సాహితీ బంధువులారా!
అవధాన శేఖర, అవధాన భారతి బిరుదాంకితులగు బ్రహ్మశ్రీ కట్టమురి చంద్ర శేఖర్ అవధాని విజయనగరం నివాసి. విశ్రాంత ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు, సుప్రసిద్ధ తెలుగు ఉపన్యాసకులు. రాష్ట్ర ప్రతిభారత్న పురస్కార గ్రహిత. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహిత, శ్రీమాన్ సద్గురు కృష్ణ యాజిగారి నిర్వహణలో గల శ్రీ సూర్య సదన ఆస్థాన పండితులు. అట్టి శ్రీమాన్ కట్టమురి చంద్రశేఖర్ చేసిన అవధానములలో పూరణకై ఇచ్చిన సమస్యలను, అవధాని ఆ సమస్యలను పూరించిన విధమును మీ ముందుంచుటకు ఆనందంగా ఉంది.
ఈ సమస్యలను పాఠకులు తమ నిపుణత చూపుతూ పూరించి, తమ పూరణలను కూడా తోటి పాఠకులకు అందించడం ద్వారా ముదావహులగుదురని ఆశించుచున్నాను.
ఈ రోజు ప్రకటిస్తున్న సమస్య:-"ఖరము శిఖరమయ్యె కవి కులమున"
ఈ సమస్యను మన అవధానిగారు పూరించిన విధానం చూద్దాము.
కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు.
కవిని కన్న పేరు గాంతురిలను.
తనర పేరు పొందు ధరణిలో చంద్రశే
"ఖరము శిఖరమయ్యె కవి కులమున"చూచారు కదా అవధాని చేసిన పూరణ.
నేను చేసిన పురాణము వ్యాఖ్యలలో చూడఁ గలరు.
ఔత్సాసికులైన మీరు కూడా ఈ సమస్యను పూరించే ప్రయత్నం ఎందుకు చేయ కూడదు? ప్రయత్నించి చూడండి. తప్పక పూరించ గలరని నా నమ్మకం. శంకరాభరణంలో అద్భుతంగా తీర్చి దిద్దబడుతోంది మీ రచనా పాటవం. అది ఎంతవరకూ మెఱుగులు దిద్దుకుందో ఈ సమస్యా పూరణద్వారా ప్రయత్నించండి. మీ పాటవాన్ని పరీక్షించుకోండి. శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.
9 comments:
ఈ నాటి యీ సమస్యకు నా పూరణము.
పట్టె నెవరి కాళ్ళు పడి వసుదేవుఁడు?
విశ్వనాధ కల్ప వృక్ష రచన
చేసి కవుల లోన వాసి యెంతగ గాంచె?
ఖరము శిఖరమయ్యె కవి కులమున.
పద్య పాదమందు పదముగ నున్నట్టి
ఖరము శిఖరమయ్యె; కవికులమున
ఘనులు, పూరణమున ఖరమును శేఖర
మంచుఁ బలికి నారు మంగళముగ.
మందాకిని మధురాక్షర
బంధంబున కమరె శోభ. బ్రహ్మాండముగా
నందంబుగ నుండెను మీ
సుందర పూరణము కవన శోభను గంటిన్.
అమందానంద మందాకినీ!
ధన్యవాదములు.
పలువిధమ్ములైన పక్షు లీ ధరనుండ
ధరణిజను పొడువఁగ దాశరథియె
యేయ బాణ మొకటి యేకాక్షియైన ము
ఖరము శిఖరమయ్యె కవికులమున.
(ముఖరము = కాకి, కవికులమున = నీటికాకుల సమూహంలో)
‘కవియను నామమ్ము నీటికాకికి లేదా?’ అని ప్రసిద్ధ చాటువు.
కట్టమూరి వంశ ఘన పాల సంద్రపు
చందమామ కివియె వందనములు!
కవన కాంతు లీను ఘనుడగు చంద్రశే-
ఖరము శిఖరమయ్యె కవి కులమున.
కొంచె మైన నేని గుర్తింపు దక్కుటన్
పద్య కవివరులకు పట్టణమున
గతము మిగుల గడ్డుకాలముగను దోచె,
"ఖరము" శిఖరమయ్యె కవి కులమున.
రామకృష్ణా!
సామాజిక స్పృహతో నేటి స్థితి గతులకు అద్దం పట్టుతూ అర్థాంతాంతర న్యాసాలంకారంలో పూరించిన మీ పూరణ అభినందనీయం. ధన్యవాదములు.
'ఖరము మీద నిలచె కమనీయ ముగ శివుడు'
యను సమస్య నీయ నపుడె నేను
వరుస వ్రాసి నాడ గిరి శిఖర మనుచు
'ఖరము శిఖరమయ్యె కవి కులమున'.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.