గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఏప్రిల్ 2014, మంగళవారం

కవిః కరోతి కావ్యాని , రసం జానాతి పండితః మేలిమి బంగారం మన సంస్కృతి 177.

జైశ్రీరామ్.
శ్లో. కవిః కరోతి కావ్యాని , రసం జానాతి పండితః
తరుః సృజతి పుష్పాణి , మరుద్వహతి సౌరభమ్.
క. కవి కావ్యము రచియింపగ
కవి హృదయము రసములెఱుగు ఘన పండితు డీ
భువి విరులను పూయ తరువు
సవిధంబుగ గాలి మోయు సౌరభమెల్లన్.
భావము. కవి కావ్యాలు వ్రాస్తే , పండితుడు రసాన్ని గ్రహిస్తాడు. వృక్షాలు పూలను సృజిస్తే, వాయువు సువాసనను వహిస్తుంది.
జైహింద్ 
Print this post

4 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

మీ వంటి కవులు కావ్యములు వ్రాస్తే పండిత, పామర జనులు ఆదరించుటకు సిద్దముగా నున్నారు గురువుగారు, మా వీక్షకులెల్లరు మీ సుకవితల సువాసనలో స్నానమాడు చున్నారు.

మంచి విషయములు తెలియ జేయు చున్న మీకు ధన్యవాదములు .
శిష్య పరమాణువు

వరప్రసాదు .

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సుజన మనోభిరామముగ శోభిలు వ్యాఖ్యలు చేయనెంచుచో
నిజముగ సన్మనోజ్ఞ గుణ నేతలు కావలె.అట్టి శక్తినే
ఋజువుగ చూపినారుకద తృప్తిని గొల్పుచు కందులోద్భవా!
భుజమును తట్టి సత్ కవికి ప్రోత్సహమిచ్చుట దైవ శక్తియే.

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

గురువుగారు ఇది యంతయు మీ సుకవితల సారము మరియు నా పైగల వాత్సల్యము. మీ పద్యము బహు సుందరముగా నున్నది. మీ కృపకు పాత్రుడ నైనందులకు నా జన్మ ధన్యమైనది. గురుదేవులకు మరొక్క మారు పాదాభి వందనములతో

శిష్య పరమాణువు
వరప్రసాదు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పుష్ప సౌరభాలనీ ,పండితుల కావ్య రసామృతాన్నీ , బంధ కవిత్వములతొ బంధిస్తున్న పాండితీ స్రష్ట శ్రీ చింతా వారు ధన్యులు .అసలు ఆంధ్రామృతమే ఒక మేలిమి బంగారం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.