జైశ్రీరామ్.
అర్ధబిందు విదాయక ప్రకరణము ప్రకటన శ్రీముమ్మడి చంద్రశేఖరాచార్యులు.
*విద్యార్థి కల్ప తరువు *నుండి
**************************
సూ :---అఁట--ఇఁక---చుఁడు అను శబ్దములందక్క పదము మొదటి హ్రస్వము మీద ఖండబిందువు లేదు.వ్యా || పై మూడు శబ్దములందు మాత్రమే కలదని భావము.
సూ :---సంస్కృత సమేతరములైన తెలుఁగు శబ్దములయందుఁ బరుషసరళములకు ముందే బిందువు కానంబడుచున్నది.
వ్యా || తత్సమములకంటే నితరములగు క, చ, చ, ట, ప, గ, జ, జ, డ, ద, బ, లకు ముందు పూర్ణఖండబిందువులుండును గాని స్థిరాక్షరముల ముందుఁగానరావు.
ఉ:-----వంకర--- కలఁకువ--- త్రాఁచు---దంట ---దాఁటు---కొంత --కోఁత.
సూ:---- దీర్ఘము మీద సాధ్యపూర్ణములేదు.
ఉ|| వాఁడు, వీఁడు, రాఁడు, కాఁడు, (వాండు, వీండు, అనురూపములు దుష్టములు. )
వ్యా|| ఆంబోతు, గోంగూర, మొ. రూపములు దీనికి విరుద్దముగఁ గాన్పించుచున్నవి.
సూ:----- విభక్తి ప్రత్యయఁ డు వర్ణమునకుఁ బూర్వమున నర్థబిందువుండును.
ఉ|| గోపాలుఁడు, కృష్ణుఁడు, రాముఁడు, మొ.
సూ:--- డు వర్ణకాంత నుబంతములతో నన్వయించు క్రియల యంత్య ఁడు వర్ణకమునకుఁ బూర్వంబున నర్ధబిందువుండును.
ఉ || రాముఁడు భుజించుచున్నాడు.
వ్యా || రాముండను కర్తతో అన్వయించు "భుజించుచున్నాడు "అను క్రియ యొక్క యంత్య ఁ డు వర్ణమునకు ముందు ఖండబిందువునుపయోగించవలెను.
సూ:--- విశేష్యములయందలి యంత్య ను వర్ణము నకు క, గు, లాదేశమగునపుడు వానిముందర్ధబిందువుండును.
ఉ || 1. రేను-- రేఁగు, 2. కొలను--- కొలఁకు, 3. గోను--- గోఁగు, మొ.
సూ:----దీర్ఘ పూర్వకము వర్ణమునకు""పఙ్""ఆదేశమగునపుడు పకారమునకఁబూర్వమున నర్ధబిందువుండును.
వ్య || దీర్ఘము పూర్వమునఁ గల ము వర్ణమునకు నాదేశముగా వచ్చు "ప"వర్ణమునకు ముందఱసున్న యుండును.
ఉ || నాము + చేను = నాఁపచేను, 2. వేము+చెట్టు= వేఁపచెట్టు, 3. పాము+ ఱేడు+ పాఁపఱేడు. మొ.
సూ:---స్త్రీ ప్రత్యయమగు""ఆఁడి""యందర్ధబిందువుకలదు.
ఉ || 1. వగలాఁడి, 2. బొంకులాఁడి, 3. మాయలఁడి, 4 వన్నెలాఁడి, 5. ఎమ్మెలాఁడి,.
సూ:---పుం ప్రత్యయమగు కాఁడు, ఆఁడు లోని "డు" వర్ణమునకు ముందఱసున్న కలదు.
ఉ|| 1. కోడెకాఁడు, 2. అందగాఁడు, 3. సొగసుగాఁడు, 4. వన్నెలాఁడు. మొ.
వ్యా|| స్వర్థమునందు వచ్చు "ఇడి" వర్ణకమున అర్ధబిందువుండదని గ్రహింపవలెను.
ఉ|| తెలివిడి, వినికిడి, రాపిడి, మొ.
సూ:--- వ్యతిరేకార్థద్యోతకమగు "ఇడి "వర్ణకమున నర్ధబిందువుండును.
ఉ|| 1. ముక్కిఁడి, 2. సిగ్గిఁడి, 3. వెరవిఁడి(ముక్కులేనివాడనిభావము).
సూ:----తత్భవంబుల హ్రస్వమున కనునాసికములు పరమగునపుడు రూపాంతరమున హ్రస్వమునకు దీర్ఘమును, ననునాసిక స్థానమున బిందువు నగు.
ఉ|| కుంకటి---కూఁకటి, పించము---పీఁచము మొ||
సూ:---అనునాసికాక్షర ప్రకృతి శబ్దము వికృతిగా మాఱునపుడ నునాసికమున బిందువు కలుగును.
ఉ|| బ్రాహ్మణుఁడు, బాఁపడు.
సూ:----ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందువగును.
ఉ|| పూచెను+ గలువలు=పూచెంగలువలు, పూచెఁగలువలు.
సూ:-----సమాసములయం దుదంత స్త్రీ సమములకును, బుం పు వర్ణాంత పదములకును బరుషములు పరమగుచో బిందుసంశ్లేషములు విభాషనగు.
ఉ|| సింగపు+కొదమ =సింగపుంగొదమ, సింగపుఁగొదమ, సింపున్గొదమ.
సూ:----పదాంతమందలి ఎఁడు వర్ణకము పరిమాణార్ధకమగుచో నందఱసున్నయుండును.
ఉ|| 1. దోసెఁడు, 2. పిడికెఁడు,3. సోలెఁడు, 4. చేరెఁడు,
మొ.
సూ:----యువర్ణాంత ధాతువులనుండి పుట్టిన తవర్ణకాంత శబ్దములలో నఱ సున్న యుండును.
ఉ|| పూయు--పూఁత, నేయు --నేఁత, కోయు--కోఁత, గీయు--గీఁత,.
సూ:---శరీరార్థకముగానున్న పోఁడి యందఱసున్న గలదు.
ఉ|| 1. పూఁబోడి,2. విరిబోఁడి, 3. ననబోఁడి.
సూ:----కొన్నిపదముల హ్రస్వ దీర్ఘముల మీఁద సిద్దముగా నఱసున్న యుండును.
ఉ|| అడఁగు--చెలఁగు --పడఁతి --అఁట--ఇఁక--ఎఱుగు--కోతి--ఈఁగ--తేఁటి--దాఁగు--నాఁడు--ఊఁత--చీఁకటి--మేఁక--మూఁడు--ప్రాఁత--దాఁటు--కాఁగు--కౌఁగిలి--ఆఁకలి--ఆఁడుది--వీఁదు--వీఁగు--వీఁపు - మొ.
సూ:----నాఁడు, నేఁడు మొదలగు పదములు డు వర్ణాం నుబంతములు కాకున్నను నర్దబిందుయుతములై యుండుట గ్రహింపనగును.
సూ:----అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, నాపుడు, అనవుడు, మొదలగు నవ్యయపదము లర్ధబిందు రహితములని గ్రహింపవలెను.
స్వస్తి.
ముమ్మడి.
జైహింద్.
2 comments:
నమస్కారములు
వ్యాకరణ పరమైన అర్ధ బిందు విధాయక ప్రకరణమును చాలా చక్కగా తెలియ చెప్పి నందులకు గురువులు శ్రీ ముమ్మడి చంద్రశేఖరా చార్యులవారికి శిరసాభి వందనములు. మాకందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు.
ప్రణామములు
అర్ధ బిందు విధాయక ప్రకరణమును పూజ్యులు శ్రీ ముమ్మడి చంద్రశేఖరాచార్యులు గారు చక్కగా వివరించినారు. ధన్య వాదములు మాకందించిన శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.