గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఆగస్టు 2011, సోమవారం

భవ్యమహోజ్వల భారతీయుడా! స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.



ఆంధ్రామృత పాఠకులకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.
భారత మాత బిడ్డలు శబాసన వర్ధిలి రొక్క నాడిలన్
శ్రీ రఘురామ పాలనను చేతన మొందిన ధాత్రి.. దీనిపై
ధీరులు, వీరులున్,సుగుణ తేజ విరాజిత దివ్యమూర్తులున్
ప్రేరణ గొల్పు పాలనము ప్రీతిఁగ చేసిరనేకులిద్ధరన్. ౧

బంగరు భూమిగా, ప్రథిత భాగ్య విధాత్రిగ, ప్రాగ్వరేణ్యగా,
నింగికి నేలకుం దగులు నీతి నిధానగ, వజ్ర ధీర స
త్సంగులకాలవాలముగ, శాంతి గుణాన్వితగా తలంచి, యీ
తొంగి కనంగ రాని సువధూటిని స్వేత విజాతి క్రమ్మెనే! ౨

భారతరత్న బిడ్డల ప్రభావము గాంచి, సమైక్యతా గుణో
ద్భారతిఁ దెల్లవారు వల పన్ని, భ్రమల్ కలిగించి, ఐక్యతన్
దూరము చేసి, భవ్యులను ధూర్తులఁ జేసి, కుయుక్తి తోడ తా
చేరిరి మధ్య లోన. విరచించిరి దుర్మత దౌష్ట్య భావముల్.౩

ధన ధాన్యంబులు, పాడి పంటలు,  బృహద్రత్నావళుల్, భాగ్యముల్
మన సర్వంబును కొల్లగొట్టి, కొనిపో మార్గంబునన్ తెల్లవా
రనిశంబున్ కృషి చేసినారు. వివిధ ప్రాంతీయ దుర్భేదముల్
మనలోనన్ గలిగించి, రైక్య కలిమిన్ మాయామయుల్ దోచిరే! ౪

ఉనికిని గోలి పోవు తరి నున్న యదార్థములన్ గ్రహించినా
రనిరత సాధ్యమైన రుధిరార్పణకున్ వెనుకంజ లేని మా
యనిమహ నీయ శక్తిగ ప్రియంబున సర్వులునొక్కటై, మహా
ఘనతరమైన పోరున కకావికలొనరించిరి తెల్లవారలన్. ౫

ఎందరి ప్రాణ దాన ఫల మెందరి జీవన దాన సత్ఫలం
బెందరి భాగ్యదాన ఫల మెందరి సౌఖ్యప్రదాన సత్ఫలం
బెందరి భావనా ఫలిత మెందరి దీక్షల సత్ఫలామృతం 
బిందరమిప్పుడీ యనుభవించెడి స్వేచ్ఛ? గ్రహింప నేర్తుమా? ౬

ఎట్టుల వారి త్యాగ ఋణ మెప్పుడు  తీర్తుము? తీర్చనౌన? వా
రెట్టి మహత్వ భారతము నేర్పడఁ జూడగ కోరినారు ? నే
డెట్టి విచిత్ర దుస్థితి వరించినదీ జగదంబ భారతిన్?
గట్టి ప్రయత్నముం జరిపి గాంచగ చేతుము  స్వప్న భారతిన్. ౭.

స్వార్థము కల్గియుండియు లసత్గుణ సజ్జన శోభనెంచుచున్, 
స్వార్థ విదూర సేవలను చక్కగ చేయుచు ధర్మబద్ధతన్
స్వార్థ మదాంధులన్ దునిమి, చక్కగ నందరి తోడ జీవనం
బర్థమనోజ్ఞ మై వెలుగ హాయిగ సాగు విధంబు నుందుమా? ౮.

నైతిక కట్టుబాటు విడనాడక, సభ్య సమాజమందునన్
భౌతిక జీవితాన వరభావమహోజ్వల కాంతి రేఖయై
ధాతిరిపైవెలుంగుచును, ధర్మ నిబద్ధ ప్రశాంత జీవనం
బీ తరినుండఁగాదలచి యీశ్వరునాజ్ఞగ నెంచి యుందుమా?  ౯. 

మరువగ రాదు బాధ్యతలు. మంచితనంబును వీడరాదు.స
త్కరుణను వీడ రాదు. వర గౌరవభావము వీడరాదు. స
ద్గురు చరణాబ్జ సేవనము  గొప్పగ చేయుట మానరాదు. సా
దరముగ చూడగా వలయు దక్షత హీనుల ధర్మబద్ధులై. ౧౦. 

దురితము లాచరింపమియు, దుష్టవిదూరతయున్, సముల్లసో
ద్భరిత మనమ్ము, సౌమ్యతయు, బ్రహ్మ విధేయత, భక్తి తత్వమున్,
భరిత సుధాంతరంగమును, భవ్య నిరంతర సాధు సేవయున్,
భరతమహోజ్వలాత్ములకుభావ్యముగా మదినెంచుటొప్పగున్. ౧౧.
జైహింద్.
Print this post

5 comments:

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భమున మీరు చెప్పిన పద్యములు మధురంగా ఉన్నాయి. కొత్తపాళి గారి విడియో ఎందుకో రావడము లేదు. ఆయన పద్యాలిదివరకు విన్నా మళ్ళీ వినాలనిపిస్తున్నది.

Sanath Sripathi చెప్పారు...

విశ్వనాథ వారన్నట్టు పద్యాలు హృద్యంగా, నీరంధ్రిగా ఉన్నాయి మాస్టారు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! నరసింహ మూర్తి గారూ! నా పద్యాలు మీ అభినందనలందుకొనేలాగున్నందుకు ఆ సరస్వతీమాతకు ప్రణతులర్పించుకొనుచున్నాను. మీకు ధన్యవాదములు. ఇక కొత్తపాళీగారి పద్యాలు ఎందుకు తెవ బడటం లేదో తెలియటం లేదు. టెక్నికల్ సపోర్ట్ ఎవరైనా ఇస్తే బాగుండును.
మళ్ళీ ప్రయత్నిస్తానండి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియ సనత్! ఓపికగా పద్యాలు చదివినందికూ, మీ అమూల్య అభిప్రాయం తెలియజేసినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.