రు+ఇం)
దులకయి.
ఉర్వినలరించ మండితో (త+ఉ) త్తములు కవులు.
ధరణి నిటులుండును స్వరప్రథానవళులు.
3) లుప్త
విసర్గక స్వర వళి. (గూఢస్వరయతి) దాసః + అహమ్ = దాసోహమ్
ఇటువంటి విసర్గతో సంధి
కారణముగా లుప్తమయి ఏ స్వరమున్నదో ఆ స్వరమునకే యతి పాటించవలయును.
తే.గీ. ఆత్మ నర్పింతు
రామ దాసో (సః+అ)
హమనఘ!
అనఘ సేవింతు నిను, కింకరో (రః+అ) హమార్య!
హరి! పరాత్పర! గావుమన్యో (న్యః+అ) న్యతనిడి.
లుప్తవిసర్గక స్వరవళులు
కనుఁ డిచట.
గీ.
స్వరము తుద నుండి లుప్తవిసర్గకోత్వ - మైన స్వర
విరామంబు
దాసోzహ మనగ
నచ్యుతాశ్రితు
లుర్వి నన్యోన్యమిత్రు - లనఁగనమ్ముకుందుండు
యశోzర్థి యనఁగ. (ఛందోదర్పణము.86)
తమః +
అర్క > తమోర్క. ఈ విధముగ విసర్గ మీద
అకారము ఓ కారముగా మారిపోవుచున్నప్పుడు
అందులోగల " అ " కారమునకు యతి వేయవలెను.
4) ఋ
వళి.
"ఋ" తో
గాని, ఋ నే
వట్రసుడిగా కలిగి యున్న హల్లులోగల వట్రసుడితో గాని
రి రీ రె రే లకు
యతి చెల్లును .
వట్రసుడి కలిగియున్న హల్లుతో నిమిత్తము లేదు.
తే.గీ. ఋషుల ప్రార్థన
మన్నించి రేయిపగలు
ప్రీ (ప్+ర్+ఈ)
తినేలును శుభదుఁడై కృష్ణుఁడిలను
శ్రి (శ్+ర్+ఇ)
తుల రక్షించు దైవమీ కృ (క్+ఋ) ష్ణుఁడనుచు
చెప్పనొప్పు ఋవళి నెన్ని
తప్పు కాదు.
5) ఋత్వ
సంబంధ వళి.
వట్రసుడి
తో ఇ ఈ ఋ ౠ ఎ ఏ లకు యతి చెల్లు తుంది
తే.గీ. పృ
(ప్+ఋ)
థ్వి సుకవిలంబోషించె కృ (క్+ఋ) ష్ణుఁడొకఁడె
కృ (క్+ఋ) ష్ణ రాయలే తెలుగన్న దృ
(ద్+ఋ)
ష్టిఁ గొలిపె.
కృ (క్+ఋ) తులనంత కృష్ణాకృతుల్ పృ
(ప్+ఋ)
థ్వి వెలయు.
భృ (భ్+ఋ) తుఁ డనంతునికిన్ నమస్కృ
(స్+క్+ఋ) తులు చేతు.
తే.గీ. ఏల నీవిచట ననంత కృ (క్+ఋ)
ష్ణుఁడవయి
ఇందరికిపటువర్ధన కృ (క్+ఋ) పుఁడవునయి,
ఎల్లరికిఁ గణపతివగుచు
పృ (ప్+ఋ) థ్వి వెలసి
పద్యపక్షమున్ ఛందమై
పరగితివయ?
6) ఋత్వ
సామ్య వళి.
వట్రసుడి
గలిగిన హల్లులు అవి యేవైనాసరే హల్ల్ సామ్యంతో నిమిత్తం లేకుండా వట్రసుడులు కలిగియుండిన చాలు. యతి
చెల్లును.
తే.గీ. పృ
(ప్+ఋ)
థివి సుకవుల కవితలు కే (క్+ఏ) లఁ బట్టి,
వి (వ్+ఇ) నుత ప్రజ పద్యమను పేర దృ
(ద్+ఋ) ష్టి పెట్టి
కృ (క్+ఋ) తుల నేకంబుగా చేసి ప్రీ
(ప్+ర్+ఈ) తిఁ గొలుప
గ్రంథ రూపాన నిల్పితే
బంధురముగ!
7) వృద్ధి
వళి.
అకారమునకు ఏ ఓ లు పరమైన
ఐ ఔ లు ఏకాదేశమగును ఇది
వృద్ధి సంధి! అటువంటి చోట పర స్వరములైన ఏ ఓ లకు గాని, ఆదేశములైన ఐ ఔ
లకుఁ గాని యతి చెల్లును.
ఉదాహరణ ౧.
తే.గీ. అమర కవితలన్
వెలుఁగు లోకై (క్+అ+ఏ=క్+ఐ)
క జనని
ఇలకు వెలుగైన గౌరి భక్తై (క్+త్+అ+ఏ=క్+త్+ఐ) క పూజ్య.
ఉర్వి నీ పద్య పక్ష భక్తౌ (క్+త్+అ+ఓ) ఘ రక్ష.
ఇట్టులొప్పును గమనింప
వృద్ధి వళులు.
ఉదాహరణ ౨.
ఇభ భయ విదార సర్వ లోకై (క్+అ+ఏ) క వీర. (పర స్వరమైన ఏ కారమునకు యతి)
అఖిల భువన ప్రశస్త జితై (త్+అ+ఏ=త్+ఐ)
ణ హస్త. (ఆదేశ స్వరమైన ఐ కారమునకు యతి)
ఉదధిజాశ్రిత పక్ష భక్తౌ (క్+త్+అ+ఓ) ఘ రక్ష. (పర స్వరమైన ఓ కారమునకు యతి)
హత పరానీక నంద వ్రజౌ (జ్+అ+ఓ = జ్+ఔ = జౌ) క యనఁగ.
(ఆదేశ స్వరమైన ఔ కారమునకు యతి)
ఇంతటితో
స్వర
యతులు సమాప్తము.
అవగాహనా రాహిత్యం వలన కాని, అజ్ఞానం వలన కాని, సాంకేతిక పరిజ్ఞానఅపరిపక్వత వలన కాని నేను వ్రాసిన వాటిలో తప్పులు ఉన్నచో విజ్ఞులు మన్నింతురని, తగిన సూచనలు చేయుటద్వారా ఆ దోషములు సవరించునట్లు చేయుదురని ఆశించుచున్నాను.
వచ్చే వారం మరికొన్ని తెలుసుకొను
అవకాశమును ఆభగవంతుఁడు కల్పించు గాక. అంతవరకు
శుభమ్.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.