సాహితీ సంసేవక కవి మిత్రులారా!
మన అవధాని శ్రీ చంద్రశేఖరం గారికి ఒక అవధానంలో పూరణకై ఇచ్చిన సమస్యను ఈ క్రింద పరికించండి.
"శిరమున బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్".ఈ సమస్యకు కవిగారి పూరణమును, నా పూరణమును వ్యాఖ్యలలో గమనింప గలరు.
మీరు అత్యద్భుతంగా ఈ సమస్యా పూరణము చేసి వ్యాఖ్య ద్వారా పాఠకాళికి ఆనందం కలిగించ గలరని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.
12 comments:
ఈ సమస్యకు నాపూరణము.
హరుఁడంబుధిఁ జనియించిన
యరుదయిన విష బడబాగ్ని నంగుటి నుంచెన్.
ధరియించె నతఁడు గంగను
"శిరమున. బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్".
ఈ సమస్యకు అవధానిగారి పూరణను తిలకిద్దాం.
అరయ బడబాగ్ని శివునకు
గరళముగా కంఠ శీమ కాపురముండెన్.
తరి చూచి గంగ యెక్కెను
శిరమున. బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్.
చాలా బాగుంది కదండీ! అందుకే అవధానిగారికి మన అభినందనలు ఆంధ్రామృతం ద్వారా తెలియఁ జేస్తున్నాను.
శ్రీగురుభ్యోనమ:
గరళంబనుబడబాగ్నిని
సరళముగా మ్రింగె హరుడు,చంద్రుని సుసుధా
కిరణుని సుమముగ దాల్చగ
శిరమున, బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్
{సుసుధా కిరణుడు = మంచి అమృతమునిచ్చే చేతులు కలవాడు}
గురువుగారు వ్యుత్పర్తి అర్థం తప్పైతే మన్నించండి
శ్రీపతి శాస్త్రి గారూ! నిజం చెప్పమంటారా?
మీ పూరణ సరళంగా మనోజ్ఞంగా ఉందండి.నాకు చాలా నచ్చిందండి.
అభినందనలు.
హరుఁడు శశి నెట ధరించును?
శరధినిగల యగ్ని యేది? చలికాలపు రా
తురు లేరీతిగ మారెను?
శిరమున; బడబాగ్ని; మిగుల శీతల మయ్యెన్.
కందిశశాంకశేఖరులు, గౌరవ సద్గుణ శాలి, ప్రేమతో
నందగఁ జేసినారు పరమాద్భుత పద్య ప్రపూరణంబు నా
నందము నొందితిన్. క్రమమునన్ వివరించిరి కావ్య పద్ధతిన్
సుందర భావ పూర్ణ పరిశోభిత పద్యము. ధన్యవాదముల్.
సుందర పద్యముతోడ న
మందానందమ్ము నొసఁగినట్టి ఘనులె; మే
లందును; మీదు ప్రశంసల
నందుకొనుచుఁ దలఁచినాఁడ నాశీస్సులుగన్.
సురనది శిరమున జారెన్
సరిసరి నటనల శివునికి సతియై చేరెన్
విరిశరుఁ దహియించిన హరు
శిరమున బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్.
మూడవ కన్ను వైశ్వానర రూపమని చెపుతారు. ఆ కన్ను ఉన్న వేడిని గంగ తగ్గించిందని నా భావము.
మందాకినిగారూ! మీ పూరణ బాగుంది.
గంగ శివుని సతిగా చెప్పుకోవడం లౌకిక ప్రచారమే కాని, పురాణ ఆధారం లేదు.
ఐనా మీ పూరణ అందగించింది.అభినందనలు.
గురువుగారూ ధన్యవాదములు.
గురువుగారూ గంగ విషయంగా మీరు చెప్పినట్లు గంగాధరుడు అని అంటారు కాని గంగాపతి,గంగానాథుడు వంటి పదాలు నేను వినియండలేదు. శివునకు విష్ణువల్లభుడు అను నామం అధారంగా నేను ఒక పద్యం వ్రాయగా మా అన్నగారు అలా వ్రయకూడదు, గంగను శివునికి భార్యగా పూర్వకవులు వర్ణించినట్లుగా తెలిపినారు. ఆ పద్యాన్ని దయచేసి పరిశీలింప ప్రార్థన.
తల్లి ఒడినుండి దూకుచు దండ్రి జేరి
తనయ యుప్పొంగి పొందెడు తన్మయముగ
విష్ణుపాదాల జారుచు వేగమంది {వేగిరమున}
శివునిశిరమున గంగమ్మ చిందులేసె
విష్ణువును తల్లిగా శివుని తండ్రిగా భావించాను. నారాయణుడే నారాయణి కదా.
గురువుగారూ సమంజసమేనా?
కరములు కరవైన లలన
కర గ్రహణము చేతునంచొక వరుడు రాగా !
కరములు మోడ్చెను జనకుడు
శిరమున బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్!
తరులాకు రాల్చు నెప్పుడు?
దరి గానని జలధి నుండు తానే నిప్పౌ?
కురు తుహినమున నెటులయె? శి-
శిరమున; బడబాగ్ని; మిగుల శీతలమయ్యెన్.
గురువర! కిట్టించితినా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.