గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఫిబ్రవరి 2013, గురువారం

సదసద్వివేకజ్ఞులైన మీ అందరికీ భీష్మ ఏకాదశి సందర్భముగా శుభాకాంక్షలు

జైశ్రీరామ్.
నేడు పరమ పవిత్రమైన భీష్మ ఏకాదశీ పర్వ దినము. ఈ సందర్భముగా మానవాళికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలందజేయుచున్నాను.
శ్రీ పండిత నేమాని వారు గీతాబోధపై  వ్రాసిన ఒక పద్యమును చూడండి:
శ్రీ కృష్ణ పరమాత్మ క్రీడికి తోడుగా
....సారథియై నిల్చి సమర భూమి
అర్జునుండు వివేక మంతరింప విషాద
....మొంది సంశయముతో నున్నవేళ
కర్తవ్య బోధను గావించి దుఃఖమ్ము
....పోగొట్టి మెండుగా ప్రోత్సహించి
ఉపనిషత్సమమైన యోగ శాస్త్రమ్మును
....బ్రహ్మ విద్యను దెల్పె పరమ గుహ్య
మైన గీత నా రీతిగా జ్ఞాన బోధ
సకల లోకములకు జేసె సద్గురుడయి
యా జగద్గురువర్యు పాదాబ్జములకు
వందన శతమ్ము గూర్తును భక్తి మెఱయ‘
జైహింద్.
Print this post

1 comments:

తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ. చెప్పారు...

బ్రహ్మశ్రీ పండిత నేమాని గురువర్యులకు ప్రణామములు. మీ పద్య స్ఫూర్తితో

సకల శాస్త్ర సారంబును సవ్యసాచి
చక్రి నోటను వినినంత సాగిలపడి
శరణు శరణని ప్రణమిల్లి శస్త్రమంది
యుద్ధమునకు సిద్ధపడెను హుంకరించి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.