గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఫిబ్రవరి 2013, శనివారం

‘మధుర వాగ్ఝరి మన్నన మాయఁ జేసె’ కందంలో పూరించగలరు.

జైశ్రీరామ్.
ప్రియ పాఠకపుంగవులారా!
పద్యరచనాసక్తి పరిఢవిల్లుతున్న వీ హృదయాలను చూస్తుంటే ముచ్చటగా ఉంది.
ఈ పర్యాము ఒక చిన్న నూతన గతిలో రచనలు పూరణలు చేసే  మార్గమున సమస్యాపూరణ చేసే ప్రయత్నం చేద్దామా?
ఈ క్రింది సమస్య తేటగీతిలో ఉంది. ఈ సమస్యను తేటగీతిలో కాకుండా కందంలో పూరించాలి.
చూడండి సమస్యను.
‘మధుర వాగ్ఝరి మన్నన మాయఁ జేసె’
ఈ సమస్యకు నా పూరణమును వ్యాఖ్యలో చూడనగును.
జైహింద్.

Print this post

14 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మరియాద వీడితివి దు
శ్చరితుల సహ వాసి వగుచు.శప్తుఁడ వయితే?
బరువాయెనా మధుర వా
గ్ఝరి? మన్నన మాయఁ జేసెగా! ప్రియ సఖుఁడా!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

మరొక విధముగా కందం వ్రాద్దామని ప్రయత్నించినప్పటికీ, మీరు చేసిన అమరికలో మాత్రమే కందం కుదురుతున్నది. నేనూ అదే విధంగా అమర్చి వ్రాస్తున్నాను.

సరిలేరు లలన, వేరె
వ్వరు నిను మాటలను మీరవశమే? బాలా!
మరులను కుఱియు మధుర వా
గ్ఝరి, మన్నన- మాయఁ జేసె, కమనీయముగా!

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

వరదగ ప్రోగిడె రూకకు
నరుదగు శతరూకలిత్తు మనగా జనులా
దరిచేరంగ మధుర వా
గ్ఝరి మన్నన మాయఁ జేసె కంపెని యప్డున్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మధు వనిలో రాధిక వలె
మధురిమ లొలికించు గాన మాధుర్యమునన్ !
సుధ లూరించగ జగతిని
మధుర వాగ్జరిని మన్నన మాయ జేసెన్ !

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

వరముగ “చింతామణి”యను
తరుణిని తగులగ గుణాంచిత “భవానీశం
కరు”నికి తుదకు “మధురవా
గ్ఝరి మన్నన మాయఁ జేసె" ఘనమయ్యె గదా!
( ఘనమగు = పూర్తిగా నిండుకొనుట)

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తమ్ముడూ ! చివరి పాదం కొరుకుడు పడటల్లేదు అందుకని మళ్ళీ ఇలా !

మధువనిలో రాధిక వలె
మదురిమ లొలికించు గాన మాధుర్యము నన్ !
సుధ లూరించగ జగతిని
మధుర వాగ్జరిని మన్నన లు మాయ జేసెన్ !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కయ్యా! నమస్తే.
ఇక్కడొక చిన్న ట్విష్టుంది.
ఎలాగంటే
ఇచ్చిన సమస్య
"మధుర వాగ్ఝరి మన్నన మాయ జేసె" అని కదా? ఇది తేటగీతి పద్యపాదం కదా/
ఈ పాదం కందంలో ఎక్కడ ఇముడుతుందో చూసుకోవాలి. ఆతరువాత మిగిలిన పూరణ చేయాలి
అదెలాగంటే
xxxxxxxxxxxxxxxxx
xxxxxxxxxxxxxxxxxxxxxxxxx
xxxxxx"మధుర వా
గ్ఝరి మన్నన మాయ జేసె" xxxxxxx.
అంటే
ఇప్పుడు ప్యాస స్థానం ఐన రెండవ అక్షరం ఏదైందో చూసుకొని మిగిలిన పైనున్న మూడు పాదాలలోను ఆ అక్షరమే వెయ్యాలి.
అలాగే ఆఖరి పాదం కాబట్టి ఆ పాదణ్లో మొదటి అక్షరం ఏదైందో దానిని చూసుకొని యతిస్థానంలో యతి వెయ్యాలి. అప్పుడు తేటగీతిలో ఇమిడియున్న ఈ సమస్య కందంలో పూరింపబడుతుంది. అర్తమైందనుకొంటానక్కయ్యా. నమస్తే.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ తొంపెల్ల బాల సుబ్రహ్మణ్యశర్మ గారు,
డా. లక్ష్మీ దేవి సహోదరి
ఈ పూరణ చేయడంలో గల మెలికను చక్కగా గ్రహించి మంచిగా పూరించారు. నాకు చాలా ఆనందం కలిగించిన అందరికీ నా అభినందన పూర్వక ధన్యవాదములు.
ఇదే సమస్యను చంపక మాలలో కాని, ఉత్పక్ల మాలలో కాని చక్కగా పూరించ వచ్చును. ఆసక్తితో తప్పక ప్రయత్నించండి.పునరభినందనలు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

భావుకుడైన వాడొకడు భవ్యముగా నొక వృత్తమందు శ్రీ
దేవిని గొప్పగా మిగుల తియ్యగ కీర్తనలందు గొల్వగా
నావుడె వచ్చినట్టి యొక నారియు విస్మయమంది నిల్చె; యా
భావుక గీతమా మధుర వాగ్ఝరి మన్నన మాయఁ జేసెగా!

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

భగ్న ప్రేమికుడు -----

వాతెర మీది ఆ మథుర వాగ్ఝరి , మన్నన మాయజేసె,ని
స్సీ!తెరవా! కడుంగడు విచిత్రముగానిటు మోసపోయినన్
నీతికి నిల్చి నీసుఖమె నేను పదంపడి కోరుకొంటి - స్త్రీ
జాతిని సున్నితంబనుట చాల అసత్యము,రాతిగుండియల్
.....
ఘనులగు పండిత జనుల ప
దునగు చతుర భాషణలు , మథుర వాగ్ఝరి , మ
న్నన - మాయజేసెడు గనుక
చనరెదురుగ నన్నుబోలు జడు లయ్యెడకున్ .
-----సుజన-సృజన

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

రాముని మందిరం బునను రాగము రంజిల జావళుల్ వినన్
సోముని వెన్నెలల్ విరియ సోద్దెము నొందుచు సంతసంబునన్
నామది పొంగి పోవగను గానము వీనుల విందు జేయగా
భామిని పాడగా మధుర వాగ్జరి మన్నన మాయ జేసెగా !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

యెన్నగ నెవరికి తరమగు
సున్నిత మగు గాన మహిమ సోముని కళలున్ !
చెన్నుని మధుర వాగ్జరి
మన్నన మాయ జేసె మా మది నిండన్ !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుర లందరు సభ యందున
సురపతి పలుకంగ నదియె సూనృత మంచున్ 1
పరమేశుని మధుర వా
గ్జరి మన్నన మాయ జేసె కందర్పు మదిన్ !

తమ్ముడూ ! " గ్జరి " తోతప్ప కొరుకుడు పడటల్లేదు.భలే ఇంట్ర స్టింగుగా ఉంది . మళ్ళీ మళ్ళీ వ్రాసి విసిగించా నేమో ! కైండ్లీ ఎక్స్ క్యూజ్ మి "

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

డా.లక్ష్మీదేవి గారు, శ్రీమతి రాజేశ్వరక్కయ్య ,శ్రీ లక్కాకుల వేంకట రాజా రావుగారు,వృత్తంలో చేసిన పూరణలు, అక్కయ్య కందంలో చేసిన పూరణ నాకు చాలా సంతోషం కలిగించాయి. మీ అందరి ఆసక్తికి, సృజనాత్మక శక్తిని మనసారా అభినందిస్తున్నాను. ఆ సరస్వతీ మాత కటాక్ష లబ్ధ రచనాధురీణులై మహత్కావ్య దక్షులు కాగలరని ఆశిస్తున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.