జైశ్రీరామ్.
నా ఆంతర్జాల అవధానం తే.24 - 4 - 2020 శంకరాభరణం వాట్సప్ లో
నా ఆంతర్జాల అవధానం తే.24 - 4 - 2020 శంకరాభరణం వాట్సప్ లో
ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా గణాధిపతయే నమః.
జైహింద్.
ప్రార్థన.
శా. శ్రీమన్మంగళ భావనాక్షరదుఁడౌ శ్రీ పార్వతీ నందనున్,
శ్రీమద్వాణిని, శ్రీ రమా శుభద నా శ్రీ విష్ణువున్, శంకరున్,
శ్రీమద్బ్రహ్మను నా మదిన్ దలచెదన్ చిత్తంబులో నిల్చి, న
న్నీమాన్యాధ్వరమందు శోభిలునటుల్ హృద్యంబుగా చేయఁగన్.
చ. గురువులు కల్వపూడి కుల కోవిదులౌ వర వీరరాఘవున్
నిరుపమ భక్తితోఁ గొలుతు, నేర్పరులౌ మన శంకరార్యులన్,
విరియఁగ సద్వధాన విరి పృచ్ఛకపాళియెమూలమంచు ని
త్తరిని నుతింతు వారలను దారిని నన్ గమనింపఁ జేయఁగన్.
సంచాలకుల, పృచ్ఛకుల ప్రశంస.
ఆటవెలదులు.
కందిశంకరయ్య కమనీయ రమణీయ
కవితలల్లఁజేయు ఘనులు భువిని
మహితులువెలుదండి మాన్యసత్కవివరుల్
గ్రంథ రచన చేయు ఘనముగాను. ౧.
అనుపమాన ప్రతిభు లరయనన్నపురెడ్డి
సత్ ప్రబంధ కర్త సరస మతియు.
సౌమనస్యులరయ సరస పంచాంగము
సత్యముభువి సుగుణ స్తుత్యమతులు. ౨.
నారుమంచి వంశ నయ వర్తనుల్ కృష్ణు
లసదృశ ప్రజ పద్య మమరిచి రిల.
ముద్దురాజయాఖ్య పూజ్య సత్కవిఁ జూడ
మోముపైన నగవె ముద్దుఁ గొలుపు. ౩.
శ్రీధరుండె క్షితిని శ్రీధరరావు సత్
కృతికి కర్తగనయి కీర్తిపొందె.
సుగుణుఁడు మిరియాల ప్రగణిత వంశజ
సత్ప్రసాదు ఘనుడు సహృదయుఁడిల. ౪.
విట్టుబాబు చరిత బట్టి చూచితిమేని
కవిగ బ్రహ్మగ నిల ఘనత గనెను.
ఇట్టి ఘనత నొంది రిచటి సంచాలకుల్,
పృచ్చకాళి నాకు పెంచు కీర్తి. ౫.
వందనంబు చేసి వరలింప గోరుచున్
శారదాంబ కృపను సన్నుతింతు
ప్రేక్షకాళి మదుల నక్షయసత్కీర్తి
కోరుచుంద్రు నాకు గురువులగుచు. ౬.
1. నిషిద్ధాక్షరి.
డా.వెలుదండి సత్యనారాయణ🏼
అవధాని గారూ! నమస్సులు..
శ్లో. బుద్ధి ర్బలం యశో ధైర్యం
నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ
హనుమత్ స్మరణా ద్భవేత్
అనే ప్రసిద్ధ శ్లోక భావంతో
ఆంజనేయుని ప్రార్థించండి.
🏼
నా పూరణ.
క. శ్రీ లక్ష్యంబుల్ గొల్పున్
కేలం బ్రోచున్ ప్రభావ నిత్యత్వమ్మున్
మ్రోలన్ మ్రొక్కన్ హనుమన్
బీలమ్ముల్ బాపి శక్తి వెల్గఁగఁ జేయున్.
2. సమస్యా పూరణ.
శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డి.🏼
గురువర్యులకు, సంచాలకులకు, పృచ్ఛకులకు, అవధానిగారికి నమస్సులు.
నేనిచ్చే సమస్య:
చినవాడే నను చేర్చు స్వర్గమునకున్ చేయంగ నారాధనల్.
నా పూరణ.
చ. గుణగణ్యుండిల శ్రీహరిన్ దలచుచో కూర్మిన్ గనున్ తాను సద్
వినయంబున్ గలిగించి మంచిఁ గొలుపున్ విశ్వాసమున్ నిల్పుచున్
క్షణమైనన్ విడనట్టివాడు గనుచున్ గాపాడు రాముండు. బ్రో
చినవాడే ననుఁ జేర్చు స్వర్గమునకున్ చేయంగ నారాధనల్.
3. దత్తపది.
శ్రీ పంచాంగం సత్యం.
నమః సభాయై
అవధానిగారికి నమస్సులు.
నేనిచ్చే దత్తపది :
హంత
ముంత
వింత
చింత
పై పదాలను ఉపయోగిస్తూ
కరోనాకాలంలో నిర్మానుష్యమైన తిరుమలలో స్వామివారిని సేవిస్తూ ఉత్పలమాలలో
మాల వేయండి.
నా పూరణ
ఉ.🏼 హంతకి యౌ కరోన కరుణాత్ములకున్ వ్యధ గొల్పుచుండగా
ముంత జలంబునైన హరి ముంగిట బెట్టు టసాధ్యమాయెనే
వింత కరోనచే హరియె వింతగనొంటరిగానె నిల్చెని
శ్చింతగ నుండ జేయుమయ శ్రీహరి సేవలు గొల్పు శంకరా!
4. న్యస్తాక్షరి.
శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ.
అవధాని చింతా రామకృష్ణారావు అన్నగారికి నమస్సులు. మీ అవధానములో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు శంకరాభరణం నిర్వాహకులు సమస్యాపృచ్ఛక చక్రవర్తి శ్రీ కంది శంకరయ్యగారికి ధన్యవాదములు. సహపృచ్ఛకులైన పెద్దలందరికి నమస్సులు.
ఇవాళ న్యస్తాక్షరిలో
‘దేశభక్తి’ అన్న పదాలు వినియోగిస్తూ,
ఉత్పలమాల వృత్తములో
“నేటి యువతకు చక్కని దిశానిర్దేశము చేస్తూ సందేశము ఇవ్వాలని కోరుకుంటున్నాను.
దే మొదటిపాదము 4 వ అక్షరము
శ రెండో పాదము 8 వ అక్షరము
భ మూడో పాదము 12 అక్షరము
క్తి నాలుగో పాదము 17 అక్షరము
అనంతకృష్ణ.
నా పూరణ.
ఉ. శ్రీకర 'దే'వతార్చకుల చెంత చరించుడు చింత బాయగన్,
ప్రాకట మొప్ప తా ది'శ'ను బాగుగ చూపుచు మంచి గూర్చుచున్,
శోక విదూర మార్గమును జూపు'భ'వుండు కృపామృతంబునే.
లోకులు దైవమున్ గనుడు లుబ్ధత వీడుచు భ'క్తి'యుక్తులై.
5. వర్ణన.
శ్రీ ముద్దు రాజయ్య.
అవధాని గారికి నమస్కారం.
నా వర్ణనాంశం :
లాకుడౌనులోస జీవనోపాధి లేని ఒకని మనోవేదనను
ఏదైనా వృత్తంలో వర్ణించండి.
.
నాపూరణ.
ఉ. శ్రీకరమైన జీవితము చేయుచు కష్టము సాగజేయు మా
భీకరమైన జీవితము వింతగ మార్చెనుగా కరోన మే
మే క్రియ జీవనంబును గణింపక దీనిని సాగజేయుటో
శ్రీకర శ్రీ నృసింహ గని చింతలు బాపుచు నాదుకొమ్మికన్.
6. ఆశువు. 1
శ్రీ మాచవోలు శ్రీధరరావు.🏼
అందరికి నమస్కారం.
అవధానిగారూ! చాలా కాలం తర్వాత మరల సాహితీ కిరణాలను ప్రసరింప జేయడానికి సిద్ధమైన గురువర్యులు, చిత్రకవితా సమ్రాట్ శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి, సంచాలకులు గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి, పృచ్ఛక కవిమిత్రులకు శంకరాభరణ సమూహ సభ్యులందరికి అభినందనవందనములు.
మ.కో. చిత్రరీతుల కైత లల్లెడి చింత వారి కనంతకున్
ఛాత్రులన్ దగ తీర్చి దిద్దెడి శంకరార్యుల కంకనల్
మిత్రులౌ వెలుదండకున్ బ్రియ మిత్రులన్నపరెడ్డికిన్
మిత్రులంజయ, ముద్దు , సత్యము, మేల్ప్రసాదు లకున్ నుతుల్!
మఱియు కవిమిత్రులు శ్రీ విట్టుబాబు గారికి అభినందనలు.
మాచవోలు శ్రీధరరావు
అంశము
"హంపీ నగరంలో విజయనగర సామ్రాజ్య శిథిలాలను దర్శించినపుడు ప్రప్రథమంగా మీ మదిలో మెదిలే భావాన్ని ఒక చక్కని ఆశువులో తెలుపండి"
నా పూరణ.
చ. కలఁ గని మాసినట్లయెను కారణమేమొ గ్రహింపలేము, స
ద్విలసిత హంపి వైభవ్చము భీతిని గొల్పు విధంబు మారెనే!
చిలికెనొకప్పు డా విభవ చిన్మయ సత్సుధ నేమి చెప్పుదున్?
కలియుగదుష్ప్రభావమిది, కాదనలేముగ శ్రీధరా కనన్.
7. చిత్రానికి పద్యం.1
శా. శ్రీరామున్ మదినమ్మినట్టి ఘనులీ చిన్మార్గ సద్వర్తనుల్,
వీరావేశములొందనేరరు. మహత్ ప్రీతిన్ ప్రసంగించుచున్
శ్రీరామున్మరిపించు మోడి ధరణిన్, చిద్యోగహామిత్తుషా,
లీలన్ వీరలు గొల్పి చూపునది మేలే గాంచ భాగ్యంబిదే.
ఆశువు : 2
శంకరాభరణం వ్వాట్సాప్ ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్న "అవధాన స్వప్తాహ" వైభవాన్ని గురించి ఒక ఆశువులో తెలుపండి.
🏼
నా పూరణ.
అవధాన సప్తాహ వైభవము.
మ. అవధానంబన నాట కాదు కనగానాద్యంతమున్ గుండెలే
జవనాశ్వంబులటుల్ చరించి వణుకున్ సప్తాహమింకెంతయో,
భవుడే శంకరుడై చరించుటను సత్ భావ్యంబుగా సాగెడున్.
నవనీతాన్విత పద్యరాశి కిరవై నవ్యంబుగానొప్పెనే.
నా పూరణ.
ఉ. భారతి ముద్దుబిడ్డడు ప్రభాకర తేజుడె యీ శివాజి, సు
స్మేరముఖుండు చూడ గుణ సింధువు దేశమునేలె గొప్పగా
శ్రీరఘురాము పాలనను జేసి ప్రశంసలనందె గొప్పగా
భారతి పొంగు నీతని ప్రభావమునెన్నుచు నిత్యమున్ గనన్.
ఆశువు: 3
సూర్యోదయ సమయంలో పవిత్ర వారణాసి నగరంలో గంగా స్నానమాచరిస్తున్నపుడు మీరేమనుకుంటారో ఒక ఆశువులో తెలుపండి.
నా పూరణము🏼
శా. గంగాస్నానము పాపముల్ తొలఁగగా కాక్షించుచున్ జేసెదన్,
గంగా మాతయు సత్ కృపామృతమునే కాంక్షించి యందించునే.
భంగంబందుట జీవితంబునికపై పారాడ రానేరదీ
గంగా స్నానము సత్ఫలంబునిడుచున్ గాపాడు నన్ నిత్యమున్.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.