గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మే 2020, ఆదివారం

కరోనానంతరం భారతీయ జీవనం....బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు.

జైశ్రీరామ్.
కరోనానంతరం భారతీయ జీవనం. బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు. Rjy: 

తరతరాలుగా భారతదేశం వసుధైక కుటుంబ భావనతో పరంపరగా వచ్చిన ధర్మ సంప్రదాయాలను నేర్పుతూ ఇల్లే ఒక ఙ్ఞాన కేంద్రంగా ఏర్పడి ఒక విశిష్టమైన సంస్కృతిని వ్యవస్థగా చేసుకున్నది. అలాంటి అవకాశాన్ని కరోనా కారణంగా మళ్లీ మనం తలచుకొని మన ఇళ్లల్లో ప్రసారం చేసుకుని పునరుత్తేజితులమవుదాం. విశ్వానికి మార్గదర్శకులమవుదాం.
కరోనా తొలగిన తరువాత కూడా ఈ జీవనాన్ని మనం అలవాటు చేసుకుంటే ఒక అద్భుత శక్తిని పొంది విశ్వానికి అందించగలుగుతాం.
స్పర్శదోషాత్ సూక్ష్మరోగా:
స్పర్శదోషాత్(ద్)కృమి వ్రజా:
స్పర్శదోషాత్(ద్) విషూచ్యశ్చ
భవేద్ అస్పర్శత: సుఖం

స్పర్శ దోశం వల్లనే సూక్ష్మ రోగాలు, విషక్రిములు, అంటురోగాలు తెలియకుండా వస్తాయి. కాబట్టి మడిగా ఉండడం వలన, ఎవరి హద్దులలో వాళ్లు ఉండడం వలన, అనవసరమైన స్పర్శ లేకుండా ఉండడం వలన అలాంటి సుఖం కలుగుతుంది. దాన్ని పొందుదాం.
సర్వే 2 పి నియమా: పాల్యా:
కథితా(:) ఋషిభి: పురా
మానస్య: స్యుశ్చ వాచిక్య:
శారీర్యశ్చ క్రియా: శుభా:

మనకు పూర్వ ఋషులు అందించిన అన్ని నియమాల్ని పాలించాలి. మన మానసిక వాచిక శారీరిక క్రియలు ఏవైనా మనకు అందరికీ శుభాన్ని ఇచ్చేవిగా ఉండాలి. వాటిని పాటిద్దాం.
వర్ణాశ్రమాచారధర్మా:
గృహస్థైర్ జ్యేష్ఠపూరుషై: (ర్)
మాతృభి: సాధువృద్ధాభి: (ర్)
గృహ్యా(:) జ్ఞేయా(:)విచార్యచ

జీవన వృత్తి కొసం, పొరుగిండ్లవారికి చేయుతనివ్వడం కోసం ఎవరు ఒత్తిడి చేయకుండగనే పరంపరగా వచ్చినవి వర్ణాశ్రమాచారధర్మాలు. మనం వేరే కుటుంబాల వారికి సమాజానికి సేవ చేయటం బ్రాహ్మణాది వర్ణ ధర్మాలు. ఏ వయస్సులో ఏమి చేయ్యాలనేదాన్ని సూచించేది బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మం. ఎవరి ఇంటిలో వారు చేసుకునే జీవన వ్యాపార వ్యవహారాలు, వృత్తి ధర్మాలు, కుల ధర్మాలు, ఆచారాలూ. వీటిని పూర్వము ఇంటిలో ఉండే వారే పెద్దలు, తల్లులు, అతిథులు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు అందరూ చెప్పేవారు. ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు కూడా పెద్దలు చెప్పిన ఆ తల్లులు చెప్పిన వర్ణాశ్రమాచార ధర్మాలను చర్చించి తెలుసుకుందాం. అర్థంచేసుకుందాం.
గృహం ధర్మపదం ప్రోక్తం
గృహాచారా: శివా: స్మృతా:
అభ్యాసశ్చ భవేన్నిత్యం
సంస్కార: పారివారిక:

ధర్మం అనే శబ్ధం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి స్థానము చోటు ఇల్లే. కాబట్టి, ఇంటి ఆచారాలు అన్నీ మంచిని చేస్తాయని మంగళాన్ని కలిగిస్తాయని గమనించాలి. వీటిని ఇంట్లోనే నేర్చుకోవాలి. కుటుంబ సంప్రదాయము, పరంపరగా వచ్చిన ఆచారమే సంస్కారము.
వృద్ధానాం వచనం శ్రావ్యం
తథా కార్యం యథాశ్రుతం
శనై: శనై: ప్రబోధ: స్యాద్ (జ్)
ఊనానాంచ వయో 2 ధికై:

పెద్దవాళ్ల మాటను వినటము, విని ఆచరించటం ఇప్పుడు ఈ రెంటినీ మర్చిపోయాం. వాళ్లేమి చెప్పితే అది విని అర్థం చేసుకుని ఆచరించడాన్ని ప్రారంభించాలి. ఆచరించి తీరాలి. పెద్దవాళ్లు కాలానుగుణంగా పిల్లలకు ఉద్వేగము రాకుండా సావధానంగా ఉత్సాహము కలిగేట్టుగా ప్రబోధించాలి. చిన్నవాళ్లు పెద్దలు చెప్పిన దానిని వ్యతిరేకించకుండా మెల్లమెల్లగా ఆచరిస్తూ ఉంటే వాళ్ల మాటలకు గల భావం అర్థమవుతుంది.
కుటుంబే విధయ: సర్వే
నిర్వర్తవ్యా: సమై: సహ
పరస్పరం సమైక్యేన
కార్యం కార్యం హితం ప్రియం

కుటుంబంలో, ఇంట్లో చేయవలసిన ఏ పనులు అయినా అందరివి అని ఆలోచించాలి. అందరూ కలిసి చేసుకోవాలి. ఒకరికి విరుద్ధంగా ఒకరు చేయకూడదు. మనం చేసే పనులు మనకు ఇంట్లో ఉండేవాళ్లందరికీ ఇష్టంగా మేలు కలిగించేవిగ చేయదగినవిగా ఉండాలి. కాబట్టి అలాంటి పనులను ఆలోచించి చేద్దాం.
గృహకార్యేషు సర్వేషు
నిర్వర్తనసమానతా
తథా ధర్మప్రబోధశ్చ
భవేద్భూయో యథా పురా

ఇంటిలో ఉండే పనులన్నింటి మీద చేయవలసిన బాధ్యత అధికారము అందరికీ సమానము. కాబట్టి పూర్వకాలములోలాగా ఇప్పుడు కూడా అట్టి ప్రబోధము జరుగుతుండాలి.
పాఠశాలాసు సంబోధ్యా:
నృణాం జీవాతవో గిర:
క్షమాదయాదిసుగుణా:
కలా: సద్వృత్తయ: శివా:

పాఠశాలలలో డబ్బు వచ్చే విషయాలను బోధించటం కాకుండా ఉత్తమ జీవనమునకు ఆధారమైన మంచి మాటలు సుభాషితాలు ఓర్పు దయా మొదలైన గుణాలు, ఇంటిలో చేసే జీవన వృత్తులు కళలు అన్నీ మంచివని బోధింపబడాలి.
మాతా పిత్రోర్గురూణాం చ
గౌరవం జ్ఞానినాం నృణాం
శిక్షణీయం చ విజ్ఞానం
వైరాగ్యం తత్వచింతనం

అట్లే తల్లిదండ్రులు పెద్దలూ గురువులు ఙ్ఞానులూ ధర్మము చేయువారు దేశభక్తులూ గొప్పవారనే విషయం, వారి పూర్వుల యొక్క గొప్ప విఙ్ఞానం తృప్తి వైరాగ్యము తత్త్వచింతనము, ఇవన్నీ గొప్పవని కూడా పాఠశాలలో నేర్పించాలి.

2. భారతీయ జీవనం - కరోనానంతర జీవనం
న శిక్షణీయా వైదేశ్యా:
భాషాస్తజ్జీవనీ పుర:
న నాగరికపద్ధత్య: (శ్)
చాలస్యాసత్యవర్ధితా:

ప్రారంభ దశలో విదేశీయ భాషలు గానీ విదేశ జీవన విధానాన్ని గానీ నేర్పకూడదు. గ్రామీణులు ముందుగానే తమ పిల్లలకు నాగరిక పద్ధతులను కూడా బోధించరాదు. అట్లే ముందుగానే ప్రక్క ఇంటి వారి పద్ధతులను నేర్పరాదు. అట్లు నేర్పినచో సోమరితనము అసత్య ప్రవృత్తి పెరుగును. కొంత విఙ్ఞానము కలిగిన తరువాత వీటిని తెలుసుకొనవచ్చును. ఎవరి ఇంటిలో వాళ్లకు సోమరితనం ఉండరాదు, అసత్య వ్యవహారం ఉండరాదు అని తాత్పర్యము.
మాతాపిత్రోశ్చ యా వృత్తి:
సైవ స్యాదనుజీవినాం
దుహితౄణాం చ పుత్రాణాం
సా హి పిత్రో: సుభక్తి కృత్

తల్లిదండృలకు ఏది జీవనవిధానమో (వ్యవసాయము, వ్యాపారము, వైద్యము, న్యాయవాదిత్వము, పౌరోహిత్యము, అర్చన, వాహన చాలనము మొదలైన వృత్తి) అదే ఆ ఇంటిలో పిల్లలకు ఉండవలయును. వారిననుసరించు వారి వృత్తియే వీరిననుసరించు వారికిని ఉండవలయును. కూతుళ్లకు తల్లి చెప్పే పని పట్ల కొడుకులకు తండ్రి చేసే పని పట్ల శ్రద్ధ ఉంటే అదే తల్లిదండ్రుల పట్ల భక్తిని కలిగిస్తుంది.
జీవనార్థం నాన్యవృత్తి: (ర్)
వృథా దుర్వ్యయకారిణీ
గృహం జీవనవృత్యాస్త్థా
శాలా సత్సంప్రదాయదా

బ్రతుకు కోసం తల్లిదండ్రుల జీవన వృత్తి కాకుండా ఇంకొకరి జీవన వృత్తి, లేదా డబ్బు వచ్చే వేరొక మార్గము మంచిది కాదు. అది వ్యర్థముగా ఎక్కువ ధనమును వ్యయ పరచడానికి కారణమవుతుంది. ఇల్లు బ్రతకడానికి ఒక జీవనవృత్తి పద్ధతి కలదనే నమ్మకము పిల్లలకు కలిగించేది కావాలి. పాఠశాల ఆ పరిసరాలలో ఉండే వారందరికీ సామూహిక సామాన్య సంప్రదాయమును అందరము ఒకటను కలిసివుండాలను మంచి పద్ధతిని నేర్పించేది కావాలి.
వాసస్థానసమీపే స్యాత్
పాఠశాలా సనాతనీ
భాషావిద్యాప్రబోధాయ
నార్థసంపాదనాయ సా

మనము నివసించే చోటునకు దగ్గరగానే మన సంప్రదాయాన్ని తెలియచేసే పాఠశాల ఉండాలి. దూరంగా ఉండే పాఠశాలలకు పిల్లలను పంపరాదు. ఆ పాఠశాల ముఖ్యముగా భాషను విద్యను విఙ్ఞానమును ధర్మమును బోధించేది అయి ఉండాలి. కేవలము డబ్బు వచ్చే మార్గమును తెలియుటకై ఏ పాఠశాల ఉండకూడదు.
కలాశాలా పృథగ్ భూయాత్
పుంసాం స్త్రీణాం సువృత్తిదా
న ప్రేష్యాస్తనయా: దూరం
పితృభ్యాం జాతు వృత్తయే

అలాగే కొంత వయసు వచ్చిన పిల్లలకు, స్త్రీలకు గానీ పురుషులకు గానీ విడివిడిగా, వారి వృత్తికి, వారి సేవా వృత్తికి మార్గముగా కళాశాలలు ఉండాలి. కాబట్టే తల్లిదండ్రులు తమ పిల్లల్ని యువకులనైనా యువతులనైనా దూరంగా పంపకూడదు.
స్వదేశవస్తువాణిజ్యం
శ్రేష్ఠం కార్యం వణిగ్వరై:
విదేశవస్తువ్యామోహో
న సంవర్ధ్య: కదాచన

ఈ కాలమున అందరమూ వ్యాపారము చేద్దాం అనుకుంటున్నాం. అయితే మన దేశములోని వస్తువులనే ఎక్కువగా అమ్మడం కొనడం చేస్తే మన దేశ వాసులకే ఎక్కువ లాభం కలుగుతుంది. కాబట్టి స్వదేశ వస్తువుల వ్యాపారమును మనవారికి లాభకరముగా ఉండునట్లుగా వ్యవస్థ చేసుకోవాలి. (విదేశ వస్తువులు అవసరమైనచో అవి మన దేశములో లభించనివైతేనే వాటిని దిగుమతి చేసుకోవాలి. విదేశీయులకు మన వస్తువులు అవసరమైతేనే వారికి ఎగుమతి చెయ్యాలి. మొత్తము మీద వారికి మనకు లభించని వస్తువులను మాత్రమే విదేశ వ్యాపారముగా చేసుకోవాలి. విదేశ వస్తువుల పైన వ్యామోహము ఉంచరాదు పెంచరాదు.)
గ్రామస్థా నగరస్థా: స్యు: (ర్)
భిన్నభిన్నస్వవృత్తికా:
పరస్పరాంతికావాసా:
పరస్పరహితక్రియా:

గ్రామములో ఉండే వారు గాని, నగరములో ఉండే వారు గాని వేరు వేరు జీవన వృత్తులు కలవారై కలిసి దగ్గర దగ్గరగా ఉండాలి. ఒకరికొకరు కావలసిన సహకారమును మేలు చేసుకోవాలి.
కలాశ్చ వృత్తయ: సర్వా:
పూజ్యా జీవనసాధనా:
ఆవశ్యక్య: స్వయం కార్యా:
శ్రమతృప్తిహితాకరా:

ఏ కళలు గానీ ఏ జీవన వృత్తులు గాని, బ్రతుకుకు సాధనమైన ఏ మార్గమము గానీ తక్కువవి అని భావించకుండా వాటిని మనము గౌరవించాలి. మన పూర్వుల జీవన వృత్తులను మనము స్వయముగా స్వీకరించి జీవనవృత్తులుగా మార్చుకున్నచో అవసరములని భావించినచో అవి మనకు తగినంత పనినిచ్చి తృప్తినిచ్చి మేలును కలిగిస్తాయి. కాబట్టి అన్ని కళలు, అన్ని వృత్తులు అవసరములే.
ప్రకృతే: సులభా అర్థా:
ఉపయుజ్యా హితా: ప్రియా:
వికృతిద్రవ్యసంప్రీతి: (ర్)
న కర్తవ్య: ప్రయత్నత:

ప్రకృతి సహజంగా లభించే వస్తువులను వీలయినంత వరకు సంపాదించుకోవాలి. వాటినే ఉపయోగించితే అవి ఇష్టముగా ప్రీతికరంగా అవుతాయి, అలా వాటిని చేసుకోవాలి. వికృతి పదార్థములను (అనగా వస్తువులను కలిపి చేసిన, కొన్న అమ్మిన వ్యాపారములకు సిద్ధపరిచిన వండిన కూరలు, వండిన పచ్చళ్లూ మొదలగు వాటిని) విపరీతముగా ప్రీతితో స్వీకరించరాదు, సంపాదించరాదు. (ఇంటిలో వండిన కూరలనూ, పచ్చళ్లనూ, అన్నము మొదలైన పదార్థములను స్వీకరించవలెను, తినవలెను.)
3. భారతీయ జీవనం - కరోనానంతర జీవనం
యత్నేన సిద్ధ ఆహార:
స్వీకర్తవ్య: స్వయం గృహే
క్రీతాహారో భవేన్నైవ
జీవనాయాహితప్రద:

మన ఇంటిలోనే శ్రద్ధగా ప్రయత్నముతో సంపాదించిన ఆహారమును తినవలెను. కొనిన ఆహారము, అట్ట శూలములలో, అంటే హొటళ్లలో వీలయినంతవరకు స్వీకరింపకూడదు. అది బ్రతుకునకు జీవనానికి మేలు చెయ్యదు.
అనివార్య: కథఞ్చిత్ స్యాద్ (చ్)
(చ్చా) శాకాహారో నృణాం ప్రియ:
వార్యో మాంసమయాహారో
విశేషేణ క్రమేణ వా

మన ఇంటిలో చేసిన శాకాహారము తప్పకుండా స్వీకరించవలెను. మాంసాహారము వీలయినంతవరకు లెకుండా చేసుకొనవలెను. క్రమముగా అందరు శాకాహారులు కావలెను.
ఆగతాతిథి సత్కార-
పూర్వకం దినభోజనం
మితం హితం న ద్రుతం చ
విహితం రాత్రిభోజనం

ప్రతిరోజు పగలు ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదగా భోజనము పెట్టి మనము భుజించవలెను. భోజనమును మితముగా హితకరముగా స్వీకరించవలెను. తొందరతొందరగా భోజనము చెయ్యరాదు. రాత్రి వీలయినంత తక్కువగా తీసుకోవడం మంచిది.
జీరకార్ద్రక హారిద్ర
హింగుధాన్యాకమారిచా:
ఘృతతైలై: సంస్కృతా వా
మిశ్రితా వా నిరామయా:

మనము తినే ఆహారములో జీలకర్ర, అల్లము, పసుపు, ఇంగువ, ధనియాలు, మిరియాలు, సాధారణముగా వాడవలెను. మంచి నేతితో గాని, మంచి నూనెలతో గాని పోపు పెట్టబడిన ఔషధములతో కూడిన ఆహారములు అనారోగ్యాన్ని కలిగించవు.
అకట్వనాంలా లవణా:
రస్యా: స్నిగ్ధా: శుచి ప్రియా:
సూపసారా: స్యురాహారా:
దధిక్షౌద్రఫలాన్వితా:

మనము తినే పదార్థాలు మిక్కిలి కారముగా, చేదుగా, మిక్కిలి పులుపుగా, ఉప్పుగా ఉండక, ఆరు సమాన రసములతో ఉండేవై నేయి మొదలైన చమురుతో ఉండేవై శుద్ధములై ఉండేవై ఇష్టమైనవై కావలెను. పప్పు చారు పెరుగు తేనె వివిధ ఫలములు మొదలైనవి ఆహారముగా ఉండవలెను.
స్థానాంతరే చ కార్యాణి
కర్తుం యోగ్యాని చింతయేత్
యథా 2వకాశం స్వస్థానాద్
దూరం దూరం న చ వ్రజేత్

మనం ఊళ్ళో కాక వేరే ఊళ్ళల్లో చేసే పనులను వీలయినంతవరకు గొప్ప వాటినే చేయవలెను. వీలయినంతవరకు మన స్థానాన్ని వదిలిపెట్టి దూరప్రాంతాలకు వెళ్లరాదు.
బాలాన్ యూన: పాఠనాయ
గ్రామదేశాంతరాణి తే
నైవ సంప్రేషయేయుర్హి
పితర: సాధువృత్తయ:

చిన్న పిల్లల్ని గానీ పెద్ద పిల్లల్ని గానీ చదువు కోసం గ్రామాంతరాలకూ దేశాంతరాలకూ పంపరాదు. తల్లిదండ్రులు మంచి పనులను చేస్తూ పిల్లలు మంచి పనులు చేసేటట్లు చేయవలెను.
పుత్రస్య పుత్ర్యా వా వృత్తి: (ర్)
మాతా పుత్ర్యోస్తు యా భవేత్
స్వధర్మ ఇతి సా వృత్తి:
శిక్షణీయా హి జీవికా

కుమారునికి గానీ కూతురుకు గానీ తాము చేస్తున్న జీవన వృత్తినే స్వధర్మమని జీవికగా నేర్పవలెను.
అలసత్వమసత్యత్వం
అక్రియత్వం న కస్య చిత్ (ద్)
యథా నైవ భవేదేవం
శిక్షణం శ్రేయసే భవేత్

ఎవరికీ సోమరితనం ఉండరాదు. అసత్య వ్యవహారము ఉండరాదు. పని లేకుండా ఎవరూ ఉండరాదు. ఆ విధముగా ఇంటిలోనే శిక్షణ జరగవలెను. అదే అందరి మేలుకు కారణమగును.
స్వస్తి.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.