గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

‘కన్యను ధార పోయమన, కాదని పొమ్మనె. పుణ్యమూర్తి తా’ ఈ సమస్యను మీరైతే సముచితంగా పూరిస్తారు.

జై శ్రీరామ్.
సాహితీ బంధువులారా!
ఈ క్రింది సమస్యాపూరణము మీరైరే సముచితముగా చేయగలరని నా విశ్వాసము.
కన్యను ధార పోయమన, కాదని పొమ్మనె. పుణ్యమూర్తి తా.
ఈ సమస్యకు నా పూరణమును వ్యాఖ్యానంలో చూడ గలరు.
జైహింద్.

Print this post

7 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఉ:-
ధన్యత నొందగా పరమ ధార్మిక భాగవతాఖ్య కావ్యమన్
కన్యను దేవదేవునకు కానుకగా నిడ నున్న పోతనా
మాన్యుని రాజు మత్తుడయి మాకు సమర్పణఁ జేయ కావ్యమన్
కన్యను ధార పోయమన, కాదని పొమ్మనె. పుణ్యమూర్తి తా.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ధన్యడు త్యాగ రాజు , శతథా జనపాలురు మెచ్చి , గీతికా
కన్యను ధారవోయుమన , కాదని పొమ్మనె ,పుణ్యమూర్తి ,తా
నన్యమెఱుంగడా యిన కులాన్వయ రామనృపాలు దప్ప , సౌ
జన్య విభూషణుల్ ధన వశమ్మున జిక్కరు మోక్ష కాములై .
----- సుజన-సృజన

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అన్యుల కీయగోరి సిరియాచన జేయట నిచ్చ లేక నే
కన్యను సింగ భూవరున కంకిత మీయక పోతనార్యు లున్
కన్యను ధార పోయమన కాదని పొమ్మనె పుణ్య మూర్తి తా
ధన్యత నొందెగా ధరను తామర సాక్షి సరస్వ తీ కృపన్ !

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

శ్రీ లక్కాకులవారికి,

నమస్సులు. చాలా కాలము తరువాత మీ పద్యము చదువగలిగినాను. ధన్యుణ్ణి.

మీరు చూపిన బాటలోనే.........

అన్యముతాదలంపగ విహారమొనర్చుచు వేంకటేశుపై
మాన్యులుమెచ్చురీతినభిమానవిశుద్ధసభక్తిపూర్ణుడై
ధన్యతనొందెనన్నమయ, తత్వరసంబులబొల్చు గీతికా
కన్యను ధారపోయమన కాదని పొమ్మనె పుణ్యమూర్తి తా.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ఎదుటి వారి భావన గౌరవించు గొప్ప
హృదయ సంస్కార మున్న సౌహిత్య మూర్తి !
లలిత లలితంపు పలుకుల చెలిమి విరియు
మీరు కుశలమా ? సంపత్ కుమార శాస్త్రి !

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ఎదుటి వారి భావన గౌరవించు గొప్ప
హృదయ సంస్కార మున్న సౌహిత్య మూర్తి !
లలిత లలితంపు పలుకుల చెలిమి విరియు
మీరు కుశలమా ? సంపత్ కుమార శాస్త్రి !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ లక్కాకుల వేంకట రావు గారు,
శ్రీమతి రాజేశ్వరి అక్కయ్య గారు,
శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు
చేసిన పూరణలు మహానుభావుల మహనీయ ప్రవృత్తికి అద్దం పట్టుతున్నాయి.మనోజ్ఞంగా ఉన్నాయి. వారికి నా అభినందన పూర్వక ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.