గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2011, బుధవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ13)


సాహితీ బంధువులారా!
అవధాని శ్రీ చంద్ర శేఖరం గారెదుర్కొని పూరించిన ఒక సమస్యను ఇప్పుడు చూద్దాం.
"ద్రౌపది రామునకు భర్త దౌహిత్రియగున్"
చూచారు కదా! ఈ సమస్యకు నాయొక్క ,  అవధానిగారి యొక్క పూరణలను వ్హ్యఖ్యలో చూడవచ్చును.
మీరు మీ జ్ఞాన ప్రభాసమానంగా ఉండేలా పూరణలు చేసి, మీ పూరణల ద్వారా పాఠకాళిని ముగ్ధుల్ని చేసాతని ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

17 comments:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆపతు లేవుర సతి ? సీ
తా పతి పేరెవరి కుంది ? తనయుని తండ్రే
రూపము? సుత సుత ఏమౌ ?
ద్రౌపది - రామునకు - భర్త - దౌహిత్రియగున్ !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణము.

దీపీత దృపదాత్మజ యెవ
రేపతికి జనకజయె సతి?ఎవరు భరించున్?
ప్రాపిత సుత సుత యేమగు?
"ద్రౌపది రామునకు భర్త దౌహిత్రియగున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు అవధాని గారి పూరణము.

ఆ పంచ భర్త్రుకెవరయ?
భూపుత్రి యెవరికి భార్య? భూమికి రాజే
మౌ?పాప తన్య తండ్రికి?
"ద్రౌపది రామునకు భర్త దౌహిత్రియగున్.

మిస్సన్న చెప్పారు...

క్రమ మొక్కటె దిక్క మనకు కంజ దళాక్షా?

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

పాపలు గా క్రతుఫలమై
రూపము; వాసము వనమున రూఢిగ కుదిరెన్-
పాపకు పాప సపత్నికి-
ద్రౌపది, రామునకు; భర్త దౌహిత్రియగున్.

Pandita Nemani చెప్పారు...

ఈ సమస్యను పూరణను తిలకించండి

గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్

గణపతి దుస్థితి గని హిమ
ఘృణిమంతు శపించె శీతగిరిసుత యక్కా
రణమున శీతాంశుండుడు
గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్

మిస్సన్న చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మిస్సన్న చెప్పారు...

శ్రీ నేమాని వారి సమస్య, పూరణ బహు బాగున్నాయి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హనుమచ్ఛాస్త్రి గారూ!
క్రమాలంకారంలో చక్కగా పూరించారు. అభినందనలండీ.

మందాకిని గారూ! చక్కగా పూరించారు. ఐతే మరొక్క సారి చదివితేనే భావ గ్రహణ చేయాడమౌతుందండి. బాగుంది. అభినందనలండీ.

మిస్సన్న గారూ! పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారు గొప్ప కవి. అవధాని.
ముఖ్యంగా అధ్యాత్మ రామాయణాన్ని అద్భుతంగా పద్య కావ్యంగా వ్రాసి అనేకులైన కవి పండిత పీఠాధిపతూల మన్ననలనందుకొన్న మహా మనీషి.
మీ అందరి రచనా వ్యాసంగాన్ని పరిశీలించి, మన కున్న ఆసక్తికి ఆద్యం పోసి ప్రోత్సహిద్దామనే ఉద్దేశ్యంతో మనను సమీఓపించి ఆంధ్రామృతం పంచనెంచారండి.
ఇక మీరు సమస్యా పూరణకు చక్కన్ ప్రయత్నం చేసారు. అభినందనలండి.

మిస్సన్న చెప్పారు...

ఆర్యా ! శ్రీ నేమాని పండితులవారిని గూర్చి విశేష మైన వివరాలను తెలియజేసి సంతోష పరచారు.
మీ మాటలు విన్నాక వారిచ్చిన సమస్యను పూరించాలనే తపన నాకు కూడా కలిగింది.

నా ప్రయత్నం:

గణపతి నవరాత్రములన-
గణితంబగు శ్రద్ధ తోడ గావించిన ధా-
రుణి విడనాడుట కెన్నడు
గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్

Pandita Nemani చెప్పారు...

శుభాకాంక్షలు

నవరాత్ర్యుత్సవ వైభవ ప్రతతులన్ దర్శించి హర్షించుచున్
వివిధ ప్రక్రియ లాత్మ కింపు గొలుపన్ ప్రీతిన్ వరాలిచ్చుచున్
కవిలోకాగ్రణి విఘ్ననాయకుడు లోకక్షేమ సంధాత వే
భువనాళిన్ వెలుగొందజేయుత దయాపూర్ణేక్షణుండాదృతిన్

మిస్సన్న చెప్పారు...

ఆర్యా ! శ్రీ నేమాని వారి ' అధ్యాత్మ రామాయణం ' కావ్యం ప్రాప్తి స్థానాన్ని తెలియజేయండి.

శ్రీపతి శాస్త్రి చెప్పారు...

శ్రీమహాగణాధిపతయేనమ:
గురువుగారికి, కవిమిత్రులకు వినాయకచవితి శుభాకాంక్షలు.

మిస్సన్న చెప్పారు...

పండిత శ్రీ నేమాని వారికి ధన్యవాదాలతో,
ఆఖరి కిలా కిట్టించానార్యా!

" రూపా! సతి యెవ్వరి కగు
ద్రౌపది? " ' రామునకు ' !! " భర్త దౌహిత్రి యగున్
పాపా నీకే వరుస? " న
' ఛీ! పొమ్మ' ని పారిపోయె సిగ్గుల మొగ్గై.

Pandita Nemani చెప్పారు...

మీ పటిమ దత్తపదిలో
చూపరె అవధానివర్య సుశ్లోక యటం
చీ పదముల నొకడిచ్చెను
ద్రౌపది రామునకు భర్త దౌహిత్రి యగున్

Pandita Nemani చెప్పారు...

తెలుగు భాష

అతిరుచిసారవంతము సమస్త జనాదరణీయ వైభవా
న్వితము సువర్ణ సంయుతము నిర్మల లక్షణ భాసురంబు న
ద్భుత చరితాభిరామము సదక్షర రూప కళాన్వితంబు భా
రతి సిగలో వెలుంగు నవరత్న విభూష తెలుంగు భాషయౌ

అజ్ఞాత చెప్పారు...

మిస్సన్న గారూ,

శ్రీ నేమాని వారి ఆధ్యాత్మ రామాయణం లంకె ఇదిగో.

http://www.lalithaedas.com/ramayanam/

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.